Dalit Women's Struggle at Gottipadu
భారత దేశం గ్రామాల్లో నివసిస్తుందని గాంధీ గారంటే యేమో అనుకున్నాం. పెదగొట్టిపాడు భారతీయ గ్రామానికి పర్యాయ పదం,
నిలువెత్తు ప్రతినిధి లాంటిది. దాని రంగు,
రూపు వాసన కుల భూస్వామ్యం. గ్రామం తల వాకిట్లో కమ్మ పెత్తందారీ కులం నివసిస్తుందనడానికి అక్కడ పెద్ద పెద్ద భవంతులు, మండువా లోగిళ్ళే సాక్ష్యం. కర్ర పెత్తానికి చిరునామాలుగా వుండే అరుగులు. నెయ్యి కిందపడితే నాలికతో అద్దుకోవచ్చన్నట్టు అంతటా పరుచుకున్న గచ్చు. కంటికి కనిపించని నేల.
అందుకే మట్టి వాసన వెలిసిపోయింది కాబోలు. దొరతనం కాలం చేస్తే ఆర్భాటంగా తీసుకెళ్ళి కాల్చుకోడానికి ఖరీదైన స్మశాన వాటిక. అన్నీ వుండీ అదో కాంక్రీటు జంగిల్ లాంటిదే! యినప్పెట్టిలాంటి ఆ వీధుల నిండా తిష్టవేసుకున్న యేదో వెలితి. కొత్తగా అక్కడికొచ్చినోడు పలానా వాళ్ళ యిల్లెక్కడా? అని అడగడానికి పిట్ట అలికిడి కూడా వుండదు. కళ్ళాల్లో ఆరబోసిన మిరపకాయ పొగరు వాసన అక్కడ గుప్పుమంటుంది అచ్చం కుల దురహంకారంలాగే!
గొట్టిపాడు కాంక్రీటు జంగిల్ ని దాటి ముందుకెళ్తే దానికి పూర్తిగా భిన్నమైన దృశ్యం. రెండో భారత దేశం లాంటి యెస్సీ కాలనీ! అక్కడన్నీ పూరి గుడిసెలే! కూలిపోడానికి సిద్ధంగా వున్న మట్టి గోడలు... అక్కడక్కడా అగ్గిపెట్టెల్లాంటి సర్కారీ పక్కా యిళ్ళు కట్టిచ్చినోడి మనసులాగా. రెండు దృశ్యాలనూ కిమ్మనకుండా కన్నార్పకుండా చూస్తున్నట్టుండే ఏసయ్య చర్చి. కాస్త ముందుకెళ్తే యెదురుగా కనిపిస్తున్న వైరుధ్యాల్ని వేలెత్తి చూపిస్తున్నట్టుండే బాబా సాహెబ్ అంబేడ్కర్ బొమ్మ... ఆయనతో యేమాత్రం సంబంధం లేకపోయినా యిరువైపులా రెండు దిష్టిబొమ్మలు. వాళ్ళకి మాలపల్లెతో పనేంటో పాపం పెట్టుకున్న వెర్రిబాగులోళ్ళకి కూడా తెలవదు. అంబేడ్కర్ బొమ్మ దగ్గరే రచ్చబండ, కమ్యూనిటీ హాలు.
అక్కడెప్పుడూ మనుషుల సందడే!
