Exclusion
భారత దేశం గ్రామాలలో నివసిస్తుందని గాంధీజీ అక్కడ చక్కగా నివసించే కులాన్ని చూసి మురిసిపోతూ చెప్పి వుండవచ్చు. దేశానికి స్వతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలు గడిచి రాజ్యాంగం ద్వారా ప్రజలకు సమానత్వ హక్కు వంటి అనేక హక్కులు కల్పిస్తూ చట్టాలు వచ్చినప్పటికీ 2017లో కూడా సాంఘిక బహిష్కరణ లేదా వెలి అంశం దళితుల పరంగా మిగిలి వుండడం భారత దేశం వంటి కుల సమాజానికే చెల్లింది. వెలి ఓ సామాజిక దురాచారమే కాదు బాధితుల పరంగా ఓ తీవ్రమైన మానసిక వేదనకు గురిచేసి వారిని 'బయటి’ వారుగా పరిగణించే ఒక హింసా రూపం. భారత రాజ్యాంగంలోని 15, 16, 17, 18 అధికరణాలు సమాజంలో కులం,
మతం, ప్రాంతం, లింగం వంటి భేదాలకు అతీతంగా వ్యక్తులందరికీ చట్టం ముందు సమానత్వ హక్కును కల్పించడమే కాదు 17 వ ఆర్టికల్ అంటరానితనాన్ని, దాని తాలూకు వివిధ రకాల వివక్షా రూపాలను నేరంగా పరిగణిస్తుంది. ఆర్టికల్ 15(2) బహిరంగ ప్రదేశాలలో సంచరించడానికి, నివశించడానికి, వాణిజ్యపరమైన దుకాణాలు, హోటళ్ళు వంటివి వుపయోగించుకోడానికీ అందరికీ సమాన అవకాశాలు వుండాలంటుంది.
యిటీవల ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా గరగపర్రు గ్ర్రామంలో జరిగిన దళితుల సామాజిక బహిష్కరణ అనేది మరోసారి యీ
అంశాన్ని చర్చకు పెట్టింది. భారత కుల సమాజంలో వ్యక్తులను సామాజిక బహిష్కరణకు లేదా వెలికి గురి చెయ్యడం అనేది కులం బయటా,
కులం లోపలా రెండు పద్ధతులలో జరుగుతుంది. కులం బయట జరిగే సామాజిక బహిష్కరణ అనేది గ్రామాలలోని ఆధిపత్య కులాలు అణగారిన కులాలపై తమ అదుపు కొనసాగిస్తూ వారిని తమ నియంత్రణలో వుంచుకుని తమ పట్టును కొనసాగించడానికి ఒక ఆయుధంగా వుపయోగపడుతుంది. పైకి కాగితాలమీద కనిపించకపోయినప్పటికీ యిది ఓ అనధికార శాసనం. గ్రామీణ కుల సమాజంలో యీ శిక్ష అనేది ప్రతి దళితుడి అనుభవంలో వుండేదే! దళితులను వూరి బయట వుండేలా చేయడం, గుడిలోకి, బడిలోకి రానివ్వకుండా, హోటళ్ళలో రెండు గ్లాసుల పద్ధతి పాటించడం, వూరి చెరువులో, బావిలో నీరు తోడుకోనివ్వకపోవడం, పబ్లిక్ స్థలాలైన కమ్యూనిటీ హాళ్ళు, శ్మశానాలు, షాపులు వంటివి వాడుకోనివ్వకుండా కట్టడి చెయ్యడం వంటివి అంటరానితనంతో పాటు గ్రామీణ సమాజంలో యింకా కొనసాగడం విడ్డూరం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 అంటరానితనాన్ని నిషేధిస్తున్నప్పటికీ యింకా కొన్ని ప్రాంతాలలో యీ పద్ధతి అనధికారికంగా అమలులోవుండి డెబ్భై ఏళ్ళ స్వతంత్రాన్ని అభాసుపాలు చేస్తుంది.
