Article on Shiek Msood Baba





ఉద్యమాన్ని  శ్వాసించిన  షేక్ మసూద్ బాబా
చల్లపల్లి స్వరూపరాణి

శ్రీకాకుళ సాయుధ పోరాట యోధుడు, ప్రజా వుద్యమాల పట్ల గొప్ప ప్రేమతో ఆశతో ప్రత్యామ్నాయ రాజకీయాలు నిర్మించడానికి తపన పడిన షేక్ మసూద్ బాబా గారు యీ నెల అయిదవ తేదీన తీవ్ర అనారోగ్యంతో విజయవాడలో మృతి చెందారు. ఆయన జీవితం గొప్ప నిజాయితీకి, నిబద్ధతకీ నిలువెత్తు ప్రతీక.  ‘బాబా’ గా అందరికీ చిరపరిచితుడి గా వున్న మసూద్ బాబా గారు 1946 లో అమీనాబీ, మస్తాన్ దంపతుల మొదటి బిడ్డగా జన్మించారు. వీరి స్వస్థలం గుంటూరు జిల్లా రొంపిచర్ల.  ఆయన తల్లిదండ్రులు జీననోపాధిని వెదుక్కుంటూ వచ్చి బాబా గారి చిన్నతనంలోనే విజయవాడలో స్థిరపడ్డారు. ఆయనకి నలుగురు తమ్ముళ్ళు, యిద్దరు చెల్లెళ్ళు. వారి తోబుట్టువులు, బంధువులు విజయవాడ, మచిలీపట్నం పరిసర ప్రాంతాలలోనే యెక్కువగా స్తిరపడ్డారు. అయిదో క్లాసు వరకూ చదువుకున్న ఆయన చిన్నతనం నుంచే మార్క్సిజం పట్ల అభిమానాన్ని పెంచుకున్నారు. ఆయన చిన్నతనంలో  విజయవాడ సూర్యారావు పేట లోని బెల్లం శోభనాద్రి గ్రంధాలయంలో సోవియట్ పుస్తకాల్లో బొమ్మలు చూడ్డానికి వెళ్ళేవారు. ఆవిధంగా క్రమంగా ఆయన కమ్యూనిస్ట్ సాహిత్యం చదవడానికి అలవాటు పడ్డారు. ఆయన మొదట వివాహం చేసుకోవాలని అనుకోకపోయినా తర్వాత వుద్యమంలో నష్టపోయిన కుటుంబానికి చెందిన బోయ కులానికి చెందిన ‘శీలం సౌదమణి’ గారిని 1987 లో వివాహం చేసుకున్నారు. వారి పెళ్ళికి ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకులు కొల్లా వెంకయ్య  పెద్దగా వ్యవహరించారు.


