Jogini Daughter Susila- Essay



జీవితపు ఆటలో గెలిచిన మాతంగి బిడ్డ సుశీల
                                                                      చల్లపల్లి స్వరూపరాణి

సమాజం వారిని చిన్న చూపు చూసింది. మతం పేరుతో ఊరుమ్మడి వస్తువుని చేసింది. ఊరు బాగుండాలంటే మాతమ్మలు చిందేయాలంది. వర్షాలు కురిసి భూములు పండాలంటే మాతమ్మ పూనకం తెచ్చుకుని సిడి మాను ఎక్కాలంది. అయినా ఆమె తన స్వయం శక్తితో తన తలరాత మార్చుకుంటుంది. ఆమే పద్దెనిమిదేళ్ళ కొండా సుశీల. జాతీయ స్థాయి హాకీ క్రీడాకారిణి.  ఆమె తల్లి ఒక ‘మాతంగి’, మాదిగ కులంలో పుట్టింది. ఆమెది చిత్తూరు జిల్లా, చంద్రగిరి మండలం, తొండవాడ గ్రామం. ఆమె తల్లి తన మేనమామ సహాయంతో ఆ మురికి కూపం నుంచి బైటకొచ్చి పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించాలనుకుంది. తన పాత పేరు ‘మాతమ్మ’ తానున్న బురదని సూచిస్తుందని ‘రేణుక’ గా మార్చుకుంది. అయినా కొత్తపేరు ఎవరికీ పెద్దగా తెలీదు. అందరూ ఆమెని ‘మాతమ్మ’ అనే పిలుస్తారు. ఆచారం వొదిలినా, పేరు మార్చుకున్నా దురదృష్టం భర్తగా మారి  ఆమెని వెంటాడింది.  చేసుకున్నవాడు పచ్చి తాగుబోతు, పైసా సంపాదించకుండా భార్యని బండబూతులు తిట్టి, కొట్టేవాడు, ఆమె గతాన్ని పదే పదే గుర్తుచేసేవాడు. ఆమెకి నలుగురు పిల్లలు. తాగుబోతు భర్త ఒకవైపు, కటిక దరిద్రం మరో వైపు ఆమెని పట్టి పీడించాయి.  కూలి నాలి చేసుకున్నా అది పిల్లలకు పెట్టడానికి లేకుండా అతని తాగుడుకే తగలేయ్యాల్సి వొచ్చేది. మరోవైపు ‘మాతంగి’ అనే గతం ఆమెని నీడలా వెంటాడింది. ఇల్లూ వాకిలి లేదు, పిల్లలూ, తనూ తినడానికి తిండి లేదు. అదనంగా తిట్లు, తన్నులు భరించాల్సిన పరిస్థితిలో చేసేదేమీ లేక కన్నవారి ఇంటికి బయలుదేరింది. అక్కడా కటిక పేదరికంలో మగ్గుతున్న తల్లిదండ్రులు తమకే గతిలేక నానా అవస్థలు పడుతున్నారు. వారు కూడా భర్తని వదిలేసి వొచ్చిన నలుగురు బిడ్డల తల్లియైన కూతురిని కలో గంజో కల్సి తాగుదాం ఇసంట రమ్మనలేకపోయారు. అయినా ఆమె ఆత్మ స్థైర్యాన్ని కోల్పోలేదు. మాతమ్మ గుడి దగ్గరే కొన్నాళ్ళు బతికింది. ఆరు బయట పిల్లల్ని పెట్టుకుని కూలిచేసి వచ్చిన పది రూపాయలతో పిల్లలకు ఇంత అన్నం ఉడకేసి పెట్టింది. ఎవర్నీ రూపాయి అడుక్కోలేదు, పల్లె విడిచి పోలేదు. వెక్కిరించిన జీవితాన్ని తన చేతిలోకి తీసుకుంది. చావో రేవో తేల్చుకోవాలనుకుంది. జీవితం చేతిలో క్షణం క్షణం ఓడిపోతూ, పడుతూ, లేస్తూ రేణుక ఇప్పుడిప్పుడే నిలబడుతుంది.