గ్రామీణ సమాజంలో కులం బయట ఆధిపత్య కులాలు కింది కులాలు తమ చెప్పు చేతల్లో లేకుండా స్వతంత్రంగా ఆత్మగౌరవంతో మెలిగిన సందర్భాలలో వారిపై ఏదో ఒక నెపంతో దాడి చెయ్యడం, వారినుంచి ప్రతిఘటన ఎదురైతే వారిని సామూహిక జీవనం నుంచి వెలివేసి వారి జీవన భృతికి ఆధారమయ్యే వ్యవసాయపు పనులకు పిలవక పోవడం, యితర నిత్యావసర వస్తువులు, సేవలు వారికి అందకుండా నిలిపివేసి వారి దైనందిన జీవితాన్ని దుర్భరం చేయడం జరుగుతుంది. గరగపర్రులో జరిగింది అక్షరాలా యిదే. పెద్ద ఎత్తున ఆందోళనలు, పోలీసు కేసులు జరగకపోయినప్పటికీ దళిత కులాలపరంగా యీ వెలి అనుభవం లేని గ్రామాలు యీ దేశంలో దాదాపు లేవంటే అతిశయోక్తి కాదు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రోహిత్ విద్యా వ్యవస్థలో అమలయ్యే కులపరమైన వెలికి బలైపోవడం మన జ్ఞాపకాలలో యింకా పచ్చిగానే వుంది. తమ జ్ఞానంతో, చైతన్యంతో బ్రాహ్మణవాదాన్ని ఎదుర్కునే రోహిత్ నీ అతని మిత్రులనూ అగ్రహారానికి నిలువెత్తురూపంలా వుండే విశ్వవిద్యాలయం సాంఘిక బహిష్కరణకు గురిచేస్తే తీవ్ర మనస్తపానికి గురైన రోహిత్ 2016 జనవరి నెలలో ఆత్మహత్య చేసుకుని కుల సమాజంముందు అనేక ప్రశ్నలు వదిలి వెళ్ళాడు.
వెలి తాలూకు తీవ్రమైన శిక్షలకు భయపడి అణగారిన కులాలు కొన్నిసార్లు ఆధిపత్యకులాల ముందు ఆత్మాభిమానాన్ని చంపుకుని కాలం వెళ్ళదీస్తారు. భూములు యితర ఆర్ధిక వనరులు, రాజకీయ పలుకుబడి ఆధిపత్యకులాల చేతుల్లో వుంటాయి కాబట్టి వారికి ఏమిచేసినా చెలామణి అవుతుందనే భరోసా వుంటుంది. వారికి దళితులు ఎదురు తిరిగిన సందర్భాలలో సామూహిక వెలితో పాటు హత్యలు, గృహదహనాలువంటి పర్యవసానాలు చోటుచేసుకోవడం సర్వసాధారణం. 1991 లో చుండూరులో ఆత్మగౌరవంతో తలెత్తిన దళితులను సినిమా హాలులో కాలు తగిలిందనే నెపంతో రెడ్లు వారిపై హత్యాకండకు దిగి ప్రతిఘటించిన దళితులను పనులనుంచి బహిష్కరించి దిగ్బంధం చేశారు. యిప్పుడు గరగపర్రులో కూడా అదే పరిస్థితి.
