Charvaka Asram- Write up




ప్రత్యామ్నాయ సాంస్కృతిక విప్లవ క్షేత్రం - మహాత్మా రావణ మైదానం  
చల్లపల్లి స్వరూపరాణి


‘భారత దేశంలో జరిగినదంతా దేవుడి పేరు మీదే జరిగింది. వారి సమస్య పేరు ‘దేవుడు’ అని  వివాదాస్పద రచయితగా పేరొందిన సల్మాన్ రష్డీ గుజరాత్ లో 2002 మత ఘర్షణల సందర్భంగా ‘The Guardian’ అనే పత్రికలో పేర్కొన్నాడు. అలాగే కవి పైడి తెరేష్ బాబు కూడా ఇలాగే అంటాడు ‘దేవుడు సృష్టికర్త... బానిసత్వాన్ని సృష్టించి ఆత్మగౌరవాన్ని ధ్వంసం చేస్తాడు’.  నిజమే! ఇక్కడంతా దేవుడి పేరునే జరుగుతుంది. నిచ్చెనమెట్ల కుల వ్యవస్థని నేనే సృష్టించానని చెప్పుకునే దేవుళ్లున్న మతం రాజ్యమేలే దేశంలో అసమానతకు ప్రాతిపదికగా ఉండే బ్రాహ్మణీయ హిందూ మతానికి అనధికార ఆమోద ముద్ర వుంటుంది.
మతం భారత సమాజాన్ని పట్టి పీడిస్తున్న  అతి ముఖ్యమైన రుగ్మత అని ప్రాచీనకాలంలోనే చార్వాక, లోకాయతులు గుర్తించారు. వివిధ అంశాల మధ్య కార్యాకారణ సంబంధాలని పరిశీలించే  హేతువాద దృష్టిని ఎదగనీయకుండా  మనిషి  కళ్ళు మూసే దైవ భావన పైన, దాని తాత్వికత పైన వారు  ప్రశ్నల తూటాలు సంధించారు. ప్రాచీనకాలంలో భౌతికవాదాన్ని ప్రచారం చేసిన తొలి భౌతికవాద తత్వమైన చార్వాక, లోకాయత సిద్ధాంతాన్ని తెలుగునాట వేమన,  త్రిపురనేని రామస్వామి చౌదరి, కొండవీటి వేంకటకవి వంటివారు ప్రచారం చేశారు. వారిదారిలో చార్వాకాన్ని తన ఇంటిపేరుగా మార్చుకున్న బొడ్డు రామకృష్ణ గారు ప్రయాణం మొదలుపెట్టి  తెలుగునాట నాస్తికవాదాన్ని ప్రజా బాహుళ్యంలోకి తీసుకెళ్ళారు.
‘నాస్తికత్వమంటే దైవాన్ని విస్వసించకపోవడం మాత్రమే కాదు, భౌతికమైన విశ్వాన్ని స్వేచ్చగా నిరంతరం అధ్యయనం చేసే లక్షణం కలిగి ఉండడం. తను ఆర్జించిన జ్ఞానంతో వివేకపూరితంగా జీవించడం కూడా’ అని కార్ల్ సాగన్ అంటాడు. నాస్తికత్వమంటే ప్రజల్లో మూఢ నమ్మకాలను పారద్రోలి శాస్త్రీయ దృక్పధాన్ని పెంపొందించడం, ప్రకృతిలోని పశు పక్ష్యాదులను వశ పరుకుకుని తన మేధస్సుతో నాగరికతను అభివృద్ధి చేసిన మానవుడే మహానీయుడని విశ్వసించడం.  