Two glasses -Poem





రెండు గ్లాసుల అభ్యుదయం
_________________________చల్లపల్లి స్వరూపరాణి
అందరి కలల్నీ మేమే కంటాం
అందరి జీవితాల్నీ మేమే జీవిస్తాం 
మీ కలాల్ని హైజాక్ చేస్తాం
ఎందుకంటే మేము ప్రగతిశీల’కులం’
మేము పుల్లలు ఎగదోసి
రగిలించిన మంటల్లో
తగలబడిపోయే పీతల్ని
మేమే గట్టెక్కిస్తాం
ఎందుకంటే సంస్కర్తలం మేమే!
మీకంత లేదు
గమ్మునుండండి...
కావాలంటే
ఓ అవార్డు మొహాన కొడతాం
శాలువా దుప్పట్ల కింద
మునగరదీసుకుని పడుకోండి!
అభుదయాన్ని మేము
పైనుంచి ఎత్తిపోస్తే
మీరు దోసిలితో తాగాలి
కలలుగనే అర్హత మీకెక్కడిది?
అన్ని ఆలోచనల కూరగాయలు
సంతలో కొనుక్కుని
పుడుతూనే చంకన పెట్టుకొచ్చినవాళ్ళం...
అవసరాన్నిబట్టి ఒక్కొక్కటీ వాడుకుంటాం
కావాలంటే అన్నీ కలగలుపు వేసుకుంటాం
ఏ కండవా అయినా కప్పుకుంటాం
సంస్కర్తలం, సామ్యవాదులం మేమే!
హేతువాదులంతా మా కులస్తులు
నాస్తికత్వానిది మా పక్కిల్లేే
స్త్రీవాదం మా తోబుట్టువు
ఏ వాదమైనా మా కట్టు బానిసే
మా చూరు నీడన తలదాచుకోవడం తప్ప
కులం తక్కువ శూర్పణఖలకు
ఆకాశం ఎందుకు?
ఆకాశాలూ, అవకాశాలూ మావే
అప్పుడెప్పుడో
మేం నరికి పడేసిన రేణుకనీ,
ఇంటి నుంచి గెంటేసిన కుంతినీ
కులదేవతల్ని చేసుకున్న
‘పిచ్చ ముండా కొడుకులు’ మీరు
సాల్ సాల్ ఆపండి...
ఇక్కడ
అభ్యుదయాన్ని తాగాలన్నా
రెండు గ్లాసుల పద్ధతే మరి!
06.03.2019

Comments

Popular posts from this blog

Nomadic Tribe- Chenchu

Ganteda Gowrunaidu on 'Vekuva pitta'

Aranya Krishna on 'Vekuva Pitta' in Matruka