Untouchable Cultivation
వెలి గిన్నె
అల్లిక ఆమె తోడబుట్టిన
చదువు
కైకట్టడం ఆమెకబ్బిన కళ
మోకాలి లోతు బురదలో
బతుకు దిగబడి పోయినా
వెనక్కి తిరగని
చెమట చుక్కని చూడండి!
ఆమె పేరు సృజన
ఆమె చేతిలో
కాలవై పారేది కవిత్వం కాకపొతే మరేంది!
నారు మొక్కలతో పాటు
నాజూకుతనాన్నీ
రేగటి చాళ్ళలో
పాతేసుకున్న
పొగచూరు కట్టె ఆమె
గట్టు బుసలు చిమ్మిన
వెకిలి పాముల్ని
నారకట్టలా విదిల్చడం
ఆమెకి పచ్చడి మెతుకుతో పెట్టిన విద్య
యిక్కడ
బియ్యం చెట్లై
సాగేవాళ్ళకి
బతుకే వో పండిన చేను
కాయ కష్టంతో
నరాలు సాగిపోయిన ఆమెకి
దినదినం యెతల జడివాన
వొడ్డు మీద కూచ్చుని
గడ్డలేసే మారాజు అన్నదాతై
కీర్తి తలపాగా ధరిస్తే
నేలకి నెత్తుటి
యెరువేసి
యెదిగిన పైరు బిడ్డపై
తన పచ్చటి పైట కొంగు
కప్పిన
ఆ కూలితల్లి
తానో రెల్లు దుబ్బై
మిగులుతాది
యెంత అన్నం పెంపుచేసినా
అన్నపూర్ణ కాలేకపోయిన
వెలి గిన్నె ఆమె
*ఫొటో: గాలి నాసర రెడ్డి గారు
23.౦7.2018
Comments
Post a Comment