అలాగే లేని దేవుడికంటే ఎదురుగా ఉన్న మనిషి పట్ల గౌరవం, నమ్మకం కలిగి ఉండడం. మతవాదం దేవుడికి, అభూత కల్పనలకు తప్ప మనిషి లోని గొప్పతనాన్ని అంగీకరించదు. అది అతనిని తిరోగమనం వైపు తీసుకెళ్తుందని చార్వాక భౌతికవాదం చెబుతుంది. తమ గురువులైన త్రిపురనేని రామస్వామి, గోరా, కొండవీటి వెంకట కవి వంటి నాస్తిక మేధావులు ఆధిపత్య బ్రాహ్నణ వాదానికి ప్రత్యామ్నాయంగా నాస్తిక వాదాన్ని నిలబెట్టడం చార్వాక రామకృష్ణ గారిని బాగా ఆకర్షించింది. గోరా, కొండవీటి వేంకటకవి ఆధ్వర్యంలోనే రామకృష్ణ, గృహలక్ష్మిల వివాహం నాస్తిక పద్ధతిలో జరిగింది.  వారి ప్రభావంతో నాస్తికుడైన ఆయన ఓరియంటల్ కాలేజీలో తెలుగు, సంస్కృత  అధ్యాపకుడిగా ఎందరో విద్యార్ధులను భౌతికవాదం వైపు తిప్పగలిగారు. వారిలో అయ్యన్న గారులాంటివారు ముఖ్యులు. ఉద్యమకారుడు కత్తి పద్మారావు ఆయన వలన ప్రభావితమైన మరో శిష్యుడు. రామకృష్ణ గారు గుంటూరు జిల్లా తాడికొండలోని ఓరియంటల్ కాలేజీ ప్రిన్సిపల్ గా ఉన్నప్పుడు కాలేజీ యాజమాన్యం తన భావాలను ఎదగనీయకపోవడంతో ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి మంగళగిరి పక్క గ్రామమైన  నిడమర్రులో చార్వాక విద్యా పీఠాన్ని స్థాపించారు. అమరావతి సమీపంలోని ‘తుళ్ళూరు’ ఆయన స్వగ్రామం. ప్రజల్లో తన ఉద్యమాన్ని వ్యాప్తి చెయ్యడానికి రామకృష్ణ విద్యని గొప్ప ఆయుధంగా భావించారు. ఆయన 1973 నాటికి నిడమర్రు గ్రామంలో ‘చార్వాక విద్యా పీఠా’న్ని స్థాపించారు.
చార్వాక విద్యా పీఠం కోసం బయట పాఠశాల విద్యకు భిన్నంగా సిలబస్ ను రూపొందించారు రామకృష్ణ గారు. ‘బాల రావణాయణం’,  ‘చార్వాక తెలుగు వాచకం’ ఐదు భాగాలు ముఖ్యమైనవి. హిందువుల పడుగలు, పబ్బాలను తెలుగువారందరి పండుగలుగా చెబుతూ హేతువుకి నిలబడని అంశాలతో కూడిన కట్టుకధలని   పాఠ్యాంశాలుగా పిల్లల మెదళ్ళలో భ్రమలను నాటే చదువు స్థానంలో శాస్త్రీయ దృష్టిని పెంపొందించే పాఠాలను రామకృష్ణ గారు రూపొందించారు. బాల్యంలో తెలియని విషయాలపై తల్లిదండ్రులను ప్రశ్నలడిగే పిల్లల స్వభావాన్ని ప్రోత్సహించాలని ఆయన భావించి ఆచరించారు. ఈ పాఠశాలను ఆయన తన సతీమణి, గృహలక్ష్మి గారి సహకారంతో సుమారు ముప్పై సంవత్సరాల పాటు నిర్వహించడం గొప్ప విప్లవంగా భావించవచ్చు. 1977, 91 సంవత్సరాలలో ఈ ప్రాంతంలో వచ్చిన తుఫాన్లకు ఈ పాఠశాల కూలిపోవడంతో పాటు శత్రువుల దాడుల్లో కూడా అది శిధిలమైంది. ఇక్కడ చదివిన అనేకమంది విద్యార్ధులు గొప్ప మేధావులుగా, రచయితలుగా, ఉద్యమకారులుగా తయారయ్యారు.
