Nasaraiah- Essay

ప్రత్యామ్నాయ సంస్కరణవాది నాసరయ్య
_____________చల్లపల్లి స్వరూపరాణి
ఈ దేశంలో కులాన్ని సృష్టించడానికి మతపరమైన ఆమోదముద్ర వేసుకున్న వైదిక బ్రాహ్మణ వాదానికి ప్రత్యామ్నాయంగా అనేక మత వుద్యమాలు ఆవిర్భవించాయి. ప్రాచీనకాలంలో చార్వాక, లోకాయతులు, జైనం, బౌద్ధం, మధ్యయుగాలలో వీరశైవం తర్వాత ప్రాంతీయంగా అనేక చిన్న చిన్న మత ఉద్యమాలు కులాన్ని పెంచి పోషించిన వైదిక కర్మ కాండలకు వ్యతిరేకంగా అణగారిన ప్రజానీకాన్ని చైతన్య పరిచాయి.
బ్రిటీష్ వారు, క్రైస్తవ మతం ఈ దేశంలో ప్రవేశించకముందే అనగా మధ్యయుగాల చివరిదశలో దేశ వ్యాప్తంగానూ ఆంధ్ర దేశంలోని వివిధ ప్రాంతాలలోనూ భక్తి వుద్యమ కారులు వైదిక బ్రాహ్మణ మతానికి దాని తాలూకు కుల తత్వం, విగ్రహారాధన, యజ్ఞయాగాది క్రతువులు, హింసాత్మక జంతు బలులు మొదలైనవాటికి వ్యతిరేకంగా ప్రజలను ముఖ్యంగా క్రింది కులాలను చైతన్యపరుస్తూ వచ్చారు. ఆంధ్రదేశంలో పోతులూరి వీరబ్రహ్మం తాత్విక చింతనతో పాటు ‘రామానుజ మతం’, ‘మాగంటి వారి మతం’, ‘నాసరయ్య మతం’ మొదలైనవి బ్రిటీష్ వారి క్రైస్తవం ప్రజల్లో వ్యాప్తి కాక పూర్వం ప్రజలలో మూఢాచారాల పట్ల చైతన్యాన్ని రగిల్చి వారిని సంస్కారవంతులుగా తీర్చిదిద్దాయన వచ్చును.
నాసరయ్య పోతులూరి వీరబ్రహ్మంగారి కి సమకాలీనుడని తెలుస్తుంది. ఈయన పుట్టుకతో మహమ్మదీయుడు. అసలు పేరు 'నాజర్ మహమ్మద్' ఈయన తల్లిదండ్రులు గునెమ్మ, ఖాన్ సాహెబ్. వీరిది వినుకొండ తాలూకాలోని కనుమల చెరువు గ్రామం. పేదరికం వలన ఈయన తండ్రి అప్పుడప్పుడు దొంగతనాలు చేస్తుండేవాడు. ఒకసారి ఆయన నరసింహస్వామి విగ్రహాన్ని దొంగిలించి, భయంతో దానిని బావిలో పడేసిన తర్వాత వరుసగా ముగ్గురు పిల్లలు చనిపోయారు. దీంతో ఆయన నాజర్ కు 'నరసయ్య' అనే పేరు పెట్టాడు అయితే తర్వాత ముస్లింలు పేరు మార్చమని పట్టుపట్టడంతో 'నాజర్ మహమ్మద్’ అనే పేరు పెట్టాడు.
నాజర్ ముస్లింగా పుట్టినప్పటికీ ఆయన ఎప్పుడూ ముస్లింగా గానీ, హిందువుగా గానీ జీవించలేదు. సిద్ధుల అవైదిక ఆచారమైన యోగ మార్గాన్ని అనుసరించాడు. ఇది హిందూ మతాచారాలకు పూర్తి భిన్నమైంది. ఆనాడు హిందూమతంలో భాగమైపోయిన గ్రామ దేవతారాధనలో జాతర్లు, కొలుపులు వంటివి నిర్వహించడం, జంతు బలులు వంటి మూఢాచారాలతో అణగారిన కులాల ప్రజలు జీవిస్తూ వుండేవారు.
