Sahoo Maharaj- essay




పీడిత ప్రజల్ని గెలిచిన మహారాజు సాహూ  
                                                                   చల్లపల్లి స్వరూపరాణి

   చత్రపతి సాహూ మహరాజ్ మహాత్మా ఫూలే తర్వాత బ్రాహ్మణేతర వుద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడమే కాకుండా దళిత బహుజనులను బ్రాహ్మణాధిపత్యం నుండి విముక్తి చెయ్యడానికి అటు పాలనా పరంగానూ, ఇటు సైద్ధాంతికంగానూ కృషి చేశాడు. శివాజీ మరణించిన 200 సంవత్సరాల తర్వాత ఆ వంశానికి వారసుడిగా సాహూ మహరాజ్ కొల్హాపూర్ సంస్థానానికి రాజై పాలకవర్గ స్వభావానికి భిన్నంగా బ్రాహ్మణ వ్యతిరేక వుద్యమకారుడిలాగా అట్టడుగు కులాల అభివృద్దికి సరికొత్త నమూనా తయారు చేశాడువిద్య, వైద్య, వ్యవసాయ రంగాలన్నింటిలో అణగారిన వర్గాలకు అనుకూలమైన విప్లవాత్మకమైన చట్టాలను రూపొందించి వెనుకబడిన కులాల ప్రజలకు విద్య, వుద్యోగ రంగాలలో యాభై శాతం రిజర్వేషన్లను అమలు పరిచిన మొట్టమొదటి పాలకుడు సాహూ మహరాజ్. ఆయన స్త్రీ పక్షపాతి. మహిళా సంక్షేమానికి కూడా పటిష్టమైన  చట్టాలను రూపొందించాడు.

కొల్హాపూర్ సంస్థానం శివాజీ రాజ్యంలో అంతర్భాగం. రాజ్యం కోసం శివాజీ వారసుల మధ్య జరిగిన అంతరంగిక వివాదాల్లో వారు ఒక ఒప్పందానికొచ్చారు. ఆ ఒప్పందం ప్రకారం కృష్ణానదికి దక్షిణ సరిహద్దు నుంచి నార్నాకు పశ్చిమ సరిహద్దుదాకా ఉన్న రాజ్యం రెండవ శంభాజీకి దక్కింది. అదే  ‘కొల్హాపూర్’ సంస్థానంగా ఏర్పడింది. శివాజీ కాలం నుంచి వీరికి మొఘల్ రాజులతో వైరం ఉంది. శివాజీ వంశంలో చాలావరకు మగవారు అనారోగ్యంతో పాటు రకరకాల కారణాల వలన అకాల మరణం పాలయ్యారు.  అందువల్ల స్త్రీలు కూడా ఈ రాజ్యాన్ని పాలించారు. కొల్హాపూరు సంస్థానంగా ఏర్పడిన తర్వాత కూడా అదే పరిస్థితి కొనసాగడంతో నాల్గవ శివాజీ భార్య అయిన రాణీ ఆనందాబాయి కొల్హాపూర్ సంస్థానానికి వారసుడు కావాలని 1884లో సాహూని దత్తత  తీసుకుంది.

సాహూ 1874 లో రాధాబాయి, జయసింగ్ ఘాట్గే దంపతులకు జన్మించాడు. కన్న తల్లిదండ్రులు ఆయనకీ పెట్టిన పేరు ‘యస్వంతరావ్ ఘాట్గే’. సాహూ తండ్రి జయసింగ్ కాగల్ సంస్థానాధిపతి, ఆయన తల్లి రాధాబాయి మధోల్ మహారాజు కుమార్తె. వీరికి కొల్హాపూర్ సంస్థానంతో మంచి స్నేహంతో పాటు వివాహ సంబంధాలు కూడా ఉండేవి. అందువలనే ఆనందాబాయి సాహూని దత్తత తీసుకుని ‘సాహూ మహారాజ్’ అనే పేరు పెట్టుకుంది. అయితే ఘాట్గే వంశం వారు శివాజీ వంశం లాగా క్షత్రియులు కాదు(శివాజీ వంశం భోంస్లే కూడా క్షత్రియులా కాదా అనే చర్చ ఉంది). వారు ‘కున్బీ’ కులంలో మరో ఉపకులమైన ‘మరాఠా’ శూద్రులు. ఇంగ్లండ్ లో చదువుకున్న సాహూ తండ్రి జయసింగ్ వ్యసనాలకు బానిసై అకాలమరణం పాలు అవ్వడమే కాక తల్లి రాధాబాయి కూడా అనారోగ్యంతో మరణించడంతో సాహూ పన్నెండు సంవత్సరాలకే తల్లిదండ్రులు లేనివాడయ్యాడు.  ఆయన బరోడా మహారాజు కుమార్తె అయిన ‘లక్ష్మీబాయి’ ని వివాహం చేసుకుని తన 20 వ ఏట కొల్హాపూర్ సంస్థానానికి రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. వారికి ‘రాధాబాయి’ అనే ఒక కుమార్తె జన్మించింది.