రెండు మూడు తరాలను హేతువాద, నాస్తిక వాదాలవైపు నడిపించిన ఈ పాఠశాల క్రమంగా ‘చార్వాక ఆశ్రమం’ గా రూపొందింది. దేశంలో భౌతికవాదాన్ని, సామాజిక మార్పును కోరే సంస్కర్తల విగ్రహాలతో నాస్తిక కేంద్రం గొప్పగా రూపొందింది. ప్రాచీన భారతంలో భౌతికవాదాన్ని ముందుకు తీసుకొచ్చిన గౌతమ బుద్ధుడు, మక్కలి గోశాలుడు, అజితకేశ  కంబళి, పూరణ కశ్యపుడు, సంజయ బెలాతి పుత్రుడు, కణాదుడు, కపిలుడు వంటి వారితో పాటు ఆధునిక యుగంలో బ్రాహ్మణవాదాన్ని ధిక్కరిస్తూ ఉద్యమాలు నిర్మించిన మహాత్మా జ్యోతీరావు ఫూలే, సావిత్రీబాయి, అంబేడ్కర్, పెరియార్, త్రిపురనేని రామస్వామి, కె.బి.కృష్ణ మొదలైనవారి విగ్రహాలను ఇక్కడ ప్రతిష్టించి చార్వాక ఆశ్రమాన్ని గొప్ప నాస్తిక తాత్విక చింతనకు నెలవుగా రామకృష్ణ గారు తీర్చిదిద్దారు.  హిందూమత గ్రంధాలలో పరమ దుర్మార్గుడిగా చిత్రించబడిన రావణుడిని సాత్వికుడిగా, యోగి వేమన దిగంబరంగా కాక నిండుగా దుస్తులు ధరించి ఉన్నట్టు ఇక్కడ కనిపిస్తారు. బ్రాహ్మణవాద ప్రతీకలను చార్వాక ఆశ్రమం తిరగదిప్పి ఓ సరికొత్త ప్రపంచాన్ని మనముందు ఉంచుతుంది. సామాజిక మార్పు కోసం ఆలోచించి, పనిచేసిన వారందరినీ విగ్రహ రూపంలో ఒకచోట చేర్చి భావితరాలకు స్పూర్తిదాయకమైన ఒకేఒక్క కేంద్రంగా చార్వాక ఆశ్రమాన్ని పరిగణించవచ్చు. మనువాదానికి ప్రత్యామ్నాయమైన గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని బహుజనులకు ఈ కేంద్రం అందించింది. వేమన నిండుగా బట్టలు ధరించిన ఒక శిల్పం చార్వాక ఆశ్రమ ద్వారం దగ్గర సందర్శకులను లోనికి ఆహ్వానించడం తెలుగు ప్రాంతాలలో బహుశా ఇక్కడే కావచ్చు. మనకి దేశంలో ఎక్కడ చూసినా దేవుళ్ళ విగ్రహాలు, గుడులూ, గోపురాలూ, స్వామీజీల బొమ్మలే కనిపిస్తాయి. అలాగే ఆశ్రమాలు అంటే అరాచాకాలకూ, మాఫియా ముఠాలు సాగించే అసాంఘిక కార్యక్రమాలకూ నిలయాలుగా  తప్ప ఇటువంటి ఉన్నతమైన విలువలతో కూడిన ఆశ్రమాలు ఈ ఇరవై ఒకటో శతాబ్దంలో కూడా ఉన్నాయంటే కొంత విస్మయాన్ని కలిగించే విషయమే. అదొక మావవతా శిబిరం, అక్కడ జ్ఞానం కొలువుదీరి ఉంటుంది. ఆయన ఇంటిపేరు ‘లోకాయత భవనం’ అని రాసుకోవడమే కాక ఒక్కో గదికి ‘చుప్పనాక’(శూర్పణఖ), కుంభకర్ణుడి భార్య అయిన ‘వజ్ర జ్వాల’, బుద్ధుడి భార్య ‘యశోధర’ పేర్లు పెట్టారు.  
