Poem on Nagesh babu




అక్షర సునామీ
_________________చల్లపల్లి స్వరూపరాణి
అతడు
వెలివాడల మూగరోదనకు
మండే గొంతునిచ్చినవాడు
ప్రభుత్వాసుపత్రి మార్చురీలోని
అనాధ శవాల మూల్గులను
తన కవిత్వంలో రికార్డ్ చేసినవాడు
తెలుగు భాషకు
వాడ నుడికారపు సొబగులద్దినవాడు
చెడు కళ్లాలకు, కుక్కి మంచాలకు
పళ్ళెంలో మెతుకుల కోసం
ఎగిరే అలగా తల్లులు
మార్త, మరియలకు
సాహిత్య గౌరవాన్ని తొడిగినవాడు
అతడు అగ్ర పీఠాలు,
అవి ఏర్పరిచిన రీతి రివావాజుల మీద
పిడికెడు మన్నుబోసి వెళ్ళినవాడు
వెయ్యేళ్ళ సాహిత్య చరిత్రపై
డబ్బాడు తారు కుమ్మరించి
సాహిత్య పురవీధుల్ని
మట్టి భాషతో శుభ్రపరిచి
పెచ్చులూడిన పాదాలతో
చిందు ఆడించినవాడు
అతడు
కరుడుగట్టిన కాలాన్ని వొడిసిపట్టుకుని
నల్ల సిరాతో తడిపి
సాధికారికంగా ముద్దాడినవాడు
తెలుగు ఛందస్సుకు
ధిక్కారాన్ని అలంకరించినవాడు
అతని రాతలు చూశాకే తెల్సింది
అక్షరం అంటే
సలసల మండే అగ్ని కణమని
అందుకే
అతడు మన్నులో క్షయమైపోయినా
అతని చేతిలో
పదునెక్కిన అక్షరం
అక్షయంగా మెరుస్తూనే వుంది
తలయెత్తుకుని
నిర్భయంగా నడుస్తూనే వుంది
అవును నగేష్ అంటే
మెదడుని రంపంతో కోసే
అక్షర సునామీ!
( మద్దూరి నగేష్ బాబు స్మృతిలో )

Comments

Popular posts from this blog

Nomadic Tribe- Chenchu

Ganteda Gowrunaidu on 'Vekuva pitta'

Aranya Krishna on 'Vekuva Pitta' in Matruka