సాహూ మహారాజ్ రాజ్యానికి వచ్చేనాటికే కొల్హాపూర్ సంస్థానం బ్రిటీషు వారి ప్రభావం లో ఉంది. వారితో కొన్ని వాణిజ్య వప్పందాలు కూడా జరిగాయి. 1900 లో విక్టోరియా మహారాణి సాహూ మహారాజ్ ని శివాజీ వారసుడిగా గుర్తిస్తూ ‘చత్రపతి’ బిరుదునిచ్చి గౌరవించింది. సాహూ రాజ్యానికి వచ్చేనాటికి మహారాష్ట్రలో సత్యశోధక సమాజం ఫూలే మరణానంతరం కొంత బలహీనపడింది. ఆ సంస్థలో బ్రాహ్మణులు సభ్యులుగా చేరి దాని సిద్ధాంతాన్ని నీరుగార్చే ప్రయత్నాలు చేశారు. కొందరు జాతీయోద్యమంలో చేరి అక్కడి బ్రాహ్మణాదిపత్యాన్ని  భరించలేక ఎటూ పాలుపోని స్థితిలో ఉన్నారు. జాతీయోద్యమంలో పాల్గొనే అణగారిన కులాల ప్రజల్ని అగ్రకులాలు ఖాతరు చేసేవారు కాదు. దానికితోడు బాలగంగాధర్ తిలక్ వంటి నాయకులు దేశభక్తి పేరుతో హిందూ పండుగలు, ఉత్సవాలు నిర్వహిస్తూ ముస్లిములను వేరు చెయ్యడం, వారిపట్ల ప్రజల్లో వ్యతిరేకతను పెంచడం వంటి చర్యలకు పాల్పడేవాడు. ఈ పరిస్థితిలో సాహూ మహారాజ్ జాతీయోద్యమం పట్ల ఆకర్షితుడు కాకుండా ఫూలే సత్యశోధక సమాజ ఉద్యమ వారసత్వాన్ని ఎన్నుకుని ఆయన  ఆశయాలను కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు.

సాహూ మహారాజ్ పెంపుడు తల్లి రాణి ఆనందాబాయి ప్రోత్సాహంతో ఆమె నియమించిన బ్రిటీషు  ట్యూటర్ల దగ్గర ఇంగ్లీష్ చదువు కొనసాగించాడు. సర్ స్టువర్ట్ ఫ్రేజార్ ఆయనకీ గురువు. సాహూకి బ్రిటీషు అధికారుల మద్దతు ఉండేది. సమాజంలో విద్య, జ్ఞానం అనేవి బ్రాహ్మణుల సొత్తు అనే అభిప్రాయం బలంగా ఉండడమే కాక కింది కులాలకు చదువుకునే అవకాశాలు బాగా తక్కువ. ఫూలే స్థాపించిన పాఠశాలలో కొందరు చదువుకోగల్గారు. బ్రాహ్మణులు శివాజీని అవమానించినట్టే   సాహూని కూడా పూజా కార్యక్రమాల విషయంలో కించపరిచారు. ఆయన సంస్థానానికి దత్తపుత్రుడు కాబట్టి క్షత్రియులకు వలె వేద మంత్రాలు చదవమని తిరస్కరిస్తే సాహూ కోర్టుని ఆశ్రయించి తన దత్తత చట్టబద్ధమైనది కాబట్టి తానూ కొల్హాపూరు రాజుగా క్షత్రియుడే అని కోర్టు ద్వారా నిరూపించుకోవాల్సి వచ్చింది. ఇదంతా సాహూ మహారాజ్ లో కులవ్యవస్థ పైన ఏవగింపునూ, బ్రాహ్మణాధిపత్యం కొమ్ములు వంచాలనే కసిని కలిగించింది.

