ప్రవహించే కల

చల్లపల్లి స్వరూపరాణి

 

ఒక తెల్లటి బూటుకాలు  

తరాలనుంచి  

మెడ నరాలమీద

అదిమివుంచినా 

ఆకాశమంత స్వేచ్ఛగా

గాలిపీల్చుకోవాలని

నా శతాబ్దాల కల

ఈ ఉచ్చిష్టపు రొదలో

కదులుతూనే వుంది.

వూపిరాడనితనంలో

ఆహ్లాదాన్ని కలగనడం

నాకిష్టమైన దినచర్య...   

ఆరంగుకే మచ్చ తెచ్చిన

తెల్ల తోలూ!  

మనిషి నెత్తురు మరిగిన

తెల్ల పులివి కదా!

గొంతు నులమడం

కలల్ని చిద్రం చెయ్యడం తప్ప

నీకేం తెల్సు!

నువ్వు అందరిముందూ  

జబ్బలు చరుచుకునే

ప్రగతి అంతా

నా చెమట కష్టంతో 

పోగు చేసింది కాదా చెప్పు!

అయినా, ఇంకా   

గుక్కెడు మనిషితనం కోసం

నాజాతి గసపెడుతూనే వుంది.

నెత్తుటి మడుగుమీద నిలబడి

శాంతి గీతమాలపించే

నాటకాలమారి తెల్ల పావురమా!

అన్ని రంగుల్నీ

నీలో ఇముడ్చుకున్నావని ఎవరన్నారు?

సమస్త రంగుల చేపల్నీ దిగమింగి

బ్రేవుమని తేన్చిన

తిమింగలం నీపేరు

తెలుపంటే ఓ లాఠీ కర్రని

నలుపంటే మట్టిచేతుల కష్టం అనీ

నిన్నూ నన్నూ చూసిన 

ప్రపంచం అర్ధం చేసుకుంది.   

నీ నంగిరి పింగిరితనాన్ని

నటనతో  ఎంతకాలం కప్పిపెడతావ్?

నువ్విక క్షమకి అర్హుడివి కావు

నెత్తురూ, కన్నీళ్ళూ

అంటిన నా కల

నిన్ను

నిలువెల్లా దహించివెయ్యక మానదు...    

నీ తెల్ల మేడమీద  

నల్లటి తారు జల్లు

కురవబోతుందని

వాతావరణ హెచ్చరిక

జారీ అయింది...  

ఊపిరాడక ఉస్సురుస్సురన్న

నల్ల గొంతు ఏడుపు పాట

చేరాల్సిన చోటుకి చేరింది.

నా ఆగిపోయిన నాపాట అందుకుని  

నీకెదురు నడిచే మనుషులు

చాలామందే వున్నారని తెలుసుకో!

పాలిపోయిన పాండపు మోహంతో 

నువ్విక గోడ కుర్చీ మీద

చేరగిలపడే అంత్యదినం

వీధుల్లో చప్పుడు చేసుకుంటూ వస్తుంది

అవును,

దేశ దేశాల నల్ల చీమలు

నాకలని చేతబట్టుకుని  

ప్రవహించడం మొదలుపెట్టాయి   

(కవి సంధ్య, రజతోత్సవ సంచిక, మే-ఆగస్టు, 2020)

 

 04.06.2020

 

 

Comments

Popular posts from this blog

Nomadic Tribe- Chenchu