నిడమర్రు చార్వాక ఆశ్రమం ఆధ్వర్యంలో శాస్త్రీయ విద్యాభివ్రుద్ధితో పాటు తెలుగు రాష్ట్రాలలో మూఢ నమ్మకాలను పారద్రోలి ప్రజల్ని చైతన్య పరిచే కార్యక్రమాలను రూపొందించి ప్రజల్లోకి వెళ్లారు. అవి నిప్పుల గుండం తొక్కడం, మూఢ నమ్మకాలను శాస్త్రీయంగా కొన్ని ప్రయోగాలు చెయ్యడం ద్వారా తొలగించడం, వాస్తు, జ్యోతీష్యం వంటివి వొట్టి భూటకం అని వివరించడం, బాణామతి, చేతబడి వంటి దురాచారాలు జరుగుతున్న ప్రాంతాలను సందర్శించి అవసరమైతే పోలీసుల సహకారాన్ని తీసుకుని ఆ దుశ్చర్యలను ఆపడం, సభలు సమావేశాలు, అవగాహనా తరగతుల ద్వారా ప్రజలను చైతన్య పరచడం వంటి ఎన్నో కార్యక్రమాలను నాస్తిక కేంద్రం తరపున తెలుగు రాష్ట్రాలలో నిర్వహించారు. నాస్తికవాదాన్ని తెలియజేసే చిన్న పుస్తకాలతో ‘వాయిస్ ఆఫ్ చార్వాక’ అనే ద్వైమాసిక పత్రికను కూడా రామకృష్ణ గారు ప్రారంభించి దానిని ఎంతో విజ్ఞానదాయకంగా నిర్వహిస్తున్నారు. రామకృష్ణ గారు 2007లో మరణించాక ఆయన కుమారుడు సుధాకర్ ఆ పత్రికకు సంపాదకుడిగా వ్యవహరిస్తున్నాడు. వీటితోపాటు చార్వాక ఆశ్రమం వారు ఆయా సందర్భాలలో ప్రజల్ని చైతన్యపరిచే కరపత్రాలూ, ప్రతి సంవత్సరం క్యాలెండర్ వంటివి కూడా ప్రచురిస్తారు. దీనికొరకు ఒక ప్రచురణా సంస్థనూ ముద్రణా యంత్రాలనూ  సమకూర్చడం విశేషం. అలాగే ఫూలే, అంబేడ్కర్ల కులనిర్మూలనా సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టే కులాంతర వివాహాలను మతపరమైన క్రతువులకు భిన్నంగా జరపడం అనేది చార్వాక ఆశ్రమ కార్యక్రమాలలో ఒక ముఖ్యాంశం. రామకృష్ణ, గృహలక్ష్మి దంపతులు తమ పిల్లలు అరుణ, సుధాకర్, చార్వాకలను చైతన్యవంతంగా పెంచి వారికి కులాంతర వివాహాలను జరిపించడమేకాక అనాధలైన పిల్లలను అక్కున చేర్చుకుని వారికి విద్యా బుద్ధులు నేర్పించి వివాహం జరిపించారు. వారిలో ప్రముఖ కవి, ఉద్యమకారుడైన  కత్తి పద్మారావు గారి భార్య స్వర్ణకుమారి ఒకరు. అనేక సామాజిక కార్యక్రమాలలో వీరు ఫూలే దంపతులను పోలి ఉండడం విశేషం.
