Samadhula Pandaga-Poem




సమాధుల పండగ
_________________చల్లపల్లి స్వరూపరాణి
సమాధుల పండగ రోజు
వానకి కొట్టుకుపోయిన మట్టిలో 
జ్ఞాపకాలను పోగుచేసుకుని
సున్నాలు, పూలతో అలంకరించి
కొవ్వొత్తులు వెలిగించడం
రోజూ సిలువెక్కే మనుషులకు ఎంత ఊరట!
నిజానికి ఒక సమాధి ఎప్పుడూ
నా లోపల ఉంటుంది
ఒక చావు
నా వెంట తిరుగుతూ ఉంటుంది
రోజూ నాలుగైదు సార్లు
సిలువపై చచ్చిపోయి
మర్నాడు పొద్దున
తూరుపు సమాధి చీల్చుకుని
సూర్యుడితోపాటు బైటకు రావడం
అలవాటే...
బతుకు క్యాలండర్లో పర్వదినాల కంటే
శ్రమల దినాలే ఎక్కువ
పెళ్లి వూరేగింపులో వున్నా
లోపల ఒక శవయాత్ర
జరుగుతూనే ఉంటుంది
బతకడానికి ఏడేడు తరాలు పొందిన
చావు యాతన తలపోస్తూ
అనంతంగా సాగే
ముసలి తల్లి వొలపోత
లోపలెక్కడో వినిపిస్తూనే ఉంటుంది
మంచి పోరాటం పోరాడేవారికి
చావు ఓ అనివార్యమైన పెనుగులాట
సమాధి
రాడనే ఒక అబద్ధాన్ని
ఇష్టంగా నమ్మడం
నమ్మకమే చావుని జయించే గొప్ప జీవ లక్షణం
*శ్రీలంక మృతులకు ప్రేమతో ...కన్నీళ్ళతో
21.04.2019

Comments

Popular posts from this blog

Nomadic Tribe- Chenchu

Ganteda Gowrunaidu on 'Vekuva pitta'

Aranya Krishna on 'Vekuva Pitta' in Matruka