Politics of Statues





విగ్రహం మాట్లాడే భాష
చల్లపల్లి స్వరూపరాణి

                
     
          తరతరాలుగా కులవివక్షకు, శ్రమదోపిడీకి, అమానవీయతకు  గురైన దళిత సమాజం అంబేడ్కర్ కృషి ఫలితంగా గుండెలనిండా ఆత్మగౌరవాన్ని పీల్చుకుంటూ ఆయన్ని తమ అస్తిత్వ ప్రతీకగా భావిస్తుంది. అందులో భాగంగానే అంబేడ్కర్ విగ్రహాన్ని దళితులు తమ వాడలలో ప్రతిష్టించుకుని తమలో పెంపొందుతున్న ఆత్మస్థైర్యాన్ని చాటుకుంటున్నారు. గుర్తింపుకు నోచుకోకుండా మూలకు నెట్టివేయబడ్డ మనుషులు సభ్య సమాజంలో తమ వునికిని  చాటుకునే ప్రయత్నంలో భాగమే అంబేడ్కర్ విగ్రహ ప్రతిష్ట. అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుకు చాలా నేపధ్యం వుంది. మొట్టమొదటిసారిగా బ్రహ్మేష్. వి. వాఘ్ అనే శిల్పశాస్త్ర పండితుడు అంబేడ్కర్ కాంస్య విగ్రహాన్ని చెక్కాడు. దీన్ని 1966 లో పార్లమెంట్, లోక్ సభ హాలుకి ఆఘ్నేయ దిశలో అధికారికంగా  ప్రతిష్టించడం జరిగింది. ఒక చేత్తో రాజ్యాంగ ప్రతిని పట్టుకుని మరో చేతి చూపుడు వేలును ముందుకు చాపిన భంగిమలో వుండే బ్రహ్మేష్ చెక్కిన అంబేడ్కర్ విగ్రహ నమూనా తర్వాత దేశవ్యాప్తంగా బహుళ ప్రచారం పొందింది. యిప్పుడు తయారు చేసే విగ్రహాలన్నీ 1966 నాటి  నమూనాతోనే వుంటాయి. అంబేడ్కర్ విగ్రహాన్ని లోక్సభలో ప్రతిష్టించినాక 1970 దశకం నుంచి గ్రామాలలోని దళిత వాడలలో ప్రతిష్టించడం వూపందుకుంది.
    
      గ్రామాలలో అంబేడ్కర్ విగ్రహ ప్రతిష్ట అనేది ఒకవైపు దళిత సమూహంలో ఆత్మగౌరవాన్నీ, మనోబలాన్ని పెంపొందిస్తే పెత్తందారీ కులాలలో ఒకరకమైన అభద్రతా భావాన్ని తీసుకొస్తుంది. అంబేడ్కర్ విగ్రహాన్ని గ్రామాలలో దళిత వాడలముందే ప్రతిష్టించుకున్నప్పటికీ అక్కడి పెత్తందారీ కులాల ఆధిపత్యానికి తరతరాలుగా ఇతరులనుంచి లభించే ఆమోదం, దళితులపై నియంత్రణ కోల్పోతామనే భయం పట్టుకుని వారు దళితులపై దాడి చెయ్యడానికి  ప్రేరేపిస్తుంది.

        గతంలో ఆధిపత్య భూస్వామ్య కులాలు దళ్తులపై నిరాటంకంగా కొనసాగించే దాష్టీకం, అణచివేత విధానాలకు అదనంగా అంబేడ్కర్ విగ్రహం వచ్చాక కొత్తరకం దాడులు ప్రారంభమయ్యాయి. దాడులకు కూడా చాలా పెద్ద చరిత్ర వుంది. 1978 ఏప్రిల్ 14 తేదీన అంబేడ్కర్ జయంతి వుత్సవాలలో భాగంగా ఆగ్రాలోని దళిత జాతవ కులస్తులు తమ వాడలో అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించుకోవాలని పూనుకున్నారు. వారు విగ్రహాన్ని తయారు చేయించిన ప్రదేశం నుంచి దానిని ఏనుగు మీద పెట్టుకుని తమ వాడకు తీసుకెళ్ళడం అక్కడి పెత్తందారీ కులాల వారికి కంటగింపుగా మారింది. విగ్రహాన్ని తమ నివాసాల మీదుగా తీసుకుకురాకూడదని, ఒక్కసారి తీసుకెళ్ళనిస్తే ప్రతి సంవత్సరం అల్లర్లు జరిగే అవకాశం వుందని వూరేగింపు దారి మళ్ళించాలని అగ్రకులాలు వాదించాయి. వారు యింకా జరగని అల్లర్లను సాకుగా చూపించి అధికారులను వొప్పించి తమ పురవీధులగుండా అంబేడ్కర్ విగ్రహం వెళ్ళకుండా అడ్డగించారు. యీ సందర్భంగా పెద్ద ఎత్తున అలజడి జరిగింది. జాతవులు పోలీసుల జోక్యాన్ని కూడా ప్రతిఘటించారు. యీ సంఘటనలో వందలాది మందిని పోలీసులు అరెస్ట్ చేస్తే, జరిగిన హింసలో పదిమంది దళితులు చనిపోయారు. చివరకు మిలటరీ దళాలు దిగినాకగానీ అల్లర్లు సద్దుమణగలేదు. 

