Aranya Krishna on 'Vekuva Pitta' in Matruka




సందేశాత్మక వేకువ పిట్ట!
అరణ్యకృష్ణ 

ఇంతటి సామాజిక దుఃఖాన్ని, ఆక్రోశాన్ని నింపుకున్న కవిత్వాన్ని ఈ మధ్య కాలంలో చదవలేదు.  ఇందులో ఉన్నది సానుభూతి కాదు, సహానుభూతీ కాదు.  ఉన్నదల్లా గుండెపగుళ్ళ అనుభవానికి అక్షర రూపమివ్వటమే.  కులానికి-వివక్షకీ, కులానికి-ఆర్ధిక దారిద్ర్యానికి వున్న అవినాభావ సంబంధాన్ని కవి తన కవిత్వంతోకి తీసుకొచ్చిన తీరు గొప్పది.  ఊరుకీ-వాడకీ మధ్యనున్న వైరుధ్యంతో కూడిన స్వానుభవాలే కవిత్వాంశాలు ఈ కవికి.  ఇది చల్లపల్లి స్వరూపరాణి కవితల సంపుటి "వేకువ పిట్ట".  
****

మనం తరగతి గదుల్లో చరిత్ర అంటే ఏం చదువుకున్నాం?  మొత్తం భరతజాతి ఒకటిగా వున్నట్లు, ఎవరో విదేశీయులు సిల్క్ రూట్లో గుర్రాలేసుకొచ్చి, లేదా సముద్రం మీద భారీ ఓడలేసుకొచ్చి ఈ దేశాన్ని దోచుకున్నట్లు మాత్రమే చదువుతాం.  కానీ ఇదే గడ్డ మీద రకరకాల సమూహాలున్నాయని, అందులో కొన్ని సమూహాలు కొన్ని వేల సంవత్సరాల తరబడి పుట్టుకని బట్టి ప్రయోజనాన్ని పొంది మరికొన్ని సమూహాల్ని అదే పుట్టుక కారణంతో దోచుకున్నాయని, హింసించాయని, ఆ దోచుకునే కారణానికి, వివక్షకి కులం అనే నెపం వున్నదని, ఆ నెపంకి మన ఆధ్యాత్మిక భావనల మద్దతు వుందని, మన ఆధ్యాత్మికతకి, మన దేవుళ్ళకి అంటరాని, వెనుకబడ్డ, నిత్య దారిద్ర్యంతో కృశించిన జీవితాల్ని గడిపిన మనుషుల రక్తం అంటుకున్నదని మాత్రం మనం చదువుకోం.   నిజమైన చరిత్ర ఎప్పుడూ సమాంతరంగా గాయపడ్డ వారి సాహిత్యంలోనే కనబడుతుంది.  "గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలు" రాయబడినప్పుడే నిజమైన చరిత్ర బైటపడుతుంది.  స్వరూపరాణి కవిత్వం సరిగ్గా ఈ కోవకి చెందినదే.  కవిత్వం ఒట్టి కవిత్వంగా మిగలక కవిత్వం ప్రశ్నై కొడవలిలా గుచ్చటమంటే ఏమిటో తెలుస్తుంది ఈ సంపుటి చదివితే!  