నాజర్ వారిని హిందూ మతపరమైన మూఢాచారాల నుండి దృష్టి మళ్ళించడానికి యోగ మార్గాన్ని వుపదేశిస్తూ క్రమశిక్షణతో పరిశుభ్రంగా జీవించాలని, ధ్యానం చేసి ఏకగ్రాత సాధించాలని, గురువు యెడల భక్తి శ్రద్ధలతో మెలగాలని, వ్యక్తుల మధ్య కులమత బేధాలు, స్త్రీ పురుష బేధాలు పాటించరాదని బోధించాడు. కుల సమాజంలో అగ్రవర్ణాల చేత పశువుల కంటే హీనంగా చూడబడుతూ అర్థం పర్థం లేని ఆచారాలు, తాగుడు వంటి అలవాట్లతో దుర్భర జీవితాన్ని వెళ్ళదీస్తున్న ఆనాటి దళిత బహుజనులకు నాజర్ బోధనలు సహజంగానే నచ్చాయి. ప్రారంభంలో కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాలలోని దళిత వెనుకబడిన కులాల వారే నాజర్ ను అనుసరించారు. ఆయన వెనుకబాటుతనంలో కూరుకుపోయిన మాల మాదిగలకు మంచి నడవడికతో పాటు చైతన్యవంతమైన గీతాలను కూడా నేర్పాడు. మార్కాపురం తాలూకా త్రిపురాంతకం గ్రామంలో ఒక మఠాన్ని ఏర్పాటు చేసుకున్న నాజర్ అనేక ప్రదేశాలు తిరిగి ప్రజలకు తన సిద్ధాంతాన్ని ప్రచారం చేశాడు. ఆయనను అనుసరించేవారిని 'నాసరయ్య మతస్థులు'అని పిలిచేవారు. ఆయన మఠానికి బహుజనులతోపాటు కుల మత భేదాలు అంటే పట్టింపులేని అగ్రవర్ణాలవారు, స్త్రీలు కూడా వచ్చేవారు.
ఆయనను దగ్గరగా అనుసరించిన వారిలో ‘జగ్గమ్మ’ అనే బ్రాహ్మణ స్త్రీ ఆయన కోసం ఒక సత్రాన్ని నిర్మించి యిచ్చింది. బోయ కులానికి చెందిన దండె సుందరమ్మ, ఆమె తల్లి తిక్కమ్మ, మాదిగ పుల్లయ్య నాసరయ్య అనుంగు శిష్యులుగా ప్రసిద్ధి పొందారు. దండె సుందరమ్మ నాజర్ చనిపోయాక ఆయన సమాధి పక్కనే మరో సమాధి నిర్మించుకొని సజీవ సమాధి అయిందని అంటారు. వీరిద్దరి సమాధులు పక్కనే మాదిగ పుల్లయ్య సమాధి కూడ వుంది. తర్వాత కాలంలో క్రైస్తవ మతాన్ని అవలంబించి అందులో క్రియాశీలకంగా మారిన యర్రగుంట్ల పేరయ్య, పిడతల పేరయ్య, పెద్దింటి రామయ్య వంటి మాదిగ కుల పెద్దలు కూడా ఒకప్పుడు నాసరయ్య మతాన్ని అనుసరించినవారే. సుమారు 80 సంవత్సరాలు జీవించి 1825 ప్రాంతంలో మరణించిన నాసరయ్యకు ఆయన మరణానంతరం కూడా అణగారిన వర్గాలలో ఆదరణ తగ్గలేదు.