సమాజంలో పెచ్చరిల్లుతున్న కులమత దురహంకార దాడులకు, అత్యాచారాలకు కూడా చార్వాక  ఆశ్రమం స్పందించి బాధితులకు ఆసరాగా కార్యక్రమాలను రూపొందించింది. కారంచేడు, చుండూరు వంటి చోట్ల దళితులపై దాడులు జరిగినప్పుడు అక్కడకు వెళ్లి బాధితులను పరామర్శించి వారి ఉద్యమానికి సంఘీభావాన్ని తెలియజేసింది.  1992 బాబ్రీ మసీదు విధ్వంసం సందర్భంగా ‘హిందూమతతత్వ వ్యతిరేక యాత్ర’ ను చార్వాక ఆశ్రమం చేసింది. అలాగే రామజన్మ భూమిని నిర్మించాలనే సంకల్పంతో హిందుత్వ వాదులు చేసే రధ యాత్రలకు భిన్నంగా ‘శంభూక రధ యాత్ర’ లను నిర్వహించింది.  ఈ క్రమంలోనే మతం పేరున దేవాలయాలలో జరిగే భ్రహ్మోత్సవాలు, రధోత్సవాలు, జాతరలు, తిరునాళ్ళు, కుంభమేళా వంటి వాటికి ప్రత్యామ్నాయంగా ప్రతియేటా  ‘నాస్తిక మేళా’ ను నిర్వహించాలనే ఆలోచన చేసింది నాస్తిక కేంద్రం. ఇక్కడ  1991 నుంచి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి రెండవ శని, ఆదివారాల్లో నిర్వహించడం అనేది నిరంతరాయంగా ఇప్పటికి 27 సంవత్సరాలుగా జరుగుతూ వస్తుంది. ‘నాస్తిక మేళా’ జరిగే ప్రదేశానికి రామకృష్ణ గారు ‘ మహాత్మా రావణ మైదానం’ అని పేరుపెట్టి బ్రాహ్మణ వాదానికి ఓ పెద్ద సవాల్ విసిరారు. అన్ని రంగాలలో ప్రత్యామ్నాయాన్ని రూపొందించకుండా వ్యవస్థను మార్చడం కల్ల అని ఆయన బలంగా నమ్మి దానిని నూటికి నూరుశాతం ఆచరణలో పెట్టారు.     
చార్వాక రామకృష్ణ గారు, ఆయన సహచరులు నాస్తికవాదాన్ని కేవలం ’దేవుడు లేడు’ అనే ఏకవాక్య ప్రచారంగా కాకుండా దానిని ఈ దేశపు ఒక గొప్ప తాత్విక చింతనగా, గతితార్కిక భౌతికవాదంగా, సమానతకు మానవతకు ప్రతీకయైన సామ్యవాదంగా, కులనిర్మూలనా వాదంగా మొత్తంగా ఒక విశాలమైన విముక్తివాదంగా ప్రచారం చేశారు. తమ ఉద్యమానికి ప్రగతిశీలక శక్తుల సహకారాన్ని తీసుకుంటూ అవిశ్రాంతంగా ముందుకు వెళ్తున్నారు. రామకృష్ణ గారికి బౌద్ధం మీద అపారమైన గౌరవం ఉంది. బౌద్ధం ఎక్కువగా వ్యాప్తిచెందిన కాలాన్ని ఆయన ‘స్వర్ణ యుగం’ గా భావించారు. అలాగే మార్క్సిజం పట్ల, గతితార్కిక భౌతికవాదం, ఫూలే అంబేడ్కర్ కులనిర్మూలనా వాదం, పెరియార్ హేతువాదం, వేమన తత్వం, గుఱ్ఱం జాషువా సాహిత్యం లోని సారాన్ని ఆయన నాస్తికవాదానికి అనుసంధానించి ఆచరణలో పెట్టడం చూడొచ్చు. అలాగే మార్స్క్సిజం చెప్పే ఆర్ధిక పోరాటాలు, అంబేడ్కరిజం ముందుకు తెచ్చిన సాంఘిక పోరాటాలు జమిలిగా జరగాలనీ అవి రెండూ ఓకే నాణానికి బొమ్మా బొరుసు వంటివని ఆయన అభిప్రాయం. అయితే ఆయన తన ఉద్యమాన్ని మార్క్సిస్టులు ఆదరించలేదని వాపోయాడు.