పెత్తందారీ కులాలు కింది కులాలను వెలివేసి శిక్షించే కారణాలలో కులాంతర వివాహాలు, ప్రేమ వ్యవహారాలు అనేవి కూడా కొన్నిసార్లు కీలకంగా వుంటాయి. గ్రామాలలో పెత్తందారీ కులాలకు, దళిత కులాలకు మధ్య ప్రేమ, పెళ్ళి అనేవి ఎంత తీవ్ర పరిణామాలకు దారితీస్తాయో మన దేశంలో జరిగిన అనేక సంఘటనలు సజీవ సాక్ష్యంగా నిలుస్తాయి. దేశంలో మనువాద భావజాలానికి పట్టుకొమ్మలాగా వుండే ఉత్తర ప్రదేశ్ లో
జరిగిన రెండు వుదాహరణలు యీ తరహా దారుణాలకు నిదర్శనం. 2000 వ సంవత్సరంలో ఒక ఆధిపత్య కులపు యువతి దళిత యువకుడిని పెళ్ళాడితే పోలీసు కానిస్టేబుల్ అయిన ఆ అమ్మాయి తండ్రి తన అల్లుడైన దళిత యువకుడితో పాటు అతని కుటుంబంలోని నలుగురు వ్యక్తులను సర్వీస్ రివాల్వర్ తో కాల్చి చంపిన ఘటన అప్పట్లో దేశమంతా కలకలం రేపింది. ఆ తర్వాత సంవత్సరం అదే రాష్ట్రంలో ఒక బ్రాహ్మణ యువకుడు దళిత యువతిని ప్రేమించిన కారణంగా యీ రెండు కులాలకు చెందిన కుటుంబాల వారు దాన్ని
తీవ్రంగా పరిగణించడమే కాకుండా ఆ యిద్దరినీ యీడ్చుకొచ్చి వందలాదిమంది గ్రామస్థులు చూస్తుండగానే వురివేసి చంపారు. యిటీవల తెలంగాణా రాష్ట్రం, మంధని లో జరిగిన మధుకర్ హత్య యీ కోవకు చెందిన తాజా సంఘటన. కరీంనగర్ జిల్లా, మంధనిలో మాదిగ యువకుడైన మధుకర్ అక్కడి ఆధిపత్య కులానికి చెందిన అమ్మాయిని ప్రేమించిన కారణంగా అమ్మాయి కుటుంబం వారు అతన్ని చిత్రహింసలు పెట్టి చంపారు. అయితే 'పరువు’ హత్యలు పేరుతో జరిగే యీ రకమైన సంఘటనలలో కింది కులాలవారినే శిక్షించడం జరుగుతుంది. యిది రాజ్యాంగం ప్రకారం వ్యక్తుల జీవించే హక్కునూ, వ్యక్తిగత స్వేచ్చనూ కాలరాయడమే!
బ్రాహ్మణవాదం వివిధ కులాల మధ్య అంతరాలు సృష్టిస్తే ఏ కులానికి ఆ కులం దడి కట్టుకుని తనకంటూ కొన్ని నియమాలను ఏర్పరుచుకుని తన కులస్తులను కట్టడి చేస్తుంది. దేశంలో అన్ని కులాలకు కుల సంఘాలుంటే అణగారిన కులాలకు కుల పంచాయితీలు బలంగా వుంటాయి. ఆధిపత్య కులాలు కులసంఘాలు స్థాపించుకుని తమకులాన్ని ఆర్ధికంగా, రాజకీయంగా అభివృద్ధి చేసుకుంటుండగా అణగారిన కులాలు తమ కుల పంచయతీల ద్వారా కులం లోపల మరో రకమైన ఆధిపత్య వ్యవస్థని నెలకొల్పుకుని కులంలో బలహీనుల మీద,
