Iftar - poem
ఇఫ్తార్, ద లాస్ట్ సప్పర్ చల్లపల్లి స్వరూపరాణి నెత్తిన టోపీ పెట్టుకుని దేశాధినేతలంతా అతనితో కల్సి కంచంలో చెయ్యి కడిగి గుండెకు గుండెని ఆనించి అలాయి బలాయి తీసుకున్నది నిజమైతే రోజూ దేశ మాత నుదుటిమీద అతడే ఎందుకు ఎర్రటి సిందూరమౌతాడు? కుంకుమ పూలు ఆయేషా, అసీఫాలు నలిగి నజ్జైంది రాజకీయ రధ చక్రాల కింద కాదా? ఇక్లాక్ అన్నం ముద్దలో మందుగుండు వడ్డించినదెవరు? ఇస్కారియోతు యోదాలు తప్ప సోదరుల మీద ఎవరైనా నిందలు మోపుతారా? ఇఫ్తార్ విందులో టోపీ యెవరి నెత్తి మీదున్నా నిత్యం అభద్రతా సుడిగుండంలో మునిగేది అతడే! పుట్టుకతో నేరస్తుల జాబితాలోకెక్కినవాడు ఇప్పుడతనికి మీ విందు అక్ఖర్లేదు చెమట వెచ్చించి సమకూర్చుకున్న అతని అన్నంలో అనుమానపు రాళ్ళవ్వకండి మీరు తనకి గుండె ఆనించకపోయినా పర్లేదు తనని గుండెనిండా స్వేచ్చగా గాలి పీల్చుకోనియ్యండి మీకు చేతనైతే ఈదేశం అతనిది కూడా అని మూకస్వామ్యానికి అరిచి చెప్పండి మీకు వీలయితే అతని డైరీలో ఓ నెత్తురంటని పేజీని బహూకరించండి ...