సాహూ మహారాజ్ 1894 నుంచి తాను 1922 లో మరణించే వరకు కొల్హాపూరు రాజుగా ఇరవై ఎనిమిది సంవత్సరాలపాటు ఓ గొప్ప పాలనను అందించి ప్రజల హుదయాలను గెల్చుకున్న రారాజుగా వెలుగొందాడు. ఒకవైపు దేశభక్తి పేరుతో జాతీయవాదులు తమ కార్యక్రమాలతో హోరెత్తిస్తుంటే ఆయన వారివైపు కన్నెత్తి చూడలేదు. దానికి కారణం జాతీయవాదం ఒక మేడిపండు వంటిదని, అక్కడ బ్రాహ్మణవాదం తప్ప ఈ దేశంలో అశేషంగా ఉండే ప్రజల మనోభావాలకు విలువ లేదనే స్పృహ సాహూకి అప్పటికే ఉండడం. తమదే అసలైన దేశభక్తి, జాతీయవాదం అని బ్రాహ్మణవాదులైన తిలక్ లాంటి వారు హోం రూల్ పేరున మనుధర్మాన్ని స్థాపిస్తున్నారని సాహూ భావించాడు. ఆయన బ్రిటీష్ వ్యతిరేక వుద్యమానికి ఆకర్షితుడు కాలేదు సరికదా బ్రాహ్మణ బనియాల నాయకత్వంలో వచ్చే స్వతంత్య్రంలో నిమ్నకులాలకు స్థానం వుండబోదని కుండ బద్దలు కొట్టినట్లు తన అభిప్రాయాన్ని ఓ బహిరంగ సభలో వ్యక్తపరిచాడు సాహూ

రాజైన తన విషయంలోనే  బ్రాహ్మణ పురోహితులు అంత వివక్ష చూపితే ఇక సామాన్య జనం సంగతేమిటనే ఆలోచన ఆయన్ని ఒకచోట నిలువనివ్వలేదు. సమాజంలో కింది కులాల అభివృద్ధికి ఆటంకాలుగా ఉన్న అవిద్య, అంటరానితనం, వెట్టిచాకిరీ, పేదరికం వంటి అంశాలపై సాహూ మహారాజ్ దృష్టి పెట్టాడు. మొదట ఆయన తన ఆస్థానంలో ఒక జైన మతస్తుడిని నియమించి బ్రాహ్మణుల వ్యతిరేకతను చవిచూశాడు. 1901 నుండి 1922 వరకు కొల్హాపూర్ సంస్థానంలో సాహూ మహారాజ్ విద్యా రంగంలో ప్రవేశ పెట్టిన సంస్కరణలు ప్రపంచవ్యాప్తంగా ఆయనకి  మంచి గుర్తింపునూ గౌరవాన్నీ ఇచ్చాయి.  దళిత, వెనుకబడిన కులాల పేద విద్యార్ధులు చదువుకోవడానికి విస్తృతంగా స్కూళ్ళు, కాలేజీలతో పాటు, ఉచితంగా, వసతి, భోజనం అందించే హాస్టళ్ళు కూడా నిర్మించాడు. అనేక హాస్టళ్ళ సముదాయంతో ఒక ప్రత్యేక కాలనీనే స్థాపించడం ప్రపంచంలో అరుదైన విషయంగా పరిశీలకులు భావిస్తారు. ప్రతి గ్రామంలో ఒక పాఠశాలను నిర్మించి, గ్రామాలలో ఉండే చావడులు, ఆలయాలలో స్కూళ్ళు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేశాడు. అంతేకాకుండా ఆయా స్కూళ్ళలో మెజారిటీ విద్యార్ధులు ఏ సామాజిక వర్గం వారో తెల్సుకుని ఆయా సామాజిక వర్గాలకు చెందిన ఉపాధ్యాయులను అక్కడ నియమించే ఏర్పాటు చెయ్యడం విశేషం. దీనివలన విద్యార్ధులకు, ఉపాధ్యాయుడికి మధ్య ఒక మంచి సంబంధం ఏర్పడి వివక్ష లేని వాతావరణం ఉంటుందని సాహూ మహారాజ్ భావించాడు. ముస్లిం విద్యార్ధుల కొరకు అరబిక్ స్కూళ్ళను ఏర్పరచాడు. స్కూళ్ళలో ఎక్కువగా బ్రాహ్మణేతరులను టీచర్లుగా నియమించాడు. కేవలం సాధారణ విద్యనందించే విద్యా సంస్థలే కాకుండా సాంకేతిక  విద్య, శిక్షణను అందించే సంస్థలను కూడా ఏర్పాటు చేశాడు. సంగీత, నాటక రంగాల అభివృద్ధికి, లైబ్రరీల ఏర్పాటుకు సాహూ ప్రభుత్వం ఎంతగానో కృషి చేసింది.  అంతకు ముందు సుమారు రెండువేల మందిగా ఉన్న వెనుకబడిన తరగతుల విద్యార్ధుల సంఖ్య 1922 నాటికి 22 వేలు దాటింది. అలాగే 234 గా ఉండే దళిత విద్యార్ధుల సంఖ్య రెండు వేలు దాటింది. బ్రాహ్మణ విద్యార్ధుల సంఖ్య దాదాపు పూర్వం లాగే ఉంది. సాహూ మహారాజ్ తన పరిపాలనలో ఎక్కువగా బ్రాహ్మణేతరులనే నియమించడంతో పాటు వెనుకబడిన కులాలకు విద్య, ఉద్యోగ రంగాలలో 50 శాతం రిజర్వేషన్ కల్పించడం అనేది ఓ విప్లవాత్మకమైన చర్య. ఇది అప్పటికి దేశంలోనే ఓ సంచలనాత్మకమైన అంశంగా భావించవచ్చు. ఆయన కొల్హాపూరులో రిజర్వేషన్లు ప్రవేశ పెట్టాకే, మైసూరులోనూ, మద్రాసు ప్రెసిడెన్సీ లోనూ అణగారిన కులాలకు విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు అనే అంశం అమలులోకి  వచ్చింది. ఈ నిర్ణయం సాహూ పైన బ్రాహ్మణీయ వర్గాలు తీవ్ర వ్యతిరేకతను పెంచుకోవడానికి ప్రధాన కారణమయ్యింది. అంతేకాక ఆయన గ్రామాలలో బ్రాహ్మణులకు వంశపారపర్యంగా వస్తున్న ‘కులకర్ణి’ అనే పదవిని రద్దు చేసి ఎవరైనా ఆ పదవిని చేపట్టవచ్చు అనే ఆదేశాలు జారీచేశాడు. గ్రామాలలో బ్రాహ్మణేతర అగ్రకులాలు వంశపారంపర్యంగా చెప్పట్టే ‘పాటిల్’ పదవిని కూడా అందరూ చెయ్యొచ్చు అనే ఆదేశం ఇచ్చాడు. దీనితో అగ్రకులాధిపత్యానికి  సాహూ మహారాజ్ గండి కొట్టినట్టు అయ్యింది. 

