Cow
గోవు
కేక
చల్లపల్లి
స్వరూపరాణి
యే పనీ చేతగాని పిల్లోడ్ని
వేదికపైకి పిల్చి
పరమవీరచక్ర బిరుదిచ్చినట్టుంది
నా పని...
పేరుకి సాదు జంతువునే అయినా
యెందుకో
జంతువుల్లో బోల్డంత చెడ్డపేరు
మూట కట్టుకుంటున్నదాన్ని!
యీ మధ్య కొందరు
నన్ను చూసి
ప్రాణభయంతో పరుగెడుతున్నారు
మరికొందరు
యెన్నడూ లేని ప్రేమ
కురిపిస్తున్నారు
యింకొందరు
నా పేరు చెప్పి
తమ పగోళ్ళని మట్టుబెడుతున్నారు
యిందతా చూస్తే
నా పుట్టుక మీదే
విరక్తి పుడుతుంది
అప్పట్లో
పాలు పెద్దగా యివ్వనని
రోడ్లంట వొదిలేస్తే
డొక్కలెండిపోయి
ప్లాస్టిక్ సంచులు, కాయితాలు తిని
బతికాను అనామకంగా!
యిప్పుడూ అంతే అనుకోండి
నా మొహాన
గుప్పెడు గడ్డైనా విదిల్చనోళ్ళు
నన్ను ఆకాశానికెత్తుతుంటే
కడుపు తరుక్కుపోతుంది
నాకు తెలీని గొప్పతనమేదో
నా నెత్తిన మెరుస్తుంటే
నా ప్రతిభ యేమిటో అర్ధంకాక
యీ కీర్తి బరువును మొయ్యలేకున్నా!
యేడ్చే దిక్కు, యీడ్చే దిక్కు లేక
అనాధగా పడి వున్న
నా శవాన్ని మోసుకెళ్ళి
ముక్కులు పగిలే గవులు
తాము భరించి
వూరికి సుచిని దానం చేసే
ఆ యెర్రిబాగులోళ్ళని
నా పేరున కొట్టి చంపుతుంటే
సిగ్గుతో కుచించుకు పోతున్నా !
నిజానికి నాకూ వూపిరాడ్డం లేదు
యే బాబా అయినా కనికరించి
నాకు నోరు తెప్పిచ్చండి బాబయ్యా!
చచ్చి మీ కడుపున పుడతా!
నేనూ చెప్పాల్సింది వుంది
అవును
నేను ఆవునే మాట్లాడుతున్నా!
* మాత్రుక ఆగస్ట్, 2018 సంచికలో వొచ్చింది
Comments
Post a Comment