ఇది ఒక ‘జోగిని’ కధ.  చిత్తూరు జిల్లాలో ఆడపిల్లల్ని  చిన్నప్పుడే దేవుడికిచ్చి పెళ్లి చేసే ఆచారాన్ని ‘మాతంగి’ అంటారు. సుశీల తల్లి మాతమ్మని అభం శుభం తెలియని వయసులోనే తల్లిదండ్రులు, గ్రామపెద్దలు గ్రామ దేవతకి అంకితమిచ్చారు. అప్పటినుంచి ఆమె ఆరుబయలు జీవితంలో అందరి వస్తువైంది. దేవుడు, దెయ్యం పాపం పుణ్యం తెలియకపోయినా వూరోళ్ళు ఆడమంటే ఆడింది, తాగమంటే తాగింది. ఊరి జాతరలు, కొలుపుల్లో తానే దేవునికి ప్రతిరూపం. అందరినీ ‘మాత’ అయ్యి దీవిస్తుంది. కానీ ఆమెని ఎవరూ అమ్మలాగా చూడరు, అక్కలా, చెల్లిలా ఆదరించరు. హిందూ మతంలోని హిపోక్రసీకి ఈ వ్యవహారం నిలువెత్తు సాక్ష్యం. ఉత్సవాల్లో ఆమె కాళ్ళు  మొక్కిన వాళ్ళే తర్వాత ఆమె గుడిసె తలుపు తడతారు, కొంచెపు మాటలతో ఆమెని తూట్లు పొడుస్తారు. జాతరలో ఆమె చేత మొహాన ఉమ్మేయించుకుళ్ళే తర్వాత ఆమెని చీదరించుకుంటారు. ఆమె చేత బూతులు తిట్టించుకున్నోళ్ళే ఆమెని ‘లంజా’ ‘లమ్డీ’ అంటారు. దేవత కాస్తా జాతర, కొలుపులు అయ్యాక అలగా దెయ్యం అవుతుంది.  ఇంతటి వైరుధ్యం ప్రపంచంలో మరెక్కడా చూడం. సుశీల తల్లి  రేణుక ఈ దుర్మార్గాన్ని భరించలేకపోయింది. మేనమామ సాయంతో ఆ రొచ్చు నుంచి బైటపడింది. కొన్నాళ్ళు కూలి పనులు చేశాక ఒక హాస్పిటల్లో కాంట్రాక్ట్ స్వీపర్ గా పనిచేస్తుంది. నెలకు ఆరు వేలు సంపాదిస్తూ చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని తన నలుగురు పిల్లల్నీ చదివిస్తుంది. ఇద్దరాడ పిల్లలు, ఇద్దరు మగపిల్లలు. ఎన్నిబాదలున్నా అందరూ తల్లి కష్టాన్ని  గుర్తెరిగి ఆమె మాటకు విలువిస్తారు.  
రేణుక మాతంగి వ్యవస్థ నుంచి బైటపడి అంతటితో దాన్ని మర్చిపోలేదు. ఆమె తనలాంటి మాతమ్మల పరిస్థితి కూడా మారాలని గ్రామాలలో ఆడపిల్లలను దేవుడికి అంకితమివ్వడాన్ని ఆపే ఉద్యమంలో ఆమె క్రియాశీలకంగా పనిచేస్తుంది. జోగినీ వ్యతిరేక స్వచ్చంద సంస్థ, గ్రేస్ నిర్మల గారి ఆధ్వర్యంలో నడిచే ‘ఆసరా’లో ఆమె కమిటీ సభ్యురాలు, చిత్తూరు జిల్లా బాధ్యురాలు. అయితే చిత్తూరు జిల్లాలో మాతమ్మలకు ప్రభుత్వం ఇచ్చే పునరావాస సదుపాయాలను ఆమె