CAB- poem













బరిగీత
                                             చల్లపల్లి స్వరూపరాణి

గొంతుకు కత్తి వేలాడేసుకుని
నెత్తురోడుతున్న కల్లోల బతుకులు
అనివార్యంగా
చౌరస్తామీదకొచ్చి
జానెడు పౌరసత్వం కోసం
యిప్పుడు బరిగీత మీద నుంచోక తప్పలేదు...
ఏరోజుకారోజు
‘శీల పరీక్ష’ సర్కస్ తాడు మీద నడవడం...
ఆదివాసీ మనిషి చెట్టు వేళ్ళమీద
గొడ్డలి గురిపెడితే
ఎప్పటికప్పుడు
అడవి తన ఆనవాలని
నెత్తురోడ్చి మరీ నిరూపించుకోవల్సి రావడం...
ఏపూటకాపూట
అభద్రతని చప్పరిస్తూ
రాజ్యం కణత మీద తూటా గుచ్చితే
ఉన్నపాటున
ఊరు ఖాళీ చెయ్యాల్సి రావడం...
నోరుండగా నాలిక కత్తిరించడం
నిలువెత్తు మనిషి నుంచి
నీడ మాయమవ్వడం
ఈ మట్టిలో
తన పాదముద్రలు పాతేసుకున్న మూలవాసిని
రాత్రికి రాత్రి దేశం నుంచి వెలెయ్యడం...
యింతకీ కాందిశీకుడంటే ఎవురు బాబయ్యా!
ఐదారు వేల ఏళ్ల పత్రాలు, సాక్ష్యాలూ
ఇనప్పెట్టెలో దాచుకుని
అడగ్గానే చూపెట్టడానికి
వీపుకు కట్టుకు తిరగలేని
వెర్రిబాగులోడా?
తన దేహాన్ని ఎరువేసి
ఈమన్నులో చెమట మళ్ళు పారించి
సంపదని దేశం గరిసెలకెత్తినోడా?
ఎండలో వానలో
మంచులో మబ్బులో
చావు సరిహద్దులో నిల్చుని
దేశానికి పహారా కాసినోడా?
సెంటు నేలపై
హక్కు భుక్తం లేకపోయినా
అనివార్యంగా దీన్ని కళ్ళకద్దుకుని
గుండెలపై మోసిన
బరిబాతల మట్టి చేతులా?
వెధవది ఆవుల మందైనా కాకపోతిమి
నడి దేశం మీద నిలబడి
ఈదేశం మాదని
జబ్బ చరిచేవాళ్ళం బాబయ్యా!
పుట్టుకతో నేరస్తులమై
చివరాఖరు మనుషులమై
పిడికెడు భూభాగం పొందలేక
దేశంలోపల పరాజితులుగా మిగిలేం...
పుట్టి పెరిగిన ఇంట్లోంచి గెంటేస్తే
కనుగుడ్ల నిండా నీరు కుక్కుకుని
నిలవ నీడకోసం అంగలార్చాం...
మాకిక పరుగెత్తే ఓరిమి లేదు
ఈదేశానికి అన్నం పెట్టిన
సిసలైన దేశ భక్తులెవురో
బొజ్జలు నింపుకున్న
తిండిపోతు తిమ్మన్నలెవురో
చాంతాడంత చిట్టా విప్పాల్సిందే...
ఏడేడు తరాలు తవ్విపోస్తాం
ఇక బరిగీత మీద నిలబడి
తాడో పేడో తేల్చుకుంటాం
తాత ముత్తాతలు తచ్చ్చాడిన
సింధూనది వొడ్డు మీద ఆన
లెక్క తేలాల్సిందే...
16.12.2019

Comments

Popular posts from this blog

Nomadic Tribe- Chenchu

My Poetry

Sahoo Maharaj- essay