Parayerum Perumal film review
బులుగు మంట రేపిన
సిల్మా
చల్లపల్లి స్వరూపరాణి
చల్లపల్లి స్వరూపరాణి
‘బంగారు
కొండా, నీ మీద గంపెడాశ పెట్టుకున్న మమ్ముల్ని ఒదిలి
ఎల్లిపోయావా, నాయినా! నిన్నెక్కడ దాచుకోనురా తండ్రీ, ఈ ముసలి తల్లి కంట్లో కారం కొట్టినోడి దీపం ఆరిపోను... నిన్ను పొట్టన
పెట్టుకున్నోడి నోట్ల మన్నుబడ... నిన్నెట్టా మరిచేదిరా బంగారూ, మా దిక్కుమాలిన చీకటి బతుకులో నువ్వే మినుకు మినుకు చుక్కవనుకున్నా కదా
నాన్నా’ ఈ ఏడుపు పాట ఊరెలపటి గుడిసెల్లో, సంచార బతుకుల్లో కడుపున పుట్టిన బిడ్డలు చనిపోతేనే కాదు, కుటుంబంలో ఒకరిగా పెంచుకున్న కుక్కలు, పిల్లులు
చనిపోయినా వినిపిస్తది. ఈ ఏడుపు పాట ‘పరియేరుం పెరుమాళ్’
సినిమా మొదట్లో వినిపించినా ఆ తర్వాత కూడా అది మన మనసులో
కులుక్కుమంటూనే ఉంటుంది. అణగారిన బతుకులో ప్రవహించే ఒక ఎడతెగని దుఃఖ నదిని,
కుల హత్యలు చేసిన మానిపోని గాయాన్ని పచ్చి పచ్చిగా చూపించే ఈ సినిమా
మనల్ని ఒక్క చోట కుదురుగా నిలవనివ్వదు. మన మెదడుని రంపంతో పరపర కోసేస్తుంది.
వెండితెరని
తమ కులపురాణాన్ని గానం చేసే ఓ ఖరీదైన సాధనంగా చేసుకుని, దశాబ్దాలుగా ఒకానొక కులం
ఆనందాన్ని అందరి సంబరంగా, తమ దు:ఖాన్ని అందరి వలపోత గా వారి
చావునీ, బతుకునీ గొప్పలతో తెరకెక్కిస్తూ అడ్డంగా బలిసిన
తెలుగు సినిమాలో ఇటువంటి సన్నివేశాలు ఎంత వెతికినా కనబడవు. పైగా సినిమా టైటిల్స్
లో ‘కులం, మతం మానవాళికి ప్రమాదకరం’,
బోధించు, సమీకరించు, పోరాడు’
వంటి సాహసోపేతమైన స్లొగన్స్ ఇక్కడ కనబడే అవకాశం ఇప్పట్లో కనబడడం
లేదు. ఇంతపెద్ద సాహసాన్ని సాంస్కృతిక యోధులైన పా.రంజిత్, మారి
సెల్వరాజ్ వంటి బులుగు మంటలకే సాధ్యం. ‘పరయేరుం పెరుమాళ్’
సమాజంలో అట్టడుగున పడి ఇప్పటిదాకా కనీసపు గుర్తింపుకీ, గౌరవానికీ నోచుకోని సంచార, అర్ధ సంచార, అణగారిన దళిత జీవితం అనేక అగచాట్లని ఎదురీది తన చుట్టూ అలుముకున్న
చీకట్లను పారద్రోలే క్రమంలో తానే స్వయంగా ఓ ప్రశ్నై మొలకకెత్తడాన్ని ఈ సినిమా
చిత్రించింది.
కధానాయకుడు
పెరుమాళ్ ప్రాణం గా పెంచుకున్న ‘కరుపి’(నల్లపిల్ల) దళితుల ఆకాంక్షలకు ప్రతిరూపం.