ఉపయోగించుకోలేదు. ఇప్పటికీ ఆమెకి సొంత ఇల్లు లేదు. ఐదు వందల రూపాయల చాలీచాలని అద్దె కొంపలో నలుగురు పిల్లలతో జీవిస్తుంది. తాగుబోతు భర్తని వదిలేసాక ఆమెకి సంపూర్ణ స్వేచ్చ లభించింది. అయినా తన గతం ఆమెని నీడలా వెంటాడి వెక్కిరిస్తే రేణుక ఆవేమీ పట్టించుకోకుండా తన కర్తవ్యం వైపు వేగంగా అడుగులేస్తుంది. ఎక్కడ ఆడపిల్లలను మాతమ్మలను చేసి గుడికి అంకితమిస్తున్నారని తెల్సినా ఆమె వెంటనే అక్కడికి వెళ్లి ఆపడం, పోలీసులకు కబురు పంపి, తన సంస్థ నుంచి ఇతర కార్యకర్తలను సమీకరించి పోరాడడం మాతమ్మ తన ఉద్యోగంతో పాటు సీరియస్ గా చేస్తుంది. మాతంగి వ్యవస్థ నిర్మూలన మీద రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ సభలు, సమావేశాలు జరిగినా అన్ని పనులు మానుకుని మరీ హాజరవుతుంది.   
భర్త సహకారం లేకున్నా మాతమ్మ తన నలుగురు పిల్లల్ని ముందు నుంచీ తన రెక్కల కష్టంతోనే సాకింది. తన పిల్లలకు ఏది ఇష్టమో అదే చెయ్యమంటుంది. పిల్లలు సాంఘిక సంక్షేమ హాస్టళ్ళలో చదువుకుంటూ తమకు నచ్చినట్టు అభిరుచుల్ని ఏర్పరచుకున్నారు. పెద్దకొడుకు డిగ్రీ అయ్యాక విజయవాడ వెళ్లి ప్రవేటు ఉద్యోగం చేస్తున్నాడు. పెద్ద కూతురు సుశీల హాకీ క్రీడలో జాతీయ స్థాయి క్రీడాకారిణిగా ఎదిగింది. సుశీలకి ఇప్పుడు పద్దెనిమిదేళ్ళు. ఇంటర్మీడియట్ పూర్తయ్యింది. ఆమె ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నప్పటినుంచి హాకీ క్రీడ పట్ల ఆసక్తి ఏర్పడింది. ఇతరులు ఆడడం చూసి తనే స్వంతంగా ప్రాక్టీస్ చేసింది. మూడో క్లాస్ వరకు తొండవాడలో చదివాక  తిరుపతి నెహ్రూ మున్సిపల్ హైస్కూల్లో చేరి అక్కడే హాస్టల్ లో ఉండి హైస్కూల్ చదువు పూర్తీ చేసింది. గ్రౌండ్లో స్టిక్, బాల్ తీసుకుని ఎప్పుడూ ఆడుతూనే ఉండేది. ఇంటికెళ్లినపుడు కూడా గోడకేసి కిక్స్ కొడుతూ ఉంటుంది. ఉదయం, సాయంత్రం ఒక్కతే గ్రౌండ్ కి వెళ్లి ఎంతో పట్టుదలగా ప్రాక్టీస్ చేసేది. ఆమె చెల్లెలు ఎనిమిదో తరగతి చదివే ‘భూమిక’ కూడా హాకీ క్రీడలో ఆసక్తి పెంచుకుని స్కూల్లో ఆడుతుంది. ఊర్లో ఇతరులు ఆమె తల్లికి మగతోడు లేకపోవడాన్ని, ఆమె గతాన్నీ అడ్డం పెట్టుకుని మాట్లాడే హీనమైన మాటల్ని పంటి బిగువున భరిస్తూ సుశీల తన లక్ష్యం వైపు ద్రుష్టి పెట్టి పట్టుదలతో హాకీ ఆటలో ప్రావీణ్యం సంపాదించి విజయం వైపు దూసుకెళ్తుంది. