Conversion for Liberation
విముక్తి కోసం బౌద్ధధర్మం
చల్లపల్లి
స్వరూపరాణి
'పీడిత కులస్థులెపుడూ తమ అస్తిత్వ పునాదులపై నిలబడి పోరాడాలి తప్ప ఆధిపత్య మతాలలోకి కాందిశీకులుగా వెళ్ళకూడదు’ అని తమిళ దళిత బౌద్ధ ఉద్యమకారుడు పండిత అయోతీదాస్ అంబేద్కర్ కంటే యాభై సంవత్సరాలకు ముందు చెప్పాడు. అయోతీదాస్, అంబేద్కర్ ల స్థల, కాలాలు వేరు.
వీరిద్దరికీ ఒకరికొకరు తెలీదు. కాని ఒకేలాగ వీరిద్దరు ఆలోచించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
క్రీస్తుకు పూర్వం ఆరవ శతాబ్ది వాడయిన గౌతమ బుద్ధుడు అప్పటికి సామాజిక, ఆధ్యాత్మిక రంగాలలో ఉన్న ఆధిపత్య, అప్రజాస్వమిక ధోరణులను తిరస్కరించి ఈ దేశపు తొలి సామాజిక ఉద్యమానికి పునాదులు వేశాడు. ఆయన బ్రాహ్మణవాదంలోని లొసుగులను ఎత్తి చూపడంతో పాటు దానికి ప్రత్యామ్నాయ సంస్కౄతిని ప్రతిపాదించడం జరిగింది. రకరకాల ప్రతికూల పరిస్థితులలో దేశం నుంచి కనుమరుగైన బౌద్ధ ధర్మం వలసవాద ప్రభుత్వంలో జరిగిన త్రవ్వకాల ఫలితంగా కొంతమేరకు వెలికి వచ్చినప్పటికీ బౌద్ధంలోని బ్రాహ్మణేతర తాత్వికాంశాలు మాత్రం అంబేద్కర్ కౄషి ఫలితంగానే ఆధునిక కాలంలో వెలుగు చూశాయి. ఆయన బౌద్ధాన్ని స్వీకరించడం భారతదేశ బౌద్ధ మత చరిత్రలోనే ఓ కీలకమైన అధ్యాయం. బౌద్ధాన్ని ఇతరులు అర్ధం చేసుకునే విధానానికీ అంబేద్కర్ పరిశీలించిన పద్ధతికీ స్పష్టమైన తేడా కనిపిస్తుంది. గాంధీ, వివేకానంద, సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి వారు బుద్ధుడిని హిందూ మతంలో భాగంగా పరిగణిస్తారు. లేదా చెట్టు కింద కూర్చుని తపస్సు చేసుకుంటూ అహింసా మార్గాన్ని బోధించిన సన్యాసిగా మాత్రమే వీరు బుద్ధుడిని గుర్తిస్తారు. కానీ అంబేద్కర్ బుద్ధుడిని బ్రాహ్మణ వాదాన్ని సవాల్ చేసి బ్రాహ్మణేతర తాత్విక ధోరణిని ప్రవేశ పెట్టిన సామాజిక విప్లవ కారుడిగా పరిగణిస్తాడు. అంతే కాదు
సామాజిక విప్లవంగా ముందుకొచ్చిన బౌద్ధాన్ని అంతమొందించి దాని స్థానంలో హిందూ మతాన్ని, దానికి అనుబంధంగా కులవ్యవస్థను స్థిరీకరించి, సామాజిక అంతరాలను చట్టబద్ధం చెయ్యడానికి బ్రాహ్మణ వాదులు చేసిన ప్రయత్నాలను 'ప్రతీఘాత విప్లవం' గా అంబేద్కర్ అభివర్ణించాడు. బ్రాహ్మణ వాదులు రాజుల ప్రాపకంతో బౌద్ధాన్ని భౌతికంగా అంతమొందిస్తూనే మరో వైపు మనుస్మృతి, భగవత్గీత వంటి గ్రంధాల ద్వారా సామాజిక అసమానతలను చట్టబద్ధం చేస్తూ ద్విముఖ వ్యూహాన్ని అవలంభించారని ఈ క్రమంలోనే బౌద్ధం అంతరించి పర్యవసానంగా వివిధ కులాల మధ్య,
స్త్రీ పురుషుల మధ్య అసమాతల స్థిరీకరణ జరిగిందని అంబేద్కర్ పేర్కొన్నాడు.
