Ganteda Gowrunaidu on 'Vekuva pitta'
గంటేడ గౌరు నాయుడు
అమ్మ చీర
కొంగు నుంచి ప్రపంచాన్ని చూసి కవిత్వం చెప్పడమంటే గుండె ఘోషను ఆవిష్కరించడమేనని,
ఆత్మగౌరవ పరిరక్షణ, ఆత్మగౌరవ ప్రకటన అని, జీవితమే కవిత్వానికి ముడిసరుకుగా
స్వీకరించి తనదైన అను భూతిని అక్షరీకరించి తన అక్షరాల్ని మన కళ్ళలో ఎర్రజీరలుగా,
అశృధారలుగా మార్చగలిగే సక్తివంతురాలైన కవిగా సాక్షాత్కరిస్తుంది చల్లపల్లి
స్వరూపరాణి. దళిత ఉద్యమం కుల, వర్గ అణచివేత గురించి మాట్లాడిందని, దళిత పురుషుల
కోణం నుంచి ఎక్కువగా మాట్లాడిందని, స్త్రీవాద ఉద్యమం మధ్య తరగతి అగ్రకుల మహిళల
గురించే మాట్లాడిందని అనుకుంటే పీడితులలోకెల్లాపీడితులైన దళిత మహిళా తన గురించి
తానూ మాట్లాడవలసిన అవసరాన్ని గుర్తించి తన అనుభవ తీవ్రతలోంచి, అవమానాల,
ఆగ్రహావేశాల్లోంచి నోరు విప్పిందని స్పష్టం చేస్తుంది ఈ వేకువపిట్ట. ఆధిపత్య సంస్కృతే అందరి సంస్కృతి కాదని,
అందరిదీ ఓకే సంస్కృతిగా మారే భవిష్యత్తును కాంక్షిస్తూ కలగంతుంది ఈ వేకువపిట్ట.
“కులం, వర్గము, ఆధిపత్యము ఈ సమాజంలో ఉన్నంతవరకూ నిరంతర పోరాటం సాగుతూనే ఉంటుంది”
అంటుంది ఈ వేకువపిట్ట, ఆ పోరాటాలకు ఊపిరి పోస్తుంది ఈ వేకువపిట్ట.
చూడండి ...
ఈ దేశం ఓ
పురుషాంగమై
నన్ను
భయపెడుతుంది
అంటున్న ఈ
కవితావేశం పాటకుల్ని కుదురుగా ఉంచదు. ఊరు, పోలీసు లాటీ, న్యాయస్థానం, ఇవే దేశంగా,
దేశం పురుషాంగం గా భయపెడుతుందని ‘ఖైర్లాంజి కాష్టం’ కవితలో ఈ దేశం దళితులను ఎలా
భయపెడుతుందో చెప్పి ఆవేశాన్ని రగిలించి ఆలోచనలను రేకెత్తిస్తుంది.
ఆ బొమ్మ
మా తాతలు
చావగొట్టి
తూముల్లో తోక్కేసిన
గోచిపాత
రాయుళ్ళంతా తిరిగొచ్చి
సూటు బూతు
వేసుకుని
నడిబజార్లో
బోరవిరుచుకుని
నిటారుగా
నిలబడ్డట్టుంది
అని ‘వెలి’
కవితలో బాబాసాహెబ్ అంబేడ్కర్ కు నివాళి అర్పించి తన దళిత చైతన్యానికి కారణం ఆ
మహనీయుడే అని ఎలుగెత్తి చాటి చెబుతుంది.
ఆ బొమ్మకు
పూజలు చేసి
భూస్థాపితం
చేద్దామంటే
అది వెంటాడే
దావానలమౌతుంది
అని వ్యంగ్యంగా
కొరడా ఓరు కొసలా విసురుతుంది.
బావి పళ్ళెం
అంచున
ఇగిరిపోని
చెమ్మలాంటి
అంటరానితనాన్నెరుగును
నీరు
నీటికి సమస్తమూ తెలుసు
నీటి బొట్టంటే
మేం చేసిన యుద్ధాల్లో
రక్తం ఏరులై పారిందిగానీ
నీటి చెలమ మాత్రం దక్కలేదు
అని తరతరాలుగా వెలివాడల్లో తాము నీటి చెలమ కోసం
చేసిన యుద్ధాలను గుర్తు చేసుకుంటుంది.