సాహూ మహారాజ్ కుల వివక్ష, అంటరానితనం కారణంగా దళితులు సమాజంలో ఎదుర్కుంటున్న అగచాట్లను రూపుమాపడానికి అనేక చట్టాలు చేశాడు. ముందుగా అంటరానితనాన్ని, వెట్టి చాకిరీని నిర్మూలిస్తూ చట్టం చేశాడు. సాహూ 1920 లోనే వెట్టి చాకిరీని రద్దు చేస్తే  భారత దేశంలో దేశ వ్యాప్తంగా 1975 దాకా వెట్టి చాకిరి నిర్మూలనా చట్టం రాలేదు. ఈ అంశంలో సాహూ ముందుచూపు ఎంత గొప్పదో అర్ధమవుతుంది. దళితులను తన పరిపాలనా యంత్రాంగంలో ఏదో ఒక స్థానంలో నియమించదానికి సాహూ మార్గాలు అన్వేషించాడు. వారికి కనీసపు విద్యార్హతలు లేకపోయినప్పుడు ఆయన వారిని రధ చోదకులుగా, మావటీలుగా, నగర కాపలాదారులుగా, రక్షక భటులుగా నియమించాడు. ఈ చర్య బ్రాహ్మణేతర అగ్రవర్ణాల వారికి కంటగింపుగా మారింది. కటిక దరిద్రంలో చాలీచాలని బట్టలు కట్టుకుని ఊరికి దూరంగా ఉండే మహర్లు, మాంగులు నడుముకు ఖడ్గం, తలపాగా ధరించి రాజువెంట నగర వీధుల్లో తలెత్తుకుని నడవడాన్ని వారు సహించలేకపోయారు. ఒకసారి మహర్ కులస్తుడైన గంగారాం కాంబ్లే  అనే వ్యక్తి సాహూ వద్దకు వచ్చి బతుకుదెరువు కోసం తనకేదైనా సహాయం చెయ్యమంటే అతన్ని టీ కొట్టు పెట్టుకోమని సాహూ కొంత డబ్బు ఇచ్చాడు. అయితే సమాజంలో దళితుల పట్ల అంటరానితనం తీవ్రంగా పాటించడం వలన అతని టీ కొట్టుకి ఎవరూ వెళ్ళేవారు కాదు. అతని కొట్టు ఎలా నడుస్తుందో కనుక్కోవడానికి సాహూ స్వయంగా తన పరివారంతో టీ కొట్టుకి వెళ్లి టీ పెట్టించుకుని తాగి అక్కడ ఉన్నవారందరితో తాగించి దళితుల పట్ల అంటరానితనాన్ని పాటించే కులాలన్నింటికి ఒక సవాల్ విసిరాడు. ఇది చరిత్రలో ఓ అరుదైన సందర్భం. అయితే సాహూ మహారాజ్ అంటరాని వారికి ప్రత్యేక స్కూళ్ళు, హాస్టళ్ళు, హాస్పటళ్ళు  కాకుండా అందరితో పాటు కలిపి ఉంచే ఏర్పాటు చేశాడు. అందరితో కల్సి ఉండడం వలెనే వారిలో మార్పు వస్తుందని ఆయన భావన.  అప్పటికే దళిత, ఆదివాసీ తెగలను నేరస్తులుగా పరిగణిస్తూ బ్రిటీషు ప్రభుత్వం చేసిన ఉన్న నేరస్త జాతుల చట్టాన్ని(criminal tribes act) సాహూ రద్దు చేశాడు. వారిని పుట్టుకతో నేరస్తులుగా పరిగణించడం అమానుషం అని వారు ప్రతిరోజూ పోలీసు స్టేషన్ కి వెళ్లి హాజరు వేయించుకుని రావడం అనే షరతు వల్ల, వారి కదలికలపైన ఎప్పుడూ ఇతరుల నిఘా ఉండడం వలన వారిలో ఆత్మ విశ్వాసం నశించి  ఏ పని మీదా దృష్టి పెట్టలేక వారు కటిక దరిద్రంలో మగ్గుతున్నారని సాహూ వారి దయనీయ పరిస్థితి మారడానికి ఆ చట్టాన్ని రద్దు చేసి వారికి పునరావాసం కల్పించాడు.