పెంపుడు జంతువుల్ని తమ జీవితంలో భాగంగా చూసుకునే ‘అలగాజనం’
తీరిగా మురికి నీళ్ళల్లో కూర్చుని తమ బిడ్డల వంటి పెంపుడు కుక్కల్ని
కూడా నీళ్ళల్లో దింపి అందరూ చల్లగా చేదదీరుతూ, సరదాగా
నవ్వుకోవడాన్ని కూడా ఒర్చలేని కుల దురహంకారులు వాళ్ళ ఆనందంపై మూత్రం పొయ్యడమే కాదు
తమ ఆశలకి ప్రతిరూపం, కొండలు, గుట్టల్లో
తమకు తోడు, నీడగా ఉండే కుక్కని రైలు పట్టాలకి కట్టేసి
నిర్దాక్షిణ్యంగా చంపడం అనేది కేవలం ఒక కుక్కని చంపడం కాదు, వారి
ఆకాంక్షల్ని అకారణంగా హత్య చెయ్యడం అనే సంకేతాన్ని సినిమా మొదట్లోనే ఇస్తాడు
దర్శకుడు. అందుకే ఆ సందర్భంలో హీరో పాడే పాటలో ‘కరుప్పీ,
నా ప్రాణమా, మనల్ని చంపింది ఎవరో నాకు తెలుసు,
కానీ అక్కడ చచ్చ్చింది ఎవరో వాడికి మాత్రమే అర్ధమవుతుంది’ అంటూ గొప్ప తాత్వికంగా పాడతాడు. తమ పెంపుడు కుక్కలని మనుషులపై ఉసిగొలిపి
నిండు ప్రాణాన్ని బలిచేసి సమాజాన్ని పెద్ద గగుర్పాటుకి గురిచేసిన నిన్న మొన్నటి
సజీవ సంఘటన మన కంటి రెటీనాపైనుంచి చెరిగిపోకముందే ఈ సినిమాలోని ‘కుక్కచావు’ దానికి పూర్తిగా భిన్నమైన ప్రాపంచిక
దృష్టిని మనముందు ఉంచింది.
ఈ కుక్కలు
ఒళ్లో గారాబంగా పెరిగిన బొచ్చు కుక్కలు కావు. ఇక్కడ బతకడమంటే ఓ యుద్ధమని, అందునా తలయెత్తి నిటారుగా
నిలబడడమంటే గొంతు మీద కత్తి వేల్లాడదీసుకుని గసపెట్టుకుంటూ పరుగెత్తడమని అనేక
సందర్భాలలో చెప్తాడు దర్శకుడు. ఊరవతలి బతుకులు నాలుగక్షరాలు నేర్వడం నేరంగా,
ప్రశ్నించడం పాతకంగా, నచ్చిన అమ్మాయిని
ప్రేమించడం ఘోర కలిగా పరిగణించే చోట దళితులు అకారణంగా చంపబడతారు. అకారణంగా పోలీసుల
చేత చిత్ర హింసలకు గురౌతారు. ఉక్కపోతనుంచి బయటబడలేక ఆత్మహత్యల్ని ఆశ్రయిస్తారు.
అలాంటిది ఏకంగా మొహాలకి రంగేసుకుని వీధి నాటకాలు, భోగం
మేళాలు ఆడుతూ బతుకు వెళ్లదీసే ఓ సంచారజాతి లో పుట్టిన పెరుమాళ్ రాజ్యాంగం తమజాతికి
ఎటువంటి అధికారాలు, హక్కులు కల్పించిందో తెలుకోవాలని లా
డిగ్రీ చెయ్యాలని పట్నంలోని ప్రభుత్వ లా కాలేజీలో చేరడం చాలా పెద్ద విషయమే. అతడు
అక్కడితో ఆగకుండా తాను అంబేడ్కర్ వంటి వాడిని అవుతానని తన జీవితాశయం కాలేజీ
ప్రిన్సిపల్ కి తెలియజెయ్యడం మరీ విడ్డూరంగా భావించబడుతుంది.
ఒక అత్యంత అణగారిన కులస్తుడు పట్నంలోని కాలేజీలో చేరి అక్కడి అగ్రకుల అధ్యాపకులు, తోటి విద్యార్దుల చేతిలో అడుగడుగునా పరాభవాలు పొందడం వాటిని తట్టుకుని అతడు తన చదువుని కొనసాగించడం అతనికి దినదిన గండంగా మారుతుంది. దీనికి తోడు అతడు ఒక అగ్రకుల అమ్మాయితో చనువుగా ఉండడం అతన్ని చావు పొలిమేరలదాకా తరిమింది. ఇతరుల శారీరక, మానసిక దాడులనుంచి తట్టుకుని నిలబడే క్రమంలో అతడు తనకి తెలీకుండానే కుల వ్యవస్తపైన ఓ తిరుగుబాటుదారుడౌతాడు. ఎంతో సౌమ్యంగా ఉండే పెరుమాళ్ లో తిరగబడే మనస్తత్వం తో పాటు తన అస్తిత్వ స్పృహ పెరుగుతుంది. మొదట తన తండ్రిని కాలేజీకి తీసుకురావాలంటే ఆయన రూపం, వెనుకబాటుతనం చూసి ఇతరులు తనని హేళన చేస్తారనే ఆత్మ న్యూనతా భావంతో ఉన్న పెరుమాళ్ తర్వాత తన అసలు తండ్రినే కాలేజీకి తీసుకెళ్ళే చైతన్యాన్ని తనకు తానుగా పొందడం విశేషం.
