Kavitvam-Poem

కవిత్వం
-------------------------చల్లపల్లి స్వరూపరాణి
నెత్తుటి వాగులు, కన్నీటి ఊటలు
చెమట కాలవల్లో నానిపోయిన
దళన కవిత్వం మాకక్కర్లేదు...
వెలివాడలు, కారపు చెడులు,
రాచపుండూరులు
ఇకపై మా కలాలకు వేలాడకూడదు...
చీపురు కట్టలు, పేడ తట్టలు
కక్కీసు దొడ్లు, వొనుకుల డొంకల వర్ణనతో
మా పద్యాలు మలిగిపోకూడదు...
గొంతులో ఆంక్షల రాళ్ళు
అడ్డుపడకుండా
నా పాట సాఫీగా సాగిపోవాలి..
ఉక్కపోతలు, అడ్డుకట్టలు దాటుకుని
అక్షర పావురం హాయిగా ఎగరాలి...
రక్తపు మరకలంటని
రోజుల పేజీలు మాకు కావాలి ...
మా పిల్లల కుంచెలు, పాళీలు
నెత్తురులో ముంచనక్కర్లేని
రోజొకటి కావాలి...
వాళ్ళు ప్రేమ కావ్యాలు అల్లుకోవాలి
ప్రకృతిలోని ప్రతి అందాన్ని
సాధికారికంగా అనుభవించాలి...
భూగోళం మీద ఠీవిగా నిలబడి
ఆకాశపు కొమ్మ వొంచి
చుక్కల్ని తుంచుకోవాలి...
మా పిల్లలు
సమాజపు యిరుకు సందుల్లోంచి బయటకొచ్చి
సువిశాల ప్రపంచపు వాకిలి తెరవాలి...
మా ఆడపిల్లలు
ఈ ప్రపంచం మాదనే ధీమా పొందాలి...
వారు కొండకోనల్లో
వాగువంకల్లో సింహాల వలే తిరగాలి...
మా పిల్లలకు
అవధుల్లేని స్వేచ్చ కావాలి...
కళ్ళారా కలలు కనడానికి
షరతులు లేని హామీ కావాలి...
వారి అక్షరాల నిండా
పువ్వులు రాలాలి, నవ్వులు పూయాలి
పంక్తుల మధ్య తేనెలు ఒలకాలి...
పిల్లల కళ్ళల్లో
కలతలు అంటని
కాసిన్ని జ్ఞాపకాల కాంతులు మిగలాలి...
అన్నింటికీ మించి
మా తలపై
అజమాయిషీ లేని ఓ ఆకాశం కావాలి!
21.03.2019
Greetings on World’s Poetry Day

Comments

Popular posts from this blog

Charvaka Asram- Write up

Nomadic Tribe- Chenchu

Dalit Women's Writing-EPW