Black Dog- Poem





కర్రి కుక్క సావాసం 
--------------------------------చల్లపల్లి స్వరూపరాణి
కరుపి,
నా నల్ల కిరీటమా,
నువ్వు కేవలం కుక్కవేనా!
నా దేహంలో దేహానివి
ప్రాణంలో ప్రాణానివి
నా ఆకలి దప్పుల్లో
భాగస్తురాలివి!
చెప్పుల్లేకుండా
ముళ్ళ బాటలో పరుగెత్తే
 
నా పాదాల జతవి
 
ఊరు కసిరికొట్టింది
నన్నో నిన్నో నాకు గుర్తులేదు గానీ
నీ చెవుల విదిలింపు
 
కన్నీరు రెప్పల్ని దాటకుండా
 
చెయ్యడ్డం పెట్టేది
కరుపి, నా చిన్ననాటి నేస్తమా! 
చీకటి నిండిన దారుల్లో
 
నువ్వు నా చేతి లాంతరువి!
నా వేట కత్తివి!
మెడకి బెల్టు పెట్టుకుని
అటు ఇటు పరికిస్తూ
 
నువ్ నా వెంట పరుగెత్తుతుంటే
 
జెడ్ కేటగరీ సెక్యూరిటీ తో
 
నేను ఠీవిగా నడిచినట్టు ఉంటాదిరా!
నా ఆరుబయలు బతుకులో
అడుగడుగునా నీ జాడలే
నా సావాసగాడా!
 
నువ్వూ, నేనూ కల్సి
డొక్కలెగరేసుకుంటూ
 
పొలం గట్ల వెంట తిరిగిన
 
వడగాడ్పు జ్ఞాపకం...
 
కడుపు నిండినప్పుడు
 
పిల్లకాలవల వెంట
 
పిల్లేరు గంతులేసిన
 
నెమలీక జ్ఞాపకం...
కరుపి,
నా సరి వీధి బాలుడా,
ఎందుకురా
 
మళ్ళీ మళ్ళీ కనిపించి
 
గతం చేసిన గాయాలు రేపుతావు!
 
ఎక్కడెక్కడ షికారు చేసినా,
 
మెతుకు పుట్టని గుడిసెల్ని
 
అంటిపెట్టుకునే నువ్వు
నా వాడ అనుంగు బిడ్డవి!
కరుపి, 
నీ పేరు తిట్టు అయినట్టే
 
నా స్పర్శ ముట్టు అయ్యింది
 
మనిషిని బొచ్చు కుక్కలతో
 
కరిపించి చంపే చోట
 
ఇప్పుడు మేము
శిలా ఫలకాల మీద
 
కుక్క ఉంది జాగ్రత్తబదులు
మనుషుల్ని కుక్కల కంటే హీనంగా చూసే
 
మనుషులుంటారు జాగ్రత్తఅని
రాసుకుంటామురా కరుపీ!
(‘పరయేరుం పెరుమాళ్సినిమాలో కరుపిని చూశాక)
25.11.18


Comments

Popular posts from this blog

Nomadic Tribe- Chenchu