Tsundur -Poem






సమాధులు 
                                                       చల్లపల్లి స్వరూపరాణి



ప్రశ్నల్ని లోపల నిద్రబుచ్చి 
దేశం సున్నం కొట్టిన
సమాధిలా వుంది

బొందపెట్టడానికి
ఆరడుగుల నేల దొరకని
వూరి చివరి శవాలు
నడిబజార్లో సమాధులై మొలకెత్తడమే
అసలు చిత్రం
సమాధులు...
యెటు చూసినా సమాధులే!
పొలంలో అందరి టిపినీల అన్నం
గుడ్డమీదేసి కలిపి
తలో ముద్ద పంచుకున్నట్టు
అన్న వొంటిమీద దెబ్బపడితే
తమ్ముడు బరిసె అందుకున్నట్టు
చావులోనూ బతుకులోనూ
సామూహికతే ఆ సమాధులది
సమాధులు దేశం నడిబొడ్డున
నిలువెత్తు ప్రశ్నలా నిలబడ్డట్టుంది
సమాధులు మాట్లాడతాయి
ప్రశ్నలడుగుతాయి
కాలవలో నీళ్ళకుబదులు
నెత్తురెందుకు పారిందని
వూరి చెరువులో
కన్నీరెందుకు నిండిందని
సమాధులు నిలదీస్తాయి
హంతకుడిని దాటేసింది యెవరని!
లోపల లావాని దాచుకున్న సమాధులు
యేదో వొకరోజు
నిద్ర వొదిలించుకు లేస్తాయి
చరిత్రని తిరగ రాస్తాయి
యిప్పుడు సమాధులు
వో సరికొత్త పునరుత్ధానాన్ని
కలగంటున్నట్టుంది
06.08.2018


Comments

Popular posts from this blog

Charvaka Asram- Write up

Nomadic Tribe- Chenchu

Dalit Women's Writing-EPW