Unnav rape- poem




చీకటి ఋతువు
                                                        చల్లపల్లి స్వరూపరాణి

బోధిసత్వుడు సమత, కరుణలు
విత్తిన ఈనేల
ఇప్పుడు శాపగ్రస్త బీడుభూమి
వివేకం వికసించని ఇసుక పర్ర
నిష్క్రియా పరత్వం ఆవులించే
భీతావహ మౌన లోగిలి
ప్రశ్నలు మొలవని స్మశాన స్థలం...
జంతువుల్ని పూజించి
ఆడపిల్లల బతుకులు
బుగ్గిపాలు చేసే ఈ దేశం పేరు
వాకపల్లి, కథువా, ఉన్నావ్,
వరంగల్, హైదరాబాద్, అసీఫాబాద్...
పేరేదైనా మదోన్మాదం దీని సర్వనామం
హత్యాచారం దీని చిరునామా...
ఇక్కడ
గుడిలో బడిలో ఇంట్లో వీధిలో
ఒక దాహం బుసలు కొడుతుంది...
కూతుళ్ళు, భార్యలు, తల్లులు తప్ప
స్త్రీలు ఉండకూడని చోటు యిది...
ఇక్కడ ఆడ శరీరాలు తప్ప
ఆడ వ్యక్తులకు స్థానం లేదని
అనధికార ‘ఫత్వా’ జారీ అయింది...
కులం, ధనం కూడబలుక్కుంటాయిక్కడ
నేరస్థుడి పుట్టుక
అతనికి శిక్ష ఖరారు చేస్తుంది
తరాలు గడిచినా ఎప్పటికప్పుడు
సరికొత్త మను శిక్షాస్మృతి
గొంతు సవరించుకుని
బోర విరుచుకుంటుంది...
దొర కోరుకున్నట్టే
ఓడిపోయిన మనుషులు
మెదడు కూడా పోగొట్టుకుని
మూకలుగా మిగిలిపోయిన చోటు...
రాజు ఆశించినట్టే
కూలిపోయిన జనం
పిడికిళ్ళుగా మొలకెత్తకుండా
హంతకుడికి వంతపాడే పీల గొంతులుగా
చప్పట్లు చరిచే చేతులుగా మిగిలిన కాలం...
అవును ఇది రాతి యుగాన్ని తలపించే
చీకటి ఋతువు...
09.12.2019
ఫోటో: ఉన్నావ్ మృతురాలి అంత్యక్రియల వద్ద దృశ్యం

Comments

Popular posts from this blog

Nomadic Tribe- Chenchu

My Poetry

Sahoo Maharaj- essay