Poem- Mahad




చెరువు
--------------------------------------- చల్లపల్లి స్వరూపరాణి
ఆసాముల బర్రె గొడ్లు
మమ్మల్ని చూసి 
గొల్లున నవ్వాయి
మా ఊరి చెరువు గట్టున
వాడ పరువు ఉరితీయబడింది
చెరువు దగ్గర
గొడ్డుకున్నపాటి విలువ
మనిషికి లేకపోవడమే కదా
ఇక్కడి విషాదం!
ఎవరికైనా
ఊరి చెరువంటే
ఓ పిల్లతెమ్మెర జ్ఞాపకం
మనసుని మెత్తగా తడుముతుంది
మాకు మాత్రం
చెరువనగానే
నీటి అలల మీద నుంచి
ఓ త్రాచుపాము సర్రున లేచి
కసుక్కున కాటేసినట్టు
దడుపు జ్వరం ఆవహిస్తుంది
బిందెడు నీళ్ళ కోసం
మా ఆడతనం
ఊరిచేతిలో
లెక్కలేనన్ని పరాభవాలు
దిగమింగుకుంది
గుక్కెడు నీళ్ళ కోసం
గొంతెండిన వాడ
చెరువు ఒడ్డున
ఒట్టికుండలతో అంగలార్చిన దృశ్యం
నా కంటి రెటీనా నుంచి
ఇంకా తొలగిపోలేదు
ఎండాకాలపు చెరువులో
నత్తగుల్లలు, ఆల్చిప్పల సంబరాలు
ఒడినిండా ఏరుకొచ్చుకున్న
బాడీ ఫ్రాకులు
ఒడ్డు నుంచి వినబడే
ఒక్క అదలాయింపుతో
బిక్కచచ్చిపోయేవి
చెరువులో ఆడుకోడానికి
కాసింత స్వేచ్ఛ కూడాలేని మా బాల్యం
ఆ చెరువొడ్డునే నెర్రెలిచ్చిపోయింది
మాకు చెరువంటే
పిడికెడు తీపి గురుతులు కాదు
ఊరూ వాడల మధ్య విస్తరించిన
సహారా ఎడారి...
మా వూరిలో చెరువు మాయమైనా
దానిలో నిండిన
నెత్తుటి జ్ఞాపకాలు
ఇంకా సలపరిస్తూనే ఉన్నాయి
• మార్చి 20 బాబాసాహెబ్ మహద్ చెరువు పోరాటం చేపట్టిన రోజు

Comments

Popular posts from this blog

Nomadic Tribe- Chenchu

My Poetry

Sahoo Maharaj- essay