Minugurulu- Deenamma
మిణుగురులు- 3
చదువుల తల్లి పుల్లగూర దీనమ్మ
తెలుగు రాష్ట్రాల్లో సంస్కరణవాద చరిత్ర కందుకూరి వీరేశలింగం, రఘుపతి వెంకటరత్నం నాయుడు వంటి బ్రాహ్మణ పురుషుల వద్ద, వున్నవ లక్ష్మీబాయమ్మ, కందుకూరి రాజ్యలక్ష్మి వంటి స్త్రీల దగ్గర ఆగిపోయిందనవచ్చు. వారి కృషిని తక్కువ చెయ్యడం కాదు గానీ వారి కంటే యెన్నో సవాళ్ళను అసమ సమాజం నుంచి, జీవితం నూంచి యెదుర్కుని నిలదొక్కుకుని తమ శక్తికి మించి యీ సమాజ వుద్ధరణ కోసం పనిచేసినా గుర్తింపు పొందని వారున్నారు. ముఖ్యంగా అణగారిన ప్రజల సామాజిక వెనుకబాటుతనానికి ప్రధాన కారణంగా వున్న అవిద్యను పారదోలి వారి జీవితాలలో వెలుగులు నింపిన కింది కులాల సంస్కర్తల పేర్లు పెద్దగా పుస్తకాలకు యెక్కకపోవడంలో వారి కృషి పట్ల పరిశొధకులలో వున్న చిన్న చూపే కారణమని భావించవచ్చు.
జ్యోతీరావు ఫూలే,
సావిత్రీబాయి ఫూలేల కాలం అంటే 19వ శతాబ్దం నాటి ఆంధ్రదేశంలో సామాజిక పరిస్తితులు, అణగారిన వర్గాల స్థితిగతులు,వాటిపై సంస్కరణ దిశగా సాగిన ప్రయత్నాల మీద అటు అకడమిక్ రంగంలో గానీ, బయటగానీ అసలు పరిశోధన జరగలేదనే చెప్పాలి. ఎమ్మా క్లౌ రాసిన ‘వైల్ సూయింగ్ ద శాండల్స్’(While Suing the Sandals) పుస్తకంలో హిందూమతం లో వున్న దళితులు క్రైస్తవ మిషనరీలు అందిస్తున్న విద్య, వైద్య సదుపాయాలకు ఆకర్షితులై తమను జంతువులకంటే హీనంగా, అంటరానివారిగా పరిగణించిన హిందూ మతాన్ని వొదిలి క్రైస్తవం లోకి వెళ్ళడం పైన చర్చించింది. నిజమే! ఆ రోజుల్లో అత్యంత దయనీయమైన పేదరికం, అంటరానితనం, వూరెలపటితనం వంటి దుర్భర పరిస్థితులలో బతుకులు వెళ్ళదీస్తున్న దళితులకు క్రైస్తవం వొక వెలుతురు పంచే ఆశాకిరణంలా కనిపించింది. గుంటూరు జిల్లాలో ఫాదర్ హయ్యర్ ఆధ్వర్యంలో లూధరన్ మిషన్ తన కార్యక్రమాలను విస్తరిస్తూ అణగారిన కులాలకు చేరువైంది. అటువంటి చీకటి దినాల్లో గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణానికి సమీపంలోని వేలూరు గ్రామంలో పుట్టిన గడ్డం దీనమ్మ అసమ సమాజం తనచుట్టూ నింపిన అంధకారాన్ని చీల్చుకుంటూ జ్ఞాన జ్యోతిలా ప్రకాశించింది.
