The Prisons We Broke



సంకెళ్ళను ఛేదించిన బతుకులు
చల్లపల్లి స్వరూపరాణి

                    

    ఆత్మకధ అనేది సాధారణంగా ' గొప్ప' వారికి అందునా మగవారికి సంబందించిన విషయంగా భావిస్తారు. స్త్రీలు, వారిలో కూడా దళీత స్త్రీలు ఆత్మకధలు రాయడం అనేది విచిత్రంగా అనిపించినప్పటికీ అటువంటి ప్రక్రియ యితర భాషల కంటే  మరాఠీలోనూ, తమిళంలోనూ కనిపిస్తుంది. మరాఠీలో దయాపవార్ ' బలూతా', శరణ్ కుమార్ లింబాలే ' అక్కర్ మాశీ', శంకర్ రావు ఖరత్ ' తరాల్, అంతరాల్' వంటి ఆత్మకధలు భారతీయ సాహిత్యంలో వో ప్రత్యేకతను సంతరించుకున్నాయి. మరాటీ దళీత స్త్రీలలో కుముద్ పవాడే, శాంతాబాయి కాంబ్లే, ఊర్మిళా పవార్ వంటి వారి ఆత్మకధలు పురు షుల ఆత్మకధల కంటే భిన్నంగా వుంటాయి. శర్మిలా రెగే యీ ఆత్మకధల్ని ' వాంగ్మూలాలు' అని పేర్కొన్నారు. దళిత పురుషుల ఆత్మకధలలో స్త్రీలను త్యాగపూరితమైన తల్లిగా, భార్యగా చిత్రిస్తే దళీత స్త్రీల ఆత్మకధలు స్త్రీలను సామాజిక చైతన్యానికి,మార్పుకు దోహదపడే వారిగా చిత్రించాయి. యీ ఆత్మకధలన్నింటిలోనూ అంబేడ్కర్ ప్రముఖ పాత్రగా, వో కేంద్ర బిందువుగా వుండడం వో ప్రత్యేకత. మహారాష్ట్ర  దళీత స్త్రీలలో అంబేడ్కర్ వుద్యమ ప్రభావంతో పాటు బౌద్ధులుగా మారిన కుటుంబాలకు చెందిన స్త్రీలు మాత్రమే ఆత్మకధలు రాయడం విశేశం. హిందూ మతాన్ని వీడకుమండా సామాజిక, ఆర్ధిక రంగాలలో పెత్తందారీ కులాల బానిసత్వంలో వున్న మాతంగ కులాల స్త్రీలు పెద్దగా విద్యావంతులు కాకపోవడమే కాకుండా వారి చైతన్య స్తాయి మహర్ల కంటే తక్కువగా వుండడం వలన వారు సృజన రంగానికి దూరంగా వున్నారు.     

      బేబీ కాంబ్లే పూనా సమీపంలోని వీరగాం అనే గ్రామంలో పుట్టి, పెరిగి అంబేడ్కర్ భావజాల ప్రభావంతో తన జీవితాన్ని వెలిగించుకోవడమే కాకుండా సమాజంలో వొక ముఖ్యమైన వ్యక్తిగా యెదిగారు. యెలిమెంటరీ స్కూల్ వరకు చదువుకున్న ఆమె భృతి కోసం తన భర్తతో కలిసి చిన్న చిన్న వ్యాపారాలు చేసి తన పిల్లలను వున్నత చదువులు చదివించారు. పేద దళిత విద్యార్ధుల కొరకు అంబేడ్కర్ భావజాలంతో నడిచే వొక స్కూల్ ని స్తాపించి పూర్తిగా ప్రజల మధ్యనే జీవించి బేబీ కాంబ్లే 2012 లో మరణించారు. బేబీ కాంబ్లే 1960 వ దశకంలో తన జీవితానువభవాలను చిత్తు కాగితాలలో రాసుకుని యెవరికీ కనిపించకుండా యింటి అటక మీద భద్రంగా దాచిపెట్టారు. మహారాష్ట్ర లో వో పరిశోధకురాలిగా క్షేత్ర పర్యటన కొరకు వచ్చిన డా. మాక్సీన్ బెర్న్ స్టీన్ కు బేబీ తారస పడ్డారు. ఆమెకు సమాచార సేకరణలో యెంతో తోడ్పడిన బేబీ కాంబ్లే ఆలోచనా సరళీ , ఆమె చెప్పే విషయాల పట్ల ఆశక్తి కనబరిచిన  బెర్న్ స్టీన్  బేబీని ఆత్మకధ రాయాల్సిందిగా ప్రొత్సహించారు. దీంతో అప్పటికే నోట్స్ రాసిపెట్టుకున్న పేపర్లను బేబీ కాంబ్లే బెర్న్ స్టీన్ కు చూపించగా ఆమె దానికి కొంత మెరుగులు దిద్ది మరాఠీ లో ' స్త్రీ' అనే పత్రికలో ముద్రింప చేశారు. తర్వాత  1986 లో యీ  ఆత్మకధ  ‘జీనా అమూచ' పేరుతో పుస్తకరూపం సంతరించుకుంది. తర్వాత మాయా పండిట్ యీ పుస్తకాన్ని ఇంగ్లీష్  లోకి అనువదించి 2008 లో 'ద ప్రిజన్స్ వుయ్ బ్రోక్' పేరుతో ముద్రించారు. ఇంగ్లీష్  అనువాదం చేసే క్రమంలో మాయా పండిట్ బేబీ కాంబ్లేని యింటర్వ్యూ చేసి పుస్తకంలో లేని  మరికొన్ని అంశాలపై ఆమె నుంచి సమాచారాన్ని సేకరించారు. యీ  యింటర్వ్యూ నిజానికి పుస్తకం లోని కొంత అస్పస్టతను పూడ్చిందనవచ్చు.

