మిణుగురులు – 6
కుల పితృస్వామ్యానికి వైద్యం చేసిన జ్యోతి లింగమ్మ
చల్లపల్లి స్వరూపరాణి
అవి 19 వ శతాబ్దపు చివరి రోజులు. వొకపక్క బ్రిటీష్ పాలనలో ప్రజలు స్వేచ్చా
స్వాతంత్ర్యాల కోసం అర్రులు చాస్తుంటే సామాజిక అంతస్తుల్లో ఆఖరి మెట్టుపైన వున్న
కులాలు అంటరానితనం, వెట్టిచాకిరీ, అవిద్య చుట్టుముట్టిన చీకటి కుహురంలో దుర్భరమైన పీడన అనుభవిస్తున్నారు. దళిత స్త్రీలు అవిద్య,
అంటరానితనం, పేదరికంతో పాటు గ్రామీణ భూస్వామ్య వ్యవస్థలో జోగిని, బసివి వంటి
దురాచారాల బారినపడి లైంగిక దోపిడీకి, దౌర్జన్యాలకూ గురౌతున్నారు. వీరి పరంగా
యెటువంటి సంస్కరణ ప్రారంభం కాలేదు. యితర స్త్రీల కంటే దళిత స్త్రీలు యెక్కువ పీడన అనుభవిస్తూ నిచ్చెనమెట్ల సమాజంలో
ఆఖరి మెట్టుపైన వున్నారు. ఆధునికత, సంస్కరణ అనేవి అప్పటికి వీరి గుమ్మం తట్టలేదనే చెప్పాలి. చదువంటే కేవలం
అగ్రాహారాలలో పుట్టి పెరిగిన వారికి తప్ప యితరులకు అంతగా అందుబాటులోకి రాని
పరిస్థితి యింకా వుంది. బ్రాహ్మణ అగ్రహాలలో వుండే మఠాలు విద్యా పీఠాలుగా భాషా
సాహిత్యాలు, వాస్తుశాస్త్రం, జ్యోతిష్యం, ఆయుర్వేద వైద్యం వంటి విషయాలనే ప్రధానంగా
బోధిస్తుండేవి. బ్రిటీషు వారి రాకతో వొచ్చిన ఇంగ్లీషు విద్య, తద్వారా వెలుగులోకి
వొచ్చిన పాశ్చాత్య భావజాల ప్రభావంతో కొందరు చైతన్యం పొంది భారతీయ సమాజంలో పేరుకుపోయిన
అవిద్య, అంధ విశ్వాసాలు, సామాజిక రుగ్మతలైన బాల్య వివాహాలు, నిర్బంధ వైధవ్యం,
సతీసహగమనం వంటి దురాచారాలను రూపుమాపడానికి ముందుకొచ్చారు. యీ క్రమంలోనే బ్రహ్మ
సమాజం వంటి సంస్థలు నిర్మాణమయ్యాయి. బ్రహ్మ సమాజం
స్త్రీ విద్యతో పాటు వారి పరంగా అమలౌతున్న సామాజిక రుగ్మతలను
రూపుమాపడానికి, అణగారిన కులాల సంస్కరణకూ కృషి చేసింది. అంటరాని కులాలుగా
పరిగణించబడే అణగారిన కులాలకు క్రైస్తవ మిషనరీలతో పాటు బ్రహ్మ సమాజం వంటి సంస్థలు
కూడా విద్యనందించడం ద్వారా వారి సంస్కరణకు దోహదం చేశాయి.