సాహూ మహారాజ్ కి అంబేడ్కర్ తో సన్నిహిత సంబంధం వుండేది. అంబేడ్కర్ 1918- 20 మధ్య కాలంలో బొంబాయిలోని సిడెన్ హోమ్ కాలేజీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నప్పుడు ఆయనకు ఒక స్నేహితుడి ద్వారా అంబేడ్కర్ పరిచయమయ్యాడు. భావసారూప్యత ఉన్న వారిద్దరికీ మంచి స్నేహం ఏర్పడింది. కుల, మత సమస్యల మీద సాహూ అంబేడ్కర్ తో సుదీర్ఘంగా చర్చించేవాడు. ఆ సందర్భంలో అంబేడ్కర్ ఓ పత్రిక ప్రారంభించబోతున్నట్టు చెప్పగా సాహూ మహారాజ్ ఆ పత్రిక నిర్వాహణకు అయ్యే ఖర్చును తానే భరిస్తానని చెప్పి తర్వాత అంబేడ్కర్ లండన్ లో బారిస్టర్ చదవడానికి అయ్యే ఖర్చుకు కూడా ఆర్ధిక సహాయం అందించాడు సాహూ. లండన్ లో ఉన్న అంబేడ్కర్ తో నిరంతరం ఉత్తర ప్రత్యుత్తరాలు నడుపుతూ ఎన్నో అంశాలను చర్చించేవాడు. అలాగే అంబేడ్కర్ భార్య రమాబాయికి కుటుంబ నిర్వాహణ కోసం డబ్బు పంపిస్తూ ఎప్పటికప్పుడు ఆ కుటుంబ యోగక్షేమాలు కనుక్కుంటూ ఉండేవాడు. అంబేడ్కర్ తో కల్సి సాహూ మహారాజ్ కొన్ని ముఖ్యమైన సభల్లో పాల్గొని అంబేడ్కర్ మేధస్సుని, గొప్పతనాన్ని కొనియాడేవాడు. ‘మూక్ నాయక్’ అంటే అంబేడ్కరేనని పేర్కొనేవాడు. 