 మసూద్ బాబా టాక్సీ డ్రైవర్ గా తన కెరీయర్ ప్రారంభించి కార్మిక సంఘాలలో క్రియాశీలకంగా వుండేవారు. విజయవాడలో ‘చిన్నకార్ల వర్కర్స్ యూనియన్’ వొక ముఖ్యమైన కార్మిక సంఘం గా గుర్తింపు పొందింది. ఆయన వుమ్మడి కమ్యూనిస్ట్ వుద్యమం చీలినాక యేర్పడిన CPI(ML)లో K.G.సత్యమూర్తి(శివసాగర్), కొండపల్లి  సీతారామయ్య, రవూఫ్, నాగభూషణం పట్నాయక్, ముక్కు సుబ్బారెడ్డి, అప్పలసూరి, చౌదరి తేజేస్వర్రావు మొదలైన ప్రముఖ నాయకులతో కల్సి పనిచేశారు. 1967-68 సంవత్సరాలలో నక్సల్బరీ సంఘీభావ కమిటీ యేర్పడినప్పుడు బాబాగారు క్రియాశీలకంగా పనిచేసిన ‘చిన్నకార్ల వర్కర్స్ యూనియన్ శ్రీకాకుళ పోరాటంలోకి వెళ్ళింది. వుద్యమంలోకి వెళ్ళినప్పటికీ ఆయనకి పద్దెనిమిది సంవత్సరాలు మాత్రమే.  ఆయన శ్రీకాకుళం వుద్యమాన్ని విస్తరించాలనే వుద్దేశ్యంతో తూర్పు గోదావరి జిల్లలో తిరుగుతున్నప్పుడు అరెస్టయ్యారు. బాబా గారు పార్వతీపురం కుట్ర కేసులో 77 వ నిందితుడిగా  అరెస్టై  విశాఖపట్నం, కోరాపుట్, జయపూర్, మల్కన్ గిరి, విజయవాడ, బందరు మొదలైన జైళ్ళలో యెనిమిది సంవత్సరాలు రిమాండ్ ఖైదీగా శిక్ష అనుభవించాక పోలీసుల నిర్బంధాల వలన సుమారు యిరవై సంవత్సరాలు రహస్య జీవితం గడిపాడు. విశాఖ జైలులో వున్నప్పుడు K.G సత్యమూర్తి గారితో ఆయనకు సన్నిహిత సంబంధం యేర్పడింది. బాబా శివసాగర్ కి వీరాభిమాని. వుద్యమం బయట యెక్కువమందికి ఆయన శివసాగర్ మిత్రుడుగానే పరిచయం. ఆయనకి  ప్రజల వైద్యుడు, ప్రముఖ కార్డియాలజిస్ట్, సామాజిక వుద్యమకారుడైన డాక్టర్. ఎం. ఎఫ్. గోపీనాద్ తో కూడా మంచి స్నేహ సంబంధాలున్నాయి.  


అప్పటి వుమ్మడి తెలుగు రాష్ట్రంలో చారుమజుందార్ ను గుత్తికొండ బిలంలో కలుసుకోవడం దగ్గర నుంచి కొండపల్లి సీతారామయ్యతో కల్సి పీపుల్స్ వార్ పార్టీని స్థాపించిన నక్సల్బరి సిద్ధాంతకర్త, మహాకవి కె.జి.సత్యమూర్తి(శివసాగర్) సాహచర్యంలో మసూద్ బాబా మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని అధ్యయనం చేశాడు. అప్పట్లో జైలులో ఖైదీలకు సౌకర్యాలు అంతంత మాత్రంగానే వుండేవి. అరకొర సౌకర్యాల వలన ఖైదీలుగా వున్నవారిని  అనారోగ్యం పట్టి పీడించేది. బాబా సత్యమూర్తి, యితర మిత్రులతో కల్సి జైలు సంస్కరణల కోసం లోపల నుంచి వుద్యమం చేశాడు. ఖైదీలు తమ వంట తామే చేసుకునే అవకాశం కల్పించి జైలులో లైబ్రరీ యేర్పాటు చెయ్యాలనే తమ డిమాండ్ ను పోరాడి సాధించుకున్నారు.  

