Pranay పరువు హత్య -Poem
దాహం చల్లపల్లి స్వరూపరాణి యెంత నెత్తురు పారినా యెన్నిసార్లు దహించుకుపోయినా యీ దాహం తీరదు బాబయ్యా! కాసింత ప్రేమ చినుకు కోసం వొకింత చిగురాకు స్పర్శ కోసం యుగాలుగా మొహం వాచినవాడిని... అందుకే ఆమె యెదురొచ్చి కళ్ళల్లో కళ్ళు పెడితే నిలువెల్లా ప్రణయమై చెమరించాను... ప్రేమని అరలు అరలుగా గదుల్లో పేర్చుకోవాలని అవసరమైనంతమేరకే తుంపులు తుంపులుగా వాడుకోవాలని అమ్మా అయ్యా బొత్తిగా బోధించలేదు... కండంటే గబుక్కుమనడమే తప్ప మరొకటి కూడా వుంటాదని యెరగని యెర్రిబాగులోళ్ళు... యే పుట్టలో యే పాముందో అర్ధమయ్యే లోపలే అన్నీ పోగోట్టుకున్నోళ్ళు... తనతో పాటు కూలి పనిచేస్తున్న కూతురి కాళ్ళ వెంట నెత్తురు కారితే గుండె పంచెని పరపరా చించి యిచ్చినోళ్ళు నా పిచ్చి తండ్రులు... అల్లుడు నచ్చకపోయినా ఆళ్ళిద్దరూ కువకువలాడితే చాటునుంచి మురిసిపోయే కన్న కడుపులుంటాయని తెలుసు గానీ ఆళ్ళకేం తెలుసు బిడ్డ నెత్తురు కళ్ళజూసే నాన్నలుంటారని! చెట్టు కూలిపోతే పొగిలి పొగిలి యేడవడం జ్ఞాపకాల్ని పోగ...