మాల, మాదిగ కులాలు కలిసి సుమారు వెయ్యి గడప వున్న పెద గొట్టిపాడు దళిత వాడ చైతన్యానికి మారు పేరు. వారు తమపై తరతరాలుగా రుద్దిన అంటరానితనాన్ని ధిక్కరించి ఆత్మగౌరవంతో జీవిస్తున్నారు. వున్న దాంట్లో తింటూ తెల్ల గుడ్డలేసుకుని తలెత్తి తిరుగుతున్నారు. గొట్టిపాడు మాల మాదిగ కుర్రోళ్ళు వొక్కొక్కరు వొక చురకత్తి అనొచ్చు. యెవరన్నా చులాగ్గా ‘అరే,
వొరే’ అంటే వాళ్ళకి నషాళానికంటుకుంటది. వారు అంబేడ్కర్ యువజన సంఘాన్ని యేర్పాటు చేసుకుని అంబేడ్కర్ యిచ్చిన స్పూర్తిని అందిపుచ్చుకుని గ్రామంలోని పెత్తందారుల ఆగడాలను ప్రశ్నిస్తున్నారు. అర్హులైనవారికి వృద్ధాప్య, వితంతు ఫించన్లు రాకపోతే అధికారులను నిలదీస్తున్నారు. యెస్సీ, యెస్టీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్ళింపు పైన ఆరా తీస్తున్నారు. 'నీరు-చెట్టు’ పేరుతో మాదిగల చెరువుని కబ్జా చెయ్యడం పైన అధికార యంత్రాంగాన్ని ప్రశ్నిస్తూ జన్మ భూమి కమిటీల పేరుతో కమ్మ దొరలు చేస్తున్న ఆగడాలను యెండగడుతున్నారు. కమ్మ కులస్తులు కరెంటు పన్ను, యింటి పన్ను కట్టకుండా మాల మాదిగలు కట్టిన పన్ను దబ్బుతో తమ వీధుల్లో సిమెంట్ రోడ్లు వేసుకోవడాన్ని ప్రశ్నించారు. యింటికిద్దరూ ముగ్గురూ మొగపిల్లలుంటే అందరూ చదువుకుంటూ ఖర్చులకోసం సెలవుల్లో పెయింటింగ్, ఆటో నడపడం, కరెంట్ పని, బేల్దారి పనీ వంటి ఆ పనీ,
యీ పనీ అని లేకుండా మర్యాదకరమైన పనులన్నీ చేస్తారు. దాదాపు అందరికీ టూ వీలర్ బళ్ళు, చేతిలో సెల్ ఫోను వున్నాయి. రెండేళ్ళ క్రితం గుంటూరులో కట్టుబడి పనికెళ్ళి ప్రమాదంలో మట్టిపెళ్ళలు యిరిగిపడి యేడుగురు మొగపిల్లలు చనిపోయారు. పనులకోసం ఆడా మగా యెక్కడికైనా వలసెళ్తారు కానీ కమ్మోళ్ళ యిళ్ళల్లో పాచిపనులు, యెట్టి పనులకు మాత్రం యెవరూ వెళ్ళరు.
డిసెంబర్ 31 అర్ధరాత్రి నుంచి జనవరి వొకటో తేదీ మధ్యాహ్నం వరకు కమ్మలు మాల పల్లెపై దాడి చెయ్యడానికి ఆ దళిత వాడ చైతన్యం, కమ్మ కుల పెత్తనాన్ని వారు అంగీకరించకపోవడమే అసలు కారణం.
డిసెంబర్ 31 అర్ధరాత్రి మాల యువకులు బైక్లపై వెళ్ళి కమ్మ వీధుల్లో ఆడ పిల్లలు ముగ్గులు వేస్తుంటే అల్లరి చేశారనే నెపంతో వారిని కొట్టి మరసటి రోజు క్షవరం చేయించుకోడానికి మంగలి షాపుకెళ్ళిన యువకుడిని చితకబాది, తర్వాత చర్చీకెళ్తున్న స్త్రీ, పురుషుల పై దాడి చేసి అదేమని అడిగిన ఆడవాళ్ళకు లుంగీలెత్తి చూపించి అసభ్యంగా ప్రవర్తించి ఆడవాళ్ళని అవమానించే జుగుప్సాకరమైన బూతులు తిట్టి తిరిగి బాధితులపైనే కమ్మ కులస్తులు పోలీసు కేసు పెట్టడం యీ సంఘటనలో ప్రధాన అంశం.
అక్కడి బాధితుల కధనం ప్రకారం దళిత యువకులు కమ్మ వారి వీధుల్లోకే వెళ్ళలేదు. వాళ్ళు 'హాపీ న్యూ యియర్ !’ అని కేరింతలు కొట్టుకుంటూ వెళ్ళింది కమ్మ వారికీ మాల పల్లెకీ మధ్యన వుండే చాకలి కులస్తులు నివశించే రోడ్డు మీదకి. అక్కడ వారు యేదో తగిలి కిందపడ్డారు, అక్కడ కమ్మ స్త్రీలు వుండే అవకాశమే లేదు.