ప్రాచీన కాలంలో వేదాల ప్రామాణికతను ప్రశ్నించి దేవుడి ప్రధానంగా కాక నైతికత ప్రధానంగా ముందుకొచ్చి ప్రజల్లో శాస్త్రీయ ధ్రుక్పధాన్ని ప్రచారం చేసిన గౌతమ బుద్ధుడు తన గురువుల్లో ఒకరిగా అంబేద్కర్ ప్రకటించాడు. అలాగే స్వేచ్చ, సమానత్వం, సౌభ్రాత్రుత్వం అనే ఉన్నతమైన భావాలను తాను ఫ్రెంచి విప్లవం నుంచి కాక బౌద్ధం నుంచి గ్రహించినట్లు అంబేద్కర్ చెప్పుకున్నాడు. ఇతర మత ప్రవక్తలందరూ తాము దేవుని కుమారులమని, దేవదూతలమని, తామే దేవుళ్ళమని ప్రకటించుకుంటే బుద్ధుడి ధర్మంలో దేవుడికి స్థానం లేదని అంబేద్కర్ అంటాడు. బుద్ధుడు మనిషి నైతిక ప్రవర్తనను ఉన్నతం చేసే విధంగా తన సిద్ధాంతాన్ని రూపొందించాడని, ఆ కారణంగానే తాను బౌద్ధాన్ని అభిమానించినట్లు అంబేద్కర్ చెప్పాడు.
బుద్ధుడు స్థాపించిన సంఘంలో అన్ని కులాలకు, స్త్రీలకు సమాన ప్రాతినిధ్యం ఉండటం, భిక్షువులు వ్యక్తిగత ఆస్థులు లేకుండా సాధారణ జీవనం సాగించాలి అనే బుద్ధుడి నియమం కూడా అంబేద్కర్ బౌద్ధాన్ని ప్రేమిచడానికి మరో ముఖ్యమైన కారణంగా చెప్పవచ్చు. ఒక వ్యక్తి పుట్టుకతో సంబంధం లేని ప్రజ్ఞ, కరుణ, మైత్రి అనే భావనలతో పాటు బౌద్ధం ‘సమత’
అనే ప్రాతిపదికన పనిచేస్తుందని అయితే హిందూమతం అసమాత్వానికి ప్రతిరూపం కాబట్టి తాను హిందువుగా పుట్టినప్పటికీ హిందువుగా మాత్రం మరణించనని యోలా సభలో ప్రకటించాడు. అంబేద్కర్ 1956 అక్టోబర్ 14 న నాగపూర్ లో తన లక్షలాది మంది సహచరులతో బర్మా దేశానికి చెందిన భిక్షువు చంద్రమణి చేతుల మీదుగా బౌద్ధాన్ని స్వీకరించి మరో సామాజిక విప్లవానికి నాందీ పలికాడు.