      యీ పుస్తకంలోని మొదటి భాగంలో  మహారాష్ట్ర లోని కులవ్యవస్థలో మహర్ల స్థానం,  వారి జీవితం చుట్టూ  అలుముకున్న అంటరానితనం, వివక్ష, పేదరికం, సామాజిక కట్టుబాట్ల పరంగా వున్న వెనుకబాటుతనం, మూడాచారాలు, నమ్మకాలు, వారు పెత్తందారీ కులాల చేతిలో తరతరాలుగా అనుభవించిన బానిసత్వం వంటి అంశాలను పూసగుచ్చినట్లు రచయిత్రి  వివరించారు.  

      కడుపు నింపుకోవడం కోసం చచ్చిన గొడ్డు మాంసం తినడం, యీ క్రమంలో వారు కుక్కలతోనూ, పిల్లులతోనూ పోటీపడవల్సిన దురవస్థ యెంత  ఘోరంగా వుంటుందో బేబీ కాంబ్లే కళ్ళకు కట్టినట్లు వివరించారు. ఆమె మహర్ వాడ రూపురేఖలు వివరిస్తూ మహర్ల పూరి గుడిసెలు, వాటిలో వొక్కో కుటుంబానికి గంపెడు సంతానం, చాలీ చాలని చిరిగి పేలికలైపోయిన బట్టలతో, చింపిరి జుట్టు, చీమిడి కారే ముక్కులతో మట్టిలో దొర్లించినట్టుండే పిల్లలు, చాలీ చాలని తిండీ, బట్టలతో అనారోగ్యంగా కనిపించే స్త్రీ పురుషులు, అరకొర వస్తువులు.... యిదీ మహర్ జీవితం అంటారు బేబీ. 'మాకు రెండు కాళ్ళు వుండం వల్ల మాత్రమే మమ్మల్ని మనుషులు అనవల్సి వస్తుంది. వాళ్ళ పెరట్లో కట్టేసి వుండే యెద్దులకంటే హీనమైన పరిస్థితికి మమ్మల్ని దిగజార్చారు. అయితే తేడా యేంటంటే యెడ్లు కడుపు నింపునిండా తిని వాళ్ళ పెరట్లోనే వుంటాయి. మేము వుండేది వూరవతల  పెంట కుప్పల్లో. అగ్రకులాలు ఆ పెంట కుప్పల మీదకి విసిరేసే చచ్చిన జంతువులకు మాత్రమే మేము యజమానులం. జంతువుల చర్మాలను వొలిచే హక్కుని నిలబెట్టుకోడానికి మేము కుక్కలతోటీ, పిల్లులతోటీ, గెద్దలతోటీ, రాబందులతోటీ కొట్లాడాలి అని కఠోర వాస్తవాల్ని, మహర్ల జీవన చిత్రాన్ని మన కళ్ళముందు  ఆవిష్కరిస్తారు బేబీ కాంబ్లే.    
      
