Valentines day- poem



ప్రేమలు పూయని నేల
------------చల్లపల్లి స్వరూపరాణి
వర్షాకాలము గడిచిపోయినది
చలికాలము దాటిపోయినది
మోదుగుపూలు విరగబూయు కాలము వచ్చినది
పుప్పొడి పానుపుమీద
మిణుగురు కాంతిలో
ప్రేమ పొట్లం విప్పుకుందాం
ప్రేయసీ, రమ్మంటివి
ఒకేఒక్క నులివెచ్చటి స్పర్శ కోసం
యుగాలనుంచీ
ఊరిచివర నిల్చుని
వేచివున్న నల్లనిదానను
ఎండపొడ సోకి
నా దేహం కమిలిపోయింది
నువ్వు అతి మనోహరుడవు
వరిచేలో
తుంగ పరకలు కూడా తెంపలేనంత
సుకుమారుడవు
నల్లనిదానవైననూ
తూరుపు కనుమలంత సొగసైన దానవు
భాగ్యనగరమంత సౌందర్యవంతురాలవు
మహర్ సైన్యము వలె
శౌర్యం గలదానవు అని
నువ్వు నాతో చెప్పినప్పుడు
నా రక్తం సముద్రపు కెరటమైంది
అయినా,
ప్రేమ మరణమంత బలమైనది
కులం పాతాళమంత దయలేనిది
అది చిమ్మిన మంటల్లో
నా అవయవాలు కమురుకు పోయినవి
నా ఎముకలు
దాని కపటత్వం కింద నుగ్గయినవి
నీ దేవుడు నా గర్బస్థ పిండాన్ని
శూలంతో పొడిచి చంపాడు
మన ప్రేమ హోమ గుండంలో నుసి
సఖుడా,
నీ ధవళ వనంలో మొలిచిన
పల్లేరు కాయలు గచ్చ పొదలు
నా మనసును ఛిద్రం చేశాయి
చెలమ కోసం ఎడారిలో వెదకడం
ఎంత అవివేకమో తెలిసేలోగా
నేను చాలాసార్లు చచ్చిపోయాను
అవును
ఇది ప్రేమలు పూయని బంజరు నేల
13.2.2019

Comments

Popular posts from this blog

Charvaka Asram- Write up

Nomadic Tribe- Chenchu

Dalit Women's Writing-EPW