My Poetry
యీ అక్షరం
ఆసరా లేకపోతే
నేనేమయ్యేదాన్నో!
బతుకు నావ యే నడి సముద్రంలో
భుడుంగుమనేదో కదా!
ఆ మాటకొస్తే ప్రపంచం కూడా
బహుశా! పుట్టిన దగ్గరే
ఆగిపోయుండేదేది!
యీ అక్షరపు చెలమ కోసమేగా
మేము అలమటించింది!
యీ అక్షరం తోడు కోసమేగా
మేము యోజనాలు నడిచింది!
అక్షరం
నా చుట్టూ మేటలు వేసిన
కటిక చీకటిని
తరిమిన కాంతిరేఖ
అక్షరం!
నా శతృవుని బోనులో నిలబెట్టి
ప్రపంచం ముందు
నన్ను విజేతని చేసిన
నా చేతి ఆయుధం
నన్ను
వేలుపట్టుకుని
నక్షత్ర మండలం మీద
వొట్టికాళ్ళతో నడిపించిన
దేవదూత అక్షరం
యీ అక్షరం
వో గండ్ర గొడ్డలై
సంకెళ్ళను తెగనరికి
నా భుజాలకు రెక్కలు తొడిగింది!
యీ చిన్నారి అక్షరమే కదా
నాకు స్వేచ్చా ప్రపంచపు తలుపులు
బార్లా తెరిచిన ఆకాశ పక్షి!
బురదలో కూరుకు పోయిన
నా జాతికి
యీ అక్షరం
జ్ఞాన స్నానం చేయించి
తెల్లటి మనిషితనాన్ని
బహూకరించింది!
యీ చిన్నారి అక్షరమే కదా!
నేను క్షయమై పోకుండా
ప్రాణాన్ని పొదివిపట్టి
నన్ను నిటారుగా నిలబెట్టిన
జీవ ధాతువు!
వెలుతురు ధారలకోసం
యుగాలుగా పిడచకట్టుకు పోయిన
నా మట్టి నాలుకపై
అమృతాన్ని చిలకరించి
సేదదీర్చింది యీ అక్షరం బొట్టే!
అక్షరం
నా గుడిసె సిగపై
రెపరెపలాడే
ఆత్మగౌరవ పతాకం!
బొట్టు లేని
మా అమ్మ నుదుటిపై
నవ్వే
వెన్నెల సంతకం అక్షరమే!
సముద్రాల కావల వున్న
జ్ఞాన దీవుల్ని తోలుకొచ్చి
మా వాకిట్లో దింపిన వోడ
యీ అక్షరం!
అక్షరానికి
కన్నీటి రుచి తెలుసు
అది మనిషి
వాసన
పసిగట్టగలదు
పొలికేకలు వినగలదు
అగ్రహార అగాధం దాటి
అక్షరం
నన్ను ముద్దాడింది
యిది
ఆకాశం, భూమి కలుసుకున్న
అపురూప సందర్భం!
నా చేతిలో చెయ్యేసి నడిచే
ఆప్త మిత్రురాలు అక్షరం
కలత పడితే
నేను అక్షరం నీడకెళ్ళి
కళ్ళు తుడుచుకొని వస్తాను
యిప్పుడు
నా అక్షరాయుధాన్ని
బాధితుడికి సాయం పంపుతాను
పీడిత చెక్కిలిపై
కన్నీటి చారికలు తుడిచే
అమ్మ చీర కొంగు
నా అక్షరం
18.2.2018
Comments
Post a Comment