యాభై యేళ్ళు
దాటినాక కూడా నాన్న తాడిచెట్టు ఎక్కి తాటి కాయలు కొట్టి ఎద్దుల బండి మీద ఇంటికి
తెచ్చి ఇంకొద్దు అనేదాకా మా పిల్లలందరికీ ముంజలు కొట్టి ఇచ్చేవాడు...
నాన్నా! నువ్వే
నా పూల పొట్లం...
పూల పొట్లం
దీపావళి రోజు
తాటి గులకలతో
చేసిన
పూల పొట్లం
పంగల కర్రతో
బుర్రల బండి
తిప్పుకోని
బాల్యం
నాకెందుకో
చప్పగానే వుంటాది...
పుస్తకం పేజీలలో
దాచి
పంతుళ్ళకి
కనబడకుండా
చప్పరించడానికి
తాటి చాపలేని బడి
పిల్లలు
నాకెందుకో
వెలితిగానే వుంటారు...
కల్పవృక్షం ఏమేమి చేస్తదో తెలీదు గానీ
తాటి చెట్టు మాబతుకంతా
కాసి
అడక్కుండానే
అన్నీ సమకూర్చి
పెట్టే చల్లని తల్లి...
ఎండకీ వానకీ బెదరాకుండా
నిటారుగా
నిలబడమని
మౌనంగా హెచ్చరించే
నాన్న...
చేత్తో చెంబుడు
నీళ్ళు పొయ్యకపోయినా
నొచ్చుకోకుండా
జలజలలాడే ముంజలు,
కమ్మటి పండు తాటి
చెక్కలతో
కడుపునింపే పేదరాసి
పెద్దమ్మ...
బతికుండగా అన్నీ
ఇచ్చిందికాక
తన శక్తి గుజ్జు చీకి
పారేసినా
చచ్చిపోయి తేగగా
మాకోసం తిరిగొచ్చే
జీవలక్షణం
తాడి చెట్టుకే
తెలుసు...
మా
నల్లతల్లి
పొట్టనింపే
తినుబండారమేకాదు
వెన్నెముకలాంటి
మాఇంటి నిట్టాడి
ఇంటికి
బలాన్నిచ్చే దూలం
మాకు ఎండపొడ
సోకనీయని
పచ్చటి పైకప్పు దుప్పటి...
కాలం అంతా
ఎండాకాలమై
బతుకుపై వడగాడ్పు
విసిరితే
సేదదీర్చే చలువ
పందిరి
మా దూరాబారాల్ని
కుదించి
అవతల వొడ్డుకి
చేర్చే
బొత్త వంతెన ఆప్తుడు
చీకటి చెత్తని
ఊడ్చిపోసే చీపురు కట్ట...
మా తాడి చెట్టు
వెలగని పొయ్యిని
గనగనమని మండించే
మట్ట, జీబు, జిబట,
ముచికల వంటచెరకు...
వొళ్ళు
వెచ్చబడితే ఆదుకునే
తాటి బెల్లం
వైద్యురాలు...
ఎడమొహం పెడమొహం మనుషుల్ని
ఊరెలపటకి
తీసుకెళ్ళి మాటా మంతీ కలిపే
కల్లుకుండ దౌత్యవేత్త
...
ఇన్ని పాత్రల్లో పున్నీటి
కుండై
మనిషిని కడుపులో
దాచుకున్నా
కాసింత మన్ననకి నోచుకోని
తాడిచెట్టుని
మావాడ మనుషులలో
మనిషిగా
ఇళ్ళ మధ్యనే
పాతుకుంటుంది...
తేగ నిలువునా
చీలిపోయినా
ఆకటి చీకటిలో ఆడే
మాపిల్లలకి
చందమామని
ఇచ్చిందని కాబోలు...
21.06.2020
Comments
Post a Comment