Dalit Politics
ప్రాచీన
సాహిత్యంలో ‘చండాలులు’, ‘అవర్ణులు’, ‘పంచములు’ మొదలైన పేర్లతో పిలువబడిన నేటి
దళితులు సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా అనేక వొడిదుడుకులను అదిగమించి
సుదీర్ఘమైన పోరాటం తర్వాత యీనాడు ‘దళితులు’ అనగా ఖండించబడిన వారు అని వొక నిరసనతో
కూడిన పేరుతో యెక్కువగా పిలువబడుతున్నారు. బౌద్ధ సాహిత్యంలో పేర్కొనబడిన ‘నాగ’,
‘యక్ష’ జాతులు యీనాటి దళితులే అనే అభిప్రాయం కూడా పరిశోధకులలో వుంది. బ్రాహ్మణ మత
సాహిత్యంలో అదే ‘నాగులు’, ‘యక్షులు’ వైదిక కర్మకాండలను నాశనం చేసే దుర్మార్గులుగా
పేర్కొనబడడం విశేషం. ప్రాచీన కాలంలో కులవ్యవస్థ యేర్పడి, సామాజిక అంతస్తులలో
పైనున్న కులాలు తమకంటే కింద వున్న కొన్ని కులాల పట్ల అంటరానితనాన్ని పాటించడం
మొదలయ్యాక సహజంగానే అంటరానితనానికి, పరాయీకరణకు, వివక్షకు గురయ్యే కులాలను యితరులు
వొక విధమైన ద్వేష భావంతో చూడడం, వారిని పరాయి వారిగా పరిగణిస్తూ వారి పట్ల శత్రుపూరితంగా వ్యవరించడం మామూలే. ఆ
క్రమంలో పై కులాలు యీనాటి ‘దళితుల’ పరంగా ‘చండాలుడు’, ‘అవర్ణుడు’ వంటి పదాలను
వుపయోగించి వుండవచ్చు. వైదిక సాహిత్యంలో చెప్పబడిన చాతుర్వర్ణ వ్యవస్థ పరిధిలోకి
రాని వారిని ‘పంచములు’ గా పేర్కొనడం కూడా
వారిని సమాజంలో కలుపుకోకపోవడంలో భాగమేనని అర్ధమవుతుంది.
దళితులపై
యితరులు అంటరానితనాన్ని పాటించడం మొదలై యెంతకాలమయ్యిందో స్పష్టంగా తెలీకపోయినా
వారు బ్రాహ్మణ వాదాన్ని, మతాన్ని అంగీకరిచక బౌద్ధాన్ని అనుసరించడం, వైదిక కర్మ
కాండలను ధిక్కరించడం వారిపై యితరుల శత్రుత్వానికి, తద్వారా పరాయీకరణకు కారణాలని తెలుస్తుంది..
అంటరానితనం అనే శిక్షలో భాగంగా గ్రామాలలో దళితులు వూరెలపటితనాన్ని, పేదరికాన్ని,
‘నీచ’ వృత్తులైన చెప్పులు కుట్టడం, గొడ్డు తోలుతో వివిధ పనిముట్లు తయారు చేసి
యితరులకు అందించి వారిచ్చే ‘మిరాసి’ ద్వారా
జీవనోపాధిని పొందడం, చచ్చిన పశువులను తరలించడం, చనిపోయిన వారి దహన కార్యాలు
నిర్వర్తించారు. వారు పై కులాలవారి చావుకు
డప్పు కొట్టడం, యితరుల మల, మూత్రాలు ఎత్తిపోసే పారిశుధ్య పనులు, వ్యవసాయ కూలీలుగా,
పెత్తందారీ కులాల దగ్గర వెట్టి చాకిరీ,
పాలేరుతనం చెయ్యడం వంటి అనేక వృత్తులను తరాలుగా చేస్తూ కనీసపు గుర్తింపు, గౌరవం
లేకుండా సమాజపు అట్టడుగు పొరల్లో జీవిస్తూ వచ్చారు. దళిత స్త్రీలపైన పెత్తందారీ కులాల
లైంగిక దోపిడీ, వేధింపులు యెక్కువే! మతం పేరుతో వారిపైన తెలంగాణలో ‘జోగిని’,
‘మురళి’ రాయలసీమలో ‘బసివి’, వుత్తరాంధ్రలో ‘దేవుడమ్మ’, దక్షిణ కోస్తా జిల్లాలలో
‘మాతంగి’ వ్యవస్థలు ఆ స్త్రీలను ప్రచ్చన్న వ్యభిచార కూపంలోకి నెట్టాయి.
