Poet Joshuva on Women








జాషువా  స్త్రీ విముక్తి- ప్రత్యామ్నాయ దృక్పధం
చల్లపల్లి స్వరూపరాణి
                 

' భయకంపితమై హింసాపీడితమై వున్న ప్రజానీకానికి కవివాక్కు ఆశాకిరణాన్నందించాలి. మిట్టపల్లాల్ని సమంచేసి చూపాలి. హింసిత ప్రజల మూకీ భాష్పాలకు నోరిచ్చి రచ్చకెక్కించాలిఅని సాహితీ సృజన గురించి మహాకవి గుర్రం జాషువ వెలిబుచ్చిన అభిప్రాయం. మాటలు ఆయన రచనలకు, వ్యక్తిత్వానికీ చక్కగా సరిపోతాయి.

జాషువ 19 శతాబ్దపు చివరి రోజుల్లో 1895 సెప్టెంబర్ 28 తేదీన గుంటూరు జిల్లా వినుకొండ సమీపంలోని చాట్రగడ్డపాడులో మాదిగతల్లి మరియమ్మకు, యాదవ తండ్రి వీరయ్యకు జన్మించాడు. తండ్రివైపు నుంచి యాదవ సమాజం వీరి కులాంతర వివాహాన్ని ఆమోదించి కుటుంబాన్ని తమలో ఒకటిగా కలుపుకోలేదు కాబట్టి జాషువ తల్లివైపునుంచి మాదిగ గుర్తింపుతో మాదిగ వాడలోనే పెరిగి దళిత జీవితం తాలూకు అనుభవాలన్నింటినీ పొందాడు. ఆయన 1920 నుంచి 1970 వరకు సుమారు యాభై సంవత్సరాల పాటు సుదీర్ఘమైన సాహితీ సృజన చేశాడు.
జాషువ కవిత్వం రాయడం ప్రారంభించిన చారిత్రక సందర్భం గురించి యిక్కడ చర్చించడం అవసరం. కవిగా జాషువ ఎదిగి వచ్చిన సామాజిక, ఆర్ధిక, రాజకీయ నేపధ్యం ప్రత్యేకమైంది. జాషువ పుట్టిన నాటికి దేశం బ్రిటీష్ వలస పాలన కింద వుంది. సమాజం కులపరమైన వ్యత్యాసాలతో, మూఢనమ్మకాలతో, వెనుకబాటుతనంతో అస్తవ్యస్తంగా వుంది. అణగారిన దళిత కులాలు అంటరానితనం, అవిద్య, ఆర్ధికపరమైన దోపిడీ, వెట్టిచాకిరీ వంటి రుగ్మతలతో కనీసపు గుర్తింపు లేకుండా పసువులకంటే హీనమైన బతుకులు యీడుస్తున్నాయి. కులవృత్తులు వెనుకబడిన కులాలవారికి కొంత జీవనోపాధిని కల్పిస్తున్నప్పటికీ వారి సాంఘిక ఆర్ధిక పరిస్థితీ అంతంత మాత్రమే. అణగారిన వర్గాల స్త్రీల పరంగా జోగిని, బసివి, మాతంగి వంటి ఆచారాలు అమలులో వున్నాయి. యీ పరిస్థితుల్లో బ్రిటీష్ వలస పాలన అణగారిన వర్గాల పరంగానూ, స్త్రీలపరంగానూ కొంత ఆశాకిరణాలను వెదజల్లిందనుకోవాలి. బ్రిటీష్ వలస పాలకులు తమతోపాటు తీసుకొచ్చిన క్రైస్తవ మతాన్ని మిషనరీలు అణగారిన ప్రజలవద్దకు తీసుకెళ్తూ అదేక్రమంలో విద్యావ్యాప్తికి కూడా కృషి  చేశారు. బ్రిటీష్ పాలనలో యింగ్లీష్ విద్య వ్యాప్తి చెందడం, తద్వారా పాశ్చాత్య భావాలైన, వ్యక్తివాదం, స్వేచ్చ, సమానత్వం విద్యావంతులను ఆకర్షించాయి. ఇంగ్లీష్ విద్య ద్వారా పాశ్చాత్య భావాలటో ప్రభావితమైన వారిలో కొందరు సంఘ సంస్కరణ మార్గం పట్టారు. స్వేచ్చ,  సమానత్వం వంటి అభ్యుదయ భావాల వెలుగులో భారత సమాజంలో వున్న దురాచారాలను, రుగ్మతలను రూపుమాపాలని వారు పూనుకున్నారు. వారిలో బ్రాహ్మణీయ  వర్గాల వారైన రాజా రామ్మోహనరాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ వంటివారు తామున్న సమాజంలోని స్త్రీల సమస్యలైన సతీసహగమనం, బాల్య వివాహాలు,  నిర్బంధ వైధవ్యం వంటివి అంతరించాలని వారు  దృఢ సంకల్పంతో పనిచేసి సతీసహగమనాన్ని బ్రిటీష్ ప్రభుత్వం నిషేధించేవరకు పోరాడారు.  