త్రిపురాంతకం, వినుకొండ ప్రాంతాలలో ఆయన సంస్మరణార్థం ఉరుసు జరుగుతుంది. ఆయన అనుచరులు తమ బిడ్డలకు నాజర్, నాజర్ సాహెబ్, నాసరయ్య, నాసరమ్మ, నరసయ్య, ‘నాసర రెడ్డి’ అనే పేర్లు ఎక్కువగా పెట్టుకునేవారు. నాసరయ్య సిద్ధాంతాలను పాటించేవారు చక్కగా పాటలు పాడేవారు. కీర్తనల ద్వారా తమ సిద్ధాంతాలకు గ్రామాలలో ప్రచారం చేస్తూ సంచరించేవారు. వారు పాడే పాటలలో ఆత్మీయత, సత్ ప్రవర్తన నైతిక జీవనం పట్ల గౌరవం, స్త్రీల పట్ల సమానత్వ భావన ఉండేవి. వారు కులమత భేదాలు పాటించకుండా అందరికీ సాధ్యమైనంత మేరకు సహాయం చేస్తూ విలక్షణంగా జీవించడం విశేషం. హిందూ మతంలోని బహుదేవతారాధన, జాతరలు, తాగుడు, అవిద్య వంటి అంధకారంలో మునిగిపోయిన మాల మాదిగ కులాల ప్రజలలో నాసరయ్య బోధనలు కొంతమేరకు చైతన్యాన్ని రగిలించడమే కాకుండా క్రైస్తవం యిక్కడ ప్రవేశించాక ఆయన అనుచరులంతా పెద్ద ఎత్తున క్రైస్తవ మతంలోకి చేరిపోయారు.
19వ శతాబ్దపు తొలినాళ్లలో ఆంధ్రదేశంలో క్రైస్తవ మత ప్రచారానికి పూనుకున్న క్లవ్ దొర, ఆయన భార్య ఎమ్మారోచర్ అప్పటికి ఆంధ్రదేశంలోని మాల మాదిగల జీవన స్థితిగతులను, ఆచారాలను అధ్యయనం చేస్తున్నప్పుడు నాసరయ్య మతస్థులు మిగిలిన వారికంటే చైతన్యవంతంగా, సామాజిక స్పృహ కలిగి ఉండటం గమనించారు. వారే పెద్ద ఎత్తున క్రైస్తవులుగా మారారని, క్రైస్తవులుగా మారిన తరువాత వాళ్ళు క్రైస్తవ కీర్తనలను యితరుల కంటే త్వరగా నేర్చుకుని శ్రావ్యంగా పాడేవారని ఎమ్మా రోచర్ క్లవ్ తమ రిపోర్టులలో రాశారు.
భక్తి పేరుతోనే అయినప్పటికీ బ్రిటీష్ పూర్వయుగంలో నాసరయ్య వంటి సామాజిక భక్తి ఉద్యమకారులు అణగారిన కులాలను, స్త్రీలను ఆధిపత్య సంస్కృతికి, మూఢాచారాలకు, వెనుకబాటుతనానికి వ్యతిరేకంగా సంఘటిత పరచడం అసాధారణ విషయంగా భావించవచ్చు. సంస్కరణవాదంతో ఆయన స్థాపించిన మఠాల తరహాలో తర్వాత భజన మండళ్ళు ఏర్పడి దళితుల సమావేశ కేంద్రాలగానూ, వారిని సంస్కరణ దిశగా మరల్చే ఉద్యమ కేంద్రాలుగానూ మారాయి. తొలితరం దళిత ఉద్యమ నాయకుడైన భాగ్యరెడ్డివర్మ వంటి వారు భజన మండళ్ళ ద్వారా అంటరాని వారిని సంఘటిత పరచడం ఒక చారిత్రక సత్యం.బ్రాహ్మణ వాదానికి, కులతత్వానికి వ్యతిరేకంగా ఒక ప్రత్యామ్నాయ మత సిద్ధాంతాన్ని ప్రచారం చేసిన నాసరయ్య వంటి వారు ఈనాటి దళితుల ఆత్మ గౌరవ పోరాటాలకు, ప్రతిఘటన వుద్యమాలకు నారు, నీరు పోశారనడంలో సందేహం లేదు.
*నవతెలంగాణా, 26. 2.2019

Comments

Popular posts from this blog

Charvaka Asram- Write up

Nomadic Tribe- Chenchu

Dalit Women's Writing-EPW