Black Rainbow- poem


మట్టిపూల సింగిడి
________________చల్లపల్లి స్వరూపరాణి
దారి పొడుగునా
పారిన నెత్తుటి వాగులు 
చరిత్ర పేజీల నిండా
పరుచుకున్న కన్నీటి సరస్సులు
పెంట పోగులైన నల్ల శవాలు
తెలుపు రంగు సాగించిన
ఉన్మత్త క్రీడ కాదా!
కాదని బుకాయించకే
తెల్ల నక్కా!
తెల్ల భాస్వరం కాలబెట్టిన
గుడిసెల చిట్టా
ఎంతని చెప్పను!
తెలుపంటే అర్ధం తారుమారై
అది హంతకుడి అసలు రంగని
ఎప్పుడో రుజువైంది
అయినా రక్తం రుచి మరిగిన
తెల్ల మృగాలకేం తెలుసు
నల్ల ద్రాక్ష కమ్మదనం!
ఒట్టిచేతులతో పెంటలెత్తి
లోకం మురికిని తట్టల్లో మోసిన
త్యాగం భాష నలుపు కాక ఇంకేంది?
ఆరుగాలం చాకిరీలో మాగిపోయి
దేశానికింత తిండి పెట్టిన
మట్టిచేతులు నేరేడు పండ్లే మరి!
పొయ్యి మీదకీ పొయ్యి కిందకీ
పొద్దంతా ఎతుకులాడే
పాచీర తల్లి నల్లతుమ్మ గాక
నాజూకు తీగ ఎట్టౌతది?
నలుపంటే ఓ పరాభవాల పరంపర
ఉగ్గబట్టుకున్న కారుమబ్బు
నలుపంటే కర్ర పెత్తనాల్ని
బోనులో నిలబెట్టే
నిలువెత్తు నిరసన
నలుపంటే
ఓ పెనుమంటల పెనుగులాట
నలుపంటే
వాన ఎలిసిపోయాక
కొత్త పొద్దై పొడిచే ఓ వరదగుడి
మట్టిపూల సింగిడి
ఎప్పటికైనా నల్లవజ్రం మెరుపుకి
ప్రపంచం తెల్లమొహం వెయ్యాల్సిందే!
12.04.2019

Comments

Popular posts from this blog

Nomadic Tribe- Chenchu

My Poetry

Sahoo Maharaj- essay