అయితే యీ సమస్యలు అతి తక్కువ శాతం స్త్రీలైన బ్రాహ్మణ, క్షత్రియ స్త్రీలకు సంబంధించినవి కాగా సమాజంలో అత్యధిక శాతం స్త్రీల సమస్యలైన అంటరానితనం, అవిద్య, వెట్టి చాకిరీ, జోగిని, బసివి, మాతంగి వంటి ఆచారాల మురికి కూపంలో, ప్రచ్చన్న వ్యభిచారంలో కూరుకుపోయిన స్త్రీల అభ్యున్నతి కోసం మహాత్మా జ్యోతీరావ్ ఫూలే, అంబేడ్కర్, పెరియార్ వంటివారు పాటు పడ్డారు. అయితే బ్రాహ్మణీయ కులాల సంస్కర్తల కృషిని పెద్దగా చేసి అణగారిన వర్గాలనుంచి వచ్చిన సంస్కర్తల తోడ్పాటును పరిశోధకులు పూర్తిగా విస్మరించడం జరిగింది. జాషువా తన కాలపు గాంధేయ వాద హరిజనోద్ధరణ వుద్యమమంతోనూ, అభ్యుదయ వాదంతోనూ ప్రభావితమైనట్టు తెలుస్తుంది. ఆయన సమకాలికులైన కవులు, రచయితలు సంప్రదాయవాదంతోనూ, కాల్పనికవాదంతోనూ, వుదారవాదంతోనూ యెక్కువగా రచనలు చేశారు. తెలుగులో విశ్వనాధ, దేవులపల్లి వెంకట  కృష్ణ శాస్త్రి,రాయప్రోలు సుబ్బారావు, చలం, శ్రీశ్రీ  వంటివారు విస్తృతంగా రచనలు చేశారు. వీరంతా బ్రాహ్మణ వర్గాల పండితులే కాక తమ రచనలలో కూడా విశ్రాంతి వర్గాల జీవితాన్నే చిత్రించారు. చలం, శ్రీశ్రీ  అభ్యుదయవాదులని అనుకొన్నప్పటికీ వీరు కుల సమస్యమీద రాసిన దాఖలాలు లేవు. జాషువా సంప్రదాయ శైలిలో పద్య కవిత్వాన్ని యెంచుకున్నప్పటికీ ఆయన రాసిన కావ్యాలన్నిటిలో అణగారిన వర్గాల జీవిత వ్యధలను పలికించాడు.          
జాషువా రచనల లో గబ్బిలం కావ్యం ఆయన ప్రాపంచిక దృష్టికి నిదర్శనం అని చెప్పొచ్చు. ఆయన యింకా ముంటాజ్ మహల్’, ‘కాందిశీకుడు’, ‘ముసాఫిరులు’, ’ఫిరదౌసి’, ‘కొత్తలోకం’, ‘క్రీస్తుచరిత్రవంటి కావ్యాలతో పాటు అనేక ఖండకావ్యాలను రచించాడు.జాషువాకు స్పష్టమైన ఆర్ధిక, సాంఘిక రాజకీయ దృక్పధం వున్నట్టు తెలుస్తుంది. కుల సమస్య తాలూకు అన్ని కోణాలను జాషువా తన రచనలలో శక్తివంతంగా చిత్రించాడు. బ్రాహ్మణీయ హిందూమతంలో వున్న హిపోక్రసీ, అది కాపాడే కులపరమైన అసమానతలు, మూఢ విశ్వాసాల వంటి రుగ్మతలను జాషువా తన రచనలన్నింటిలోనూ యెత్తి చూపాడు.
       జాషువా స్త్రీలపట్ల తన కాలపు రచయితల కంటే భిన్నంగా, హుందాగా వ్యవహరించాడు. ఆయన సమకాలిక కవులు, రచయితలు స్త్రీని వలపుల రాణిగా, చిలక పలుకుల చెక్కెరగా, పిండిబొమ్మగా చిత్రిస్తే జాషువా స్త్రీని రక్తమాంసాలున్న వ్యక్తిగా వాస్తవిక దృష్టితో చిత్రించాడు. జాషువా ఖండకావ్యాలలో అనాధ’, ‘వంచిత’, ‘స్వప్నకధ’, ‘ప్రబోధం’, ‘నేటినెలత’, వంతివి స్త్రీ అభ్యున్నతి పట్ల జాషువా దృక్పధాన్ని తెలియజేస్తాయి. 