Narabali-Poem




నరబలి
చల్లపల్లి స్వరూపరాణి

ఇక్కడ  కుమ్మరోడికి కుండ కరువు
నేతగాడికి గుడ్డ దొరకదు
మట్టి పిసికి
గరిసెలు నింపే సేద్యగాడింట్లో
అన్నం నిండుకుంటది
కాటికాపరికి
బొందల గడ్డలో
ఆరడుగుల నేల పుట్టదు...
చచ్చినాక బ్రాహ్మడైనా చండాలుడైనా
ఒక్కటే అన్నావు అన్నమయ్యా!
మేము చచ్చినా
 పూడ్చుకోడానికి
కాసింత జాగా దొరకదని
ఎన్నిసార్లు రుజువయ్యిందో చూశావా!
బతికినన్నాళ్ళూ
కర్ర బుచ్చుకుని తరిమే కులం
చావులోనూ
మనిషిని కుళ్ళబొడుస్తుంది
బడిలో, గుడిలో,
నీటిలో, తిండిలో,
ఆఖరుకి కాటిలో
నీడలా వెంటాడే సైతాన్ కులం...
ఇక్కడి నేలకీ కులముంది
కులమున్నోడికే భూమి
కులం తక్కువోడు
భూమి కావాలన్నప్పుడల్లా
‘నరబలి’ కోరుతుంది కులం...
కులం నాలిక మచ్చలమారిది
కానీ, నేల  అబద్ధమాడదు
పత్రాలతో దస్త్రాలతో
దానికి పనిలేదు...
ఏ శవం కార్చిన
చెమట బొక్కెనలతో
తాను తడిసి ముద్దయ్యిందో
ఎవరి చేతిలో చదునై
తను పంటయ్యిందో
మట్టికి తెలుసు...
ఎవరు తనని వొంటికి పులుముకుందీ
ఏ మట్టి బిడ్డలు
తన వీపుమీద అంబాడిందీ
తనకి  గుర్తే...
చెరబట్టేవాడెవడైనా
తనని ముద్దాడే
మట్టి పెదాల స్పర్శ
ఈ మన్నుకి ఎరుకే...
మట్టి తల్లి ఓరిమికీ ఓ హద్దుంటది
తనని పెనవేసుకున్న మనిషికి
నేలమాళిగలో
ఆరడుగుల చోటియ్యని కట్టడిని
నేల ఎప్పటికైనా
బలికోరక తప్పదు...
 
 29.08.2019










Comments

Popular posts from this blog

Charvaka Asram- Write up

Nomadic Tribe- Chenchu

Dalit Women's Writing-EPW