Jogini- Essay










రాచ పుండు ‘థియోగమీ’
                                                చల్లపల్లి స్వరూపరాణి

ఇక్కడంతా దేవుడి పేరు మీదే జరుగుతుంది. కవి పైడి తెరేష్ బాబు అన్నట్టు దేవుడు అసమానతల్ని సృష్టించి కొందరి ఆత్మగౌరవాన్ని ధ్వంసం చేస్తాడు. ఈదేశంలో కనీసపు మనిషి హోదా పొందని నికృష్ట జీవి అయిన జోగినీని సృష్టించినదీ ఆ దేవుడే! ఆమధ్య తెలంగాణలో ‘మొగుడనేవాడు మనిషైతే అతడు చనిపోయినప్పుడు నేను వితంతు పెన్షన్ కి అర్హత పొందుతాను, కానీ నా మొగుడు దేవుడైపాయే ఆడెప్పుడు సచ్చేది, పెన్షన్ ఎప్పుడోచ్చేది? అని ఒక జోగినీ అడిగిన ప్రశ్నకి అంతరిక్షంలోకి దూసుకెళ్తున్న నాగరిక సమాజం సమాధానం చెప్పలేదు... ఆమెని సృష్టించిన ఆ మాయదారి దేవుడు బదులు పలకలేడు... ఒకపక్క ప్రభుత్వాధినేతలే పోతురాజుల్ని, జోగినీలను ప్రోత్సహిస్తూ నగరం నడిబొడ్డున జాతర చేస్తూ, ‘రంగం’ చెప్పించుకుంటుంటే జోగినీల ప్రశ్నలకు ఎవరైనా ఎందుకు  బదులిస్తారు?
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంకా సుమారు ఎనభై వేల మంది జోగినీలు, బసివిలు, మాతమ్మలు, దేవుడమ్మలుగా కొనసాగుతున్నారంటే ఈ సమాజం ఎటు వెళ్తున్నట్టు? 1988 జోగినీ నిరోధక  చట్టం అచ్చం ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంలాగే పేపర్లలో పడి మూలుగుతుంది. గ్రామీణ భూస్వామ్య వ్యవస్థలో అణగారిన కులాల స్త్రీలను బలిపసువులను చేసే ఈ వ్యవస్థ సమసిపోవాలని హేమలతా లవణం లాంటివాళ్ళు ఎంతమంది కృషి చేసినా ఆ వ్యవస్థని దేవుడు పకడ్బందీగా కాపాడుతూనే ఉన్నాడు.  జోగినీ నిరోధక  చట్టం ప్రకారం బాధిత స్త్రీ తప్ప జోగినీగా మార్చే పూజారి, అంకితమిచ్చే తల్లిదండ్రులు, ప్రోత్సహించే కుల పెద్దలు అందరూ దోషులే. కానీ చట్టం వచ్చి ముప్పై ఏళ్ళు గడిచినా జోగినీ వ్యవస్థను కొనసాగిస్తున్నవారిలో ఒక్కరికి కూడా శిక్ష పడకపోవడం గమనార్హం.  
జోగినీ వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వాలు కమిటీలు ఏర్పాటు చేస్తున్నాయి, మీద అనేకమంది పరిశోధన చేస్తున్నారు, ఎన్జీవోలు ఇబ్బడి ముబ్బడిగా ప్రాజెక్టులు తెచ్చుకుంటున్నాయి. అయినా ఈ వ్యవస్థ  సమాజం మొహం మీద మాయని మచ్చగా ఇంకా మిగిలే ఉంది. జోగినీ స్త్రీలు, వారి బిడ్డలకు రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు ఉండవు. ఉండడానికి ఇల్లు ఉండదు, రమ్మనే, పొమ్మనే బంధువులుండరు. కొంతమంది జోగినీలు బిచ్చమెత్తుకుని బతుకుతున్నారు. వితంతు పెన్షన్ కి గానీ, మరొక రకమైన రాయితీలకు గానీ అర్హులు కాకుండా అడ్డుపడే వీరి గుర్తింపు ఆ స్త్రీల మెడలో గుడి బండై కూర్చుంది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థల ద్వారా జోగినీలకు, వారి