అసలు దీనమ్మ యెవరు? ఆమె ధనవంతుల బిడ్డా? తన సౌందర్యంతో యితరులను ఆకర్షించగలిగిన స్త్రీనా? అంటే యివేమీ కావనే సమాధానం. కానీ ఆమె అత్యంత వున్నతురాలిగా చరిత్రలో నిలిచిపోయే విధంగా తన జీవితాన్ని మలచుకున్న తీరు మనకు సంభ్రమాశ్చర్యాలను కలిగిస్తుంది. దీనమ్మ గుంటూరు జిల్లా కేంద్రానికి 48 కిలోమీటర్ల దూరంలో, చిలకలూరుపేట పట్టణానికి దగ్గర వేలూరు గ్రామంలో గడ్డం రాహేలు, యాకోబు దంపతులకు 17.02.1881 న పుట్టింది. పౌలయ్య, దేవయ్య, ఆనందరావు అనే ముగ్గురు అన్నల తర్వాత కడగొట్టు బిడ్డ. ఆమెది గుంటూరు జిల్లాలో క్రైస్తవులుగా మారిన మొదటి
దళిత కుటుంబం. మతం పుచ్చుకోకముందు దీనమ్మ తల్లిదండ్రుల పేర్లు చెంచమ్మ, రమణయ్య. అప్పట్లో కొత్తగా క్రైస్తవం లోకి మారిన వారికి తప్పనిసరిగా పాతపేరు మార్చి
క్రైస్తవ మతపరమైన పేరు పెట్టేవారు. ఆ విధంగా వారికి రెండు పేర్లు వుండేవి.
దీనమ్మ శారీరకంగా పూర్తి స్థాయి అవిటితనంతో కుడి చెయ్యి సగం వరకు వుండి యెడం చెయ్యి అసలు లేకుండానూ, వొక కాలుకి పాదం లేకుండానూ పుట్టింది. ఆమె పుట్టినప్పుడు మంత్రసాని 'యీ దెయ్యం పిల్లకి నోట్లో వడ్లగింజేసి వొదిలించుకో! లేకపోతే నీ బతుకు నరకం అవ్వుద్ది’ అని దీనమ్మ తల్లికి సలహా యిచ్చింది. ఆ సమయంలో తన భర్త యింట్లో లేకపోవడంతో ఆయనొచ్చాక నిర్ణయం తీసుకుంటాం అని చెప్పింది. దీనమ్మ తండ్రి వొచ్చి కాళ్ళూ చేతులు లేని పసికందుని చూసి బాధపడినప్పటికీ ఆయనకి ఆమె మొహంలో యేదో తెలీని కాంతి కనిపించి ఆమెని యెలాగైనా కష్టపడి వృద్ధిలోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు.
దీనమ్మ తండ్రి యాకోబు ఆమెను యెలాగైనా చదివించాలనే పట్టుదలతో ఆమె కోసం అహర్నిశలు శ్రమించాడు. అందుకు ఆయన యెక్కని గడప లేదు.
ఆ రోజుల్లో అరకొరగా వుండే ప్రయాణ సాధనాలైన గుర్రపు బండ్లలో మాల,
మాదిగలను యెక్కనిచ్చేవారు కాదు.
ఆ పరిస్థితిలో దీనమ్మని ఆమె తండ్రి యాకోబు తన భుజాలమీద కూర్చోబెట్టుకుని తిప్పేవాడు. బాగా వాకబు చేస్తే ఆయనకి లూధరన్ క్రిస్టియన్ మిషన్ నుండి ఫాదర్ హయ్యర్ గుంటూరులో ఆడపిల్లల కోసం వొక పాఠశాలను స్థాపించాడని తెలిసి ఆమెను ఆ స్కూల్లో చేర్పించాడు. ఆ స్కూల్ కి అనుబంధంగా హాస్టల్ కూడా వుంది. దీనమ్మ వయసు రీత్యా యెదిగే క్రమంలో ఆయన ఆమె ప్రయాణం కోసం ఆయన తన దగ్గరున్న చిన్నపాటి వొస్తువులన్నీ అమ్మి వొక చిన్న గుర్రాన్ని కొన్నాడు. కూతురి చదువు పట్ల యెంతో శ్రమించిన ఆమె తండ్రి దీనమ్మను ఐదవ తరగతి వరకు చదివించాడు. అప్పట్లో ఐదో తరగతి వరకు చదివితే హయ్యర్ సెకెండరీ టీచర్ వుద్యోగానికి అర్హత వచ్చినట్లే! ఆ రోజుల్లో ఆడపిల్లల విషయంలో, అందునా అవిటిదైన పిల్ల విషయంలో అంతటి శ్రద్ధ తీసుకునే తల్లిదండ్రులు అరుదుగా వుండేవారు.
