Nelapoori Ratnaji


            










రాజకీయ చురకలు- రత్నాజీ 'నెత్తుటి మరకలు
చల్లపల్లి స్వరూపరాణి

నిజమే తమని జంతువులకంటే హీనంగా చూసే దేశాన్ని యెవరైనా తమదని యెలా అనుకుంటారు? పైగా యిక్కడ కొంతమంది అనునిత్యం యీ దేశం పట్ల తమ విధేయతని ప్రకటించాల్సి రావడం వారి శీల పరీక్షలాంటిదే.దళితులు అన్నం కోసం, గుడ్డ కోసం యేడ్చినప్పుడు పెత్తదారులకు వారి మీద చంపేంత కోపం వుండేది కాదు. దళితులు గుడిమెట్లు, బడిమెట్లు యెక్కడం, పంచాయితీ సర్పంచులు గా గెలిచి అధికార హోదాలో కూర్చోవడం, చారెడు పరిగ గింజల కోసం పడిగాపులు పడకుండా వారే తమ సొంత భూములను  సాగుచేసుకోవడం లక్షింపేట నరమేధానికి అసలు కారణం. యెక్కడైనా దళితుల వూచకోత అనేది పైకి కుల సమస్యలాగా కనిపించినప్పటికీ దాని వెనుక పెత్తందారీ కులాల ఆర్ధిక, రాజకీయ ప్రయోజనాలు వుంటాయనేది స్పష్టం. నేలపూరి రత్నాజీ ' నెత్తుటి మరకలు  దీర్ఘ కవిత దళిత సమస్య కేవలం సామాజిక సమస్య కాదు, అది వారి, ఆర్ధిక, రాజకీయ సమస్య అనే అంబేడ్కర్ ధృక్పధాన్ని చాలా స్పష్టంగా ప్రతిఫలిస్తుంది.

నేలపూరి రత్నాజీది  వో ప్రత్యేకమైన గొంతు. అతడు కేవలం కవి కాదు. దళిత తాత్వికను బాగా వంటబట్టించుకున్న వాడు. అంబేడ్కర్ ఆర్ధిక, సాంఘిక, రాజకీయ ధృక్పధాలను సీరియస్ గా అధ్యయనం  చేసి దాన్ని తన కవిత్వంలో పలికిస్తున్నాడు. పైకి అంబేడ్కర్ భజన చేస్తూ 'గాంధీ మార్గంలో ప్రయాణం చేసే దొంగ అంబేడ్కరిస్టుల అజ తెలిసిన రత్నాజీ వారి బండారాన్ని బయట పెట్టాడు.  యీ దీర్ఘ కవితలో సమకాలీన హిందుత్వ రాజకీయాలను వీలున్న చోటల్లా  యెండగట్టాడు రత్నాజీ.  హిందుత్వ పులి ఆకలి లక్షింపేట నరమేధంతో చల్లబడకుండా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రోహిత్ ని బలితీసుందని,  దళితులు తినే  ఆహారం మీద నిషేధం విధిస్తూ ఫాసిస్ట్  చర్యలకు పాల్పడుతుందని రత్నాజీ అంటాడు.

నేలపూరి రత్నాజి 'నెత్తుటి మరకలుకీలవేన్మణి నుంచి కారంచేడు, చుండూరు,లక్షింపేట దాకా సాగిన దళితుల వూచకోత, వాకపల్లి ఆదివాసీ స్త్రీలపై రాజ్యహింస వరకు జరిగిన సంఘటనలలో   దాగున్న సాంఘిక, ఆర్ధిక, రాజకీయ కోణాలను యేకరువు పెడుతుంది.
' దేశపు ముఖ ద్వారం
శంభూకుడిని వేటాడిన కత్తులబోను
అని దీని చిరునామా యెంత వికృతమైనదో పరిచయం చేస్తాడు కవి.
అలాగే 'యిక్కడ పారుతున్న
జీవనదుల పక్కనే పొంగుతున్న్న
మా దు: నదులువుంటాయని నాణానికి అవతల వైపు దృశ్యాన్ని చూపిస్తాడు. 
 
