Pranay పరువు హత్య -Poem






దాహం
చల్లపల్లి స్వరూపరాణి

యెంత  నెత్తురు పారినా
యెన్నిసార్లు దహించుకుపోయినా
యీ దాహం తీరదు బాబయ్యా!

కాసింత ప్రేమ చినుకు కోసం
వొకింత చిగురాకు  స్పర్శ కోసం
యుగాలుగా
మొహం వాచినవాడిని...

అందుకే ఆమె యెదురొచ్చి
కళ్ళల్లో కళ్ళు పెడితే
నిలువెల్లా ప్రణయమై
చెమరించాను...

ప్రేమని అరలు అరలుగా
గదుల్లో  పేర్చుకోవాలని
అవసరమైనంతమేరకే
తుంపులు తుంపులుగా వాడుకోవాలని
అమ్మా అయ్యా
బొత్తిగా బోధించలేదు...

కండంటే గబుక్కుమనడమే తప్ప
మరొకటి కూడా వుంటాదని
యెరగని యెర్రిబాగులోళ్ళు...

యే పుట్టలో యే పాముందో
అర్ధమయ్యే లోపలే
 అన్నీ పోగోట్టుకున్నోళ్ళు...

తనతో పాటు కూలి పనిచేస్తున్న
కూతురి కాళ్ళ వెంట
నెత్తురు కారితే
గుండె పంచెని
పరపరా చించి యిచ్చినోళ్ళు
నా పిచ్చి తండ్రులు...

అల్లుడు నచ్చకపోయినా
ఆళ్ళిద్దరూ కువకువలాడితే
చాటునుంచి మురిసిపోయే
కన్న కడుపులుంటాయని తెలుసు గానీ 

ఆళ్ళకేం తెలుసు
బిడ్డ నెత్తురు కళ్ళజూసే
నాన్నలుంటారని!

చెట్టు కూలిపోతే   
పొగిలి పొగిలి యేడవడం
జ్ఞాపకాల్ని పోగుచేసుకుని  
మళ్ళీ చిగురించడం
నా జాతి  సహజాతం...

అవును
మాకు ప్రేమించడం మాత్రమే తెలుసు... 

(ప్రణయ్, అమృతల కోసం)
16.09.2018








Comments

Popular posts from this blog

Charvaka Asram- Write up

Nomadic Tribe- Chenchu

Dalit Women's Writing-EPW