ఒక్క కవితతో ఒక కవి ఏమిటో అంచనా వేయలేం.  కానీ ఒక కవితల గుఛ్ఛంతో ఆ కవి ఏమిటొ చెప్పొచ్చు.  స్వరూపరాణి తన కవిత్వాన్ని అభిరుచితో రాసినట్లుండరు.  కవిత్వాన్ని ఆయుధంగా స్వీకరించినట్లు కనబడతారు మొత్తం చదివితే.  ఆమె కవిత్వం మనల్ని ఒక టైం మెషీన్ ఎక్కించి గతంలోకి తీసుకెళుతుంది.  హింస, వంచన, వివక్షలతో కూడిన రక్తసిక్త చరిత్రని పరిచయం చేస్తుంది.  వర్తమానంలో చరిత్ర మిగిల్చిన, ఇంకా కొనసాగిస్తున్న నెత్తుటి చారికల్ని ఎత్తి చూపిస్తుంది.  గాయపడ్డ వర్గానికి చెందిన కవి స్వరూపరాణి  రాసిన కవిత్వంలో గతం తాలూకు సామాజిక దురాగతాలు, ఒక వర్గం మరో వర్గానికి చేసిన చారిత్రిక ద్రోహాలు కనబడతాయి.  నాకు ఫెమినిస్ట్ కవిత్వం అంటే గౌరవమే.  కానీ మధ్య తరగతి వర్గానికి చెందిన అడ్వాంటేజియస్ కులాలకు చెందిన ఫెమినిస్ట్ కవులు స్పృశించలేని అనేకానేక స్త్రీ అనుభవ కోణాలు స్వరూపరాణి కవిత్వంలో కనబడతాయి.  ఫెమినిస్ట్ కవిత్వం ఆగిపోయిన చోట మొదలై ఉన్నతీకరించబడిన స్త్రీ కవిత్వంగా దళిత ఫెమినిస్ట్ కవిత్వాన్ని చెప్పొచ్చు.  ఇందుకు స్వరూపరాణి కవిత్వాన్ని ఉదాహరణగా చూపొచ్చు.  సమాజంలో సంఘర్షించే శక్తుల పట్ల అవగాహన వుంటేనే ఇది సాధ్యమౌతుంది.  ఈ సంపుటిలోని కవిత్వం మొత్తంగా సందర్భంలో నుండి చూడాల్సిన కవిత్వం.  ఎంచుకున్న వస్తువు, శాస్త్రీయ దృక్పథం, కసి, సామాజిక దుఃఖం వల్ల కలిగిన భావోద్వేగం వల్ల కవిత్వమై పోయిన రచన స్వరూపరాణిగారిది.  

భౌగోళికంగా, సాంస్కృతికంగా ఆదివాసీ జీవితాల్ని కల్లోల పరచి వారి జీవితాల్ని శిల్పారామాల్లో వస్తువులుగా, మ్యుజియాల్లో విశేషాలుగా భద్రపరిచే దుర్మార్గాన్ని ఇలా అంటారు:

"అదమరచి చుట్టూ నిద్రపోయే గుడిసెల్ని
కార్పొరేట్ తిమింగలం అమాంతంగా మింగి 
శిల్పారామం నడివీధిలో ఉమ్మినట్లుంది
...
అడవి బిడ్డల ముక్కెరలు
పూసల పేరులు, అద్దాల రవికలు
గేటెడ్ కమ్యూనిటీకి యెత్నిక్ అందాలు సమకూర్చాయి"

హెచ్.సీ.యూ. విద్యార్ధి రోహిత్ మరణం నేపధ్యంలో ప్రశ్నించే గొంతుకల మీద నిషేధాల్ని ప్రస్తావిస్తూ మంచి కవిత రాసారు:
"రాముడు మంచి బాలుడెందుకయ్యాడని
ఈ దేశంలో ఎక్కడ చూసినా 
సీతమ్మోరు స్నానమాడిన గుంటలే ఎందుకున్నాయని
ఎందుక్కున్నాయని అడగటం ఎంత ఘోరం?
ఇక్కడ కలలు కనమంటారు
కానీ నిద్ర పట్టనివ్వరు" 

నిజంగానే మనకు పారవశ్యం కలిగించే  ప్రకృతి విన్యాసాలు వివక్షకీ, దరిద్రానికి గురైన వారి పాలిట శాపాలు.  వర్షం అలాంటిదే. "వాన" అన్న కవిత బలంగా ఈ వైరుధ్యాన్ని చెందుతుంది.  

ఎంతటి దారిద్ర్యంలో అయినా చచ్చేవరకు బతకటానికి మనిషికి ఒక దేశం కావాలి.  నువ్విక్కడెందుకున్నావు? అని ఎవరూ ప్రశ్నించని నేల ఒకటి కావాలి మనిషికి.  నిలబడటానికి నేలలేని రోహింగ్యా ముస్లీముల గురించి "తిరస్కృతుడు" అనే కవిత రాసారు.  