'నిన్నాకాశము దాకా పొగుడుచున్/నీ అంద చందాలతోవన్నెల్/ దీర్చి కవిత్వములు కొనుకున్/ పై పై పరామర్శలన్ నీవున్/ శరీరమున్ హృదయమున్/ ధరించి వధించి/ తన్నంబున్ బడవేయు సంఘముఅని స్త్రీ అందచందాలను పొగిడి ఆమె హృదయాన్ని గాయపరిచే పురుషుడి కపటత్వాన్ని విప్పి చెప్పాడు. స్త్రీలపై పితృస్వామిక అణచివేత కొనసాగినంత కాలం స్వాతంత్రపు రధం  ముందుకు సాగదని తేల్చి చెప్పాడు. పాతివ్రత్యాన్ని, దైవభక్తిని స్త్రీకి అంటగట్టి ఖరీదైన బట్టలు, నగలు ధరించి, షోకులు చేసుకుని సంతోషించమని పురుషుడు స్త్రీని మభ్యపెట్టి ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచాడని జాషువా అంటాడు. స్త్రీలలో అత్యంత పీడనకు, వివక్షకు గురయ్యే దళిత స్త్రీ దైన్యాన్ని 'అనాధఅనే ఖండకావ్యంలో 'యెవ్వడారగించు నమృత భోజనంబున/ గలిశెనో యీ లేమ గంజిబువ్వ/ యెవ్వడు వాసము సేయు శృంగార సౌధాన/  మునిగెనో యిన్నారి పూరి గుడిసెఅని ఆమె పేదరికం  వెనుక దాగివున్న గొప్పవారి ఆర్ధిక దోపిడీని బయట పెట్టాడు జాషువా. 
అంబేడ్కర్ న్యాయశాఖ మంత్రిగా స్త్రీలకు చట్టపరమైన హక్కులు కల్పిస్తూ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన హిందూకోడ్ బిల్లుకు అగ్రకుల నాయకుల మద్దత్తు లేకపోగా వారు దానికి వ్యతిరేకంగా పనిచేయడంతో అది వీగిపోవడంపై కూడా జాషువా స్పందించాడు. 'పరదాలో నిన్ను దాచిపెట్టుకున్/ స్వాతత్ర్యంబావశ్యకం/ బరవిందాక్షులకంచువీధుల/ నుపన్యాసాలు సాగించు టక్కరులై/ హైందవకోడు బిల్లుకు పక్కా ద్వేషులై/ నిల్చుచుందురు విద్యా కుసుమంబు లేని/ యలివేణుల్ గానరీ మర్మముల్అని వొక పక్క స్త్రీకి స్వతంత్ర్యం కావాలంటూనే వారి హక్కుల సాధనకై ప్రవేశపెట్టిన హిందూ కోడ్ బిల్లును అడ్డుకునే టక్కరితనం పై జాషువా కన్నెర్ర చేశాడు. ఆచరణలో స్త్రీ స్వేచ్చని అడ్డుకునే 'సంస్కర్తల రెండునాల్కల ధోరణిని జాషువా దుయ్యబట్టాడు.
జాషువా ' ప్రబోధం, 'నేటినెలత, ' వీరచానమ్మ, ' వీరకుమారివంటి ఖండ కావ్యాలలో స్త్రీల పరంగా అభ్యుదయకరమైన అంశాలను పేర్కొన్నాడు. ' వీరకుమారిలో అంతరిక్షయానం చేసిన రష్యన్ మహిళ వలెంటినా తెరిష్కోవా సాహసాన్ని కీర్తించి 'నేటినెలతలో 'గ్రహించినది నేటి కామినీ తిలకంబు/ బురఖాల కెరయైన బుద్ధి బలము అని స్త్రీలు చైతన్యవంతమవ్వడాన్ని గుర్తించాడు. 'పరదా దాటి స్వతంత్ర్య వీధుల/ పదాబ్జంబూని క్రీడింపుమాఅంటూ పరదాలను చేదించి బైటకు రమ్మని జాషువా స్త్రీలకు పిలునిచ్చాడు.
జాషువా పరిణితి చెందిన కవి. సుదీర్ఘకాలం పాటు సాహితీ సృజన చేసిన ఆయన తన కాలం నాటి సాహితీ వేత్తలకంటే భిన్నమైన ప్రాపంచిక దృక్పధంతో దుఖితులైన దళితులు, స్త్రీల ఆర్తనాదాలను తన కవిత్వంలో కరుణ రసాత్మకంగా పలికించాడు. దళితుల కొరకు వొక సామాజిక వుద్యమం లేని రోజుల్లో జాషువా కవిత్యం లోటు తీర్చిందని పరిశీలకులు భావిస్తున్నారు. కుల, మత, వర్గ, లింగపరమైన వివక్ష, అసమానతలపైన తన కవిత్వాన్ని సంధించి అట్టడుగు మనిషిని ఆయుధంగా మలిచిన మహాకవి గుర్రం జాషువా యీనాటి అస్తిత్వ సాహిత్య వుద్యమాలకు నేపధ్యమయ్యాడు. 

(సెప్టెంబర్ 28 జాషువా జయంతి)            
          


    

Comments

Popular posts from this blog

Nomadic Tribe- Chenchu

My Poetry

Sahoo Maharaj- essay