తినే తిండిలో, కట్టే బట్టలో మతాన్ని ముడిపెట్టడం ఇక్కడ అతి సాధారణ విషయం. లౌకిక రాజ్యం అని ప్రకటించుకున్న భారతదేశం ఆచరణలో మత రాజ్యంగానే జీవిస్తుంది. ఇక్కడ ఒక మతానికి అనధికార ఆమోద ముద్ర వేస్తూ ప్రభుత్వ కార్యక్రమాలను  పూజలతో ప్రారంభించడం బహిరంగ రహస్యమే!. అధికారికంగా యజ్న యాగాది క్రతువులను నిర్వహిస్తూ లౌకికవాద స్పూర్తిని సాక్షాత్తూ ప్రభుత్వాలే తుంగలో తొక్కే పని నిర్విఘ్నంగా జరుగుతుంది. విమానాలూ, రాకెట్ల ప్రస్తావన పురాణాలలోనే ఉన్నాయని ఎంతో కృషి, శ్రమల ఫలితంగా ఎదిగొచ్చిన శాస్త్ర సాంకేతిక రంగాన్ని అవమానిస్తున్నారు. కౌరవులు టెస్ట్ ట్యూబ్ బేబీలని ఒక విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ ఏకంగా సైన్స్ కాంగ్రెస్ లో ప్రకటించి వైద్య విజ్ఞానాన్ని అభాసుపాలు చేస్తున్నాడు. ప్రభుత్వ ప్రైవేటు మీడియా సంస్థలు కూడా ఒక ఆధిపత్య మతాన్ని ప్రచారం చేసేపనిలో ఉంటాయి. రేడియోల కాలం నుంచి నేటి శాటిలైట్ చానళ్ళ దాకా టెక్నాలజీ మార్పు తప్ప ధ్రుక్పధాలలో పెద్ద మార్పేమీ లేదు. అందరూ ఆవుతోక పట్టుకుని స్వర్గానికి ఎగబాకాలనుకునేవారే. మహాకవి గుఱ్ఱం జాషువా అన్నట్టు మతం సర్వస్వం అయినచోట పాములకు పాలు, చీమలకు పంచదార ఇస్తారుకానీ మనిషికి మాత్రం పిడికెడు మనిషితనాన్ని ఇవ్వడానికి మనసొప్పదు.  ఇక్కడ దేవుడి పేరున జరగని అరాచకం లేదు. రోజుకో బాబా, పూటకో దేవుడూ పుట్టుకొచ్చి ప్రజల అమాయకత్వంతో ఆటలాడుకునే దేశంలో మతాన్ని కాదని నిలబడడం అనేది అతి పెద్ద సవాలు అనొచ్చు. దేవుడు లేడన్న వాడిని ఒక ఉలిపిరి కట్టెలా చూసి ఇంటా, బయటా వెలేస్తారు. అనేక రకాలుగా ఒంటరిని చేస్తారు. అటువంటి సవాళ్ళకు ఎదురీది ఓ ప్రత్యామ్నాయ సంస్కృతిని నిర్మించడం చార్వాక రామకృష్ణ గారు, ఆయన మిత్రులు, వారసులు చేసిన పెద్ద యుద్ధం. వారు  తమ వాదాన్ని పిడివాదంగా కాక గొప్ప ప్రేమతో, అనునయంతో సాధించారు. ఆయన ప్రారంభించిన ‘నాస్తిక మేళా ‘ అర్ధం పర్ధం లేని మతపరమైన ఉత్సవాలను, తిరునాళ్ళను, జాతరలను కాలితో ఈడ్చితన్ని ఒక ప్రత్యామ్న్యాయ సంస్కృతిని నెలకొలిపింది.  ఇలాంటి మేళాలు దేశవ్యాప్తంగా ఇంకా పెద్ద సంఖ్యలో జరగాలి, ప్రజల్లో శాస్త్రీయ దృష్టిని పెంపొందించాలి. మూఢ నమ్మకాలను వ్యతిరేకిస్తూ చట్టాలు చెయ్యవలసిందిగా కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు ఇప్పటికే డిమాండ్ పెట్టి సాధించాయి. అయితే నిడమర్రు చార్వాక ఆశ్రమ కార్యక్రమాల వెలుగులో లౌకిక స్పూర్తిని బతికించుకుంటూ తెలుగు రాష్ట్రాలలో కూడా మూఢ నమ్మకాల వ్యతిరేక చట్టం చేసేలా  కృషి చెయ్యడం ఈనాటి అవసరం. శాస్త్రీయ స్ఫ్రుహను, మానవ వాదాన్ని, పరిశీలనా తత్వాన్ని, సంస్కరణను పెంపొందించడం ప్రతి భారతీయ పౌరుని విధి అని రాజ్యాంగం చెబుతుంది. రాజ్యాంగం ఇచ్చిన మత స్వేచ్చని అందరూ అనుభవిస్తూ మరోపక్క మత మౌడ్యాన్ని అడుకట్ట వెయ్యగలగడం అందులో భాగమేనని గుర్తించాలి. మనకూ కావాలి ఒక సాంస్కృతిక విప్లవం. సాంస్కృతిక విప్లవం విజయవంతమైతే సామాజిక, ఆర్ధిక, రాజకీయ విప్లవాలు  సఫలం కావడానికి మార్గం సుగమం అవుతుంది.

