Charvaka Asram- Write up
ప్రత్యామ్నాయ సాంస్కృతిక విప్లవ క్షేత్రం - మహాత్మా రావణ మైదానం చల్లపల్లి స్వరూపరాణి ‘భారత దేశంలో జరిగినదంతా దేవుడి పేరు మీదే జరిగింది. వారి సమస్య పేరు ‘దేవుడు’ అని వివాదాస్పద రచయితగా పేరొందిన సల్మాన్ రష్డీ గుజరాత్ లో 2002 మత ఘర్షణల సందర్భంగా ‘The Guardian’ అనే పత్రికలో పేర్కొన్నాడు. అలాగే కవి పైడి తెరేష్ బాబు కూడా ఇలాగే అంటాడు ‘దేవుడు సృష్టికర్త... బానిసత్వాన్ని సృష్టించి ఆత్మగౌరవాన్ని ధ్వంసం చేస్తాడు’. నిజమే! ఇక్కడంతా దేవుడి పేరునే జరుగుతుంది. నిచ్చెనమెట్ల కుల వ్యవస్థని నేనే సృష్టించానని చెప్పుకునే దేవుళ్లున్న మతం రాజ్యమేలే దేశంలో అసమానతకు ప్రాతిపదికగా ఉండే బ్రాహ్మణీయ హిందూ మతానికి అనధికార ఆమోద ముద్ర వుంటుంది. మతం భారత సమాజాన్ని పట్టి పీడిస్తున్న అతి ముఖ్యమైన రుగ్మత అని ప్రాచీనకాలంలోనే చార్వాక, లోకాయతులు గుర్తించారు. వివిధ అంశాల మధ్య కార్యాకారణ సంబంధాలని పరిశీలించే హేతువాద దృష్టిని ఎదగనీయకుండా మనిషి కళ్ళు మూసే దైవ భావన పైన, దాని తాత్వికత పైన వారు ప్రశ్నల తూటాలు సంధించారు. ప్రాచీనకాలంలో భౌతికవాదాన్ని ప్రచారం చేసిన త...