C.V and Cultural Revolution







సాంస్కృతిక యోధుడు సి.వి
చల్లపల్లి స్వరూపరాణి


      తొలితరం బహుజన కవి, సిద్ధాంతకర్త, హేతువాది, సి.వి గారికి జోహార్లు. బ్రాహ్మణవాదం లోని  అమానవీయతనీ, దోపిడీ స్వభావాన్ని, అహేతుకతను తన రచనల ద్వారా యెండగట్టి యీనాటి బహుజన సాహిత్యానికి సైద్ధాంతిక భూమికనిచ్చిన సి.వి. (చిత్తజల్లు వరహాల రావు) తన శక్తివంతమైన రచనలతో తెలుగు వుద్యమ సాహిత్యాన్ని వో మలుపు తిప్పారు. ఆయన స్వస్థలం గుంటూరు. లక్ష్మీ దేవమ్మ, వెంకట చలపతి  గార్లు యీయన తల్లిదండ్రులు. సి.వి. తండ్రి మంచి చిత్రకారుడు. ఆయన వేసిన బొమ్మలు లండన్ మ్యూజియంలో వున్నాయి. యింటర్మీడియట్, డిగ్రీ గుంటూరు .సీ కాలేజీలో చదివాక ఆయన మద్రాస్  క్రిష్టియన్ కాలేజీలో ఎం. యెకనామిక్స్ చేశారు. డిగ్రీలో ఆయన కె.జి. సత్యమూర్తి(శివసాగర్) కి సహాధ్యాయి. యిద్దరూ మంచి స్నేహితులే కాక మార్క్సిజం గురించి కలిసి కలలు కన్నవారు.

   కాలేజీ రోజుల్లో ఆయన యెర్రగా బుర్రగా వుండం వలన తన తెలుగు లెక్చరర్ సి.వి గారిని బ్రాహ్మణ కుర్రాడనుకుని ఆయనకి తెలుగు, సంస్కృత భాషల్ని క్లాసు బయట కూడ బాగా చెప్పేవాడంట. అందువలన ఆయనకి హిందూ పురాణ సాహిత్యంపైన పట్టు దొరికిందని వొక యింటర్వ్యూలో అన్నారు సి.వి. మద్రాస్ క్రిష్టియన్ కాలేజీలో పి.జి చేసే  రోజుల్లో కన్నెమెరా లైబ్రరీలో ఆయన మార్క్స్ తో పాటు అంబేడ్కర్ని,  గుర్రం జాషువాని అధ్యయనం  చేశాడు. అప్పుడు రాసుకున్న నోట్సు తర్వాత ఆయన రచనలకు బాగా వుపయోగ పడిందంటారు సి.వి. 

   చదువు అయ్యాక సి.వి కో ఆపరేటివ్ సంస్థలో సబ్ రిజిస్త్రార్ గా పనిచేసి రిటైరయ్యారు. ఆయన యెక్కువ కాలం విజయవాడలోనే పనిచేశారు. సి.వి గారి భార్య, భారతి కూడా అభ్యుదయ భావాలు, స్వంత వ్యక్తిత్వం గల మనిషి. ఆమె టీచర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. వారికి వొక అబ్బాయి, వుదయ్ భాస్కర్. ఆయన తొలినాళ్ళలో మార్క్సిస్ట్  వుద్యమ కార్యకర్తగా,  తర్వాత హేతువాద, నాస్తిక వుద్యమకారుడిగా రచనలు చెయ్యడమే కాకుండా ఆంధ్ర రాష్ట్రమంతా తిరిగి సభలు, సమావేశాల్లో పాల్గొన్నారు. సి.విజయలక్ష్మి, అరుణశ్రీ, విజయశ్రీ, ఆర్. రంగారెడ్డి వంటి పేర్లతో రచనలు చెయ్యడం వలన ఆయన అసలు పేరు చాలా కాలం వరకు యెవరికీ తెలీదు.
 