    
మసూద్ బాబా మార్స్కిస్ట్ వుద్యమం పట్ల కొండంత విశ్వాసంతో, గొప్ప విప్లవ స్వప్నంతో నడిచే వుద్యమంలా వుండేవాడు.  ఆయనకి చాలా కాలం వరకు వర్గ స్పృహ తప్ప కుల నిర్మూలనా స్పృహ వుండేది కాదు. యెప్పుడూ తనని తాను వొక కార్మిక వర్గపు వుద్యమకారుడిగానే భావించే బాబా నలభై యేళ్ళు దాటాక ‘సౌదామణి’ గారిని వివాహం చేసున్నాడు. అయితే తమ బంధువులు ముస్లిం ‘నిఖా’ పద్ధతిలో కార్యక్రమాన్ని యేర్పాటు చెయ్యబోతే సున్నితంగా తిరస్కరించాడు.  ముస్లిం గా పిల్లలకు వుర్దూ భాష నేర్పలేదు. యే రకమైన సామాజిక అస్తిత్వాన్ని చాటుకోలేదు. ఆయన తన కొడుక్కి పెట్టిన ‘ఆజాద్ ముస్తాక్’ అనే పేరు విప్లవోద్యమంలోని  వొకానొక సహచరుడికి జ్ఞాపకం గా మాత్రమే పెట్టుకున్నాడు తప్ప ముస్లిం అస్తిత్వ స్పృహతో కాదు. తన యిద్దరు చెల్లెళ్ళు బాబా గారి అమ్మాయికి ‘ఆయేషా’ అనే పేరు పెట్టారు. అయితే సత్యమూర్తి గారు దళిత వుద్యమం వైపు వచ్చాక బాబా గారికి క్రమంగా కొంత అస్తిత్వ స్పృహ వొచ్చిందని చెప్పొచ్చు. సత్యమూర్తి  బహుజన సమాజ్ పార్టీ లో చేరడాన్ని మొదట వ్యతిరేకించిన బాబా సత్యమూర్తి యిచ్చిన వివరణతో సంతృప్తి పడ్డాడు. క్రమంగా అంబేడ్కర్ ని అధ్యయనం చెయ్యడం ఆరంభించాడు. యింతకాలం అంబేడ్కర్ ని తెలుసుకోలేకపోవడం వలన సైద్ధాంతికంగా చాలా నష్టపోయామని ఆయన అంటుండేవాడు. తర్వాత దశలో వొక ముస్లిం గా ఆయనలో మైనారిటీ స్పృహతో పాటు వర్గ స్పృహ, కులనిర్మూలనా స్పృహ పెరిగాయి. కారంచేడు దళితులపై కమ్మ కులస్తుల దాడి జరిగినప్పుడు కుల సమస్యపైన సీరియస్ గా ఆలోచించడం మొదలుపెట్టాడు. సత్యమూర్తి విప్లవోద్యమం నుంచి బయటకొచ్చాక మొదట కల్సుకున్నది బాబానే. ఆయన బతుకుదెరువుకోసం పాత అంబాసిడర్ కారు కొనుక్కుని దాని బాడుగతోనే జీవితాన్ని వెళ్ళదీశాడు. అనేకమంది వుద్యమకరులకు తనయింట్లో వసతి కల్పించి వున్నదాంట్లో భోజనం పెట్టి అప్పుడప్పుడూ చార్జీలకు పదో పరకో యిచ్చి పంపేవాడు.  సత్యమూర్తి గారిని బాబా తన కారులో రాష్ట్రమంతా తిప్పాడు. సత్యమూర్తి ముదినేపల్లి నియోజకవర్గం నుంచి 1994 లో యెలక్షన్లలో పోటీచేసినప్పుడు ఆయన పూర్తిగా బాడుగ పని మానేసి సత్యమూర్తి గారి యెన్నికల ప్రచారానికే కారుని వినియోగించాడు.