దీనమ్మ కురచగా వుండే తన చేతితో అక్షరాలు నేర్చుకుంది. ఆమె చేతిరాత ముత్యాల్లా వుండేది. పట్టుదలతో
చదివి తనకు కుల సమాజం నిరాకరించిన చదువుని సొంతం చేసుకోవడంతో పాటు ప్రకృతి యిచ్చిన శారీరక అవరోధాన్ని కూడా అదిగమించింది. ఆమె గుంటూరు జిల్లాలోనే చదువుకున్న మొట్టమొదటి దళిత స్త్రీ. ఆమె గుంటూరు జిల్లాలోనే చదువుకున్న మొట్టమొదటి దళిత స్త్రీ. ఆ రోజుల్లో బ్రిటీష్ వాళ్ళ దగ్గర ప్రాపకం వున్న వాళ్ళ మగపిల్లలకు అరుదుగా ఆడ పిల్లలకు తప్ప,
సంస్కర్తలు అనుకునే వారి యింటి ఆడపిల్లలకు కూడా చదువు లేదనే చెప్పాలి. ఆ విధంగా దీనమ్మ వొక విద్యావంతురాలైన యువతిగా అప్పట్లో అందరి దృష్టిలో పడింది. గురజాడ అన్నట్టు విద్య నేర్చిన స్త్రీ కన్నా సృష్టిలో అపురూపమైన వొస్తువు లేదని అంతా భావించే పరిస్తితుల్లో దీనమ్మ అందరికీ అపురూపంగా కనబడేది. ఐదవ తరగతి పూర్తయ్యే సరికి దీనమ్మకి యుక్క్త యసొచ్చింది ఆమెను పొరుగు గ్రామమైన జాలాదికి చెందిన వడ్రంగం పనిచేసే పుల్లగూర జకరయ్య యిష్టపడి, ఆమె తల్లి దండ్రులను బతిమాలి వొప్పించి వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు మగపిల్లలు మనోహర్ రావు,
విశ్వనాధం, ప్రసంగి రావులు. యిద్దరు కుమార్తెలు- సువార్త, సుగుణమ్మలు జన్మించారు. సువార్తమ్మ చిన్నతనంలోనే అనారోగ్యంతో చనిపోయింది. దీనమ్మకు బిడ్డల పెంపకంలో ఆమె అన్నగారైన పౌలయ్య సహాయం చేశాడు. దీనమ్మ పిల్లలు పెద్దవారై తమ పనులు తాము చేసుకునే వరకు పెళ్ళిచేసుకోకుండా ఆమెకి చేదోడు వాదోడుగా వున్న మంచి మనసు ఆయనది. ఆమె పెద్ద కొడుకు మనోహర్ రావు మిలటరీ లో చేరగా ఆయన భార్యతో పాటు
మిగిలిన యిద్దరు కొడుకులు, కోడళ్ళు, కూతురు సుగుణమ్మ టీచర్లుగా స్తిరపడ్డారు.
ఆ రోజుల్లో చిలకలూరిపేట చుట్టుపక్క గ్రామాలు కమ్యూనిస్ట్ పార్టీకి పెట్టని కోటల్లా వుండేవి. దీనమ్మ గ్రామం కూడా కమ్యూనిస్ట్ నాయకులకు కేంద్రంగా వుండేది. 'గడ్డం మోషే’ అనే అని జిల్లా స్థాయిలో పేరు ప్రఖ్యాతులున్న నాయకుడు దీనమ్మ తల్లిదండ్రుల వైపు నుంచి దగ్గరి బంధువు కావడం వలన ఆ కుటుంబం కమ్యూనిస్ట్ భావజాలం తో సమసమాజ స్థాపన కోసం తమవంతు కృషి చెయ్యడం అలవర్చుకుంది. వారింట్లో యెందరో విప్లవకారులకు ఆశ్రయం కల్పిస్తూ వారికి కావల్సిన సదుపాయాలను, ఆహారాన్ని అందిస్తూ వుండేవారు. అప్పట్లో రైతు కూలీ సంఘాలు నిర్వహించే కమ్యూనిస్ట్ నాయకుడైన గడ్డం మోషే గారు కనిపిస్తే కాల్చివెయ్యమనే ఆదేశాలు ప్రభుత్వం నుండి వుండేవని వినికిడి. ఆవిధంగా దీనమ్మకు కుటుంబం నుంచి ఆదర్శ భావాలు అబ్బాయనవచ్చు.