స్త్రీల మీద దాస్టీకం చెయ్యడం జరుగుతుంది. యిది కూడా బ్రాహ్మణవాద పరిధిలోనిదే! కులపంచయితీలు అంతర్వివాహ పద్ధతి పకడ్బందీగా అమలవ్వడానికి పని చేస్తూ కులంలోని వ్యక్తులు యితర కులం వారిని వివాహం చేసుకునే సందర్భాలలో వారిని రచ్చబండకు పిల్చి జరిమానా వెయ్యడం లేదా కులం నుంచి వెలి వెయ్యడం జరుగుతుంది. అలాగే యీ పంచాయితీలు తమ కుల స్త్రీల ‘పాతివ్రత్యాన్ని’ కులగౌరవంలో భాగంగా పరిగణిస్తాయి కాబట్టి స్త్రీల లైంగికత పైన కూడా నిఘా వేసి వుంచుతాయి. వివాహం, విడాకులు, ప్రేమవ్యవహారాలు వంటి విషయాలలో ప్రధాన అంశం స్త్రీని కట్టడి చెయ్యడమే! కులపంచాయితీలు ఎవరైనా వివాహేతర సంబంధాలకు పాల్పడ్డారని భావిస్తే వారికి అత్యంత అవమానకరమైన బట్టలూడదీసి నగ్నంగా వూరేగించడం, చెట్టుకు కట్టేసి కొరడాలతో కొట్టడం, మంటల్లో శరీరాన్ని కాల్చి తమ ‘శీలాన్ని’ నిరూపించుకోమని కోరడం వంటి దారుణమైన శిక్షలు యిప్పుడు 21వ శతాబ్దంలో కూడా అమలు చేస్తున్నారనడానికి యిటీవల సోషల్ మీడియాలో కనిపించిన వీడియోనే సాక్ష్యం. అత్యాచారానికి గురైన మైనర్ బాలికకు ఆ దుర్మార్గానికి పాల్పడిన వాడితో తాళి కట్టించి పెళ్ళి చేసేటువంటి దారుణాలు కూడా గ్రామాలలో కులపంచాయితీలు నిర్విఘ్నంగా అమలు చేస్తున్నాయి. నిజానికి అన్ని కులాలకూ కుల పంచాయితీలు వున్నప్పటికీ గ్రామాలలో దళిత,
ఆదివాసీ కులపంచాయితీలు బలంగా పని చేస్తుంటాయి. విడాకుల వంటి అంశాలలో వీరిచ్చిన తీర్పులకు యిటీవల కాలం వరకు కోర్టులో చెల్లుబాటు వుంది. ఆడ పిల్లల విషయంలో బాల్య వివాహాలను ఆదివాసీ, దళిత కుల పంచాయితీలు బాహాటకంగానే సమర్ధిస్తుంటాయి. ఆదివాసీల పెళ్ళి ఖర్చంతా కులపెద్దలకు సమర్పించుకోవల్సిన కులకట్నం, మందు,
భోజనాలకు సంబంధించినదే కావడం గమనార్హం. కులపంచాయితీలలో కూడా కండ బలం వున్న వారిదే పైచేయి గా వుండి కులంలోని బలహీనులను, స్త్రీలను చిన్న చిన్న తప్పులకు బలి చేస్తూ వుంటారు.
కులం లోపల వెలికి, బహిష్కరణకు గురయ్యే వ్యక్తులు, కుటుంబాలు తీవ్రమైన మానసిక వేదనకు గురవుతారు. అవమానాన్ని దిగమింగుకోలేక కొంతమంది ఆత్మహత్యకు కూడా పాల్పడడం జరుగుతుంది. వారిని తమ కులస్థులు అన్ని రకాలుగా దూరం వుంచుతారు. ఎవరూ మాట్లాడరు, వారి పిల్లల్ని యితర పిల్లలతో కలవనివ్వరు, దుకాణాలలో సామానులు, బావిలో నీరు తీసుకోనివ్వరు, వారితో వివాహ సంబంధం పెట్టుకోరు. యిటువంటి దుర్భర పరిస్తితులలో వెలికి గురైన కుటుంబాలు గ్రామంలో బతకలేక తమకున్న కొద్దిపాటి ఆస్థులను అమ్ముకుని యితర ప్రాంతాలకు వలస వెళ్ళిపోయే సందర్భాలు అనేకం.
