Hyderabad Poem
You too …
చల్లపల్లి స్వరూపరాణి
అమ్మా! భాగ్యనగరమా!
వొకపక్క దొరతనం
వూరి అరుగు దాటి
అపార్ట్ మెంట్ లో గాండ్రిస్తుంది
యిప్పుడు నువ్వూ అసింట జరగమంటున్నావు!
అభాగ్యులందరి
భాగ్యమా!
నువ్వు పాలుతేనెలు ప్రవహించే
కానాను పట్టణానివి కదూ!
వొట్టిపోయిన
అగ్రహారానివి యెప్పుడయ్యావు?
యెవరమ్మగన్న బిడ్డల్నైనా
అక్కునజేర్చుకునే నువ్వు
యింత కానిదానివెప్పుడయ్యావ్!
వూర్లల్లో అన్నం మెతుక్కీ
అంటుకున్న కులం
అలగా నోట్లో మన్నుగొడితే
నువ్వే కడుపులో దాచుకున్నావు కదా!
అమ్మా! భాగ్యనగరమా!
ఆఖరికి నువ్వూ మారిపోయావా!
దోస్తానా అంటే
ప్రాణం పెట్టే నీ ముసల్మానుతనం
కండంటే గబుక్కుమనే
తెలంగాణా బరిబాతలతనం
యే గరుత్మంతుడెత్తుకుపోయాడు?
చేతులు చాచి
గుండెలకు హత్తుకోవడం తప్ప
అన్యం పున్యం యెరగని
భాగ్యనగరమా!
నువ్వూ కామధేనువై
రంకె వెయ్యడం నేర్చుకున్నావా!
Comments
Post a Comment