యెంతో ఆత్మవిశ్వాసం, పట్టుదల మెండుగా వుండే దీనమ్మ సమాజంలో వుండే అసమానతలు, అజ్ఞానం, వెనుకబాటుతనం అనే రుగ్మతలను విద్య ద్వారా పారద్రోలవచ్చని చిన్నతనం నుంచే బలంగా నమ్మేది. ఆ పట్టుదలను ఆమె చివరివరకూ కొనసాగించింది. తనని వుద్యోగం చెయ్యమని అంటే 'నాకు వుద్యోగమొస్తే నేనూ,
నా కుటుంబమే బాగు పడతాము, సమాజానికి ప్రయోజనం పెద్దగా వుండదు’ అనుకుని యెంతో అజ్ఞానం, వెనుకబాటుతంతో వున్న సమాజం మొత్తానికి తన పని ద్వారా మేలు జరగాలంటే యేదో వొక గట్టి పని చెయ్యాలని దీనమ్మ భావించింది. ఆమె తాను వుద్యోగం సంపాదించుకోకుండా తన అత్తగారి వూరైన జాలాది గ్రామంలో వొక యెలిమెంటరీ స్కూల్ ని తమ సొంత స్థలంలో పూరి పాకలో ప్రారంభించింది. దానిపేరు 'లూధరన్ యెలిమెంటరీ స్కూల్’. ఆ రోజుల్లో ఐదవ తరగతి వరకు చదివితే హయ్యర్ గ్రేడ్ టీచర్లుగా పనిచెయ్యడానికి అర్హత వుండేది కనుక ఆ పాఠశాలకు దీనమ్మ అన్నీ తానే అయ్యి నడిపించగలగడం విశేషం. దళితవాడలో దీనమ్మ స్థాపించిన లూధరన్ యెలిమెంటరీ స్కూలు ఆనాడు అంటరానితనం కారణంగా సమాజంలో విద్యకు నోచుకోని అనేకమంది దళిత
విద్యార్ధులకు అక్షర జ్ఞానాన్నిచ్చింది. ప్రారంభించిన అతి తక్కువ కాలంలోనే ఆ పాఠశాలకు ప్రభుత్వం నుంచి యెయిడ్ వొచ్చింది.
దీనమ్మ యెంతో నిజాయితీ, క్రమశిక్షణలతో పాఠశాలను నడిపిందని ఆమె పనితీరు, వ్యక్తిత్వం గురించి తెల్సిన వారనేవారు. ఆమె అంగవైకల్యం వున్నప్పటికీ అన్ని పనులు ముగించుకుని పాఠశాలకు ముందుగానే రావడం దగ్గర నుంచి స్కూలు రికార్డులను సక్రమంగా నిర్వహించడం వరకు అన్నీ యెంతో చాకచక్యంతో, ప్రావీణ్యంతో చేసేదని తెలుస్తుంది. ప్రారంభించిన తక్కువ కాలానికే ప్రభుత్వం నుంచి యెయిడ్ రావడం వలన ఆమె దాన్ని మరింత మెరుగు పరిచింది. దళితులు తెల్లబట్టలేసుకుంటే యిప్పటికీ అగ్రకులాలు వోర్చలేని పరిస్థితి వుంది. అలాంటిది పెద్దకులాలు కుల,
మత దురహంకారాన్ని బాహాటంగానే ప్రదర్శించే ఆ రోజుల్లో వొక దళిత మహిళ వొక్కతే సొంతగా స్కూల్ స్థాపించి దాన్ని నడపడం అంటే యెంత పెద్ద సవాలో మనకు అర్ధమౌతుంది. ప్రారంభంలో ఆమె వొక్కతే యేకోపాధ్యాయ పాఠశాలగా నడిపే రోజుల్లో పాఠశాల పనితీరును పరిశీంచడానికి ప్రభుత్వం నుంచి అగ్ర కులానికి చెందిన వొక యిన్స్పెక్టర్ స్కూలుకొచ్చాడు. ఆయన
'పిల్లలకు వ్యాయామ తరగతులు నిర్వహిస్తున్నారా లేదా?
