May Day- poem




మేడేసవారీ చేస్తుంది 
                                                                                                                               చల్లపల్లి స్వరూపరాణి

ఇక్కడ కమ్మటి మేడే 
ఎర్ర పూల ఏసీ చెట్టుకింద సేదదీరుతుంది
 
వివక్ష వడ గాలుపులో
వొడలిపోయిన గుడిసె
 
ఇంటా బయటా దగా మంటలు
 
పాచీర చెంగుతో తుడుచుకుంటూ
 
ఉస్సురుస్సురంటుంది....
ఎల్సిపోయిన మూడు రంగుల జెండాలు
ఇంకొన్ని కళా కాంతీ లేని రంగుల్ని
నెత్తిమీద సిలువలా మోసుకుంటూ
బతుకు గొల్గొతా కొండ ఎక్కలేక
 
గోడకుర్చీ వేస్తుంది
 
ఇక్కడ చెమట చుక్కల్ని
 
అసే తుసే పిలుపులతో
ఏగ్యానం చేసే మేడ మాత్రం
ఎరుపు రంగు వీపుమీద సవారీ చేస్తుంది
 
ఆఫీసు అటెండర్ల తో ఇంటి పనీ, పెంట పనీ
 
చేయించే దొరలు
విద్యార్ధులతో తమ పెంపుడు కుక్కల
 
అశుద్ధం కడిగించే దొరసానులు
ఇక్కడ అభ్యుదయపు
 
చిలక పలుకులు
మా కమ్మగా పలుకుతారు
 
అహో! ఇది మదమెక్కిన కులవాదం కాక
సామ్యవాదమెట్లా అవుతుంది
 
మార్క్స్ గురువర్యా!
నువ్వీ ఊర్లో పుట్టుంటే
 
కులం పెట్టుబడిఅంటే ఏంటో
 
విడమర్సి రాసేవాడివి కదా!
 
బహుశా తప్పు నీది కాదు...
కానివారికి చుక్క పాలుతాపని
కామధేనువు కులానిదే!
 
1.5.2019

Comments

Popular posts from this blog

Jogini- Essay

Nallamalla- Poem

Nomadic Tribe- Chenchu