జ్యోతి లింగమ్మ నేటి ప్రకాశం జిల్లా మార్టూరుకు సమీపంలోని రాజుపాలెంలో దళిత
మాల కులంలో గోవతోటి వారింటి ఆడపడుచుగా 1866 సంవత్సరంలో జన్మించింది. ఆ చీకటి రోజుల్లో కూడా దళితుల్లో బాల్య
వివాహాలు, నిర్బంధ వైధవ్యం, సతీసహగమనం వంటి దురాచారాలు ఉండేవి కావు. లింగమ్మకు యుక్త
వయసు రాగానే ప్రస్తుత అద్దంకి సమీపంలోని తాళ్ళూరు గ్రామ వాసియైన జ్యోతి వోబయ్య
గారి కుమారుడైన కోటాదాసుతో వివాహం జరిపించారు. జ్యోతి వంశం కొన్ని తరాలుగా నేత
వృత్తిని కుల వృత్తిగా చేసుకుని జీవించేవారు. యీ కుటుంబం నేత పనిలో సాధించిన
ప్రావీణ్యం యితరులకు కంటగింపుగా మారిన సందర్భం కూడా వుంది. వోబయ్య పూర్వీకుడైన ‘మార్కాపురం’ మంచి పేటంచు పట్టు పంచె స్వయంగా
నేసుకుని ధరించడాన్ని సహించని అక్కడి పెత్తందారీ కులానికి చెందిన గ్రామాధికారి
కరణం అటువంటి పంచె తనకూ నేసి యివ్వమని అడిగినప్పుడు మార్కాపురం తాను కట్టుకున్న పంచెను విప్పి ఆ కరణానికి
యివ్వబోయాడు. మాల కులస్తుడు తాను వుపయోగించిన
బట్టను పెద్ద కులస్తుడైన తనకు యివ్వడాన్ని
గ్రామాధికారి కరణం తీవ్రమైన అవమానంగా భావించి అతనిపై ద్వేషం పెంచుకుని
మార్కాపురం పైన చేతబడి చేయించి చంపాడనిఅంటారు. ఆ తర్వాత యిటు దళిత మార్కాపురం
కుటుంబంలోని పురుషులు, కరణం కుటుంబం లోని పురుషులు అంతా అనుమానాస్పదంగా మృతి
చెందారు. అప్పట్లో జ్యోతీ కుటుంబం ప్రకాశం జిల్లా పొదిలి నగరానికి సమీపంలోని
‘కుంచే పల్లి’ లో నివసించేవారు. మార్కాపురం యేడుగురు అన్నదమ్ములలో వొకడు. యీ
వుద్రిక్త పరిణామాల నేపధ్యంలో మగవారు చనిపోగా మిగిలిన స్త్రీలు, పిల్లలు తాళ్ళూరు
వలస వచ్చి అక్కడే వివాహ సంబంధాలు యేర్పరచుకుని స్తిరపడ్డారు. కోటాదాసు తండ్రి
వోబయ్య అలా వొచ్చిన పిల్లల్లో వొకడు.
తాళ్ళూరు గ్రామంలో జ్యోతీ కుటుంబం వారు నేత వృత్తితో సమృద్ధిగా జీవనోపాధిని
పొందడంతో పాటు వెంకటగిరి సంస్థానంలో భూమి శిస్తు వసూలు చేసే గౌరవప్రదమైన వుద్యోగం
పొందడం వలన ఆ కుటుంబానికి తమ కులంలోనే కాక
సమాజంలో కూడా కొంత పలుకుబడి దక్కింది. వారికి ఆర్ధిక స్థోమత, సాగు చేసుకోడానికి తమదైన
స్వంత వ్యవసాయ భూమి కూడా పుష్కలంగా వుండడమే ఆ గౌరవానికి కారణం. దీనికి తోడు వారిది తరాలనుంచి పల్నాటి
సంప్రదాయాన్ని పాటిస్తూ వస్తున్న వంశం. పల్నాటి సంప్రదాయాన్ని పాటించడాన్ని ‘దాస’
సంప్రదాయం అంటారు. ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వొచ్చే కుటుంబాలవారు తమ పేరు
చివర ‘దాసు’ అని పెట్టుకోవడం ఆచారం. ఆ విధంగా ‘కోటయ్య’
‘కోటాదాసు’ అనే గౌరవ ప్రదమైన పేరుకు అర్హుడయ్యాడు. కోటాదాసు బ్రహ్మసమాజపు మనిషి, దేశికాచారియైన
శేషయ్య గారి దృష్టిలో పడ్డాడు. పుట్టుకతో బ్రాహ్మణుడైనా, శేషయ్య బ్రహ్మ సమాజపు
ఆశయాలకోసం కులపరమైన కట్టుబాట్లను వొదిలి వుదారవాదిగా గుర్తింపు పొందాడు. ఆయన ప్రోత్సాహంతో కోటాదాసు చదువుకుని తెలుగు,
సంస్కృత భాషల్లో పాండిత్యం సంపాదించి
జానపద నాటకాలు, జంగం కధలు రాయడం ప్రారంభించాడు. ఆయన రాసిన నాటకాలు ఆ
ప్రాంతంలో అనేకసార్లు ప్రదర్శించ బడ్డాయి.