సాహూ మహారాజ్ మహిళల పరంగా చేపట్టిన సంస్కరణలు చాలా విశాల ప్రాతిపదికన రూపొంచడం జరిగింది. ఆయన స్త్రీ విద్య కోసం చేసిన కృషి పేర్కొనదగినది. ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా స్కూళ్ళు, కాలేజీలు ఏర్పాటు చేశాడు. బాల్య వివాహాలు రద్దు చేస్తూ చట్టం చేశాడు. 1920 లోనే విడాకుల చట్టం చేసి కుటుంబ చట్రంలో వ్యక్తిత్వాలు బలైపోయే స్త్రీలను కాపాడాడు. అలాగే కులాంతర వివాహాలను ప్రోత్సహిస్తూ చట్టం చేశాడు. సమాజంలో మతం ముసుగులో అణగారిన వర్గాల స్త్రీలపై జరిగే లైంగిక దోపిడీని అరికట్టడానికి దేవదాసీ వ్యవస్థను రద్దు చేస్తూ జీవో జారీ చేశాడు. అంతకు ముందు వ్యభిచార నిరోధం పేరుతో కొందరు పెత్తన దారులు ఆడవాళ్ళను వేధించే ఒక చట్టం ఉండేది. అది అనేక రకాలుగా దుర్వినియోగం అవుతూ అమాయకులైన స్త్రీలు వేధింపులకు గురవుతుంటే ఆ చట్టాన్ని రద్దు చేశాడు సాహూ మహారాజ్. ఆయన పెంపుడు తల్లి అయిన ఆనందబాయి ఉన్నత భావాలు కలిగిన వ్యక్తి కావడం వలన ఆమె ప్రభావం సాహూ మీద పడింది. ఆయన తన భార్య అయిన లక్ష్మీబాయి ని వివాహం తర్వాత కూడా చదివించి ఆమె ఆసక్తి కనబరిచిన అన్ని రంగాలలో ఆమెకు శిక్షణ ఇప్పించాడు. ఆమె కొంతకాలం తర్వాత అనారోగ్యానికి గురైనప్పుడు సాహూని  మరో స్త్రీని వివాహం చేసుకోమని బంధువులు, మిత్రులు సలహా ఇవ్వగా ఆయన దాన్ని  తోసిపుచ్చాడు. ఈ అనుభవాలు సాహూ స్త్రీ పక్షపాతానికి సాటిలేని నిదర్శనాలు. 1920 లోనే విడాకుల చట్టం చెయ్యడమనేది కూడా సాహూపైన సంప్రదాయవాదులు ద్వేషం పెంచుకోడానికి మరొక  ముఖ్యమైన కారణం.

సాహూ మహారాజ్ అధికార పగ్గాలు చేపట్టేనాటికి కొల్హాపూర్ సంస్థానం ఆర్ధిక పరిస్థితి దుర్భరంగా ఉంది. నూటికి ఎనభై శాతం ప్రజలు సన్నకారు రైతులుగా, భూమిలేని కౌలుదారులుగా, వ్యవసాయ కూలీలుగా వుండేవారు. ఆర్ధిక వ్యవస్థలో భూమి సాగుపై ఆధారపడి జీవన సాగించే పరిస్థితిలో పంటలు లేక ప్రజలు కరువు కాటకాలతో సమతమవుతూ ఉండేవారు. వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో మునిగిపోయింది. ఈ పరిస్థిని ఆయన చాకచక్యంతో మార్చాడు. కరువు సమయంలో రైతులు చెల్లించాల్సిన భూమి శిస్తు రద్దు చేశాడు. సాహూ  నీటిపారుదల కోసం ప్రాజెక్టులు నిర్మించి అత్యధిక శాతం భూమిని సాగుకు అనుకూలంగా మార్చి పంటలు పండేలా చేశాడు. పైపు లైన్ల ద్వారా నీరు పంట పొలాలకు అందే ఏర్పాటు చేయించాడు. విత్తనాల తయారీలో కొత్త పద్ధతులు  ప్రవేశపెట్టాడు. రైతులులకు వడ్డీలేని రుణాలు మంజూరు చేశాడు. వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాడు.

వ్యవసాయ రంగంలో ఏర్పడిన సంక్షోభాన్ని చక్కదిద్దాక సాహూ పారిశ్రామిక రంగంపైన దృష్టి పెట్టాడు. భారీ, చిన్న తరహా పరిశ్రమలు స్థాపించాడు. చక్కెర, వస్త్ర పరిశ్రమ, గొనె సంచుల తయారీ వంటి పరిశ్రమలు వాటిలో ముఖ్యమైనవి. చిన్న తరహా పరిశ్రమలు సహకార రంగంలో ఉండేవిధంగా ఆదేశాలు జారీ చేశాడు.  ఆయన ప్రోత్సాహంతో ప్రవేటు రంగంలో కూడా కొన్ని పరిశ్రమలు ఏర్పడ్డాయి. అటు వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా రూపొందించి, ఇటు పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేశాడు సాహూ మహారాజ్. స్వయం సమ్రుద్ధికరమైన ఆర్ధిక వ్యవస్థ లో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి.