       భారత సమాజం వర్గ, కుల సమాజమని, అలాగే బ్రాహ్మణవాదం హిందూమత పురాణ సాహిత్యంలో తిష్టవేసుకుని వుందని సి.వి భావన. ఆయన దాదాపు 28 కి పైగా కవిత్వం, సిద్ధాంతపరమైన పుస్తకాలు ప్రచురించాడు. వాటిలో 'నరబలి’, 'సత్యకామ జాబాలి’, ' కారుచీకట్లో కాంతి రేఖలు’, 'విషాద భారతం’, 'వర్ణ వ్యవస్థ’(మూడు భాగాలు),'సింధూ నాగరికత’, 'మనకూ కావాలి వో సాంకృతిక విప్లవం’, ' మనుధర్మ శాస్త్రం- శూద్ర బానిసత్వం’, ' వూళ్ళోకి స్వాములవారు వేంచేశారు’, 'శంభుక వధ’, 'కుసుమ ధర్మన్న కవీంద్రుడు’, 'పారిస్ కమ్యూన్వంటి సుమారు 28 పుస్తకాలు రాశారు. ఆయన సమకాలీన కవులు, రచయితలైన శ్రీశ్రీ, రంగనాయకమ్మలతో కీలకమైన చర్చ చేశాడు. 'శ్రీశ్రీ మహాకవి కి యేకలవ్యుని బహిరంగ లేఖపేరుతో ఆయన చేసిన విమర్శ శ్రీశ్రీ 'ఖడ్గ సృష్టిరాయడానికి దోహదపడిందని అంటారు సి.వి. రంగనాయకమ్మ ' నీడతో యుద్ధంఅనే రచనలో సోషలిజం వస్తే అన్ని సమస్యలు పరిష్కారమౌతాయని రాస్తే, సి.వి ఆమెతో విభేదిస్తూ సాంస్కృతిక వుద్యమం జరగకుండా సమస్యలు కేవలం సోషలిజంతో పరిష్కారం కావని సమాధానం రాశారు.  

   సి.వి.తెలుగు సాహిత్యంలో అత్యంత ప్రభావం చూపిన రచనలు చేశాడు. ఆయన 'శంభూక వధరాసిన తర్వాత త్రిపురనేని రామస్వామి 'సూత పురాణంరాయడం విశేషం. హిందూ పురాణ పాత్రలైన యేకలవ్యుడిని, శంభూకుడిని దళిత బహుజన ప్రతినిధులుగా పేర్కొంది మొదట సి.వి.నే! తర్వాత కుల సమస్య మీద రాసిన దళిత కవులు వొరవడిని కొనసాగించారు.
   తొలితరం దళిత కవి కుసుమ ధర్మన్న అంటే సి.వి కి చాలా అభిమానం. ఆయన గురించి అందరూ మర్చిపోయిన రోజుల్లో సి.వి ' కుసుమ ధర్మన్న కవీంద్రుడుఅనే పుస్తకం రాసి అందులో 'తెలుగు సాహిత్య కారులు కుసుమ ధర్మన్న కనిపించకుండా యేడు తాడి చెట్ల లోతున పాతిపెట్టారుఅని ఆవేదన వ్యక్తం చేశాడు.

    సి.వి. తన యింటర్వ్యూలో వో గమ్మత్తైన అంశం చెప్పాడు. విజయవాడకి శృంగేరీ పీఠాధిపతి వచ్చినప్పుడు మెదలో జంధ్యం వేసుకుని పూజా కార్యక్రమంలో పాల్గొని అక్కడ తాను చూసిన విషయ పరిజ్ఞానంతో ' వూళ్ళోకి స్వాముల వారు వేంచేశారుఅనే పుస్తకం రాశానని అన్నారు. పుస్తకం రాసిన తర్వాత ఆయనకి శత్రువులు పెరగడం మొదలయ్యింది. ఆయన రాసిన 'నరబలిపన్నెండు సార్లు పునర్ముద్రణ పొందింది. ' కారుచీకట్లో కాంతిరేఖలు’, ' విషాద భారతంపైన పాఠకులలో మంచి స్పందన వచ్చింది. 'నరబలిని వేగుంట మోహన ప్రసాద్ యింగ్లీష్ లోకి, నారాయణ స్వామి కన్నడలోకి అనువదించారు. ఆర్ధికంగా యెన్ని యిబ్బందులున్నప్పటికీ సి.వి.తన పుస్తకాలను స్వంతంగా ముద్రించేవారు. కొన్నిసార్లు వడ్డీకి అప్పు తీసుకొచ్చి కూడా పుస్తకాలు ప్రచురించడం జరిగింది. అలాగే పుస్తకాలలో అచ్చు తప్పులుంటే ఆయనకి యిష్టముండదు కనుక యెంత కష్టమైనా  తన ప్రూఫులు తానే దిద్దుకోవడం ఆయన వ్యక్తిత్వ లక్షణం. 