పింగళి చైతన్య (రచయిత్రి, కేంద్రసాహిత్య యువ పురస్కార గ్రహీత)
నేను చార్వాక ఆశ్రమంలో రెండవ తరగతి నుంచి నాల్గవ తరగతి వరకు చదివాను. మా నాన్నగారు జర్నలిస్ట్ పింగళి దశరధ్ రాం చార్వాక ఆశ్రమ పాఠశాల విద్యా విధానం పట్ల ఆసక్తితో నన్ను సాధారణ విద్యావిధానానికి భిన్నంగా చదివించాలని ఆయన కోరిక. నాకు సిలబస్ గురించి పెద్దగా గుర్తులేదు గానీ రామకృష్ణ గారు పిల్లలపట్ల ఎంతో ప్రేమగా, శ్రద్ధగా ఉండేవారు. ఒకసారి నేను స్కూల్ నుంచి ఇంటికి పారిపోతే ఆయన నా వెనక సైకిల్ మీద వచ్చి నచ్చ చెప్పడం బాగా గుర్తుంది. అక్కడ జరిగే నిప్పులు తొక్కడం, సైంటిఫిక్ టెంపర్ ని పెంచే కొన్ని ప్రయోగాలు నాకు బాగా నచ్చేవి. భయం లేకుండా ఉండడం, ఇష్టమొచ్చినట్టు ఆడుకోవడం మాకు బాగా ఇష్టం. మేము అక్కడ ఏవైనా అడగవచ్చు. ప్రశ్నలు అడిగితే విసుక్కోకుండా ఓపిగ్గా సమాధానం చెప్పేవారు. నేను నా తోటివారి కంటే భిన్నంగా నాస్తికవాదం వైపు వెళ్తున్నానని భయపడేది. ఇప్పటికీ ఆమె అక్కడ నన్ను చేర్చకుండా ఉంటే బాగుండేది అని అంటుంది. అక్కడినుంచి వేరే స్కూల్ కి మార్చినా అప్పుడప్పుడు నేను అక్కడికెళ్ళి రామకృష్ణ మాస్టారిని చూసి వచ్చేదాన్ని.   మా మేనత్త ‘తులసి’ అక్కడ ఎక్కువ కాలం చదివింది. ఆమె మా బంధువులందరిలోనూ ధైర్యంగా ఎవరినైనా ఎదిరించి ప్రశ్నించే మనిషిగా గుర్తింపు పొందింది. ఆమె పెళ్లి చేసుకున్న విధానం, వ్యవహార శైలి డైనమిక్ గా ఉంటాయి. నా కేరెక్టర్ లో ప్లస్ పాయింట్స్, ధైర్యం వంటివి ఏమైనా ఉన్నాయంటే అవి చార్వాక స్కూల్ లో చదవడం వల్లనే అలవడ్డాయని అనిపిస్తుంది. ఇతరులకంటే భిన్నంగా సమాజం పట్ల బాధ్యతగా మెలగడం చార్వాక చదువు వలన వస్తుంది. ఆ స్కూల్ విద్యార్ధిని అని చెప్పుకోవడం నాకు గర్వంగా ఉంటుంది.