అయినప్పటికీ దళితుల యెదుగుదలను వోర్వలేని కమ్మ కులస్తులు యేదో వొక నెపంతో దాడికి పాల్పడడమే కాకుండా ' మాల మాదిగ నా కొడుకులకి బళ్ళు కావాల్సి వొచ్చినాయా? మీ ఆడోళ్ళు పది రూపాయలిస్తే మా బండెక్కి యెక్కడకి రమ్మన్నా వొస్తారురా!’ అని దుర్భాషలాడి దళిత వాడను వల్లకాడు చేస్తామని, గొట్టిపాడుని మరో కారంచేడుని చేస్తామని హెచ్చరించారు. కమ్మ కులస్తులు ముందుగానే పధకం ప్రకారం బయట నుంచి తెచ్చుకున్న కర్రలు, సీసాలు, కత్తులతో వారిని చితక బాదితే కొందరు దళిత యువకులు ప్రాణాపాయ స్థితిలో హాస్పత్రిలో చేరారు. కమ్మ కులస్తులు చేసిన దాడిలో వారి స్త్రీలుకూడా పాల్గొని దళితుల కళ్ళల్లో కారం కొట్టడం యిక్కడ గమనార్హం. ఆడపిల్లల పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణతో 35 మంది దళిత యువకులపై 354 సెక్షన్ ప్రకారం నాన్-బెయిలబుల్ కేసు పెట్టారు. బాధితులు యిచ్చిన ఫిర్యాదుకు పోలీసులు అధికారులు స్పందించిన తీరు నిందితులను వెనకేసుకొచ్చేవిధంగా వుంది. బాధితుల మీద నాన్ బెయిలబుల్ సెక్షన్ ల కింద కేసు నమోదు చేసి జైలుకి పంపి, అసలు ముద్దాయిలపైన బెయిలబుల్ సెక్షన్ ల కింద నామ మాత్రంగా కేసు పెట్టినట్టే పెట్టారు. యిప్పుడు వారు బెయిల్ పైన తిరిగొచ్చి గ్రామంలో స్వేచ్చగా తిరుగుతుంటే బాధితులకు బెయిల్ రావడమే కష్టమై వారు దళిత న్యాయవాదుల అండతో విడుదలైనా , స్వేచ్చగా యింటికి రాలేక పొరుగూర్లలోనే తలదాచుకుంటున్నారు.
దాడి అనంతరం గొట్టిపాడు దళితులపై కమ్మ దురహంకారులు రకరకాల వెలిని అమలు పరుస్తున్నారు. గ్రామంలోని కాఫీ హోటళ్ళకు దళితులను రానివ్వకుండా అడ్డుకోవడం, దళిత వాడకు నీరు వొదలనివ్వకుండా అడ్డుకోవడం, దళితులను కూలి పనికి పిలవకుండా, గ్రామంలో వున్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదివే పిల్లల్ని రకరకాలుగా వేధింపులకు గురి చెయ్యడం జరుగుతుంది. అధికారులు కల్పించుకుని రాజీ చేశామని వార్తలు వొస్తున్నప్పటికీ యింతవరకూ అసలు ముద్దాయిల్ని అరెస్ట్ చెయ్యకపోగా గ్రామంలో శాంతి భద్రతల పేరుతో 144 వ సెక్షన్ విధించి యితర ప్రాంతాల వారిని, బాధితులకు అండగా వుండే ప్రజా సంఘాలవారిని అక్కడికి రాకుండా అడ్డుకున్నారు. గొట్టిపాడు దళితులు తమపై జరిగిన దాడికి బెదిరిపోకుండా ప్రతిఘటించడం వారి చైతన్యానికి చిహ్నం. అరెస్టులకు, వెలివేతలకు వారు భయపడడం లేదు.