అంబేద్కర్ బౌద్ధ ధర్మ దీక్ష ఆయన తదనంతర దళిత సమాజాన్ని, ఉద్యమాన్ని ఎంతో ప్రభావితం చేసిందనవచ్చు. అంబేద్కర్ బౌద్ధ ధర్మ స్వీకారం అనేదాన్ని హిందూ మతంలో అణగారిన వర్గాలకు కేటాయించిన హీనత,
అంటరానితనం అనే స్థాయిలను, మొత్తంగా అసమానత్వాన్ని తిరస్కరించడంగా భావించాడు కనుకనే అది వ్యక్తిగత ఆధ్యాత్మిక పరమైన అంశం అనే స్థితిని దాటి ఒక ప్రత్యామ్నాయ సంస్కృతిగా, మనువాదానికి చెంపపెట్టుగా మారింది. అంబేద్కర్ తన దీక్ష అనంతరం మరుసటి రోజు అదే స్థలంలో తానే స్వయంగా తన సహచరులకు దీక్షనిచ్చాడు. ఈ సందర్భంగా ఆయన వారితో త్రిశరణాలతో పాటు మరో 22 ప్రమాణాలు చేయించాడు. తాము ఇకపై యజ్ఞ,
యాగాల వంటి క్రతువులను ఆచరించబోమని, బుద్ధుడిని విష్ణుమూర్తి దశావతారలో ఒకడిగా చెప్పే తప్పుడు ప్రచారాలను నమ్మబోమని, బుద్ధుడు బోధనల్లో ముఖ్యమైన అష్టాంగ మార్గాన్ని అనుసరిస్తూ సకల జనుల పట్ల సమతతోను, జీవుల పట్ల కరుణతోను వ్యవహరిస్తామని ఈ ప్రమాణాల సారాంశం. ఈ ప్రమాణాలు అంబేద్కర్ కి బౌద్ధం పట్ల ఉన్న దృక్పధాన్ని వెల్లడిస్థాయి. క్రైస్థవ మతానికి బైబిల్ వున్నట్లు బౌద్ధ ధర్మ సారాంశాన్ని వివరించే ఒక గ్రంధం రూపొందించాలని ఆయన చేసిన కృషి
'బుద్ధ అండ్ హిజ్ ధమ్మ' పేరుతో ఆయన మరణానంతరం వెలుగు చూసింది.
బుద్ధుడి జీవితం, బోధనలపై సంప్రదాయ వాదులైన బౌద్ధ పండితులు విశ్లేషించే పద్ధతికి భిన్నంగా అంబేద్కర్ బౌద్ధాన్ని ఈ పుస్తకంలో విశ్లేషించాడు. బుద్ధుడి జీవితంలోని ప్రధాన ఘట్టమైన మహాభినిష్క్రమణ గురించి సంప్రదాయ వాదులు చెప్పే కారణాలకు భిన్నంగా హేతుబద్ధమైన రోహీణీ
నదీజల వివాదాన్ని బుద్ధుడి పరిత్యాగానికి ముఖ్య కారణంగా అంబేద్కర్ చూపించాడు. సంప్రదాయ వాదులు చెపుతున్నట్టు బుద్ధుడు ఒక రోగిని, శవాన్ని, సన్యాసిని, వృద్ధుడిని చూసి చలించిపోయే అంతటి బలహీనుడు కాదని, హేతుబద్ధం కానిదేదీ బౌద్ధంలో లేదని అంబేద్కర్ అంటాడు. అలాగే బుద్ధుడి బోధనగా చెప్పబడే 'దు:ఖవాదం', 'కర్మ’
సిద్ధాంతాలను బుద్ధుడు బోధించలేదని, తర్వాత ఇతరులు దు:ఖవాదమనే నిరాశావాదాన్ని చేర్చి బౌద్ధంలోని క్రియాశీలతను తక్కువ చేశారని అంబేద్కర్ అభిప్రాయం. గత జన్మలో చేసిన తప్పులకు ఈ జన్మలో మనిషి ప్రతిఫలం పొందుతాడని బుద్ధుడు ఎక్కడా చెప్పలేదని, ఇదంతా బ్రాహ్మణవాదుల తప్పుడు వక్రీకరణ అని అంబేద్కర్ 'బుద్ధ అండ్ హిజ్ ధమ్మ’ అనే పుస్తకంలో వివరించాడు. ఇతర మతాలలోని సన్యాసులవలే కాకుండా బౌద్ధ బిక్షువులు సమాజంలో క్రియాశీలక కార్యకర్తలుగా ఉండి, బుద్ధుడి సందేశమైన బహుజన హితం, బహుజన సుఖం
కోసం పనిచెయ్యాలని సూచించాడు. ఆయన ఈ పుస్తక రచనలో చరిత్ర, మానవ శాస్త్రాల విశ్లేషణా పద్ధతులను పాటించాడు. అంబేద్కర్ దీక్ష సందర్భంగా ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా తనదైన బౌద్ధానికి 'నవయానం' అనే పేరు సూచించినప్పటికీ ఆ తర్వాత ఆయన తక్కువ కాలానికే మరణించడంతో అంబేద్కర్ 'నవయానం' పేరున రచనలు చెయ్యలేదు.