గ్రామదేవతారాధనతో ముడిపడి వున్న యీ సంస్కృతి పెద్ద దేవాలయాల్లో వుండే ‘దేవదాసీ’
వ్యవస్థను పోలి వున్నప్పటికీ దేవదాసీల వలే గ్రామీణ పేద స్త్రీలైన వీరికి యెటువంటి
ఆర్ధిక వెసులుబాటు వుండదు.
దళితులు ప్రాచీన
కాలంలో వైదిక హిందూ మతాన్ని కాదని చార్వాక, లోకాయత తాత్విక ధోరణుల వైపు వెళ్లి
తర్వాత బౌద్ధాన్ని అవలంబించారు.
మధ్యయుగాల్లో సామాజిక సమానత్వాన్ని ప్రతిపాదించిన వీరశైవ మతాన్ని స్వీకరించి
‘జంగములు’ గా, వైష్ణవాన్ని పాటించి‘దాసరులు’గా
యెంతోకొంత వూరట పొందారు. కొందరు ఇస్లాంలోకి వెళ్ళారు. వీటికి తోడు గ్రామ
దేవతారాధనలో వారే పూజారుగా, పోతురాజు వంటి పాత్రల్లో తమదైన మత విధానాన్ని పాటించారు.
అయితే బ్రిటీషు వారితో పాటు వొచ్చిన
క్రైస్తవ మిషనరీలు దళితులకు చేసిన సేవ, మతమార్పిడి ద్వారా అంది వచ్చిన
చదువు, పరిశుభ్రత, ఆత్మగౌరవం దళితుల చరిత్రలో వో కేలకమైన అధ్యాయం అని చెప్పొచ్చు. అప్పటిదాకా
అంటరానితనం, వివక్ష, ఆర్ధిక పరాధీనత, వెట్టిచాకిరీల కింద మలిగిపోయిన ఆనాటి
దళితులకు క్రైస్తవ మతం చదువుకునే అవకాశాన్ని, తద్వారా ఆత్మగౌరవాన్ని బహూకరించిందని
చెప్పాలి. క్రైస్తవ మిషనరీలు దళితవాడల్లో నెలకొల్పిన ‘లేబర్ స్కూళ్ళు’ తరాలుగా,
విద్యకు, మర్యాదకు దూరమై యెట్టి బతుకులు యీడుస్తున్న దళితులకు బాహ్య ప్రపంచపు
ద్వారాలను తెరిచాయి. తొలితరం విద్యావంతులైన
కొందరు పాశ్చాత్య భావజాలం వైపు ఆకర్షితులై సంఘ సంస్కరణకు పూనుకున్నారు.
క్రమంగా వెట్టి చాకిరీ, పాలేరుతనం, వారి పై రుద్దిన ‘హీన’ వృత్తులను వొదిలి మిషనరీ
స్కూళ్ళు , హాస్టళ్ళలో చేరారు. తొలినాటి
దళిత కవి బోయి భీమన్న రాసిన ‘పాలేరు’ నాటకం యీ పరిస్థితికి అద్దం పడుతుంది.
విద్యావంతులైన దళితులు తమ వ్యక్తిగత జీవితాలలో వెలుగులు నింపుకోవడమే కాక సంఘ
సంస్కర్తలుగా, కవులు, రచయితలుగా, పాత్రికేయులుగా తమ సమాజాభివృద్ధికి కృషి చేశారు.