తమపై జరిగిన దాడిలో ప్రధాన నిందితులైన ఐదుగురు కమ్మ వారిని అరెస్ట్ చేయ్యాలని, తమ వాడలో పోలీసు పికెటింగ్ ని తొలగించాలని, తమపై అమలౌతున్న అప్రకటిత వెలిని నిషేధించి తమ పిల్లలు స్వేచ్చగా చదువుకునేలా శాంతియుత వాతావరణం కావాలని గొట్టిపాడు దళితులు గ్రామంలో రిలే నిరాహార దీక్షకు దిగారు. యీ దీక్షా శిబిరాన్నీ జయ భాగ్యమ్మ గొప్ప క్రమశిక్షణతో, సీరియస్ గా నడిపిస్తుంది. యీ కార్యక్రమంలో స్త్రీలు క్రియాశీలకంగా పాల్గొంటున్నారు. డ్వాక్రా గ్రూపుల్లో సభ్యులుగా వున్న మహిళల్ని ఆమె సమీకరించి శిబిరాన్ని నిరవధికంగా నడిపిస్తున్నారు. అయితే వారి పై జరిగిన దాడికి అధికారులు స్పందించే తీరు పట్ల వారు యెంతో ఆగ్రహంతో వున్నారు. నిందితులను శిక్షించకుండా బాధితులపై కేసు నమోదు చెయ్యడం, తమకు రోడ్లు వేయిస్తామని, యితర సౌకర్యాలు కల్పిస్తామని అధికారులు చెప్తూ అసలు సమస్యని దాటవెయ్యడమే కాక గొట్టిపాడు దళితులకు, కమ్మ వారికీ మధ్య రాజీ కుదిరిందని మీడియాలో చెప్పడం పైన ఆ స్త్రీలు నిరసన వ్యక్తపరిచారు. తమపై దాడి సందర్భంగా లుంగీలు యెత్తి తమ మర్మావయాల్ని చూపించిన కమ్మ కుల పురుషులపైన, తమ కళ్ళల్లో కారం చల్లిన కమ్మ స్త్రీల పైన
చర్య తీసుకోకుండా అధికారులు నిందితులను కాపాడే విధంగా వ్యవహరిస్తున్నారని బాధిత స్త్రీలు ఆవేదన వ్యక్తం చేశారు.
యిక దివిటీల్లాంటి గొట్టిపాడు దళిత స్త్రీల గురించి ప్రత్యేకంగా చెప్పాలి. వాళ్ళు ఆ దళితవాడ లో ఆత్మగౌరవ చైతన్యాన్ని వుగ్గుపాలతో పెంచి పోషించిన తల్లులు. వొక్కోసారి తాగుడుకి బానిసలైన మగవాళ్ళు ప్రలోబాలకు లొంగిపోయినప్పటికీ వాళ్ళు పిల్లల్ని క్రమశిక్షణతో పెంచడమే కాకుండా తాగుబోతు భర్తలకి బుద్ధి చెప్పిన ధీరలు. గ్రామంలో వున్న లైసెన్స్ వున్న మద్యం దుకాణాన్ని సైతం తమ పోరాటంతో మూయించ గలిగిన కార్య సాధకులు వారు. జొన్నలగడ్డ జయ భాగ్యమ్మ ఆ దళిత వాడకు వో చుక్కాని వంటి వ్యక్తి. ఆమె వారికి పెద్ద దిక్కు అని చెప్పొచ్చు. జయ భాగ్యమ్మ నాయకత్వంలోనే వారు సారా వ్యతిరేక వుద్యమాన్ని విజయవంతంగా నడిపారు. దాడి సందర్భంగా దళిత స్త్రీలు చూపిస్తున్న ధైర్య సాహసాలు, వారి పోరాట పటిమ యెంతో స్పూర్తిదాయకమైంది. గుంటూరులో యేర్పాటు చేసిన కార్యక్రమం లోను, ఆ తర్వాత ఫిబ్రవరి ఆరవ తేదీ నుంచి జరుగుతున్న నిరాహార దీక్ష లోనూ స్త్రీలే ప్రధాన పాత్ర వహిస్తూ వుద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. జయ భాగ్యమ్మ నష్టపరిహారం, పునరావాసం కోసం ప్రభుత్వమిస్తానంటున్న సౌకర్యాల మీద
మండిపడ్డారు. 'మీరు డబ్బులిస్తారని, రోడ్లు వేయిస్తారని మేము వాళ్ళచేత దాడి చేయించుకోలేదు. మా ఆత్మ గౌరవ సమస్యని డబ్బుతో ముడిపెట్టొద్దు’ అని ఆమె కోరుతున్నారు. దళిత పురుషుల్లో కొందర్ని కమ్మ కుల పెద్దలు తాగబోసి తమపైకి తగువుకి వుసిగొల్పి దీక్షా శిబిరాన్ని మూయించి తద్వారా తమ పోరాటం మీద నీరు చల్లాలని చూస్తున్నారని, తాము మాత్రం యెంతో సంయమనంతో శిబిరాన్ని నడిపిస్తున్నామని జయ భాగ్యమ్మ చెప్పారు.
