Posts

Showing posts from July, 2018

Cow

Image
గోవు కేక   చల్లపల్లి స్వరూపరాణి యే పనీ చేతగాని పిల్లోడ్ని వేదికపైకి పిల్చి పరమవీరచక్ర బిరుదిచ్చినట్టుంది నా పని... పేరుకి సాదు జంతువునే అయినా యెందుకో జంతువుల్లో బోల్డంత చెడ్డపేరు మూట కట్టుకుంటున్నదాన్ని! యీ మధ్య కొందరు నన్ను చూసి ప్రాణభయంతో పరుగెడుతున్నారు మరికొందరు యెన్నడూ లేని ప్రేమ కురిపిస్తున్నారు యింకొందరు నా పేరు చెప్పి తమ పగోళ్ళని మట్టుబెడుతున్నారు యిందతా చూస్తే నా పుట్టుక మీదే విరక్తి పుడుతుంది అప్పట్లో పాలు పెద్దగా యివ్వనని రోడ్లంట వొదిలేస్తే డొక్కలెండిపోయి ప్లాస్టిక్ సంచులు, కాయితాలు తిని బతికాను   అనామకంగా! యిప్పుడూ అంతే అనుకోండి నా మొహాన   గుప్పెడు గడ్డైనా విదిల్చనోళ్ళు నన్ను ఆకాశానికెత్తుతుంటే కడుపు తరుక్కుపోతుంది నాకు తెలీని గొప్పతనమేదో నా నెత్తిన మెరుస్తుంటే నా ప్రతిభ యేమిటో అర్ధంకాక యీ కీర్తి బరువును మొయ్యలేకున్నా! యేడ్చే దిక్కు, యీడ్చే దిక్కు లేక అనాధగా పడి వున్న   నా శవాన్ని మోసుకెళ్ళి ముక్కులు పగిలే గవులు తాము భరించి వూరికి సుచిని దానం చేసే ఆ యెర్రిబాగులోళ్ళని నా పేరున కొట్

Untouchable Cultivation

Image
వెలి గిన్నె అల్లిక ఆమె తోడబుట్టిన చదువు కైకట్టడం ఆమెకబ్బిన కళ మోకాలి లోతు బురదలో బతుకు దిగబడి పోయినా వెనక్కి తిరగని   చెమట చుక్కని చూడండి! ఆమె పేరు సృజన ఆమె చేతిలో    కాలవై పారేది కవిత్వం కాకపొతే మరేంది! నారు మొక్కలతో పాటు నాజూకుతనాన్నీ రేగటి చాళ్ళలో పాతేసుకున్న పొగచూరు కట్టె  ఆమె గట్టు బుసలు చిమ్మిన వెకిలి పాముల్ని  నారకట్టలా విదిల్చడం  ఆమెకి పచ్చడి మెతుకుతో  పెట్టిన విద్య యిక్కడ బియ్యం చెట్లై సాగేవాళ్ళకి బతుకే వో పండిన చేను  కాయ కష్టంతో  నరాలు సాగిపోయిన ఆమెకి దినదినం యెతల జడివాన వొడ్డు మీద కూచ్చుని గడ్డలేసే  మారాజు అన్నదాతై కీర్తి తలపాగా ధరిస్తే నేలకి నెత్తుటి యెరువేసి యెదిగిన పైరు బిడ్డపై తన పచ్చటి పైట కొంగు కప్పిన ఆ కూలితల్లి తానో రెల్లు దుబ్బై మిగులుతాది యెంత అన్నం పెంపుచేసినా అన్నపూర్ణ కాలేకపోయిన వెలి గిన్నె ఆమె *ఫొటో:  గాలి నాసర రెడ్డి గారు  23.౦7.2018 

Nelson Mandela

Image
నల్ల సూర్యుడికో నూలుపోగు చల్లపల్లి స్వరూపరాణి నలుపు రంగు యెంత చక్కనిదో నిన్ను చూశాకే కదా ప్రపంచం తెలుసుకుంది! తెల్లటి మృగం మొహాన తుపుక్కున వుమ్మటానికి నల్ల మనుషుల వొంట్లో సత్తువ నింపిన సూర్యుడా! యీ శకం నీదేరా తండ్రీ! కాలం నీ బొమ్మని కూడా రంగుల్లో చూడ్డానికి యిష్టపడదు కదా! రంగుల లోకాన్ని ధిక్కరించే అవర్ణుల రక్తంలో ప్రవహిస్తూనే వుంటావు నువ్వు గుండెలు మండేలా! (జులై 18, 2018 నెల్సన్ మండేలా శతజయంతి)

Nomadic Tribe- Chenchu

Image
చౌరస్తాలో చెంచు జాతి చల్లపల్లి స్వరూపరాణి        అడవిలో మానుల్లో వొకానొక మానులాగా అప్పుడే మోవులు తొడిగిన లేత పచ్చ ఆకులాగా స్వచ్చంగా పెద్దగా మాట్లాడకుండా యితరుల్ని చూస్తే మొహమాటంగా , బిడియంగా కనిపించే రాతియుగపు మనిషికి నికార్సైన ప్రతినిధి చెంచు . చెంచులు ఆదిమ మానవ తెగలలో ద్రావిడ జాతికి చెందిన వొకానొక ఆటవిక తెగకి చెందిన వారు . ' చెట్టు ’, ' చుంచు ’ వంటి పదాల నుంచి ' చెంచు ’ అనే పదం వొచ్చిందని పరిశోధకులు అంటారు . తెలుగు రాష్ట్రాలలో గుర్తించబడిన 33 గిరిజన తెగలలో చెంచులు మిగతా వారందరికంటే మరింత మూలకి నెట్టబడిన వీరు యెక్కువగ కర్నూలు , ప్రకాశం , ప్రస్తుత తెలంగాణా రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలలో విస్తరించిన నల్లమల అడవులలోనూ కృష్ణా , గుంటూరు , కడప మొదలైన జిల్లాలలోని మైదాన ప్రాంతాలలో అరుదుగా నివసిస్తుంటారు . చెంచులు ప్రధానంగా ఆటవిక జాతి వారే ! పాల్కురికి సోమనాధుడు రాసిన ' పండితారాధ్య చరిత్ర ’ లో ఆయన చెంచుల గురించి పేర్కొన్నాడు . నల్లమల అడవిలో వున్న ప్రముఖ శైవ క్షేత్రం అయిన