అయితే, కొందరు దళితులు చైతన్యవంతులై గ్రామీణ కుల సమాజపు వివక్ష నుంచి తప్పించుకుని
వెళ్లి సైన్యంలో కింది స్థాయి సిపాయిలుగా, బొగ్గు గని కార్మికులుగా జీవనోపాధిని
పొంది కుల రక్కసి కోరల నుంచి బయట పడ్డారు. అంతేకాదు పొరుగు దేశాలైన బర్మా, శ్రీలంక
వంటి దేశాలలో కార్ఖానాలలో పనివారుగా జీవనోపాధిని పొందిన చైతన్యం కూడా ఆంద్ర ప్రదేశ్
దళితులకు వుందనే చెప్పాలి. అలాంటి వారు గోదావరి జిల్లాలలో కనిపిస్తారు. వీరి సంఖ్య
చాలా తక్కువే అయినా వారి చైతన్యం చెప్పుకోదగిననది. 20 శతాబ్దం మొదట్లో జరిగిన దళిత
ఆత్మగౌరవ వుద్యమాల ఫలితంగా యీ ప్రాంతపు దళితులు
తమ పూర్వపు కుల గుర్తింపును వొదిలి ‘ఆది ఆంద్ర’ అనే కొత్త కులంగా మారారు. అది 1930
వ దశకంలో మొదలయింది. మహారాష్ట్రలో మహర్లు తమ విముక్తి ప్రదాత అయిన అంబేడ్కర్ తో
పాటు బౌద్ధాన్ని స్వీకరించాక ‘నియో-బుద్ధిష్ట్’ అనే కొత్తరకం సామాజిక గుర్తింపును
పొందినట్టు ఆంద్ర ప్రాంతంలో కూడా దళితులు అటువంటి సామాజిక చలనానికి దారులు
వెతికారు.
వ్యవసాయ
కూలీలుగా, కౌలుదారులుగా ప్రత్యక్షంగా, పరోక్షంగా అత్యధిక శాతం వ్యవసాయ రంగంపై ఆధారపడే తెలుగు రాష్ట్రాల దళితులు భూమిపై స్వంతదార్లుగా
వున్న సందర్భాలు తక్కువ. యెంతో కష్టపడి యకరమో, రెండేకరాలో సంపాదించుకునే దళితులను
గ్రామాలలో పెత్తందారీ కులాల భూస్వాములు పెట్టే తిప్పలు అన్నీ, యిన్నీ కావు. వారిని
తమ భూములు సాగు చేసుకోనివ్వకుండా
అడ్డుకోవడం, వారి పంట చేలోకి గొడ్లను తోలి నాశనం చెయ్యడం, పొలంలోకి నీరు, దారి
యివ్వకుండా అడ్డుకుని ఆ భూమిని సాగుచేసుకోలేని స్థితికి వారిని నెట్టడం, చివరికి
వారు ఆ చిన్నపాటి భూమిని కూడా వొదులుకోవడం వంటి సంఘటనలు కూడా చరిత్రలో
చోటుచేసుకున్నాయి. కానీ వారి శ్రమ లేనిదే యిక్కడ వ్యవసాయ రంగ అభివృద్ధిని
వూహించలేం. దళితుల కష్టంతోనే యిక్కడి హరిత
విప్లవాలు వర్దిల్లాయని చెప్పాలి.
బ్రిటీషువారి
రాకతో పాటు వచ్చిన క్రైస్తవ మిషనరీలు దళితుల జీవితాలలో నింపిన వెలుగు కంటే వారి
పరంగా డాక్టర్. బి.ఆర్. అంబేడ్కర్ వంటి సామాజిక విప్లవకారుడు రాజ్యాంగం ద్వారా
సాధించి పెట్టిన హక్కులు, అవకాశాలు, ఆయన తన కార్యాచరణ ద్వారా అందించిన ఆత్మగౌరవ
చైతన్యం దళితుల తరతరాల సంకెళ్ళను తెంచాయనవచ్చు. రాజ్యాంగం ద్వారా సిద్దించిన
రిజర్వేషన్లు వలన వారి ఆర్ధిక, సాంఘిక పరిస్తితులలో చెప్పుకోదగిన మార్పు వచ్చింది.
వుద్యోగాల్లో స్థిరపడిన వారు గ్రామాలను వొదిలి పట్టణాలలో నివసిస్తూ గ్రామీణ కుల
సమాజపు దుర్బర స్థితి నుంచి కూడా బయటపడగలిగారు. మొదటి తరం విద్యావంతుల్లో
యెక్కువగా స్కూలు టీచర్లుగా, మిలిటరీ సర్వీసుల్లోనూ, పోలీసు సర్వీసులోనూ, స్త్రీలైతే నర్సులు, ఆయాలు, టీచర్లుగా
వుద్యోగాలు పొందారు. క్రమంగా ప్రభుత్వ
రాయితీలు వుపయోగించుకుని వున్నత విద్య ద్వారా పై స్థాయి వుద్యోగాలలో కూడా స్థిర పడ్డారు.