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు తన ఆటతీరు చూసి ఆరో తరగతిలో ఉన్న సుశీలని పదో తరగతి వారితో కూడా ఆడించేవారు. ఇప్పుడామె హాకీలో జాతీయ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. త్వరలో జరగబోయే జాతీయ స్థాయి హాకీ టోర్నమెంటుకి కూడా సుశీల ఎంపికైంది. తానెంచుకున్న రంగంలో అత్యున్నత ప్రతిభ సాధించి సమాజం తమ నుదుటి మీద రాసిన పిచ్చి గీతల్ని తుడుచుకోవాలనే సుశీల తాపత్రయం ఎంతోమందికి స్పూర్తిదాయకం. తానొక ఉత్తమ క్రీడాకారిణిగా రాణించి తన తల్లికి తనదైన ఒక సొంత ఇల్లు కట్టించాలనేదే సుశీల జీవితాశయం. ఇల్లులేక ఇప్పటిదాకా అమ్మ ఎన్నో స్థలాలు మారింది, గుడి దగ్గర బతికాము. ఒక ఇల్లుంటే బాగుంటుంది అనేదే నా కోరిక అంటుంది కొండా సుశీల. తను బాగా చదువుకుని తన క్రీడారంగంలో కష్టపడి రాణించి సమాజం నుంచి ఎదురయ్యే అన్ని రకాల వ్యతిరేక పరిస్థితులను అదిగమించవచ్చని సుశీల అంటుంది. ఆమె తల్లి కూడా తాను ఒకఉద్యమ కార్యకర్తననే అనుకుంటుంది గానీ బాదితురాలినని భావించదు.  ఆ భావనే ఆమెని ముళ్ళకంప వంటి జీవితం మీద విజేతని చేసింది.  ఆమె బిడ్డ సుశీల ఇప్పుడామెకి కొండంత అండ, జీవితం మీద కొత్త ఆశ చిగురింపచేస్తుంది. ఆమె ఆటలో చూపించే ప్రావీణ్యం గురించి విన్నప్పుడు రేణుక(మాతమ్మ)కళ్ళల్లో నుంచి అప్రయత్నంగా నీరు చేరుతుంది. సమాజం నుంచి కుటుంబంలో భర్త నుంచి ఎటువంటి ఆదరణకూ  గౌరవానికీ  నోచుకోని ఒక మాతంగి స్త్రీ కన్న బిడ్డ అన్నిరకాల అవరోధాల్ని దాటుకుని డిల్లీ, రాజస్థాన్ వంటి నగరాలలో హాకీ ఆడడానికి వెళ్లి అక్కడ బాగా ఆడి పెద్ద పెద్ద వారి నుంచి మెప్పు పొందుతుంటే ఆమె గతంలో తను పొందిన కష్టాన్నంతా మర్చిపోయి హాయిగా సేదదీరుతుంది. అట్టడుగు స్థాయి నుంచి ఎదిగొచ్చి తమ ప్రతిభతో కులం గీసిన అడ్డుగోడల్ని, పేదరికం తాలూకు అసౌకర్యాల్ని కూలగొడుతున్న క్రీడాకారిణులు మేరీ కోమ్, హిమా దాస్ వంటి  నల్ల కేతనాల వలే సుశీల కూడా హాకీ ఆటలో అంతర్జాతీయ స్థాయి హాకీ క్రీడాకారిణిగా గుర్తింపు పొంది జీవితపు ఆటలో ఎదురైన సవాళ్ళను అదిగమిస్తుందని ఆశిద్దాం.
24.8.2019

Comments

Popular posts from this blog

Charvaka Asram- Write up

Nomadic Tribe- Chenchu

Dalit Women's Writing-EPW