ఆయన రాసిన ‘చిరియాళ’ నాటకం 19౦౩ లో అచ్చయింది. ఆ విధంగా ఆయన తెలుగులో మొదటి
దళిత రచయిత, కవి అయ్యాడు.
లింగమ్మకు చదువు లేదు. కానీ ఆమె భర్త కోటాదాసు నుంచి చదవడం, రాయడం
నేర్చుకుంది. కోటాదాసు అన్న తిరుపయ్య గొప్ప ఆయుర్వేద వైద్యుడు.
లింగమ్మ తన బావగారైన తిరుపతయ్య నుంచి
ఆయుర్వేద వైద్య విద్య నేర్చుకుని అందులో ప్రావిణ్యం పొందింది. ఆమెకు మూలికలను
చెట్లనుంచి గ్రహించడం వాటితో వైద్యం చెయ్యడం అలవాటయ్యింది. తాళ్ళూరు గ్రామంలోనే
గాక చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఆమె దగ్గరకొచ్చి వైద్యం చేయించుకునేవారు.
కులం కారణంగా కొందరు దూరం జరిగినప్పటికీ వైద్య వృత్తిలో లింగమ్మ సాధించిన ప్రావీణ్యం ముందు కులం చిన్నబోయిందని
చెప్పొచ్చు. ఆమె దగ్గర అన్ని కులాలవారు వైద్యం చేయించుకోవడంతోపాటు వైద్య వృత్తిని
ఆమె వద్ద నేర్చుకున్న వారిలో కూడా అన్ని
కులాలవారు వుండడం విశేషం.
లింగమ్మ భర్త కోటా దాసు, బావగారు తిరుపతయ్య చనిపోయాక ఆమె ఆ రెండు
కుటుంబాలకు పెద్ద దిక్కై సాకింది. లిగమ్మకు కొడుకు చెన్నకేశవులుతో పాటు అచ్చమ్మ,
ఈశ్వరమ్మ, కోటమ్మ, శేషమ్మ అనే నలుగురు కూతుళ్ళున్నారు. ఆమె కొడుకు చెన్నకేశవులు
కూడా తండ్రిలాగే గొప్ప పాండిత్యం పొందినప్పటికీ ఆయన వొకపక్క కులవృత్తి ఐన నేత పని
చేస్తూనే తల్లి లింగమ్మకు వ్యవసాయ పనుల్లో తోడుగా వుండేవాడు. లింగమ్మ తన మనవడు
జ్యోతి శ్రీరాములుని వెంటబెట్టుకుని వైద్యం చెయ్యడానికి గ్రామంలో తిరుగుతూ
వుండేది. ఆ విధంగా ఆయనకు ఆయిర్వేద వైద్యం
నేర్పించింది. ఆయన ఆమె శిక్షణలో శ్రీరాములు
గొప్ప వైద్యుడుగా, కవిగా యెదిగాడు. తర్వాత తరంలో ఆమె ముని మనవడు,
శ్రీరాములు కుమారుడైన విద్వాన్ జ్యోతీ
చంద్రమౌళి గారు విశిష్టమైన పండితుడిగా, చరిత్రకారుడిగా గుర్తింపు పొందడం విశేషం.