ఖైర్లాంజి, లక్షింపేట, గరగపర్రు దళితులపై దాడుల సందర్భం లాగే గొట్టిపాడు దళిత వుద్యమం విషయం లో కూడా కులం, జెండర్ అనే భావనల మధ్య వుండే వైరుధ్యాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. యిక్కడ కూడా స్త్రీలందరి చైతన్యం వొకటికాదని స్త్రీలకు కూడా తమ కుల, వర్గ ప్రయోజనాలు తప్ప సాటి స్త్రీలనే భావన వుండదు కాక వుండదనే విషయాన్ని గొట్టిపాడు కమ్మ స్త్రీలు మరోసారి రుజువు చేశారు. యీ దేశం లో అనేకచోట్ల దళితులపై జరిగిన దాడుల్లో పెత్తందారీ కులాల స్త్రీలు వొక్కసారైనా బాధిత స్త్రీల పక్కన నిలబడిన దాఖలాలు లేవు.
ఖైర్లాంజి నుంచి గొట్టిపాడు దాకా ఆ విషయం స్పస్టంగానే కనిపిస్తుంది. స్త్రీలకు తమదైన కుల దురహంకారం పురుషుల్లాగే వుంటాయని ఆయా సంఘటనలు మనకి తెలియ చెప్పాయి. యీ సంఘటనలలో దళిత స్త్రీ చైతన్యం స్పస్టంగా కనిపిస్తుంది. అయితే జయ భాగ్యమ్మ లాగా గతంలో దళిత స్త్రీలు కొందరు క్రియాశీలకంగా వున్నప్పటికీ వారిని నాయకులుగా గుర్తించడానికి దళిత పురుషులు అంగీకరించ లేదు. జయ భాగ్యమ్మ చాలా కాలం నుంచి వొక్కతే నిలబడి కొన్ని విజయాలు సాధించడం వలన యిప్పుడామెని తమ నాయకురాలిగా వారు భావిస్తున్నారు. దళిత వుద్యమంలో యిదొక మంచి పరిణామం గా భావించవచ్చు. దళిత స్త్రీల భాగస్వామ్యంతోనే దళిత వుద్యమం సవ్యంగా ముందుకెళ్తుంది.
గొట్టిపాడు దళిత స్త్రీలను చూస్తే 1920,30 వ దశకాలలో అంబేడ్కర్ నడిపిన రాడికల్ వుద్యమం లో పాల్గొన్న మహర్ స్త్రీలు జ్ఞాపకమొస్తారు. దళిత సమాజాన్ని అంతర్గతంగా సంస్కరించడానికి ఆయన దళిత స్త్రీలపైనే యెక్కువగా ఆశ పెట్టుకున్నారు. వారాయన ఆశలు నెరవేర్చడమే కాక ఆయన సాగించిన ప్రజా వుద్యమాలలో క్రియాశీలక భాగస్వాములవ్వడం చూస్తాం. యెంతో ధృఢ చిత్తంతో భాగ్యమ్మ, ఆమె అసహచరులైన ధర్నాసి మరియమ్మ, పిల్లి దీనమ్మ, ధర్నాసి మేరి, ధర్నాసి సుభాషిణి, జొన్నలగడ్డ ఎల్సిమ్మ, ఏసుమ్మ, సునంద, పిడతల నాగమ్మ, ధర్నాసి రత్తమ్మ, బూసి సువార్త, జొన్నలగడ్డ అన్నమ్మ, పిల్లి ఏసుమ్మ, అన్నారపు ఆశీర్వాదం మొదలైన స్త్రీలు గొట్టిపాడు దళిత పోరాట శిబిరాన్ని శక్తివంతంగా నడిపిస్తున్నారు. వారి పోరాట స్పూర్తికి జేజేలు...
(Navatelangana
5.3.18, Charvaka page)
Comments
Post a Comment