అని అడిగినప్పుడు దీనమ్మ తన బలహీనతకు నొచ్చుకుంటూ 'అవిటిదాన్నైన నాకు కుదరడం లేదు’ అని యెంతో న్యూనతా భావంతో బదులిచ్చింది. దానికాయన 'మీ కులపోళ్ళకి యేమొచ్చు? అంతా అవిటితనమేగా? అని చీత్కారంతో విదిలించి వెళ్ళాడు. స్కూలు యిన్స్పెక్టర్ చీత్కారంతో చిన్నబుచ్చుకున్న దీనమ్మ తమ పాఠశాలలో యెలాగైనా వ్యాయామ విద్యను అభివృద్ధి చెయ్యాలని భావించింది. బాగా ఆలోచించి ఆమె వొక విజిల్ కొనుక్కుని దాని సహాయంతో ఆమె కూర్చుని విద్యార్ధులకు తర్ఫీదునిచ్చింది. క్రమంగా పిల్లలు డ్రిల్లు చెయ్యడం నేర్చుకున్నారు. కొన్నాళ్ళకు మళ్ళీ ఆ పాఠశాలకు అదే యిన్స్పెక్టర్ వొచ్చాడు. పిల్లలు ఆయనకు గౌరవ వందనం చెయ్యడం, డ్రిల్లు చెయ్యడం చూసిన ఆ బ్రాహ్మణ యిన్స్పెక్టర్ ఆశ్చర్యబోయి దీనమ్మ పట్టుదలను యెంతో అభినందించాడు. ఆయన రెండవ సారి యిన్స్ పెక్షన్ కి వచ్చేటప్పుడు తన భుజం కనిపించకుండా కండువా కప్పుకుని వొచ్చి వెళ్ళేటప్పుడు కండువాని తొలగించి ప్రమాదంలో తాను పోగొట్టుకున్న చెయ్యిని చూపించి దీనమ్మ అవిటితనాన్ని అవమానించినందుకు దేవుడు తనకీ శిక్ష వేశాడని, దీనమ్మ మాత్రం తన కార్యరంగంలో యెంతో నిబద్ధత, పట్టుదలతో రోజు రోజుకూ శక్తివంతురాలవుతుందని కితాబిచ్చి వెళ్ళాడు ఆ యిన్స్పెక్టర్.
దీనమ్మ ప్రారంభించిన లూధరన్ యెలిమెంటరీ పాఠశాల వందలాదిమంది దళిత విద్యార్ధులకు విద్యనందించడమే కాకుండా అనేక మంది దళితులకు వుద్యోగం, వుపాధిని కలిగించిందనవచ్చు. ఆమె పెద్ద కొడుకు మనోహర్ రావు మిలిటరీ వుద్యోగంనుంచి రిటైరయ్యాక ఆ స్కూలుని నిర్వహించడమే కాకుండా దీనమ్మ చిన్న కొడుకులిద్దరు, ముగ్గురు కోడళ్ళు ఆ స్కూల్ లోనే వుపాధ్యాయులుగా, ప్రధానోపాధాయులుగా పనిచేసి రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆమె తన సంతానాన్ని వృద్ధిలోకి తీసుకు రావడంతో పాటు తన ప్రాంతంలో అంటరానితనాన్ని, దాని తాలూకు అజ్ఞానాన్ని నెత్తిన పెట్టుకుని మొయ్యకుండా అక్కడి దళితుల్ని కొంతమేర చైతన్యం వైపు దారులువేసి అలిసిపోయిన ఆ తల్లి తన 65 వ యేట 1946 వ సంవత్సరంలో అమరురాలైంది. ఆమె విద్య ద్వారా సమాజంలో బడుగు జీవుల బతుకుల్లో వెలుగులు నింపాలనే వుద్దేశంతో ప్రారంభించిన కార్యక్రమాన్ని దీనమ్మ సంతానం యెంతో శ్రద్ధతో ముందుకు తీసుకెళ్తుంది.