రహస్య జీవితం నుంచి బయటకొచ్చాక కూడా మసూద్ బాబా వొకరకంగా  వుద్యమ జీవితాన్నే గడిపినట్టు భావించాలి. ఆయన విజయవాడ సున్నపు బట్టీల సెంటర్ లోనూ, వుండవల్లి దగ్గర నులకపేట లోనూ తనలాగే యిల్లు లేని పేదలు, పాడుబడిన స్మశాన స్థలాలు, కొండపక్కన క్వారీ స్థలాలలో తాత్కాలికంగా గుడిసెలు వేసుకుని జీవించే వారికి  పట్టాలు వొచ్చేదాకా పోరాడి సాధించి పెట్టాడు. ఆ స్థలం లోనే లైబ్రరీ నిర్మాణం కోసం కొంత స్థలాన్ని కేటాయించి అక్కడ తన వుద్యమ సహచరుల జ్ఞాపకార్ధం ‘అమరవీరుల గ్రంధాలయం’ అనే పేరున లైబ్రరీ యేర్పాటు చెయ్యాలని యెన్నో ప్రయత్నాలు చేశాడు. అలాగే అమరవీరుల స్థూపం దగ్గర ప్రతి సంవత్సరం మేడే నాడు జెండా యెగరేసి అక్కడి ప్రజలతో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నాడు. విజయవాడ సున్నపు బట్టీల సెంటర్  అంటే  వుద్యకారుల కాలనీ అనుకునే పరిస్థితి వుండేది. అందులో బాబా యిల్లు వుద్యకారులకు నెలవు అని భావించేవారు. అయితే బాబా కొంతకాలంగా అంబేడ్కర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను నిర్వహిస్తూ పిల్లల చేత ఆ రోజు దళిత గీతాలు పాడించి, సాంస్కృతిక కార్యక్రమాలు  చేయించడం ఆయనలో పెరుగుతున్న అంబేడ్కర్ వుద్యమ స్పృహకు నిదర్శనం గా అర్ధం చేసుకోవచ్చు. 


సమకాలీన రాజకీయాల పట్ల, వుద్యమాలపట్ల మసూద్ బాబా గారికి స్పష్టమైన అవగాహన, నిశితమైన పరిశీలనా దృష్టి వున్నాయి. ఆయన అన్ని సామాజిక, ప్రజాస్వామిక వుద్యమాలకు మద్దతు తెలుపుతూ యువకులలో చైతన్యాన్ని నింపేవాడు. సత్యమూర్తి వుద్యమ వారసులతో యేర్పడిన సంస్థ ‘సామాజిక న్యాయ పోరాట సమితి’ కి  ఆయన ముఖ్య సలహాదారుడిగా వ్యహరించడం ఆయన నిత్య పోరాట పటిమకు తార్కాణం. బాబా గారి వర్గ దృష్టి గొప్పది. తెలంగాణా సాయుధ పోరాటం జరిగే రోజుల్లో ధనిక ముస్లిములు నిజాం నవాబుకు తొత్తులుగా వ్యవహరిస్తే పేద ముస్లిం లు వుద్యమానికి సహకరించారని అలాగే యిటీవల ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన వుద్యమంలో కూడా ధనిక ముస్లిములు వుద్యమ వ్యతిరేకులుగా వ్యవహరిస్తే పేద ముస్లిములు తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావానికి యెన్నో త్యాగాలు చేశారని బాబా అభిప్రాయం.  

         
మనూద్ బాబా గారు నిష్కలంకమైన మనిషి. ఆయన మొహం లో యేదో తెలియని గొప్ప తేజస్సు వుంటుంది. ఆస్తులు పోగుచేసుకునే అవకాశం వొచ్చినా చాలీచాలని యింట్లో అరకొర సౌకర్యాలతో నిజాయితీగా బతికారు.  పేదరికం లోనూ ఆయన తాను యెన్నుకున్న మార్గాన్ని వీడలేదు. తన చెల్లెళ్ళ లో పెద్దామె ‘మాలిని’ యెరుకల కులస్తుడిని, చిన్న చెల్లెలు ‘దాదీమా’ గౌండ్ల కులస్తుడిని వివాహం చేసుకుంటే బాబా వారిని ప్రోత్సహించి వారి  వివాహాలకు తానే పెద్దగా వ్యవహరించాడు. ఆయన పిల్లలు ‘ఆజాద్’, ‘ఆయేషా’లను గొప్ప  చైతన్యవంతంగా పెంచి అమ్మాయికి యెస్సీ  కులస్తుడితో వివాహం జరిపించారు. ఆయన కుటుంబం వో ‘బహుజన సమాఖ్య’ అనొచ్చు.