నరేష్ బైరి ( సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడెరేషన్ జాతీయ సమన్వయకర్త, ఉస్మానియా రీసెర్చ్ స్కాలర్)
నాస్తిక మేళా కు నేను తెలంగాణా నుంచి మా సంఘం సైంటిఫిక్ ఫెడరేషన్ నుంచి యాభై మంది విద్యార్ధులతో మూడు సంవత్సరాల నుంచి వస్తున్నాను. మాకు ఇది ఒక పండగలాంటిది. ఎక్కడెక్కడినుంచో కష్టపడి వచ్చినా ఇక్కడి వాతావరణాన్ని చూడగానే ప్రయాణ భారాన్ని మర్చిపోతాం. తెలంగాణా, ఆంద్ర ప్రాంతాలను ఇది కలుపుతుంది. ఈ మేళాలో అనేకమందిని కల్సుకుని చర్చల్లో పాల్గొని కల్సి భోజనం చెయ్యడం వలన దీనికి ఒక పండగ లాంటి వాతావరణం వస్తుంది.  ‘నాస్తిక మేళా’ సంఘాలకు, రాజకీయ దృక్పధాలకు అతీతంగా అన్ని ప్రగతిశీల సంఘాలను అంటే సామ్యవాదులు, అంబేడ్కర్ వాదులు పెరియార్ వాదంతో అందరినీ కలిపే ఒక కూడలి గా ఈ నాస్తిక మేళా పనిచేస్తుంది. అలాగే ఎప్పుడూ ఫిబ్రవరి రెండవ శని, ఆదివారాలు అనేవి బయటినుంచి రావడానికి అనుకూలంగా ఉన్నాయి. కుటుంబాలుగా పిల్లలతో రావడం వలన వారికి ఇప్పటినుంచి సహజంగానే ఒక హేతువాద దృష్టి అలవడడానికి నాస్తిక మేళా ఉపయోగపడుతుంది. మన భావజాలానికి సంబంధించిన సమగ్ర సాహిత్యం ఓకే చోట దొరుకుతుంది. ఇక్కడికొచ్చి ఉపన్యాసాలు విని స్పూర్తిపొంది మళ్ళీ తిరిగి వెళ్లి రెట్టించిన ఉత్సాహతో నాస్తిక ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇక్కడి కార్యక్రమాలు తోడ్పడుతున్నాయి. ఈ మేళా ఒక క్రమ పద్ధతిలో జరగడం అందరినీ కలిపే ఒక కూడలిలా ఉంటుంది. అయితే దీన్ని కాపాడుకోవాలి. రెండు రాష్ట్రాల్లో వేరు వేరు ప్రదేశాలలో రెండుమూడు నెలలకోసారి ఇటువంటి మేళాలు జరిగితే ఇక్కడిదాకా రాలేనివారు మరో చోటికి వచ్చి పాల్గొనే అవకాశం ఉంటుంది.

షేక్ హజరత్ ఆలీ ( రిటైర్డ్ టీచర్, చార్వాక అభిమాని, వేమూరు, గుంటూరు జిల్లా)
నేను చాలాకాలంగా ఈ చార్వాక కేంద్రంతో కల్సి మమేకమవుతూ ఉన్నాను. చార్వాక రామకృష్ణ గారితో ఎక్కువగా దగ్గరి సంబంధం ఉండి ఆయనతో భుజం, భుజం కలిపాను. చార్వాక ఆశ్రమం ప్రశ్నించడం నేర్పింది. నేను అదే చేస్తాను. అయితే ఆయన బతికి ఉన్నప్పటిలా ఇప్పడు లేదు. అడపా దడపా కార్యక్రమాలు తప్ప ఎక్కువగా ప్రజల్లోకి వీళ్ళు వెళ్ళడం లేదు. అయితే, ఈ మేళా అందరినీ ఒకచోటకు చేరుస్తుంది. నాస్తికులు కేవలం మతం పోవాలంటారు. కులనిర్మూలనా వాదులు కేవలం కులం పోవాలంటారు. నిజానికి రెండూ పోవాలి. ఆ రకమైన అవగాహన రామకృష్ణ గారికి ఉండేది. ఆయన తర్వాత వారి వారసులు కొన్ని మార్పులతో మేళా నిర్వహించడం నాకు సంతోషంగా ఉంది.


12.02.19,  Nvatelangana


                    

Comments

Popular posts from this blog

Dalit Women's Writing-EPW

Jogini- Essay