        2017 సంవత్సరం ప్రారంభంలో సుదీర్ఘమైన విరామం తర్వాత ఉత్తర ప్రదేశ్ లో ఠాకూర్ కులస్తుడైన బి.జె.పి అభ్యర్ధి యోగి ఆధిత్యనాధ్ ముఖ్యమంత్రి అయ్యాక ఠాకూర్లు తమ కులాధిక్యతను తిరిగి ప్రదర్సించుకోడానికి అక్కడి దళితులపై దాడులు మొదలు పెట్టారు. యీ క్రమంలో షబ్బీర్ పూర్ లో 2017, ఏప్రిల్ 14 దళితులు చేపట్టిన అంబేడ్కర్  విగ్రహ  ప్రతిష్ట కార్యక్రమం ఠాకూర్ల అసహనానికి కారణమయ్యింది. పశ్చిమ ఉత్తర ప్రదేశ్ లోని సహరన్ పూర్ నగరానికి దగ్గరలో వున్న షబ్బీర్ పూర్ గ్రామంలో అంబేడ్కర్ విగ్రహ ప్రతిష్టను ఠాకూర్లు అడ్డుకుని దానికి స్థానిక అధికారులనుండి పాలనా పరమైన అనుమతులు లేవనే కారణం చూపారు. దీంతో ఠాకూర్లకు, దళితులకు ఘర్షణ ప్రారంభమయ్యింది. తర్వాత ఠాకూర్లు మధ్య యుగాలలో రాజపుత్ర వీరుడిగా భావించే మహారాణా ప్రతాప్ సింగ్ జ్ఞాపకార్ధం ఒక వూరేగింపును ప్రారంభిస్తే అంబేడ్కర్ విగ్రహాన్ని అడ్డగించినప్పుడు భంగపడి అసంతృప్తికి గురైన దళితులు ఠాకూర్ల వూరేగింపుకు కూడా సాంకేతికంగా అభ్యంతరాలున్నాయని  దానిని అడ్డుకున్నారు. తర్వాత గత మే నెలలో ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి షబ్బీర్ పూర్ ను సందర్శించారు . ఆమె పర్యటన సందర్భంగా కూడా అక్కడి ఠాకూర్లకు దళితులకు ఘర్షణ చెలరేగి అందులో ఒక వ్యక్తి మరణించగా అనేకమంది తీవ్రంగా గాయపడ్డారు.  
  