అంబేద్కర్ తాను గౌరవించే బౌద్ధాన్ని విశ్లేషిస్తూ మహాబోధి సొసైటీకి చెందిన పత్రికలో వ్యాసాలు రాశాడు. బౌద్ధం అనంతరం హిందూ మతంలో పతనమైన స్త్రీల హోదా గురించి ఆయన రాసిన వ్యాసం అందుబాటులో ఉంది,
అలాగే అమెరికాలో వరల్డ్ రెలిజియస్ పార్లమెంట్ కి బౌద్ధ ప్రతినిధిగా హాజరై ప్రసంగించాడు. తర్వాత బర్మాలోనూ, నేపాల్ లోనూ జరిగిన బౌద్ధ సమ్మేళనాలకు అంబేద్కర్ హాజరై బౌద్ధం పైన సాధికారికంగా ఉపన్యసించాడు. భారతదేశంలో తనకంటే ముందు బౌద్ధాన్ని బ్రాహ్మణేతర దృక్పధం నుంచి పరిశీలించిన ప్రొఫెసర్ లక్ష్మీనరుసు రచించిన పుస్తకం 'ఎసెన్స్ ఆఫ్ బుద్ధిజం' అనే పుస్తకానికి పీఠిక రాసి 1948 లో తిరిగి ముద్రించాడు. బుద్ధుడిని హిందూమతంలో భాగం అనుకొనే రోజుల్లో ప్రజల భ్రమల్ని తొలగించే మంచి పుస్తకంగా లక్ష్మీనరుసు గ్రంధాన్ని అంబేద్కర్ పేర్కొన్నాడు. నిజానికి ఆయన చేసిన ప్రయత్నం కూడా అటువంటిదే!
అంబేద్కర్ భారతదేశాన్ని బౌద్ధదేశంగా పరిగణించి బ్రాహ్మణ వాదుల ప్రతీఘాత విప్లవంతో దేశం నుంచి నిష్క్రమించిన బౌద్ధాన్ని తిరిగి ఇక్కడ ప్రతిష్టించాలని కలగన్నాడు. 'భారతీయత’ అనేది బౌద్ధంలోనే ఉందని చెప్పడానికి ఆయన రాజ్యాంగ రచనను ఉపయోగించుకున్నాడు. బౌద్ధ చిహ్నాలైన అశోకుడి సార్నాధ్ స్థంభాన్ని, ధర్మచక్రాన్ని ఈదేశపు చిహ్నాలుగా రాజ్యాంగంలో పేర్కొన్నాడు. ‘పంచశీల’ భావన కూడా బౌద్ధం లోనిదే. ఆయన రాజ్యాంగ రచనలోనూ, హిందూకోడ్ బిల్లును తయారు చెయ్యడంలోనూ అంబేద్కర్ పైన బౌద్ధ ధర్మ ప్రభావం కనిపిస్తుంది.
