The Crusader (Dec.6)- Write up
The
Crusader
‘తన
ప్రేమలోనూ, ద్వేషం లోనూ స్పష్టంగా లేనివాడు తన కాలాన్ని ప్రభావితం చెయ్యలేడు’- డా.బి.ఆర్.అంబేడ్కర్
భారత సామాజిక, ఆర్ధిక, రాజకీయ చిత్రపటం పై
అంబేడ్కర్ ది చెరిగిపోని సంతకం. సామాజిక, ఆర్ధిక, రాజకీయ
రంగాలలో ప్రజాస్వామిక విలువల్ని సాధించడానికి ఆయన వెయ్యి మెదళ్ళతో ఆలోచించాడు. కుల
వ్యవస్థ యీ దేశ రాజకీయ, ఆర్ధిక, సామాజిక రంగాలను తీవ్రంగా
ప్రభావితం చేసే వొక చోదక శక్తిగా వుండం పైన అంబేడ్కర్ చేసినంత పరిశోధన యింత వరకు
మరెవ్వరూ చెయ్యక పోవడం గమనార్హం. కులానికి వుండే మానసిక ప్రవృత్తిని ఆయన అర్ధం చేసుకున్నాడు కనుకనే భారత
దేశంలోని శ్రమ జీవులు కుల వ్యవస్థ కారణంగా వొకటి కాలేకపోతున్నారని సూత్రీకరించాడు
అంబేడ్కర్.
అంబేడ్కర్ వొక వైపు దేవాలయ ప్రవేశం, అంటరానితనం పైన మహద్ చెరువు
పోరాటం వంటి ప్రజా వుద్యమాలను నిర్మిస్తూ, మరోవైపు మూక్ నాయక్, ప్రబుద్ధ
భారత్ వంటి పత్రికల ద్వారా ప్రజల్లో భావ చైతన్యం పెంపొందించాడు. అలాగే
వొకవైపు జాతీయ కాంగ్రెస్ తోనూ, మరోవైపు బ్రిటీష్ వారి తోనూ దళితుల
రాజకీయ హక్కుల సాధనకు అనేక విధాలుగా చర్చించాడు, ఘర్షణ పడ్డాడు, నచ్చ
చెప్పాడు.
చాలామంది దృష్టిలో అంబేడ్కర్ అంటే రాజ్యాంగం రాసిన విద్యావంతుడు. కాకుంటే
దళితులకు విద్య,
వుద్యోగాలలో రిజర్వేషన్లు సంపాదించి పెట్టిన వుదారవాది. యీ
విధంగానే చాలాకాలం పాటు ప్రజలు అంబేడ్కర్ ని అర్ధం చేసుకున్నప్పటికీ యిటీవలి
కాలంలో మేధావులు అంబేడ్కర్ లోని కొత్త కోణాలను వెలికి తీస్తున్నారు. ఆయన్ని
వో క్రూసేడర్ గా,
విప్లవకారునిగా, విశిష్టమైన మేధా సంపన్నుడిగా, వో
తత్వవేత్తగా గుర్తించడం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతుంది.
యెవరికిష్టమున్నా లేకున్నా డా.బి.ఆర్.అంబేడ్కర్
నేడొక విస్మరించడానికి వీలులేని శక్తిగా పరిణామం చెందారు. బ్రాహ్మణవాదం
ఆయన్ని యెంతగా పక్కన పెట్టాలని ప్రయత్నించిందో అంతే బలంగా ఆయన వెలుగులు
చిమ్ముకుంటూ బయటకొస్తున్నాడు. ఆయన భావాల ప్రాసంగికత నానాటికీ పెరగడంతో
అంబేడ్కర్, తాత్వికత,
వ్యక్తిత్వంపై విస్తృతంగా చర్చ జరుగుతుంది. ప్రపంచం
లో స్వేచ్చ,
సమానత్వం, సౌభ్రాతృత్వం కోసం పెనుగులాడే సమూహాలకు
టక్కున గుర్తుకొచ్చే కాంతిపుంజం అంబేడ్కర్. యింకా మనిషితనం నిరాకరించబడే
పీడిత ప్రపంచపు మునివాకిట రెపరెపలాడే ఆత్మగౌరవ పతాక ఆయనే! అంబేడ్కర్
తనకాలపు వీరుడే కాదు మన కాలానికి కూడా వో మహాద్భుతం...
ఆయన స్మృతి వో వేకువ... వో వెలుతురు...
06.12.2018
Comments
Post a Comment