    ఆంధ్ర ప్రదేశ్ లో యిటీవల జరిగిన గరగపర్రు సంఘటన అధిపత్య కులాలకు, దళితులకు అంబేడ్కర్ విగ్రహ ప్రతిష్ట పరంగా చోటుచేసుకుంటున్న అనేక వరుస ఘర్షణలలో తాజా సంఘటనగా భావించవచ్చు. పశ్చిమ గోదావరి  జిల్లా పాలకోడేరు మండలంలోని గరగపర్రు గ్రామ దళితులైన మాలలు అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించుకోవడం, దానికి అక్కడి ఆధిపత్య కులస్తులైన రాజులు అభ్యంతరాలు పెట్టి చివరకు విగ్రహాన్ని మాయం చెయ్యడంతో  యిరువర్గాల మధ్య ఘర్షణ మొదలై అది మాలలను వెలివెయ్యడం దాకా వెళ్ళింది. వారిని గ్రామంలోని అన్ని కార్యక్రమాల నుంచి, పనుల నుంచి బహిష్కరించడమే కాకుండా యితరులు వారితో మాట్లాడినా, వారికి సహకరించినా వారికి కూడా జరిమానా విధిస్తామని అక్కడి ఆధిపత్య కులస్థులైన రాజులు ఒక అనధికార శాసనాన్ని జారీ చెయ్యడం జరిగింది. దీంతో అక్కడి దళితులు నిత్యావసర వస్తువులు, వైద్యం వంటివి దొరకక కూలీపని చేద్దామంటే పని దొరకక ఎంతో అవస్థ పడ్డారు. గ్రామంలో అత్యధిక శాతం భూములు, ఫాక్టరీలు  అధిపత్య కులాల చేతిలో వుండడమే కాకుండా వారికి కౌలుకిచ్చిన భూములను కూడా దళితుల నుంచి వెనక్కి తీసుకోవడంతో గరగపర్రు దళితులు సామాజికంగానూ, ఆర్ధికంగానూ ఎంతో దుర్భర స్థితిని అనుభవించారు. మూడునెలల తర్వాత దళితుల వెలి అంశం వెలుగులోకి వచ్చింది. గరగపర్రు మాల బాధితులకు  మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాలు తరలి వచ్చి అంబేడ్కర్ విగ్రహాన్ని వున్న చోటు నుంచి తొలగించడానికి కారకులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. వుద్యమం తీవ్ర రూపం దాల్చడంతో పోలీసులు ఘటనకి భాధ్యులైన వారిని అరెస్ట్ చెయ్యక తప్పలేదు. అయితే దళితులైన మాలలకు వ్యతిరేకంగా రాజులు గ్రామంలోని యితర పధ్నాలుగు  కులాలను కూడగట్టి వారిచే గ్రామంలో అన్ని కులాల వారు ఎంతో సఖ్యంగా వుంటారని మీడియాలో చెప్పించారు. పెత్తందారీ కులస్థులైన దోషులకు వంత పాడిన వారిలో వెనుకపడిన కులాల వారూ, దళిత వుప కులస్థులైన మాదిగలు కూడా చేరడం పెత్తందారీ కులస్థుల మనువాద ఎత్తుగడగా భావించాలి. తర్వాత గరగపర్రులో ఆందోళన సద్దుమణిగి శాంతి నెలకొంటుంది అనుకునే సమయంలో అంబేడ్కర్ విగ్రహాన్ని తొలగించడం అనే  విషయంలో ప్రధాన సాక్షిగా వున్న యాకోబు అనే దళితుడు రోడ్డు ప్రమాదంలో అనుమానాస్పద  స్థితిలో మరణిచడంతో మళ్ళీ గ్రామంలో వుద్రిక్త  పరిస్థితి ఏర్పడింది. 
        
         దళితవాడలో అంబేడ్కర్ విగ్రహ ప్రతిష్ట అనేది కేవలం విగ్రహ మాత్రమైనదిగా కాకుండా ఒక రాజకీయ చర్యగా అటు దళితులు యిటు ఆధిపత్య కులాల వారు పరిగణించడం జరుగుతుంది. తరతరాలుగా అంటరానితనం, వెట్టిచాకిరీ, వెలివేతలు, అవమానాలను భరిస్తూ వచ్చిన దళితులు అంబేడ్కర్  అనే అగ్నిలో తమపై రుద్దబడిన న్యూనతను  దహించుకుంటున్నారు.  ఆయన అందించిన రాజ్యాంగ  పరమైన హక్కులను అవకాశాలను అందిపుచ్చుకుని తాము కూడా యితరులతో సమానమేననే  ఆత్మగౌరవ ప్రకటన చెయ్యడం ప్రారంభించారు. అందులో భాగంగానే తమ స్ఫూర్తి ప్రధాత అయిన అంబేడ్కర్ విగ్రహాన్ని గ్రామాలలోని తమ వాడలముందు భాగంలో ప్రతిష్టించడం జరుగుతుంది. యీ చర్య ఎదిగి వచ్చిన దళిత ఆత్మగౌరవానికి గుర్తుగా భావించవచ్చు. గతంలో హరిజన వాడలుగా పిలువబడిన దళిత వాడలు అవమానానికీ న్యూనతకీ ప్రతీకలుగా వున్న 'హరిజనపదాన్ని చెరిపేసుకుని యిప్పుడు 'అంబేడ్కర్ కాలనీలుగా మారడం వెనుక అంబేడ్కర్ చూపిన వెలుగులో ' పిడికెడు ఆత్మ గౌరవం కోసం'  దళిత సమాజం చేసిన నిరంతర  పెనుగులాట వుంది.   