"యజ్ఞం" ఈ సంపుటిలో చాలా విశిష్ఠమైన కవిత.  యజ్ఞ యాగాది క్రతువులే అత్యంత ప్రాచీన ఘన సంస్కృతిగా చెప్పుకునే నాగరికతలో పరాయీకరించబడిన దళిత స్వరం తనని తాను పెకిలించుకొని చెప్పిన పద్యంలా వుంటుంది. 
"యజ్ఞం జరుగుతూనే ఉంది 
అక్కడెవరో యూపస్థంభం మీద
ఒక ప్రాణిని నిలబెట్టారు
అది బిక్కుబిక్కుమంటుంది
అచ్చం నాలాగే!
..........
ఒక సంస్కృత శ్లోకం
కంట్లో నలుసై గుచ్చుతుంది
...........
నా శరీరాన్నెవరో తూట్లు పొడిచి
పురుష సూక్తంలో దొర్లించినట్లుంది
బొత్తిగా గాలి ఆడడం లేదు
ఒక ఆదిమ నిర్బంధం గొంతు మీద వేలాడుతుంది" 


సమస్త సామాజిక దుర్మార్గాలకి ప్రాకృతిక సాక్షిగా నీరుని కవి నిలిపి వర్ణించిన తీరులో గొప్ప అవగాహన కనబడుతుంది. చదవాల్సిన మంచి కవిత.  అలాగే కులానికి వున్న పురుషాధిక్య దాష్టీకానికి ప్రతీకగా దేశం, కులం, , ఊరు, పురుషాధిక్య స్వభావాన్ని ఔదలదాల్చిన స్త్రీల చూపులు, పోలీసు లాఠీ, చివరికి న్యాయస్థానం...సమస్తం ఓ పురుషాంగమై భయపెడుతున్నాయని "ఖైర్లాంజి కాష్టం"లో చెప్పిన తీరు కదిలిస్తుంది.  దళితులకు చదువు ఎంత అవసరాన్ని బలంగా చెప్పిన కవిత "అమ్మ చీర చెంగు".  

ఐతే అవగాహన పరంగా బలహీనంగా రాసిన "కపట క్రీస్తు", "అలగా జెండర్" వంటి ఓకట్రెండు కవితల్ని ఆమె సరి చేసుకొని వుంటే బాగుండెది.  కొన్ని కవితల్ని కవి మరింత స్తిమితంగా రాసుంటే 
చాలా మంచి కవితలయ్యుండేవని అనిపించింది.   

*****

"సింహాలు తమ చరిత్ర తామే రాసుకోనంత కాలం వేటగాడు రాసినదే సింహాల చరిత్ర అవుతుంది"  ఇది ఓ సామెత.  ఇప్పుడు సింహాలు తమ చరిత్ర తామే రాసుకోవటం మొదలైంది.  నోటికి ముంతనీ, ముడ్డికి చీపుర్నీ కట్టుకొని భయం భయంగా ఊరు వీధుల్లో పరుగెత్తిన పంచముడి నుండి బలిసిన నాగరీక మూక చేతిలో హతమైన కేరళ ఆదివాసీ మధు వరకు భాగం చేసినందుకు స్వరూపరాణిగారికి కవిగా అభినందనలు!  ఎంత గొప్ప చదువులు చదువుకున్నా, ఎన్ని ఉన్నత పదవులు సాధించినా తన మూలాలు మర్చిపోనందుకు ఆమెకు వ్యక్తిగా అభినందనలు.   

("వేకువ పిట్ట" కవితా సంపుటి. రచన ప్రొఫెసర్ చల్లపల్లి స్వరూపరాణి. వెల రూ.100.  ప్రతులకు - ఫ్లాట్ నం.4 , అనుమోలు ఎంక్లేవ్, రామచంద్రనగర్, విజయవాడ-520008.  ఫోన్ 9440362433) 

(మాతృక మాసపత్రిక, ఆగస్ట్, 2018) 




Comments

Popular posts from this blog

Charvaka Asram- Write up

Nomadic Tribe- Chenchu

Dalit Women's Writing-EPW