పుల్లగూర దీనమ్మ రెండవ కొడుకు విశ్వనాధం కుమారుడు పుల్లగూర రంజన్ బాబు యీ రోజు విద్య, సామాజిక సేవా
రంగాలలో గుంటూరు జిల్లాలో చెప్పుకోదగిన గుర్తింపు పొందడం వెనుక తన నాయనమ్మ దీనమ్మ యిచ్చిన స్పూర్తి యెంతో వుంది. నిజానికి ఆయన నాయనమ్మ దీనమ్మ గారి గురించి తన తల్లిదండ్రుల ద్వారా వినడం తప్ప ఆమెని చూడలేదు. ఆయన 1947 లో పుట్టేనాటికే దీనమ్మ చనిపోయింది. అయితే రంజన్ బాబు స్కూల్ లో చదివే రోజుల్లో మ్యాధమాటిక్స్ లో వొక సారి ఆయనకు సున్నా మార్కులు వస్తే స్కూలు లో టీచర్, యింట్లో తండ్రి విశ్వనాధం ఆయన్ని బాగా కొట్టడం తో అవమాన పడిన ఆయన యింట్లో నుంచి యెక్కడికైనా పారిపోదామని నిర్ణయించున్నాక ఆయన తన ఖర్చులకోసం కొంత డబ్బు దొరకొచ్చనే ఆశతో పాత ట్రంకు పెట్టెలో వెతికాడు. ఆయనకి డబ్బు కు బదులు తన నాయనమ్మ స్కూలు నడిపినప్పుడు ఆమె చేతి రాతతో వున్న అటెండెన్స్ రిజిస్టర్ వొకటి ఆయన కంటబడింది. ఆ అక్షరాలు చూసి ఆయనకు తీవ్రమైన దు:ఖం కలిగి మనసు ఆమె తాలూకు ఆలోచలతో నిండిపోయింది. తన నాయనమ్మ 19 వ శతాబ్దపు చీకటి రోజుల్లో కాళ్ళూ చేతులు లేక నిలబడే శక్తి లేకపోయినా, కుల వ్యవస్థ తాలూకు అంటరానితనం తనని తరిమి కొట్టినా జీవితం నుంచి పారిపోకుండా ఆమె అనేక అడ్డంకులకు యెదురీది నిలబడింది. తాను మాత్రం అన్నీ సరిగానే వున్నప్పటికీ యింటిని వొదిలి, తల్లిదండ్రులను మోసం చేసి పారిపోతున్నాను కదా అనుకుని తీవ్ర పశ్చాతాపానికి గురై, యింటినుంచి పారిపోవాలనే ఆలోచనను విరమించుకుని బాగా చదివి తన నాయనమ్మ గారైన పుల్లగూర దీనమ్మ ఆశయాలను కొనసాగించాలని నిర్ణయించున్నారు.
ఆయన వున్నత విద్యనభ్యసించడమే కాకుండా గుంటూరు జిల్లాలో దళిత విద్యార్ధుల కోసం Community and Rural Development Society ( CARDS) అనే స్వచ్చంద సంస్థను స్థాపించి దాని ద్వారా అనేక పాఠశాలలు, కాలేజీలు ప్రారంభించి వాటిలో
ఆడపిల్లలకు అనాధ పిల్లలకు యెక్కువగా ప్రాధాన్యతనిస్తూ వేలాదిమందిని విద్యావంతులను చేస్తున్నారు. 'బాలబాట’ పేరుతో మారు మూల ప్రాంతాల్లో చదువుకునే యువకులను ప్రోత్సహించి వారిచే తన గ్రామంలోని దళిత వాడలలో పిల్లలు మధ్యలో బడి మానకుండా వారికి పై తరగతులు చదివే పిల్లల ద్వారా ట్యూషన్లు చెప్పించే యేర్పాటు చేశారు. యీ పనికి వారు ఖర్చు పెట్టి యేమీ యేర్పాట్లు చెయ్యలేదు. రాత్రిపూట వీధి దీపాల కింద వారంతా కూర్చుని చదువుకోవడమే పని.
వీధి దీపాలు లేని గ్రామాల్లో ఆ పిల్లలు అక్కడ లైట్లు వేసే వరకు అక్కడి సర్పంచులను యితర అధికారులను అడిగి, రకరకాల పోరాటాల ద్వారా వీధి లైట్లు తమ గ్రామాల్లో సాధించుకునే విధంగా రంజన్ బాబు వారిలో చైతన్యం నింపారు. ఆ విధంగా పెద్దపిల్లల్లో కూడా తాము చదువుతూ చిన్న వారిని చదివించడంతో వొకరకంగా ఆత్మస్థైర్యం పెంపొంది వారు కాలేజీ, యూనివర్సిటీ చదువుల దాకా వెళ్ళగలిగేలా గొప్ప పధకాలను రూపొందించి రంజన్ బాబు గారు విజయం సాధించారు. దళిత్ వోపెన్ యూనివర్సిటీ వారు నడిపే విద్యా సంస్థల్లో వొక ముఖ్యమైన విభాగం. రంజన్ బాబు కుమారుడు ఫ్రాంక్ విశ్వనాధ్ మానసిక వికలాంగుల కోసం వొక ప్రత్యేక సంస్థను నడుపుతున్నారు. ప్రస్థుతం ఆయనకి వృద్ధాప్యం కారణంగా ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆయన భార్య డాక్టర్. స్వర్ణలతా దేవి, కుమారులు ఆ సంస్థల కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దళిత వర్గాల విద్యా వ్యాప్తి కోసం జరుగుతున్న యీ నిరంతర కార్యక్రమాల వెనుక వారికి చుక్కానిగా, చోదకశక్తిగా
పుల్లగూర దీనమ్మ గారి స్పూర్తి వుందనేది కాదనలేని సత్యం.