అంబేద్కర్ బౌద్ధాన్ని స్వీకరించడం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. బ్రాహ్మణవాదులకు ఆయన వైదిక హిందూమతానికి ప్రత్యామ్నాయంగా బౌద్ధాన్ని ప్రతిపాదించడం కటగింపుగా మారింది. దీని పర్యవసానంగా '2500 ఇయర్స్ ఆఫ్ బుద్ధిజం' పేరుతో పి.వి.బాపట్ సంకలనం చేసిన పుస్తకం మలి ముద్రణలో 'భారత దేశంలో బౌద్ధ మత పునరుజ్జీవనానికి అంబేద్కర్ కృషి’ అనే వ్యాసాన్ని తొలగించారు. దీనికి తోడు బుద్ధుడు వైదిక హిందూమతంలో పుట్టి, హిందూమతంలో పెరిగి, హిందువుగానే మరణించాడని, ఆయన ఆర్యుల
నాగరికతలోని గొప్పతనాన్ని చాటడం తప్ప కొత్తగా చేసిందేమీ లేదని సర్వేపల్లి రాధాకృష్ణన్ రాసిన పీఠికను ఇందులో చేర్చారు. అంబేద్కర్ మరణానంతరం 1957 లో ఈ పుస్తకం భారత ప్రభుత్వ ప్రచురణగా పునర్ముద్రణ పొందడం మరీ విడ్డూరం.
అంబేద్కర్ 'బుద్ధ ఆర్ కార్ల్ మార్క్శ్’ అనే పుస్తకంలో కార్ల్ మార్క్స్ సోషలిజం కంటే బుద్ధుడు ప్రతిపాదించిన అహింసాయుతమైన సమానత్వ భావన గొప్పదని పేర్కొనడం, బౌద్ధధర్మ దీక్ష తీసుకోవడంపైన మర్క్సిస్టులు ఆయన పట్ల తీవ్ర అసంతృప్తి చెందారు. సంప్రదాయ మార్క్సిస్టులు అంబేద్కర్ బౌద్ధం స్వీకరించడాన్ని ఫలాయన వాదంగా
పేర్కొనడమే కాకుండ ఆయన సిద్ధాంతాన్ని తక్కువ చెయ్యడానికి బౌద్ధాన్ని ఒక సాకుగా చూపిస్తారు. వీరందరి వాదనలోని సారాంశం ఒక్కటే అని స్పష్ట మవుతుంది.
అంబేద్కర్ బౌద్ధం పై చేసిన లోతైన పరిశోధన, ఆయన బౌద్ధాన్ని విశ్లేషించిన తీరు వలన ప్రపంచం తిరిగి బౌద్ధం వైపు చూస్తుంది. మహారాష్ట్రలో బౌద్ధాన్ని అవలంభించే దళితులు అంబేద్కర్ అనంతరం గతంలోని తమ కులపరమైన గుర్తింపును ఒదిలిపెట్టి 'నియో బుద్ధిస్ట్' అనే సామాజిక గుర్తింపును పొందారు. దళితుల రాజ్యాధికారం అనేది వారి బౌద్ధమత గుర్తింపు ద్వారానే సాధ్యమవుతుందని అంబేద్కర్ వాదులు భావిస్తున్నారు. సామాజిక, రాజకీయ రంగాలలో దళితుల
పరాధీనత
అనే సమస్యకు అంబేద్కర్ బౌద్ధంలో పరిష్కారాన్ని వెదికినట్లే హిందూ సామ్రాజ్య వాదానికి బౌద్ధం సమాధానం చెప్పగలదని భావిస్తున్నారు. ఆయన బౌద్ధ ధర్మ దీక్ష ఈ దేశంలో సాంస్కృతిక రంగంలో ఫాసిస్ట్ అణచివేతకు గురౌతున్న హైందవేతరులందరికీ స్ఫూర్తిదాయకం. ఆయన స్ఫూర్తితో లౌకికవాద శక్తులన్నీ ఉమ్మడి సంఘటనగా బలోపేతం కావల్సిన అవసరం ఉంది.
Comments
Post a Comment