      యిటువంటి దుర్భర పరిస్థితులలోనూ మహర్లు తమ ఆచారాలు, కట్టుబాట్ల విషయంలో యెంత నిక్కచ్చిగా వుంటారో రచయిత్రి వివరించారు. కుటుంబంలో పుట్టిన పెద్ద కొడుకుని గ్రామ దేవతకు కానుకగా అర్పించే ' ఘర్యా(పోతురాజు) ఆచారంతో పాటు పెద్ద కూతురిని వూరుమ్మడి వస్థువుగా మార్చే ' మురళీ(జోగిని) ఆచారం, హిందూ మతంలో వారు పొందుతున్న  అత్యంత హీనమైన స్థాయికి చిహ్నాలు. మహర్ స్త్రీలు తమ కులాచారాలను మతపరమైన కట్టుబాట్లను కాపాడే వారిగా వుంటారని, హిందూ మతం తమని యెంతగా వెలివేతలకు గురిచేసినప్పటికీ వారు తమను తాము హిందువులుగానే భావిస్తూ వుండడం అనే మహర్ల  మానసిక స్థితిని రచయిత్రి పదే పదే ప్రస్థావిస్తారు.     
    యీ పుస్తకంలో బేబీ కాంబ్లే మహర్ సమాజంలో స్తీల హోదా పైన లోతైన విశ్లేషణ చేశారు. కోడళ్ళుగా, భార్యలుగా వుండే స్త్రీల పట్ల మహర్ కుటుంబాలు కూడా యితర పెత్తందారీ కులాలకేమీ తీసిపోని విధంగా దాష్టీకం ప్రదర్సిస్థాయని స్త్రీలకు కనీసపు విలువ, గుర్తింపు లేదని అంటారు. మహర్ స్త్రీల వస్త్ర ధారణ నుంచి వారి కదలికలపైన, ప్రవర్తనపైన ఆంక్షలు వుంటాయని,  ప్రతి యింట్లోనూ కోడళ్ళ  యేడుపులూ, ఆర్తనాదాలూ తరచుగా వినిపిస్తూ వుంటాయని ఆమె పేర్కొన్నారు. వారు పాటించే ఆచారాలలో వుండే  అశాస్త్రీయత కారణంగా కొంతమంది ప్రసవం సమయంలోనూ, తర్వాతా చనిపోతుంటారని, వారి జీవితాలకు విలువ లేదని అంటారు.   అత్తింట్లో వూడిగం చేయలేక, వారు పెట్టే హింసలు భరించలేక యెదిరించి పారిపోయే స్త్రీలకు వారు విధించే శిక్షలు అమానవీయంగా వుంటాయి. యెదురు తిరిగిన స్త్రీలకు ముక్కులు కొయ్యడం, కాళ్ళను గుదుబండలు, యినప గొలుసులతో కట్టి వారి కదలికలను నియంత్రించడం వంటి కఠినమైన శిక్షలు కుటుంబాలలో స్రీలు అనుభవించేవారు. మరో వైపు జీవనోపాధికి కట్టెలు కొట్టి, గడ్డికోసుకొచ్చి అమ్ముకోవడం, జొన్న చేలలో పనిచెయ్యడం వంటివి చేస్తూ మహర్ స్త్రీలు నరక యాతన అనుభవించేవారని బేబీ కాంబ్లే పేర్కొన్నారు. వీటికి తోడు దళిత స్త్రీలు రుతుక్రమం ఆగిపోయే వరకు పిల్లల్ని కని పెంచడం అనేది వారిపైన అదనపు భారంగా వుంటుంది.