లక్షింపేట దళితుల వూచకోతకు ముఖ్య కారణం  భూమి సమస్య .  భూమి సమస్య యీనాటిది కాదు. దళితులు భూమిపై హక్కు పొందిన ప్రతిసారీ వారిపై దాడి జరిగిన సందర్భాలు చరిత్రలో కోకొల్లలు. దళితులు భూమిపై యజమానులు గా వున్న అరుదైన సందర్భాలలో పెత్తందారీ కులాలు కళ్ళల్లో నిప్పులు పోసుకుని వారి పొలంలోకి నీరు పారనివ్వకుండా, దారి యివ్వకుండా వారిని కట్టడి చెయ్యడం, పండిన చేలల్లో గేదెల్ని తోలి పాడు చెయ్యడం వంటి దుర్మార్గాలకు పాల్పడుతూ దళితులను గ్రామాలలో ప్రధాన ఆర్ధిక వనరు అయిన భూమికి దూరం చెయ్యడం జరుగుతుంది.  ఆంధ్ర ప్రదేశ్ లో పోలీసు రికార్డులకెక్కిన మొట్ట మొదటి కేసు  భూమి కి సంబంధించినదే! 

భూమిపై యజమానులుగా లేకపోయినా గ్రామాలలో సగటు దళిత కుటుంబం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వ్యవసాయ భూమిపైన  కౌలుదారులుగా, వ్యవసాయ కూలీలుగా ఆధారపడి జీవనోపాధిని పొందుతుంది. అందుకే రత్నాజీ

' మా చేతులతో కలగుమ్మిన భూమి
మా కాళ్ళకింద పచ్చగా మొలకెత్తిన భూమి
నిత్యం మేం పొర్లాడిన భూమి
మేడ గిన్నెలో మెతుకై
వాడ గొంతు దిగని యెక్కిల
యెందుకయ్యిందో
చరిత్రపై కొరడా పట్టాలి
గ్రామ చావిట్లో నిలబెట్టి తాట వలవాలి
అని ధర్మాగ్రహం వ్యక్తం చేస్తాడు.

అలాగే తాను నమ్ముకున్న మట్టి తనది కాకుండా పోతున్నప్పుడు దానితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుని మట్టి కూడా మనసు మార్చుకుని వేరొకరి చేతిదండమయ్యిందని వొల పోస్తాడు.

' మట్టికి నేను తెలుసు
నా చెమట వాసన తెలుసు
అలాంటి భూమి
మాట్రిక్స్ మాంత్రికుల
చేతిదండమయ్యింది
నన్ను మరిచి పోయింది
యెంత మారి పోయింది!’
భూమి అడిగితే గ్రామీణ  పీత్తందారీ కులాలకు యెక్కడలేని ఆగ్రహం కట్టలు తెంపుకుని వస్తుంది.
సాగు అడిగి నందుకే
శవాలొచ్చి పడ్డాయి
సేద్యగాళ్ళమైనందుకే
శేర్లు రక్తం
హిందూ మహాసముద్రంలో వొలికింది

భూమి సాగులో చెమటోడ్చే వాడికి భూమి మీద, దానికి సంబంధించిన పనిముట్లమీద అనుబంధం, మమకారం వుంటుంది. అందుకే కవి 'నాగలి మా మట్టి వాకిట్లో నిలబడ్డ జాబిలిఅంటాడు. యీ మాట పొలం గట్టు మీద నిలబడి కర్ర పెత్తనం చేసేవాడి  కలం నుంచి రాదు. అయితే రత్నాజీ దొరల పొలంలో గొడ్డు చాకిరీ చేస్తూ నాష్టాల్జియాలోనే బతికేద్దాం అనుకునే సెంటిమెంటల్ కాదు. యిక్కడ అనాదిగా భూమి వున్నవాడే అధికారి గా వున్నాడు కాబట్టి 'భూమితోనే ఆత్మ గౌరవం/  భూమితోనే అధికారం/ భూమితోనే ఆర్ధిక సమానత్వంఅని భూమితో ముడిపడి వున్న గౌరవాన్ని కవిత్వీకరించాడు.   

ఖైర్లాంజి దళితుల  వూచకోత నుంచి లక్షింపేట నరమేధం వరకు ఘోర కృత్యాల్ని దగ్గరుండి సుతారం చూడ్డమే కాక కొండొకచో దళితులపై దాడికి కర్ర సాయమందించిన పెత్తందారీ  కులాల స్త్రీల దాష్టీకాన్ని రత్నాజీ 'నెత్తుటి మరకలు లో 'పురుషాంగం మొలిచిన / మీ ఆడోళ్ళు సైతం / కర్ర పట్టారు/పర్ర కొట్టారు అని నిష్టూరంగా అంటాడు. 'వూసెత్తు మర్యాద కూడా/ మా ఆడోళ్ళపట్ల పాటించలేకపోయారుఅని మా స్త్రీలకు సంబంధం లేని చట్టసభల్లో వాటా అవసరం లేదంటాడు. వాకపల్లి ఆదివాసీ స్త్రీలను, చీమకుర్తి దళిత స్త్రీని చెరపట్టినవాళ్ళు రామాయణంలో శూర్పణఖ ముక్కు, చెవులు కోసిన  వారి సంతతివారని, వారిని 'తాలిబన్లతో పోలుస్తాడు.  