సాహూ మహారాజ్ న్యాయపరమైన సంస్కరణలు కూడా చేపట్టి పాత న్యాయ సూత్రాల స్థానంలో సరికొత్త ‘హిందూ లా’ ని క్రోడీకరించాడు. హిందూ స్మృతుల ఆధారంగా ఉండే పాత న్యాయ సూత్రాలు సంస్కృతంలో సామాన్యులకు అర్ధం కాకుండా  ఉండడమే కాకుండా కోర్టు కేసులు సంవత్సరాల తరబడి పెండింగ్ లో ఉండడం వలన న్యాయం కోసం ప్రజలు కోర్టులను ఆశ్రయించడం మానేసే  పరిస్థితి ఉండేది. వకీళ్ళందరూ సంస్కృతం తెల్సిన బ్రాహ్మణ పండితులే కావడం, వారు ప్రజల్ని రకరకాలుగా పీడించడం వలన సాహూ మహారాజ్ న్యాయ వ్యవస్థని సులభతరం చేసి  ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి సంస్కరణలు చేపట్టాడు. వారసత్వం, వివాహం, దత్తత స్వీకారం, వర్ణాంతర వివాహాలు వంటి అంశాలలో ఆయన కొత్త చట్టాలను రూపొందించి మరాఠీ భాషలో న్యాయ శాస్త్ర గ్రంధాలను రూపొందించాడు.

సాహూ మహారాజ్  చేపట్టిన సంస్కరణల వలన ప్రజలు స్వేచ్చగా, స్వయం సమృద్ధిగా జీవనం సాగిస్తే  ఆయన కి బ్రాహ్మణ వర్గాల నుంచి మాత్రం తీవ్రమైన వ్యతిరేకత ఎదురయ్యింది. ఆయన పాలన చేపట్టిన తొలినాళ్ళనుంచి చివరి వరకు బ్రాహ్మణ వర్గం ఆయన్ని వెంటాడి వేధించారు. ఆయన వంశపారంపర్యంగా వారికి వస్తున్న అగ్రహార భూములు వెనక్కి తీసుకోవడం, ‘కులకర్ణి’ వంటి పదవులు బ్రాహ్మణులకు వంశపారంపర్యంగా కాక ఎవరైనా చేపట్టే అవకాశం ఇవ్వడం, విద్య, ఉద్యోగాలలో వెనుకబడిన కులాలకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పించడం, స్త్రీలకు ఇష్టంలేని కాపురాన్ని రద్దు చేసుకోడానికి విడాకులు చట్ట్టం ద్వారా స్వేచ్చ కల్పించడం, వర్ణాంతర వివాహాలకు చట్టం చెయ్యడం వంటి చర్యలతో బ్రాహ్మణ వర్గం తీవ్ర అభద్రతకు, అసహనానికీ లోనైంది.  సాహూ చర్యలతో కుల వ్యవస్థకి బీటలు వారితే తమ అధికార పీఠాలు కదిలిపోతాయని తల్లడిల్లింది. తిలక్ నడుపుతున్న ‘కేసరి’ అనే పత్రికలో బ్రాహ్మణులు తరచుగా సాహూ మీద తీవ్రమైన విమర్శలు చేసేవారు. సాహూ మహారాజ్ బ్రాహ్మణ వర్గాల నాయకత్వంలోని జాతీయవాదం వైపు మొగ్గు చూప కపోవడమే కాక బ్రిటీషువారి నుంచి దేశానికి స్వత్రంత్ర్యం వచ్చినా దానిలో బడుగువర్గాలకు వాటా ఉండదని స్వరాజ్యం, స్వతంత్రం అనే అంశాలపట్ల తన దృక్పధాన్ని కుండ బద్దలుకొట్టినట్టు చెప్పేవాడు. దానితో ఆయన వ్యతిరేకులైన బ్రాహ్మణ వర్గాలు సాహూని జాతీయవాద వ్యతిరేకి అని, బ్రిటీషువారి ఏజెంట్ అని విమర్శలు గుప్పించేవారు. బ్రాహ్మణులు సాహూ మహారాజ్ పైన నైతిక, భౌతిక దాడులకు పాల్పడ్డారు. ఆయన పైన ఒకసారి బాంబులతో హత్యా ప్రయత్నం చెయ్యగా అది విఫలమైంది. దానితో ఆగక ఆయన తన కులం వారికి పాలనలో అన్ని అవకాశాలు కల్పించి కులతత్వవాదిగా ప్రవర్తిస్తున్నాడని ప్రచారం చేశారు. ఆ వర్గానికి బాలగంగాధర్ తిలక్ వంటివారు ప్రాతినిధ్యం వహించారు. తిలక్  కరుడుగట్టిన సంప్రదాయవాదిగా కులవ్యవస్థ యధాతధంగా కొనసాగాలని కోరుకునేవాడు. భారత్ లో మాదిరి చాతుర్ వర్ణ వ్యవస్థ  లేకపోవడం చేతనే ప్రపంచ వ్యాప్తంగా ప్రాచీన గ్రీకు, రోమన్ నాగరికతలు అంతరించిపోయాయని ఆయన తరచూ వాపోయేవాడు. స్త్రీలకు వివాహ విషయంలో నిర్ణీత వయోపరిమితి, వారికి విడాకుల ద్వారా స్వేచ్చనిస్తే  సంప్రాదాయక హిందూ కుటుంబ వ్యవస్థ కుప్పకూలిపోతుందని ఆయన అభిప్రాయం.  అందుకే ఆయన నాయకత్వంలోని సాహూ ఎంతో  దృఢ చిత్తంతో వారి విమర్శలను లెక్కచేయకుండా ముందుకు నడిచి తన సంస్కరణలను కొనసాగించాడు. అయితే  ఆయన ముగ్గురు స్త్రీలపై అత్యాచారం చేశాడనే ఆరోపణకు అంతటి దృఢ సంకల్పి సాహూ కుంగిపోయాడు. ఆయన తన భార్యకు ఆరోగ్యం క్షీణించిన సమయంలో బంధు మిత్రులు  మరో స్త్రీని వివాహ చేసుకోమంటే తిరస్కరించడమే కాక  వ్యసనాలకు లోనై ముప్పై ఏళ్లకే మరణించిన తన తండ్రిని చూసి జీవితాంతం దురలవాట్లకు దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నాడు. తాను నమ్మిన విశ్వాసాలకు నిబద్దుడైన సాహూ మహారాజుని స్త్రీల పరమైన ఆరోపణ కుంగదీసింది. ఆయనకు వంశపారంపర్యంగా వచ్చిన మధుమేహ వ్యాధి తో తరచూ ఆరోగ్య సంబంధిత సమస్యలతో సతమత మవుతూ ఉన్నప్పటికీ సాహూ ఏకైక కుమార్తె రాధాబాయికి భర్తతో ఏర్పడిన సమస్య మనోవేదనగా మారి ఆయన ప్రాణాలను హరించింది. సాహూ తన 48 సంవత్సరాల వయసులోనే మరణించడం భారత సామాజిక ఉద్యమాలకు తీరని నష్టం కలిగించింది.