పెరుమాళ్
లో మనకి రోహిత్, ఇళవరసన్, శంకర్, మందని మధుకర్ ,
పెరుమాళ్ళ ప్రణయి లను చూపిచడానికి అనేక సార్లు కుక్కని సింబాలిక్ గా
ఉపయోగిస్తాడు దర్శకుడు సెల్వరాజ్. సజీవ పాత్రలైన వారంతా కులంతో తలపడడం, పడిలేస్తూ కొన్నిసార్లు ఆ వధ్యశిల పై బలికావడం పెరుమాళ్ చేసిన పోరులో
కనిపిస్తుంది. సినిమా ఆఖరులో హీరో పెరుమాళ్ ని హీరోయిన్ తండ్రి మా అమ్మాయికి
నువ్వంటే చాలా ఇష్టం, ప్రేమ... అది నీకు తెలుసా? అని అడిగితే ‘ఆ విషయం నాకు తెలిసే లోపల నేను చాలా
సార్లు చనిపోయాను’ అంటాడు. కనీసం స్వేచ్చగా గాలి పీల్చుకునే
వీలు లేకుండా జీవితం తనని అనుక్షణం తరుముకొస్తుంటే దళిత యువకుడికి తన స్నేహితురాలి
మనసులో ఏముందో తెలుసుకునే వెసులుబాటు లేదని గంభీరంగా హీరో బదులివ్వడం చూస్తాం.
అగ్రకుల సమాజంలోని మర్యాదస్తులుగా చెప్పబడే వారు కూడా పెరుమాళ్ లాంటి దళితులు,
పీడితులను సహనంతో ఉండమని, శాంతియుతంగా
నడుచుకోమని ఎందుకు చెబుతారు? కుల దురహంకారుల దగ్గరికి
వచ్చేసరికి వీరి నీతి బోధలు ఏమౌతాయి? అనే ప్రశ్నని కూడా దళిత
ప్రిన్సిపల్ ద్వారా చెప్పిస్తాడు దర్శకుడు. అలాగే మారవల్సింది పైమెట్టులో ఉండి
వ్యవస్థ నుంచి అన్ని రకాల అధికారాలను, మర్యాదలను అనాయాసంగా
అనుభవించేవారు తప్ప కుక్కల్లా చూడబడేవారు కాదని పెద్దమనిషిలా మాట్లాడే హీరోయిన్
తండ్రితో హీరో చెప్పడం హుందాగా ఉంది.
పరయేరుం
పెరుమాళ్ వాస్తవిక దృష్టితో దళిత జీవితాన్ని చిత్రించిన సినిమా. ఇందులో పాత్రలన్నీ
సజీవంగా కనబడతాయి. కొత్త బట్టలకు అక్కడక్కడా కత్తెరతో కన్నాలు పెట్టినట్టుగానూ,
తెల్లటి ముఖానికి మసి పూసినట్టుగానూ కాక ఒక దళిత వాడలోని పేద బతుకులు ఎలా ఉంటాయో
అచ్చం అలానే తెరకెక్కించాడు దర్శకుడు మారి సెల్వరాజ్. దళిత జీవితం నుంచి రావడం తో
పాటు తమిళ సాహిత్యంలో మంచి కవిగా, రచయితగా గుర్తింపు ఉన్న సెల్వరాజ్ తన పాత్రలను
సహజంగా తీర్చిదిద్దడంలో సక్సెస్ అయ్యాడు. హీరో పెరుమాళ్ తల్లి కొంత చొరవ, ధైర్యం కలిగి,
తండ్రి తన రెక్కల కష్టం తప్ప కనీసం ఇతరులతో మాట్లాడడం కూడా సరీగా తెలియని వాడు.
పైగా వీధి నాటకాలు వేసుకుంటూ తనకంటూ ఎటువంటి గుర్తింపునూ, గౌరవాన్నీ ఆశించని సగటు
దళిత శ్రామిక తండ్రి. తాను పస్తులున్నా పిల్లల కడుపు మాడితే తట్టుకోలేడు. అందునా
చదువుకునే బిడ్డంటే ఆయనకి ఇంకాస్త మమకారం. వాడి కాలు కిందపెడితే కందిపోతుందేమో అని
అన్ని బండ పనులు, మురికి పనులు తానే చేస్తాడు. ఆ కష్టం ఏమిటో పిల్లలకు తెలియకూడదని
కొన్నింటిని వాళ్లకి తెలియనివ్వరు, చూడనివ్వరు. తమ కొడుకు రేపు డిగ్రీ
చేతబట్టుకుని వచ్చి, ఉద్యోగస్తుడైతే తమ కష్టాలన్నీ దూది పింజల్లా ఎగిరిపోతాయి కదా!
