Mango assault- poem
మామిడిపళ్ళ రక్తం
చల్లపల్లి స్వరూపరాణి
అప్పుడు కోటేసు
చెంబు దొంగతనం
చేస్తే
సజీవ దహనం
చెయ్యలేదా?
ఇప్పుడు శీను
మామిడికాయ దొంగతనం చేసినందుకు
ఉరిశిక్ష వేశాం
స్థల కాలాలే
మారింది
అంతా సేం టూ సేం
ఇంకా ఏ కాలంలో
ఉన్నాం అని అడగొద్దు
కాలం మీకెప్పుడూ
ఎండాకాలమే అని తెల్సుకోండి
ఇక్కడ ఏది
తినాలన్నా
అనుభవించాలన్నా ప్రేమించాలన్నా
విధిగా కులం కావాలి
అది మీకెక్కడిది?
పండ్లూ, ఫలాలూ మేమే
తింటాం
మీరూ మీవాళ్ళూ
చెట్టుకి నీరుపోసి
కావలి ఉండండి
పాలూ నెయ్యీ మేమే
తాగుతాం
మీరు గేదెల్ని మేపి
పేడ కళ్ళు
ఎత్తేయండి
నాలుక్కూరలు, నవకాయ
పిండి వంటలూ
మేమే భుజిస్తాం
మీరు పండించి
గోతాలకెత్తండి
మీరు ఇవేవీ
ఆశించకూడదు
వాటి వంక చూడకూడదు
రాలిపడిన కాయకు
కూడా
నోచని బతుకులు మీవి
మీ ప్రాణాల ఖరీదు
కేరళలో పిడికెడు అన్నం
కంచికచర్లలో ఒక
రాగి చెంబు
కాదంటే
సింగంపల్లిలో
రెండు రాలిపడ్డ
మామిడి కాయలు
ఎంగిలిస్తరాకు తప్ప
మీకంటూ సొంత
కంచాన్ని కలగనొద్దు
సొంత గొంతుతో అసలు
మాట్లాడొద్దు
ఎందుకంటే మీ
పరాధీనత
మరింత
పొడిగించబడింది
మీ వీపు మా
ముక్కాలు పీటయ్యిందని
ప్రకటించడానికి
గర్విస్తున్నాం
31.05.2019
Comments
Post a Comment