దళితులు విద్య
వుద్యోగ రంగాలలో కొంతమేరకు స్థిరపడినప్పటికీ యింకా వారిలో నిరక్షరాస్యత, పేదరికం,
నిరుద్యోగం, ఆరోగ్య భద్రత లేకపోవడం, ప్రభుత్వం కల్పించే రాయితీలను అందిపుచ్చుకునే
చైతన్యం, స్థాయి లేకపోవడంతో పాటు వారిపై పెత్తందారీ కులాల వివక్ష, దోపిడీ అనేక
రంగాలలో నిరంతరాయంగా కొనసాగుతూనే వుంది. యింకా అత్యధిక శాతం దళితులు వ్యవసాయ
రంగంపై ఆధారపడే కూలీలుగా, కౌలుదారులుగా గ్రామాలలో నివసిస్తూ యితరుల నుంచి కుల
వివక్షను, శ్రమ దోపిడీని, స్త్రీలు లైంగిక దోపిడీని యెదుర్కుంటున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభాలో
దళితులు అత్యధికంగా 25.396% గా వున్నప్పటికీ వారిలో 37 శాతం మంది దారిద్ర్య రేఖకు దిగువున జీవిస్తూ
కనీసపు అవసరాలు, సౌకర్యాలు లేకుండా అతి తక్కువ జీవన ప్రమాణాలతో జీవిస్తున్నారు.
వీరిలో 54 శాతం మంది దళిత బాలలు కనీసపు పోషకాహారం లేకుండా రోగాలతో
నెట్టుకొస్తున్నారు. ప్రతి వెయ్యి మంది బాలల్లో 83 మంది శారీరక లోపాలతో పుట్టి
సంవత్సరం వయసు లోపలే మరణిస్తున్నారు. దళితులలో యింకా 45 శాతం మంది
నిరక్షరాస్యులుగానే వుండడం విశేషం. గ్రామాలలో దళిత స్త్రీల అక్షరాస్యత శాతం కేవలం
37.8 శాతం మాత్రమే వుండడం ఆందోళన కలిగిస్తుంది. 27 శాతం మంది దళిత స్త్రీలకు కనీసం
ప్రసూతి సౌకర్యాలు లేక దురవస్థ పాలవ్వడం గమనార్హం. మూడొంతుల దళిత గృహాలకు నీరు,
విద్యుత్తు వంటి కనీస మౌలిక సదుపాయాలు అందుబాటులో లేవు. గ్రామాలలో వీరికి వైద్యం
అందించడానికి ప్రాధమిక వైద్య ఆరోగ్య సిబ్బంది సుముఖంగా లేకపోవడం కుల వివక్ష వల్లనేనన్నది
అర్ధమౌతుంది. యింకా అనేక ప్రభుత్వ స్కూళ్ళలో దళిత విద్యార్ధులు యితర విద్యార్ధులకు
దూరంగా, విడిగా కూర్చుంటున్నారు. గ్రామాల్లో దళితులకు పోస్టులో వొచ్చే వుత్తరాలను
బట్వాడా చేయ్యక పోవడనేది యింకా కొనసాగడం కుల వివక్ష తాలూకు వొకానొక రూపంగా అర్ధం
చేసుకోవాలి. యెస్సీ , యెస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారం కేవలం 15 శాతం కేసుల్లోనే నిందితులను
అదుపులోకి తీకుకోగా, యింకా 85 శాతం
పెండింగ్ కేసులు వుండడం గమనార్హం.