అని కలలుగంటారు. పేద దళిత కుటుంబాలలో పిల్లల్ని చదివించే తల్లిదంత్రులు అచ్చం ఇలాగే
ఉంటారు. అలాగే తాము పెంచుకునే కుక్కల్ని కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చూసుకోవడం సంచార
జాతులు, దళిత గూడేలలో మామూలుగా ఉంటుంది. కుక్కని గౌరీ దేవి అని పూజించేవారి కన్నా
వీరికి దాని మీద మమకారం ఎక్కువ. ఎందుకంటే కుక్కలు వారికి వేటాడడంలో సహాయం చెయ్యడం,
చీకట్లో దారి చూపించడం, శత్రువుల అడుగుజాడలను పసిగట్టి అప్రమత్తం చెయ్యడం వంటి
అవసరాలెన్నో తీర్చే కొడుకు పాత్ర పోషిస్తాయి. అందుకే అవి చనిపోతే ఇంటిల్లిపాదీ
పొగిలి పొగిలి ఏడుస్తారు. దానికి వాడ వాడ అంతా కలిసి ఊరేగింపుగా అంతిమ సంస్కారం
నిర్వహించడం తో ఈ సినిమా మొదలౌతుంది. కధానాయకుడు పెరుమాళ్ సగటు దళిత యువకుడికి
ప్రతీక. అతనికి తన కులం వలన కలిగే ఆత్మ న్యూనత, సంచయం వంటి లక్షణాలతో పాటుగా
బతుకుదెరువు కోసం దొరికిన ప్రతి పనీ చెయ్యడం, దుర్మార్గం అనిపించే దానిమీద సహజమైన
వ్యతిరేకతను ప్రదర్శించే తెగువ, ధైర్యం వంటి అంశాలతో పాటు వారి కట్టు, బొట్టులను
కూడా నిజ జీవితంలో కనిపించే విధంగా చిత్రించాడు. అయితే కధానాయకుడు పెరుమాళ్ ఏదో
గాలివాటంగా కాకుండా తను కాలేజీలో ఒక స్పష్టమైన దృక్పధంతో, ఆకాంక్షతో లా కోర్సును
చదవడానికి వచ్చినట్టు చెప్పడం ఈ సినిమాలో దర్శకుడు ఏమి చెప్పాలనుకున్నాడో
తెలుస్తుంది.
దళిత యువకుడితో జీవితాన్ని ఇష్టంగా భావించే అగ్రకుల అమ్మాయి గా
హీరోయిన్, జ్యోతి
మహా లక్ష్మిని కుల హత్యలు చేసే తాపీపని వాడికి గానీ, ప్రలోభాలకు
గానీ లొంగకుండా హీరో పెరుమాళ్ విషయంలో ధృఢమైన సంకల్పంతో ఉండే ధైర్యవంతురాలిగా,
హీరో పెరుమాళ్ ని పరిస్తితుల నుంచి రూపుదిద్దుకున్న గొప్ప పోరాట
యోధుడిగా ఆశావహుడిగా చిత్రించడం ఈ సినిమాలో ఓ మంచి అంశం. వ్యవస్థ నుంచి అనధికార
ఆమోదముద్ర పొంది నిరాటకంగా జరుగుతున్న కిరాయి కులహత్యల్ని కూడా ఈ సినిమా
ఎండగట్టింది. వేటకు గురై, ఊరవతలకు నెట్టివేయబడిన వాళ్ళు
తిరగబడతారు, తమ హక్కుల గురించిన స్పృహ పొంది చరిత్రని
తిరగరాస్తారనే సందేశాన్ని ఈ సినిమా ఇస్తుంది. ఆ విషయం తమ పాత్రల ద్వారా చెప్పించే
దమ్ము, ధైర్యం దర్శక నిర్మాతలు, మారి
సెల్వరాజ్, పా.రంజిత్ లలో నిండుగా ఉన్నాయి. అది వారు
పీల్చుకుని పెరిగిన ఉద్యమ వాతావరణం నుంచి, పొందిన
కులనిర్మూలనా స్పృహ నుంచి వారికి సహజంగా అబ్బింది. పా.రంజిత్ లు, సెల్వరాజ్ లు మనకూ కావాలి. నల్లటి మురికి లో ఇంద్ర ధనస్సుని కలగానే సాహసం
మనమూ చేద్దాం. ‘పరయేరుం పెరుమాళ్, B.A, B.L’ మనకీ ఓ బులుగు మంట కావాలనే కోరికని రగిలిస్తుంది.
Comments
Post a Comment