పిల్లలకు రేషన్, ఆధార్ కార్డులు ఇప్పించాలని, వారి పిల్లలను సాంఘిక సంక్షేమ హాస్టళ్ళలో ఎంట్రెన్సు లేకుండా నేరుగా చేర్చుకోవాలని, వారికి తండ్రిపేరు రాయనవసరం లేకుండా వెసులుబాటు కల్పించాలని  కొన్ని అధికారికమైన ఏర్పాట్లు ఉన్నప్పటికీ వాటిని చిత్తసుద్దితో అమలుపరిచేవారు లేరు. కటిక పేదరికంలో కనీస అవసరాలు కూడా తీరని ఈ ఊరుమ్మడి స్త్రీలకి సమాజంలో ఎదురయ్యే అవమానాలు, అవహేళనలకు లెక్క లేదు. తండ్రి వైపు నుంచి గుర్తింపు లేని వీరి పిల్లలు సమాజంలో ఎదుర్కొనే పరాభవాలకు అంతే లేదు. వారికి స్కూలు అడ్మిషన్ దగ్గర నుంచి ఎదురయ్యే అవమానాలకు ఏ నేరం చెయ్యని ఆ పిల్లలు పొందే మానసిక హింస మాటల్లో చెప్పలేనిది. వారి జీవితకాలపు దు:ఖానికి  పరిహారం ఎప్పుడు దొరుకుతుంది?
ఎస్సీ కార్పోరేషన్ ఆగస్ట్ ఇరవయ్యో తేదీన విజయవాడలో ఏర్పాటు చేసిన వర్క్ షాప్ కి రెండు రాష్ట్రాల అధికారులతో పాటు అనేకమంది జోగినీ స్త్రీలు పాల్గొనడం విశేషం. వారిలో హాకీ క్రీడాకారిణి ‘సుశీల’ ఒకరు. ఆమె తల్లితో పాటు నికృష్టమైన ఈ వ్యవస్థ నుంచి బైటకొచ్చి గౌరవంగా బతకాలని కోరుకునే కొందరు జోగేనీ స్త్రీలు ఈ వర్క్ షాపులో పాల్గొనడం విశేషం. వారి మాటల నిండా కసి ఉంది, సమాజం తమని చూసే చూపు మీద పట్టరానంత ఆగ్రహం ఉంది. జోగినీ ఆచారం నుంచి బయటపడి మళ్ళీ వివాహం చేసుకుని సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్న ‘హాజమ్మ’ అనే  మహిళతో మాట్లాడినప్పుడు ఆమె  ‘జోగిని చిందేస్తే వర్షాలు పడతాయని జోస్యం చెప్పే ఆ పంతులు మాల మాదిగోళ్ళు చదువుకుని పైకి రాకపోతే సంఘానికి అరిష్టం అని చెబితే బాగుండు’ అని చమత్కరించడం విశేషం.  అయితే జోగినీ వ్యవస్థ  నిరోధక చట్టాన్ని మరింత బలపరుస్తూ ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమ శాఖతో పాటు, సాంఘిక సంక్షేమ శాఖకూ అనుసంధానం చేస్తూ ఈ చట్టాన్ని మరింత కట్టుదిట్టం చెయ్యాలి. ‘నిర్భయ’, పోక్సో చట్టం వంటి వాటితో  అనుసంధానం చెయ్యాలి. దేవుడితో పెళ్లితంతు పేరుతో చిన్నపిల్లలను జోగినీలుగా మార్చే జాతర జరిగే ప్రదేశానికి ముందస్తు సమాచారం మేరకు వెళ్లి బాధ్యులను కటినంగా శిక్షించాలి. ఈ జోగినీ వ్యవస్థను ప్రోత్సహించే గ్రామ పెద్దలు, పూజారులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చెయ్యాలి. ఇప్పటివరకూ వారికి ఇచ్చ్సిన పునరావాస సౌకర్యాల పరిస్థితి మీద సమీక్ష జరిపి న్యాయంగా వారికి సరైన పునావాసం కల్పించాలి. వీటన్నింటికంటే ముందు దేవుళ్ళను బహిష్కరించి దేవాలయాల్ని కూలగొడితే గానీ సమాజానికి పట్టిన రాచపుండులాంటి ఈ రుగ్మత తొలగిపోదు.


Comments

Popular posts from this blog

Charvaka Asram- Write up

Dalit Women's Writing-EPW