Posts

Showing posts from August, 2018

Article on Shiek Msood Baba

Image
ఉద్యమాన్ని   శ్వాసించిన   షేక్ మసూద్ బాబా చల్లపల్లి స్వరూపరాణి శ్రీకాకుళ సాయుధ పోరాట యోధుడు, ప్రజా వుద్యమాల పట్ల గొప్ప ప్రేమతో ఆశతో ప్రత్యామ్నాయ రాజకీయాలు నిర్మించడానికి తపన పడిన షేక్ మసూద్ బాబా గారు యీ నెల అయిదవ తేదీన తీవ్ర అనారోగ్యంతో విజయవాడలో మృతి చెందారు. ఆయన జీవితం గొప్ప నిజాయితీకి, నిబద్ధతకీ నిలువెత్తు ప్రతీక.   ‘బాబా’ గా అందరికీ చిరపరిచితుడి గా వున్న మసూద్ బాబా గారు 1946 లో అమీనాబీ, మస్తాన్ దంపతుల మొదటి బిడ్డగా జన్మించారు. వీరి స్వస్థలం గుంటూరు జిల్లా రొంపిచర్ల.   ఆయన తల్లిదండ్రులు జీననోపాధిని వెదుక్కుంటూ వచ్చి బాబా గారి చిన్నతనంలోనే విజయవాడలో స్థిరపడ్డారు. ఆయనకి నలుగురు తమ్ముళ్ళు, యిద్దరు చెల్లెళ్ళు. వారి తోబుట్టువులు, బంధువులు విజయవాడ, మచిలీపట్నం పరిసర ప్రాంతాలలోనే యెక్కువగా స్తిరపడ్డారు. అయిదో క్లాసు వరకూ చదువుకున్న ఆయన చిన్నతనం నుంచే మార్క్సిజం పట్ల అభిమానాన్ని పెంచుకున్నారు. ఆయన చిన్నతనంలో   విజయవాడ సూర్యారావు పేట లోని బెల్లం శోభనాద్రి గ్రంధాలయంలో సోవియట్ పుస్తకాల్లో బొమ్మలు చూడ్డానికి వెళ్ళేవారు. ఆవిధంగా క్రమంగా ఆయన కమ్యూనిస్ట్ సాహిత్యం చదవడానికి అలవాటు పడ్డ

Masood Baba-Poem

Image
జెండా చెట్టు చల్లపల్లి స్వరూపరాణి నూనూగు యవ్వనంలో నిప్పులగుండం తొక్కినవాడా ! యెగుడుదిగుడు లోకంతీరుకు విముఖుడైన సిద్ధార్ధుడివి నువ్వు   బందిఖానా గుహలో నువ్వే ఆకుపచ్చని సూరీడు వేకువకోసం ముళ్ళబాటలో చెప్పుల్లేకుండా పరుగెత్తడమే నువ్వు యెంచుకున్న నడక మందిని పోగుజేసి మాటలు కలపడమంటే నీకు   కొండెక్కినంత సంబరం కదూ! విలువల పాత అంగీ తొడుక్కుని ఆకలిని చప్పరించినోడా! నగరం నగిషీల పక్కన అనామకంగా సంచరించే అభిమాన ధనుడవు నువ్వు అంపశయ్య మీదనుంచి నెలవంకల్ని కలగన్న స్వాప్నికుడా! మా నల్ల చీమల బారులో   నువ్వు జెండా చెట్టై నవ్వుతూ నిలబడతావు!     (అమరుడు షేక్ మసూద్ బాబా గారి స్మృతిలో) 19.08.2018

Tsundur -Poem

Image
సమాధులు                                                         చల్లపల్లి స్వరూపరాణి ప్రశ్నల్ని లోపల నిద్రబుచ్చి  దేశం సున్నం కొట్టిన సమాధిలా వుంది బొందపెట్టడానికి ఆరడుగుల నేల దొరకని వూరి చివరి శవాలు నడిబజార్లో సమాధులై మొలకెత్తడమే అసలు చిత్రం సమాధులు... యెటు చూసినా సమాధులే! పొలంలో అందరి టిపినీల అన్నం గుడ్డమీదేసి కలిపి తలో ముద్ద పంచుకున్నట్టు అన్న వొంటిమీద దెబ్బపడితే తమ్ముడు బరిసె అందుకున్నట్టు చావులోనూ బతుకులోనూ సామూహికతే ఆ సమాధులది సమాధులు దేశం నడిబొడ్డున నిలువెత్తు ప్రశ్నలా నిలబడ్డట్టుంది సమాధులు మాట్లాడతాయి ప్రశ్నలడుగుతాయి కాలవలో నీళ్ళకుబదులు నెత్తురెందుకు పారిందని వూరి చెరువులో కన్నీరెందుకు నిండిందని సమాధులు నిలదీస్తాయి హంతకుడిని దాటేసింది యెవరని! లోపల లావాని దాచుకున్న సమాధులు యేదో వొకరోజు నిద్ర వొదిలించుకు లేస్తాయి చరిత్రని తిరగ రాస్తాయి యిప్పుడు సమాధులు వో సరికొత్త పునరుత్ధానాన్ని కలగంటున్నట్టుంది 06.08.2018