అతనికి కుల కవచకుండలాలు లేవు
ప్రశ్నల్ని
మింగడానికి
ఊళ్ళే జైళ్ళయ్యాయి
దళితుల్ని ఎవరూ చంపలేదు
రోహిత్ మరణం వ్యక్తిగతం
మీరిచ్చిన తీర్పులు
వెలివాడ కంట్లో కారం చల్లాయి
న్యాయ దేవత కుంతీ దేవన్నా కాదాయె
కర్ణులు చచ్చిపోయాకైనా
నాలుగు కన్నీటి బొట్లు రాల్చడానికి
అనడం న్యాయస్థానాలలోని డొల్లతనాన్ని నిలదీయడం,
‘శిక్షాస్మ్రుతి’ దళితులకు ‘శిక్షామృతి’ గా మారడమేనని కుండ బద్దలుకొడుతుంది.
అమ్మను తలచుకుంటే
ఆమె అవయవాలకు బదులు
కక్కీసు దొడ్డి, చీపురు కట్ట
పేడతట్ట గుర్తొస్తాయి
----------
సమాజపు మాలిన్యాన్ని
ఎత్తిపోసిన పాకీ తల్లి
ఓ అశుద్ధ పనిముట్టై మిగిలింది
అనడంలో ఎంత వ్యధ దాగి ఉందో తెలుస్తుంది.
ఇంటికొక మరుగు దొడ్డి
ఎప్పుడు కొట్టినా ధారలు కట్టే నీళ్ళ పంపు
ఇంకా మా ఆడోళ్ళ నెరవేరని కలే!
నాకిప్పుడు దేశం తలుపుల్లేని కక్కీసుదోడ్డిలా కనిపిస్తుంది.
అంటూ ఒక చిన్న కలను నిజం చేసుకోడానికి అవకాశం ఇవ్వని దేశ దౌర్భాగ్యాన్ని
అక్షరాల్లో ఆవిష్కరించింది., తన కలల కన్నీటి ధారలలో ఉతికిపారేస్తుంది ‘సఫాయీ’
కవితలో అలాగని ఈ పుస్తకం నిండా దళితవాడ కవిత్వమే ఉందని చెప్పడం కాదు.
ఈ పుస్తకం దళిత వాదానికి ఊపిరి పోసిన
పుస్తకమని, దళిత కవిత్వం ఊపిరిగా శ్వాసిస్తున్న మహిళ ఆత్మ ఘోష ఈ కవిత్వ సంపుటం అని
చెప్పడమే. దళిత, బహుజన సమస్యల్ని పట్టించుకున్న కవితలు ఇందులో ఉన్నాయి.
అంటరానితనం, స్త్రీల అణచివేత, హరించిపోతున్న బాలల హక్కులు, ఆహార నిషేధం, దేశాల మీద
దేశాల పెత్తనం, వాకపల్లి, రోహింగ్యాల సమస్యల్ని కవిత్వీకరించిన ఈ కవయిత్రి ఏ
సమస్యా తన దృష్టి పధం నుంచి దాటిపోలేదని పుస్తకాన్ని రుజువుగా నిలుపుతుంది.
‘వేకువపిట్ట’ తో మొదలైన ఈ సంపుటి ‘నా ఆకాశం’
కవితతో ముగుస్తుంది. ‘వేకువపిట్ట’ కవిత తన తల్లిని గురించి రాసుకున్నది కాగా, ‘నా
ఆకాశం’ కవిత తన నాన్న గురించి రాసుకున్నది. తల్లిని ‘వేకువపిట్ట’ అని
అభివర్ణించినా నిజానికి తానే వేకువపిట్ట. కులం చీకట్లో కళ్ళు మూసుకుపోయి ఆ అజ్ఞాన
సుఖంలో జోగుతున్న సమాజానికి కలం ముక్కుతో పొడిచి
నా అక్షరాన్ని
బాధితుడికి సాయం పంపుతాను
పీడిత చెక్కిలిపై
కన్నీటి చారికలు తుడిచే
అమ్మ చీర కొంగు నా అక్షరం
అని కవితాగానం చేస్తూ చైతన్యపరుస్తున్న
‘వేకువపిట్ట’ చల్లపల్లి స్వరూపరాణి గారిని అభినందించకుండా ఉండలేం. ముచ్చటగా మూడు
ముందు మాటలు, ముప్పయ్యారు కవితలున్న ఈ పుస్తకం ‘మనం చదివి మిత్రులతో
చదివిన్చావాల్సిన అత్యంత అవసరమైన పుస్తకం అని చదివిన ప్రతివారూ ఒప్పుకుంటారని నా
నమ్మకం.
అందమైన అర్ధవంతమైన ముఖచిత్రంతో, నూరు రూపాయల
సాధారణమైన ఖరీదుతో అన్ని పుస్తకాల షాపులలోనూ లభిస్తుంది. (ఉత్తరాంధ్ర మాస పత్రిక, సెప్టెంబర్, 2018 )
Comments
Post a Comment