సాహూ మహారాజ్ కొల్హాపూర్ సంస్థానానికి రాజుగా వచ్చేనాటికి ఫూలే నిర్మించిన సత్యశోధక సమాజ ప్రభావంతో ఉన్నవారిని, వీరశైవ లింగాయతుల్ని, జైనుల్ని, ముస్లిముల్ని తన సొంత వర్గంగా భావించి వారి సహకారంతో పాటు బ్రిటీషు అధికారులతో  వ్యూహాత్మక స్నేహం కొనసాగించి వారి మద్దతుతో అద్భుతమైన పరిపాలన అందించగలిగాడు. తన ఇరవై ఎనిమిది సంవత్సరాల పాలనా కాలంలో సాహూ మహారాజ్ పాలక, పూజారి వర్గాలతో జతకట్టలేదు. ఎప్పుడూ పాలక వర్గ లక్షణాలతో ప్రవర్తించకుండా మహారాష్ట్రలో తనకంటే ముందు పీడితవర్గాల దాస్య విముక్తికొరకు సామాజిక ఉద్యమాన్ని నిర్మించిన సత్యశోధకుడు మహాత్మా జ్యోతీరావ్ ఫూలే మార్గాన్నే తన మార్గంగా ఎంచుకున్నాడు. ఆయన చేపట్టిన విప్లవాత్మకమైన సంస్కరణలు ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు గుర్తింపునూ, గౌరవాన్నీ తెచ్చిపెట్టాయి. బ్రాహ్మణాధిక్యత కింద నలిగినజ్జైన మహారాష్ట్రలో  తర్వాత కాలంలో దళిత రాజకీయాలు పదునెక్కడం వెనుక సాహూ మహరాజ్ కృషి వుందంటే అతిశయోక్తి కాదు.  సాహూ వుద్యమం వలన బలపడిన కున్బీలు ఖైర్లాంజి వంటి సంఘటలలో దళితులపై దాడులకు పాల్పడడం ఆయన అందించిన సామాజిక ఉద్యమ స్పూర్తికి తూట్లు పొడవడమే! వెనుకబడిన కులాలను, దళితులను, ముస్లిములను, స్త్రీలను  మతపరంగా బ్రాహ్మణాధిక్యతను ధిక్కరించిన జైనులు, లింగాయతులు వంటి వర్గాలను కలుపుకుని ఓ గొప్ప బహుజన సమాజ స్వప్నాన్ని నిజం చేసిన సాహూ సామాజిక విప్లవ స్పూర్తిని అందిపుచ్చుకోవాల్సిన అవసరం బ్రాహ్మణవాదం వలన వివక్షకు, దాడులకు గురయ్యే ప్రజలకు, స్త్రీలకు వుంది. 








Comments

Popular posts from this blog

Charvaka Asram- Write up

Nomadic Tribe- Chenchu

Dalit Women's Writing-EPW