యిదంతా లింగమ్మ అనే గొప్ప శక్తివంతురాలి కృషివల్లనే సాధ్యపడిందని చెప్పాలి. ఆమె
వ్యవసాయం కూడా చాకచక్యంతో చేసేది. యెంతో ధైర్యం, తెగువ వున్న లింగమ్మ అంటే ఆ గ్రామస్తుల్ల్లో
కొందరికి భయం, మరి కొందరికి యీర్ష్య, యెక్కువమందికి ఆమె అపురూపం, ఆశ్చర్యం. వైద్య
వృత్తిని, వ్యవసాయాన్ని యెంతో ఆత్మ విశ్వాసంతో చేస్తూ వుండే ఆమె అన్యాయాన్ని
సహించేది కాదు. అవమానకరంగా
ప్రవర్తించేవారు యెంతటి వారైనా నిలదీసి ప్రశ్నించడం ఆమె వ్యక్తిత్వ లక్షణం. వొకసారి
పొలంలో గడ్డి కోసుకురావడానికి వెళ్ళిన లింగమ్మతో వో పెత్తందారీ కులస్తుడు అమర్యాదకరంగా
ప్రవర్తించడంతో ఆ విషయమై పంచాయితీ యేర్పాటు చేయించి లింగమ్మ అతన్ని అందరి ముందు
చెప్పుతో కొట్టి ఆనాటి సమాజాన్ని
వులికిపాటుకు గురిచేసింది. ఆమె జ్యోతీ కుటుంబ సాహసోపేతమైన వారసత్వాన్ని, ఆత్మగౌరవాన్ని చాటేవిధంగా
జీవించిందని చెప్పాలి. లింగమ్మ చూపిన ధైర్యం, చొరవ ఆనాటికే కాదు యిప్పటికీ
ఆశ్చర్యకరమైనదే!
జ్యోతి లింగమ్మ మానసికంగానే కాదు, శారీరకగా కూడా యెంతో శక్తివంతురాలు. ఆమె
తన నిండైన జీవితాన్ని అర్ధవంతంగా, సమాజ సేవకు అంకితం చేసి తన
యెనభై నాలుగో సంవత్సరంలో 1952లో చనిపోయింది. ఆమె సమాధి తాళ్ళూరు గ్రామంలో
యిప్పటికీ వుంది. లింగమ్మ కులసమాజం దళితులపై రుద్దిన కులపరమైన ఆంక్షలను,
పితృస్వామిక వ్యవస్థ స్త్రీల బతుకులపై కుమ్మరించిన వివక్షనూ మొత్తంగా బ్రాహ్మణీయ
భావజాలాన్ని సవాలు చేసింది. అన్నిరకాల
అవరోధాలను సాహసంతో అదిగమించడంలో జ్యోతీ లింగమ్మ బురద నుంచి పైకి లేచిన తామర
పువ్వు. దళితుల పరంగా, ముఖ్యంగా దళిత స్త్రీల పరంగా కనీసపు వెలుతురు సోకని చీకటి
రోజుల్లో వొక దళిత స్త్రీ వైద్యురాలిగా రాణించడం, సొంత వ్యక్తిత్వంతో ప్రకాశించడం,
ధైర్య సాహసాలతో పెత్తందారీ కుల మగ దురహంకారుల దాస్టీకాన్ని ధిక్కరించడం అసాధారణమైన
విషయం. యే రంగంలోనైనా ప్రావీణ్యం సాధించడం అనేది వొక కులానికో, జెండర్ కో
పుట్టుకతో సంక్రమించే ప్రతిభ అని భావించే సమాజంలో వ్యవస్థీకృత సంప్రదాయ విలువల్ని
యీడ్చి తన్ని భావితరాలకు గొప్ప పోరాట వారసత్వాన్ని అందించిన లింగమ్మ వో
సాహసి. దళిత సమాజం గ్రామాలలో పెత్తనదారుల
ఆగడాలను భరించడం, బలైపోవడం తప్ప యెదురు తిరిగి వారితో కలబడి నిలబడిన యిటువంటి
అరుదైన సంఘటనలు చరిత్రలో పెద్దగా లిఖించబడలేదు.
అటువంటి ధిక్కార చరిత్రకు లింగమ్మ జ్యోతి ప్రజ్వలన చేసిందనవచ్చు.
Comments
Post a Comment