   సి.వి. మార్క్సిస్ట్ లు యెంతసేపూ వర్గపోరాటం అంటూ మడి కట్టులాంటి పడి కట్టు పదాలు వాడడం తప్ప కులం జోలికి వెళ్ళరని, ‘ పీడిత ప్రజలంటే దళితులే కదా! పీడితులు మేడల్లో వుండరు, గుడిశెల్లోనే వుంటారుఅని వ్యంగ్యంగా అన్నారు. అప్పట్లో కులం గురించి మాట్లాడేవారిని మార్క్సిస్ట్ లు చాలా చులకనగా చూసేవారని, నాస్తికులు, హేతువాదులు దేవుడిని నిరాకరించడం తప్ప కుల సమస్య జోలికి వెళ్ళరని వుద్యమాల పరిమితులను సి.వి. తన యింటర్వ్యూలో పేర్కొన్నారు. యీ దేశంలో కులతత్వంపైన, వర్గ పరమైన దోపిడీపైన, మత చాందసవాదం పైన కలిసికట్టుగా పోరాటం జరగాలని ఆయన అంటారు. మతంకంటే భయంకరమైన సారా మరొకటి లేదని, చార్వాకులు 2000 సంవత్సరాల క్రితమే ఆత్మలేదు, పరమాత్మ లేదు అని చెప్పారని, కులం, మతం రెండూ లేవని ప్రజల్ని కన్విన్స్ చెయ్యకుండా యేమీ చెయ్యలేమని చెప్పారు సి.వి. 2009 లో 'బహుజన కెరటాలుపత్రిక కోసం నేనూ, కేశవ్ కుమార్ ఆయన ఆచూకీ కష్టమైనా వెతుక్కుని ఆయన్ని యింటర్వ్యూ చేశాం. శిధిల దేవాలయం లాంటి సాదా సీదా పాత యింటిలో అంతే శిధిలమైన దేహంతో నందనార్ లా కనిపించాడు మహాకవి సి.వి. అప్పటికి ఆయనకి సుమారు యెనభై యేళ్ళు వుంటాయి. మాకు ఆయన్నుంచి చల్లటి కరచాలనం దొరికింది. పేద దళిత ప్రజలపై అమలయ్యే హింస, వారిని యితరులు కుక్కల్లా చూడడమనే విషయాలతో ఆయన మాటలు గద్గద స్వరంతో మొదలయ్యాయి. ‘కారంచేడు తర్వాత వచ్చిన దళిత సాహిత్యంలో మీరున్నారుఅని చెబితే ఆయన కళ్ళల్లో నీటి పొర అప్రయత్నంగా మెరిసింది. అయితే ఆయన కారంచేడు తర్వాత వొచ్చిన సాహిత్యాన్ని పెద్దగా చదవలేదని, అంతకు ముందు జరిగిన కంచికచర్ల కోటేసు సజీవదహనం పైన వ్యాసాలు రాశానని, దళితులు కళ్ళు తెరవకుండా యీ దేశంలో యే విప్లవం రాదు అని నిక్కచ్చిగా అన్నారు.

   కవిగా, సిద్ధాంత కర్తగా, చరిత్రకారుడిగా, బ్రాహ్మణీయ భావజాలానికి ప్రత్యామ్నాయ బహుజన సిద్ధాంతాన్ని సాహిత్యాన్ని విస్తృతంగా అభివృద్ధి చేసిన సి.వి మార్క్సిస్ట్, హేతువాద, నాస్తిక, వుద్యమాలను బహుజన కోణం నుండి తీవ్రంగా విమర్శించాడు. యీ దేశంలో దళిత సమస్యను పట్టించుకోకుండా యే వుద్యమం, విప్లవం సఫలీకృతం కాదని సి.వి బలంగా నమ్మడమే కాకుండా దళిత, బహుజన కులాలు సంఘటితంగా పోరాటాలు జరపాల్సిన అవసరం వుందని, వారు వొకేసారి కుల, వర్గ సమస్యలపైన, మతతత్వం పైన బలమైన సైద్ధాంతిక పోరు చెయాలని సి. వి అంటారు. సి.వి కవిత్వానికి యిచ్చే నిర్వచనం- ' బ్రెయిన్ టైఫాయిడ్ వేడి హృదయం + బద్దలయ్యే బాధ= త్రినేత్రం లాంటి కవిత్వం

      కుల, మత విషయాలలో అప్రజాస్వామిక వైఖరి  పెట్రేగిపోతూ రోజుకో స్వామీజీ, పూటకో బాబా పుట్టుకొస్తూ, ప్రజల మెదడుల్ని గిడస బారుస్తున్న వర్తమానంలో సి.వి. రచనల ప్రాసంగికత  మరింతగా పెరుగుతుంది. కుల, వర్గ దోపిడీలతో పాటు హైందవ మతం చేసే ఆధ్యాత్మిక దౌర్జన్యం గుట్టు విప్పిన సి.వి. ఖచ్చితంగా దార్శనికుడు. ప్రజల శ్రమకు విలువుండే  సమాజం ఆవిర్భవించాలని, వారి  సామాజిక, సాంసృతిక జీవితం ప్రజాస్వామ్య బద్ధంగా వుండాలని తన అక్షరాలతో యుద్ధం చేసిన సి.వి. కి మరణం లేదు...   

(10, నవంబర్, 2017, నవతెలంగాణా)       

Comments

Popular posts from this blog

Nomadic Tribe- Chenchu

My Poetry

Sahoo Maharaj- essay