19 వ శతాబ్దపు చివరి రోజుల్లో జన్మించి అటు సమాజం నుంచి కలపరమైన అసమానతల్ని, పుట్టుకతో ప్రకృతి నుంచి ప్రాప్తించిన శారీరక అవిటితనాన్ని తన ఆత్మ స్థైర్యంతో వొక్క తన్ను తన్ని పుల్లగూర దీనమ్మ యీ అసమ సమాజానికి పెద్ద సవాల్ విసిరింది. ఆమె వ్యక్తిత్వం చాలా విశిష్టమైనదని కుటుంబ సభ్యులు చెబుతారు. ఆమె తన కూతురు సుగుణమ్మని వరంగల్ జిల్లాలో వ్యక్తికిచ్చి పెళ్ళి చేశారు. రవాణా సౌకర్యాలు అంతంత మాత్రంగా వుండే ఆరోజుల్లో దీనమ్మ అల్లుడి వూరు వెళ్ళాలంటే యెంతో వ్యయ ప్రయాసలకోర్చి వెళ్ళాలి. ఆమె తల్లి ప్రేమ అవిటితనాన్ని కూడా జయించింది. దీనమ్మ తానే స్వయంగా అన్ని రకాల పిండివంటలు చేసుకుని వోపిగ్గా వాగులు వంకలు దాటుకుని తన కూతురిని చూసొచ్చేంత శక్తిసంపన్నురాలు ఆమె. విద్యావంతురాలు గొప్ప గుండెనిబ్బరం గలిగిన పుల్లగూర దీనమ్మ అంటే ఆమె గ్రామస్తులకు యెంతో గౌరవం. చిన్న కుటుంబ తగాదాలు, మంచీ చెడుల గురించి ఆమె దగ్గరకు ఆడా, మగా వచ్చేవారని తెలుస్తుంది. ఆమె మాటకు తన భర్త జకరయ్య దగ్గరి నుండి కొడుకులు, కూతురు, కోడళ్ళు, మనవ సంతానం వరకు ఆమె మాటకు జవదాటేవారు కాదని ఆమె బంధువులు పేర్కొన్నారు.
పుల్లగూర దీనమ్మ ఆంధ్ర ప్రదేశ్ లో దళిత కులాల్లో మొదటి విద్యావంతురాలు మాత్రమే కాదు, మొదటి టీచర్, మొదటి పాఠశాల వ్యవస్థాపకురాలుగా గుర్తింపునూ అరుదైన గౌరవాన్నీ పొందిన వ్యక్తి. ఆమె 20 యేళ్ళకే సొంతగా పాఠశాల స్థాపించడమే కాక దానిని యెంతో పట్టుదలతో అభివృద్ధి చెయ్యడం లో ఆమె యెన్నో ఆటు పోట్ట్లను అటు కుల సమాజం నుంచి యిటు కుటుంబం నుంచీ యెదుర్కొని నిలబడడం అనేది అసాధారణం, అనితర సాధ్యం. దీనమ్మకు 'దీపమ్మ’ అనే పేరు సరిపోతుంది. యెగుడు దిగుడు లోకంలో బతకడాన్ని ఆమె వొక సవాలుగా తీసుకోవడమే కాదు తన భావి తరాలకు కూడా కొండంత ఆత్మగౌరవాన్ని, స్థైర్యాన్ని ప్రోదిచేసి ఆస్థిగా పంచి యిచ్చింది. పుల్లగూర దీనమ్మ అవరోధాల మడుగును దాటి అంధకారంలో గొప్ప వ్యక్తిత్వంతో తనకు తాను స్వయం ప్రకాశితమై తళుక్కున మెరిసిన మిణుగురు.
Comments
Post a Comment