       గతంలో గ్రామీణ కులసమాజంలో పెత్తందారీ కులాలు దళితుల పెళ్ళి వూరేగింపులనూ, పండుగ రోజు జరుపుకునే దేవుడి వూరేగింపులనూ అడ్డుకుని వారిపై భౌతిక దాడులకు పాల్పడిన అనేక సంఘటనలు వున్నాయి. ఎంత సేపటికీ దళితులు తమ కాళ్ళ కింద చెప్పులా పడి వుండాలని భావించే పెత్తందారీ కులాలు వారు తెల్ల బట్టలు కట్టుకున్నా, చెప్పులు వేసుకున్నా వారిపై దాడికి దిగేటువంటి క్రూరత్వాన్ని ప్రదర్సించిన సందర్భాలు ఎన్నో వున్నాయి. గ్రామాలలో దళితులకు అతి తక్కువ మొత్తంలో భూములు యితర  ఆదాయ వనరులు వుండడం చూస్తాం. చిన్న పాటి పొలాలకు కూడా దళితులు యజమానులు కావడం యిష్టంలేని అక్కడి పెత్తందారీ కులాలవారు దళితులు తమ భూమిని సాగు చేసుకోనివ్వకుండా రకరకాలుగా అడ్డుకుంటారు. వారి పొలల్లోకి దారి యివ్వకుండా, నీరు పారనివ్వకుండా, కొన్ని సార్లు వారి పంట పొలాల్లోకి గేదెలను తోలు చేతికొచ్చిన పంటను  నాశనం చేస్తూ వుంటారు. అంతంత  మాత్రంగా వుండే దళితుల ఆర్ధిక పరిస్థితి మెరుగు పడకుండా అడుగడుగునా అడ్డంపడి వారు ఎప్పటికీ  సాంఘిక, ఆర్ధిక పరాధీనతలోనే వుండాలని పెత్తందారీ కులాల  వుద్దేశం.  అయితే దళితులపై వారు గతంలో చేసిన దాడులకూ, అంబేడ్కర్ విగ్రహ ప్రతిష్ట సందర్భంగా చేస్తున్న దాడులకూ స్పష్టమైన తేడా వుంది.

       అంబేడ్కర్ చూపుడు వేలు యీ సమాజంలో వున్న అసమానతలను వేలెత్తి చూపుతూ ప్రజల మధ్య వుండవల్సిన సామాజిక ప్రజాస్వామ్యాన్ని,  సామరస్యాన్ని, సౌభ్రాత్రుత్వాన్ని  గుర్తు చేస్తుంది. సామాజిక, ఆర్ధిక రంగాలలో సమానత్వం,  ప్రజాస్వామ్యం వూండాలని అటు మేధోపరంగానూ  యిటు  కార్యరంగంలో  వుద్యమకారుడిగానూ  అన్ని వైపులనుంచి పోరాటం చేసిన అంబేడ్కర్ ఎప్పుడూ అణచివేతదారుల గుండెల్లో గుబులు పుట్టిస్తూనే వుంటాడు.'నాదేశ భక్తి అన్ని రకాల గుత్తాధిపత్యాలను  వ్యతిరేకిస్తుందిఅని చెప్పిన ధీశాలి రకరకాల గుత్తాధిపత్యాల కింద నలిగి నజ్జయ్యే ప్రజలకు ఆత్మ బంధువుకాక  ఏమౌతాడు? సమకాలీన ప్రపంచంచంలో అంబేడ్కర్ భావాల ప్రాసంగికత నానాటికీ  పెరగడం, ఆయన ప్రపంచం మెచ్చిన మేధావిగా, పోరాట యోధుడుగా గుర్తింపు పొందడం, అన్నింటి కంటే ఆయన అణగారిన ప్రజల ఆత్మగౌరవ పతాక అవ్వడం అనేది గ్రామీణ భూస్వామ్య పెత్తందారీ కులాలకు చెంప పెట్టుగా మారింది. దీంతో వారు అంబేడ్కర్ విగ్రహ ప్రతిష్టని అడ్డగించడానికి  సాకులు వెదుకుతూ  ప్రతిఘటించిన వారిపై దాడులకు పాల్పడుతున్నారు.  