కులం బయట పెత్తందారీ కులాలు దళితులను సామూహికంగా బహిష్కరించినా, కులంలోపల కులపంచాయితీలు వ్యక్తులను, కుటుంబాలను బహిష్కరించినా మొత్తానికి వెలి అనేది ఓ దుర్మార్గ మైన సామాజిక విధానంగా భావించవచ్చు. యిది ఆయా సమూహాలనూ, వ్యక్తులనూ ఒక సామూహికత నుంచి వేరు చేసి వారిని ఒంటరితనానికీ, ఆత్మ న్యూనతకీ, కుంగుబాటుకీ గురి చేసే ఓ దురన్యాయం. యీ విధానంలో ఎప్పుడూ అణగారిన ప్రజలు, స్త్రీలు బలిపశువులుగా మారి అసలే అంతంత మాత్రంగా వుండే వారి జీవితాలు వెలితో మరింత మసకబారిపోతాయి.
మహారాష్ట్ర ప్రభుత్వం సాంఘిక బహిష్కరణలు నిషేధిస్తూ 2016 లో ఒక చట్టం చేసింది. దీనిపేరు The Maharastra Protection of People
from Social Boycott Act- 2016. మతతత్వ బ్రాహ్మణ వాదుల చేతిలో 2014లో హత్యకు గురైన సామాజిక వేత్త డా. నరేంద్ర దబోల్కర్ వంటి వారి కృషి ఫలితంగా యిది చట్టం రూపం దాల్చింది. గ్రామాలలోని కులపంచాయితీలు తమ కులంలోని వ్యక్తులకు విధించే వెలి లేదా సాంఘిక బహిష్కరణలను యీ చట్టం నేరాలుగా పరిగణిస్తుంది. సామాజిక జీవితానికి సంబంధించిన మతపరమైన వేడుకలు, వివాహాలు, అంత్యక్రియలు జరుపుకోకుండా అడ్డుకోవడాన్ని యీ చట్టం వ్యతిరేకిస్తుంది. అలాగే విద్య, వైద్య సంస్థలు, కమ్యూనిటీ హాళ్ళు వంటి వాటిలో ప్రవేశాన్ని అడ్డగించడం యీ చట్టం ప్రకారం శిక్షార్హం. సామాజిక బహిష్కరణ అనే నేరానికి పాల్పడే వారు మూడేళ్ళు జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా, లేదా రెండూ భరించాల్సి వుంటుంది. సాంఘిక బహిష్కరణ అనేదాన్ని మానవ హక్కుల వుల్లంఘనగా యీ చట్టం పరిగణిస్తుంది.
యీ చట్టం వివాహం, వస్త్రధారణ, భాష మొదలైన 12 అంశాలను పరిగణనలోనికి తీసుకుంటుంది. అయితే యిది కులం లోపల వెలిని మాత్రమే నిషేధిస్తుంది. కులం బయట పెత్తందారీ కులాలు అణగారిన కులాలపై విధించే వెలి యీ చట్ట పరిధిలోకి రాదు.
కులపంచాయితీలు, పెత్తందారీ కులాలు కులం లోపల వ్యక్తులను, కులం బయట సమూహాలనూ వెలివేతలతో వేధించడం అనేది
దక్షిణాది
కంటే వుత్తరాదిలోనే ఎక్కువని భావిస్తాం. అయినప్పటికీ బ్రాహ్మణవాదం ఎక్కడైనా ఒక్కటే. అలానే గ్రామీణ కుల సమాజపు పోకడలు వాటి తీవ్రతలో హెచ్చు తగ్గులు గానీ అవి చేసే దాష్టీకం విషయంలో ఎవరికి ఎవరూ తీసిపోరు. కరుడుకట్టిన గ్రామీణ కుల వ్యవస్థ ముందు చట్టాలను అమలు చెయ్యలేని దుస్థితి ఏర్పడుతుంది. దళితులపై సామాజిక బహిష్కరణలు, హత్యాకాండలు పెచ్చుమీరడం, ‘పరువు హత్య’ల పేరుతో దళిత యువత నిండు ప్రాణాలను బలిచేస్తున్న పరిస్థితులలో సాంఘిక బహిష్కరణల నిర్మూలనలో దేశమంతటికీ వర్తించే చట్టం ఒకటి తీసుకురావల్సిన అవసరం వుంది.
Comments
Post a Comment