నేషనల్ క్రైం రికార్డ్ బ్యూరో ప్రకారం దళితులపై నేరాలు యిటీవల కాలంలో 66
శాతం పెరిగాయని తెలుస్తుంది. వివరాల్లోకి వెళ్తే ప్రతిరోజు కనీసం ముగ్గురు దళిత
స్త్రీలు దేశంలో యెక్కడో వొక చోట అత్యాచారానికి
గురౌతున్నారు. యిద్దరు దళితులు హత్యకు గురౌతున్నారు. కనీసం రెండు దళిత గృహాలను
పెత్తందారీ కులస్తులు తగలబెడుతూ కనీసం పదకొండు మంది దళితులను శారీరకంగా చిత్ర
హింసలపాలు చేస్తున్నారు. మరోవైపు కొన్ని గ్రామాల్లో దళితులపరంగా రెండు గ్లాసుల
పధ్ధతి కొసాగుతూనే వుంది, వారికి దేవాలయ ప్రవేశం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో
దళిత స్త్రీలపైన పెత్తందారీ పురుషుల వేధింపులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి.
జోగినీ వ్యవస్థ గ్రామాల్లో నిరాటంకంగా కొనసాగుతుంది. తెలంగాణలో సుమారు పది వేల
మంది, ఆంధ్రప్రదేశ్ లో తొమ్మిది వేల మంది స్త్రీలు యింకా జోగినీ వ్యవస్థలో
మగ్గుతున్నట్టు వొక అంచనా. తెల్ల బట్టలు వేసుకున్నారని, గుడిలోకి వెళ్ళారని,
గుర్రం పైన తిరిగారని, మీసం పెంచారని, తమ వీధుల్లోగుండా వారి వూరేగింపులు జరిపారని, సినిమా హాల్లో పక్కనే కూర్చుని
సినిమా చూస్తే కాలు తగిలిందని రకరకాల
సాకులతో దళితులపై దేశవ్యాప్తంగా దాడులు జరుగుతూనే వున్నాయి. యిటీవల కాలంలో తెలుగు
రాష్ట్రాలలో దళితులను వివాహం చేసుకున్నారని, ప్రేమించారని పరువు హత్యలు, వేలివేతలు
పెచ్చుమీరాయి. దళితులకు ప్రభుత్వం ద్వారా లభించిన చిన్నపాటి భూములు పెత్తందారీ
కులాలవారు లాక్కుని అదేమని అడిగితే వారిపై భౌతిక దాడులకు పాల్పడడం వంటి సంఘటనలు
కూడా యెక్కువయ్యాయి. ఆత్మగౌరవంతో వారు తలయెత్తిన చోట యేదో వొక సాకుతో వారిపై దాడి
చెయ్యడం, వారిని రకరకాలుగా కట్టడి చెయ్యడం చూస్తుంటే దళితులు అభివృద్ధితో , ఆత్మవిశ్వాసంతో
ముందుకొస్తే పెత్తందారీ కులాలు తరాలుగా అనాయాసంగా అనుభవించిన ఆధిపత్యం యిక
చెల్లుబడి కాదనే శంకతో చేస్తున్నారనిపిస్తుంది.
అంబేడ్కర్ కృషి వలన వొచ్చిన రాజ్యాంగ పరమైన హక్కులు, రిజర్వేషన్లు దళితుల
భౌతిక అవసరాలు కొనతమేరకు తీర్చినా యింకా వారిలో అత్యధిక శాతం మంది పేదరికపు
కోరల్లోనే చిక్కి వున్నారు. సామాజిక వుద్యమాలు అందించిన చైతన్యం యింకా
పూర్తిస్థాయిలో రాజకీయ చైతన్యంగా మారలేదు. అంబేడ్కర్ అన్నట్టు సామాజిక, ఆర్ధిక
రంగాలలో ప్రజాస్వామ్యం రానంతవరకూ వారికి రాజ్యాంగం ద్వారా లభించిన రాజకీయ హక్కులను
వుపయోగించుకునే పరిస్థితి వుండదు. అందువల్లనే దళితులు దేశ జనాభాలో 25శాతానికి పైగా
సుమారు 300 మిలియన్ల మంది అంటే యితర సామాజిక వర్గాలందరి కంటే ఎక్కువ సంఖ్యలో
వున్నప్పటికీ వారు తమవైన రాజకీయాలను నిర్మిచుకోకపోవడం వల్లనే యింకా వారు దేశంలో
పరాయివారిగా భావించబడుతూ నిరంతరం దాడులకు, వివక్షకు గురౌతున్నారు.
(24, May, 2018, BBC Telugu)
Comments
Post a Comment