' మా బతుకులు’  రెండవ భాగం  అంతా అంబేడ్కర్ కేంద్రంగా నడుస్తుంది. 1930 దశకం నుంచి అంబేడ్కర్ ప్రజావుధ్యమాలను నిర్మిస్తూ దళిత సమాజంలో వున్న ఆత్మన్యూనతను రూపుమాపి వారిని సంస్కరించే దిశగా ఆయన చేసిన కృషి దళిత స్త్రీలను యెక్కువగా ఆకర్షించింది. ఆకలి  తీర్చుకోడానికి చచ్చిన గొడ్డు మాంసాన్ని, యితరులు వదిలేసిన యెంగిలి మెతుకుల్ని తింటూ హిందూ మతాచారాల రొచ్చులో క్రిమి కీటకాల మాదిరిగా బతుకుకుతున్న మహర్ల జీవితంలో అంబేడ్కర్ వో ఆశాకిరణమై తళుక్కున మెరిశాడు.  చచ్చిన గొడ్డు మాంసాన్ని తినడం మానమని, చచ్చిన గొడ్డును, మనుషులను యెత్తివేసే వృత్తుల్ని, పోతురాజు, మురళి వంటి ఆచారాలను వొదిలి ప్రతి కుటుంబం విద్యవైపు దృష్టి సారించాలని అంబేడ్కర్ యిచ్చిన పిలుపును మహర్ స్త్రీలు అందిపుచ్చుకున్నారు. అంబేడ్కర్ పాల్గొనే సభలకు స్త్రీలు పెద్ద యెత్తున హాజరవడమే కాదు ఆయన వుద్యమంలో వారు క్రియాశీలక భాగస్వాములయ్యారు. ఆనాటి అంబేడ్కర్ వుద్యమ విశేషాలను, వార్తలను గ్రామస్తులందరికీ తెలియచేసే 'చావడి’ గురించి కూడా బేబీ కాంబ్లే యీ పుస్తకంలో తరచుగా ప్రస్తావించారు.  వొకప్పుడు గొడ్డు మాంసాన్ని, పాటిల్ కులస్తుల యిండ్లలో జరిగే విందుల్లో మిగిలిపోగా తీసుకొచ్చిన పదార్ధాలను వంతులవారీగా పంచుకోడానికి ముఖ్యమైన కూడలిగా వుపయోగపడే చావడి తర్వాత వుద్యమ కేంద్రంగా మారడం యీ పుస్తకంలో చూస్తాం. 
      అంబేడ్కర్ అనంతరం మహారాష్ట్ర దళిత వుద్యమంలో వచ్చిన మార్పుల్ని కూడా బేబీ కాంబ్లే తన ఆత్మకధలో వివరించారు. అంబేడ్కర్ వుద్యమంలో బేబీ  కాంబ్లే అమ్మమ్మ తరం స్త్రీల నుంచి తన తరం స్త్రీల వరకు స్త్రీలు పెద్ద యెత్తున పాల్గొని తమ జీవితాలను, కుటుంబాలను తీర్చి దిద్దుకుంటే అనంతర కాలంలో దళిత వుద్యమంలో స్త్రీల సంఖ్య తగ్గి పోవడం, దళిత వుద్యమం దళారీల చేతిలోకి వెళ్ళిపోవడం వంటి అంశాలను కూడా రచయిత్రి  బేబీ కాంబ్లే ప్రస్తావించారు.  
      కుల సమాజంలో దళితులైన మహర్లు అనుభవించిన అమానవీయత, అంటరానితనం, ఆర్ధిక పీడనలతో పాటు కనీసపు మనిషి హోదా కోసం వారు చేసిన  నిరంతర పోరాటం, పెనుగులాట బేబీ కాంబ్లే తన ఆత్మకధలో యెంతో వుద్వేగంతో, వాస్తవిక దృస్టితో చిత్రించారు. బేబీకాంబ్లే ఆత్మకధలో ఆమె తన స్వంత విషయాల కంటే తానున్న సమాజపు పోకడ గురించి రాయడానికే ప్రాముఖ్యతనివ్వడం  ఆమెలోని  సామాజిక స్పృహను పట్టి యిస్తుంది. యీ పుస్తకం మరాఠీలో వచ్చినప్పుడు రాసిన ముందు మాటలో ఆమె  తన ముందు తరాలు గతం గురించి, అంబేడ్కర్ అనే అగ్ని గురించి తెలుసుకోవాలని తన ఆత్మకధ రాసినట్లు పేర్కొన్నారు. యీ సందర్భంగా ఆమె ' యీ నేల మీద పుట్టిన నేలతల్లి నిజమైన బిడ్డని నేనే! యీ గడ్డ నాది. మహారాష్ట్రలోని  మహర్ని నేనే!  మహారాష్ట్రకి పేరు నానుంచే వచ్చింది’ అని ఆత్మ గౌరవ ప్రకటన చేస్తుంది. అలాగే 'ప్రపంచం నిలబడి వుండడానికి కారణం మేమే! పర్వతాలను సైతం తనలో దాచుకోగలిగే అనంత సముద్రం లాగా అగ్రకుల పాపాల పర్వతాలను కప్పివుంచే సముద్రాలవంటి వారం మేము. అందుకే సముద్రానికి దక్కినట్లే ప్రపంచపు మొత్తం ఆరాధన మాకు దక్కాలి!' అని అంటారు రచయిత్రి.     
   సాహిత్య విశ్లేషకులు బేబీ కాంభ్లే ఆత్మకధ దళిత స్త్రీలు రాసుకున్న ఆత్మకధల్లో మొదటిది అంటారు. యీ  ఆత్మకధ ద్వారా గౌరవం, ఆత్మాభిమానం, సంప్రదాయం  వంటి విషయాల గురించి లోతైన పరిశీలన అందుబాటులోకి వచ్చింది. బేబీ కాంబ్లే ఆత్మకధ కుల సమాజపు  నిజ స్వరూపాన్ని చూపించడంతో పాటు దళిత సమాజంలో సరిచేసుకోవల్సిన అంతర్గత విషయాలను నిర్మొహమాటంగా చర్చించింది. గోపాల్ గురు  అన్నట్టు యీ పుస్తకం వోక వుపయోగపు విలువను వుత్పత్తి చెయ్యడంతో  పాటు మనల్ని మనం ప్రశ్నించుకోడానికి, ఆమె తన ఆత్మకధ రాసేలా చేసిన వ్యవస్థని ప్రశ్నించడానికి మనకు వొ క నైతిక విలువని కూడా అందిస్తుంది.             




Comments

Popular posts from this blog

Nomadic Tribe- Chenchu

My Poetry

Sahoo Maharaj- essay