లక్షింపేట వంటి నరమేధం  అధికారంలో వున్నవారికి, అధికారం కోసం కుటుంబాలకు కుటుంబాలుగా పాద యాత్ర చేసేవారికి పట్టక పోవడం పైన 'నెత్తుటి మరకలు కవి నిలువెత్తు ఆగ్రహమౌతాడు.

'అడగండి  మీ లోకవిభుని
మీ కులం కుళ్ళుకడగటానికి
సముద్రమంత ఫినాయిల్ మధించమనండి
పాల కడలి పానుపు విడిచి
కటికనేల సేవకు పిలిపించండిఅని హూంకరిస్తాడు

 అందుకే 'మీరంతా వొకే తాను గుడ్డలని తేలిపోయిందిఅని తేల్చి చెబుతూ  అన్నలారా! వీరులారా!
మీరు విడిచిన కాడిని
మా భుజాలకెత్తుకుంటాం
 మీరు నడిచిన నెత్తుటి దారిలో
 రాలిపడిన గాయాలను ముద్దాడతాం
నిరంకుశ వేటలో నేలకొరిగిన మిమ్మల్ని
వసంత రుతువు చిగురుల్లో
గుర్తు తెచ్చుకుంటాంఅని లక్షింపేట మృతవీరుల నెత్తుటి త్యాగాలను వృధా కానివ్వమని,  వారు విడిచిన పోరు కాడిని భుజాలకెత్తుకుంటామని గొప్ప వాగ్దానం చేస్తాడు కవి నేలపూరి రత్నాజీ.

యీ దీర్ఘ కవితలో కవి దళిత పల్లెల్లోని అపురూప సన్నివేశాలను, ఆర్గానిక్ మేధావులను,  కళాకారులను, అన్ని పనులూ తామే చేసి గొప్ప సాంకేతిక విద్యల్ని యెగతాళి చేసే దళిత వీరుల్ని జ్ఞాపకచేస్తూ దళిత సౌదర్య శాస్త్రం వారి రోజువారీ జీవితాలలో యెట్లా కళ, కళలాడుతుందో కళ్ళకు కట్టిస్తాడు నేలపూరి రత్నాజీ . దళిత కిరణాలైన కుసుమ ధర్మన్న, బోయి భీమన్న, గుర్రం జాషువా, శివసాగర్ లతో  బాటు ప్రజా యుద్ధ నౌక, గద్దర్ ని కూడా దళిత ఆత్మ గౌరవ ప్రతీకలుగా  కీర్తించాడు. రత్నాజీ యీ దీర్ఘ కవితలో అంబేడ్కర్ ని గొప్పగా ప్రస్తావిస్తూ
 
ఒక్క గుణవంతుడూ పుట్టని దేశంలో
ఒకే ఒక స్తితప్రజ్ఞుడు
ఎన్ హిలేషన్  ఆఫ్ కేష్ట్ రాసి
కోట్లాది మేకల గొంతుల్లో
మాటల వసపోశాడు

 అని ఆయన చూపిన స్టేట్  సోషలిజంద్వారానే దళితులకు భూమిపై హక్కు సంక్రమిస్తుందని గొప్ప సైద్ధాంతిక పరిజ్ఞానంతో భూమి సమస్యకు పరిష్కారాన్ని వివరిస్తాడు. 

నెత్తుటి మరకలులో గొప్ప భావావేశంతో పాటూ కవిత్వం పరంగా కూడా గుర్తుంచుకోదగిన కవిత్వ పంక్తులెన్నొ వున్నాయి. దళితులపై జరిగిన వొక హత్యాకాండని సాంఘిక, ఆర్ధిక, రాజకీయ కోణాల నుంచి సమగ్రంగా దీర్ఘ కవితలో చర్చించిన ఆత్మీయ తమ్ముడు నేలపూరి రత్నాజీకి అభినందనలు... ఫూలే, అంబేడ్కర్ సామాజిక వుద్యమాభివందనాలు...            
                                                                                                                          

       

Comments

Popular posts from this blog

Charvaka Asram- Write up

Nomadic Tribe- Chenchu

Dalit Women's Writing-EPW