       దళితులు అంబేడ్కర్ విగ్రహాన్ని  ప్రతిష్టించుకోవడం అనేది  వారి మనోభావాలు, వారి సామాజిక రాజకీయ ఆకాంక్షల వ్యక్తీకరణ అని అంగీకరించడానికి సిద్దంగా  లేనివారు విగ్రహ ప్రతిష్టని ఒక సాంకేతిక సమస్యగా, ఘర్షణలకు దారితీసే శాంతి భద్రతల అంశంగా కుదిస్తారు. గ్రామాలలో అనాయాసంగా పుట్టుకతో తమకు సంక్రమించిన ఆధిపత్యాన్ని అనుభవించే పెత్తందారీ కులాలవారు, వారి స్త్రీలు గతంలో గ్రామంలో వివిధ కులస్తులంతా అన్నదమ్ముల్లా  పొరపొచ్చాలు లేకుండా కలిసి వున్నట్టు, యిప్పుడీ విగ్రహం మూలకంగా గ్రామంలో అనవసరమైన గొడవలు వస్తున్నట్టు సన్నాయి నొక్కులు నొక్కడమే కాకుండా కొన్నిసార్లు తమ  చెప్పుచేతల్లో వుండే దళిత చెంచాలతో కూడా అదేమాట చెప్పిస్తారు. యీ విషయంలో మీడియా కూడా అదే రకమైన సన్నాయి నొక్కులు నొక్కడం గమనార్హం. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి గా వున్నప్పుడు మాయావతి రాష్ట్రవ్యాప్తంగా గౌతమ బుద్ధుడు, మహత్మా ఫూలే, అంబేడ్కర్, సాహూ మహరాజ్, పెరియార్ వంటి బ్రహ్మణేతర సామాజిక విప్లవకారుల విగ్రహాలు నిర్మించి వారి స్మృతి చిహ్నాలు ఏర్పాటు చేసినప్పుడు ఆమె అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు దుమ్మెత్తిపోసింది. సందర్భంగా మనువాద పార్టీల నుండి విప్లవ పార్టీలవరకు అందరూ మాయావతి  విగ్రహ నిర్మాణం అనేదాన్ని ప్రజాధనాన్ని  వృధా చెయ్యడంగా  అవినీతికరమైన చర్యగా విమర్శించారు  తప్ప అది అణగారిన ప్రజల ఆత్మగౌరవ ప్రకటనగా భావించకపోవడం తెల్సిందే.

      యిప్పుడు అంబేడ్కర్ విగ్రహాలు దేశవ్యాప్తంగా గ్రామాల్లోని దళిత వాడల్లోనే కాకుండా పట్టణాలలోని నాలుగు రోడ్ల కూడళ్ళలో, విశ్వవిద్యాలయాలలో, పార్లమెంట్, ఐక్యరాజ్య సమితి కార్యాలయాలలోకి  కూడా వచ్చాయి. బహుశా! దేశంలో యితర నాయకుల విగ్రహాలతో పోలిస్తే అంబేడ్కర్ విగ్రహాల సంఖ్యే ఎక్కువ కావచ్చు. ప్రస్తుతం అంబేడ్కర్ కేవలం దళిత ఐకాన్ కాదు. ఆయన ఇండియన్ ఐకాన్ గానూ, అసమానతలపై ఎక్కుపెట్టిన విల్లుగానూ, మండే అగ్నిగానూ మారాడు. మూకీ భాష్పాలకు నోరిచ్చిన ధీరుడు. తాను జీవించివున్నప్పుడు అణగారిన వర్గాలకు మానవ హక్కులు సాధించడానికి వ్యవస్థ తోనూ, అధికార పీఠాలతోనూ నిరంతరం పోరాడిన అంబేడ్కర్ యిప్పుడు కేవలం విగ్రహ మాత్రుడు కాడు. ఆయన వూరూ వాడల కూడలిలో, కరుడు కట్టిన గ్రామీణ కులసమాజపు తలవాకిట్లో నిలబడి భారత సమాజంలోని వైరుధ్యాల గురించి స్వయంగా మాట్లాడుతున్నాడు.     

(11,ఆగస్ట్, 2017, ప్రజాశక్తి )

           




Comments

Popular posts from this blog

Nomadic Tribe- Chenchu

My Poetry

Sahoo Maharaj- essay