దుర్భర దారిద్ర్యం వొకవైపు, వెంటాడే అనారోగ్యం వొకవైపు బాబాని వేధించినా యెప్పుడూ చెక్కుచెదరని నిబ్బరంతో, ఆత్మగౌరవంతో బతికాడు. వొకసారి తమ యింటికి ఆనుకుని వున్న కొండ విరిగి తమ పూరి పాక మీద పడినప్పుడు గొప్ప ముందు చూపుతో ఆ ప్రమాదాన్ని పసిగట్టి పక్కకు తప్పుకున్నాడు. అయినప్పటికీ ఆయన భార్య ఆ ప్రమాదంలో గాయపడి ఆస్పత్రి పాలైంది. భయం అంటే యేమిటో ఆయన యెరగడు. చివరి రోజుల్లో అనారోగ్యం పాలై ఆయనకు రక్తపు వాంతులైనప్పుడు కూడా ఆయన బెంబేలెత్తకుండా భార్య, పిల్లలు బాధపడుతుంటే  ‘యేదో వొక అనారోగ్యం వొచ్చి పోతుంటది, అన్నింటికీ వైద్యం అందుబాటులో వుంది కదా!’ అనడం ఆయనలోని సాహసికి నిదర్శనం.  


బాబా గారు సాదా సీదా గా యెప్పుడూ నవ్వు మొహంతో కనిపించేవారు. నిరంతర అధ్యయనం ఆయన వ్యసనం. కొత్త పుస్తకాన్ని పట్టుకుంటే అది పూర్తయ్యేవరకు చదవందే నిద్రపోడు. యెప్పుడూ ఆయన దగ్గరకొచ్చే వుద్యమ సహచరులతో సమకాలీన రాజకీయాలు చర్చిస్తూ చిన్న వారికి మంచి సూచనలు చేస్తుండేవాడు. సత్యమూర్తి గారు    విజయవాడ వొస్తే బాబా గారి దగ్గరే మకాం. ఆయనతో చర్చించి సత్యమూర్తి  ‘అంబేడ్కర్ సూర్యుడు’ పుస్తకం రాయడం విశేషం. ఆ పుస్తకాన్ని సత్యమూర్తి తనకెంతో ప్రియమైన మిత్రుడు బాబా గారితో ఆవిష్కరింప చెయ్యడం బాబా గారిపట్ల శివసాగర్ కి వున్న గౌరవానికీ, ప్రేమకూ గుర్తు. ఆయన విజయవాడలో  జరిగే  అన్ని వుద్యమ సమావేశాలకు ఆసక్తిగా వొచ్చేవారు. యెవరితో మాట్లాడినా తన గురించి యేమీ చెప్పుకోకుండా యెప్పుడూ సత్యమూర్తి గారి ఔన్నత్యాన్నే గుర్తు చేసుకునేవాడు. శివసాగర్ కీ బాబా అంటే అదే ప్రేమ. అది వారిద్దరి అనుబంధం.


మసూద్ బాబా నిరంతరం వొక వుద్యమ జీవిగా సామాజిక మార్పుని కలగంటూ గొప్ప ఆశావహంగా(optimistic) బతికాడు. వుద్యమాన్ని శ్వాసిస్తూ నిజాయితీగా బతకడం కూడా వొక పోరాట రూపమేనని  ఆయన నిరూపించి  వెళ్ళాడు.  పాత బట్టలు వేసుకుని రోడ్డు పక్కన సాదా సీదాగా నడిచి వెళ్ళే ఆయన మోహంలో కాంతి బహుశా ఆ స్వాప్నికతే కావచ్చు.  అది అనితర సాధ్యం. నికార్సైన నిజాయితీకి, నిబద్ధతకీ నిలువెత్తు రూపం అయిన బాబాగారి  జీవితం, వ్యక్తిత్వం మన  తరానికి గొప్ప స్పూర్తిదాయకం.  మసూద్ బాబా గారికి జోహార్లు

published in Andhra Jyothi on 18.08.2018


Comments

Popular posts from this blog

Charvaka Asram- Write up

Nomadic Tribe- Chenchu

Dalit Women's Writing-EPW