Tributes to Toni Marrison
బ్లాక్ బుక్- టోనీ
మారిసన్
“Race is the least reliable information you can have about someone. It’s
real information, but it tells you next to nothing” - Toni Morrison
ఆమెకి జాలి
జాలి మాటలంటే అసహ్యం, కన్నీటి మూటలంటే చీదర... అందుకే తన పాత్రల్ని సానుభూతికి
అందనంత ఎత్తులో నిలిపి నల్లజాతి ప్రజల జీవన పోరాటానికి గొప్ప సాహిత్య
గౌరవాన్నిచ్చింది టోనీ మారిసన్. ఆత్మగౌరవం కంటే ప్రాణాలు ఖరీదైనవి కావని,
బానిసత్వపు కోరల్లో జీవన్మ్రుతుల్లా బతకడం కంటే చావడం మేలని కన్నబిడ్డను చేతులారా
చంపుకున్న నల్లతల్లి, సమాజం తన లేమిని,
రంగుని త్రుణీకార దృష్టితో చూస్తుందని తెల్లవాళ్ళకు వలే తనకి కూడా అందమైన నీలి కళ్ళు ఉంటే బాగుందని ఆ నీలి కళ్ళ కోసం
ఆరాటపడే నల్లజాతి అమ్మాయి వంటి సజీవమైన పాత్రలతో
జాత్యాహంకార సాహిత్య విలువలపైన పెద్ద తారుడబ్బా కుమ్మరించిన ధిక్కారి టోనీ
మారిసన్. అవును, సాహిత్యంలో నోబుల్ బహుమతి
పొందిన మొదటి ఆఫ్రో-అమెరికన్ రచయిత్రి టోనీ మారిసన్ పాత్రలన్నీ వివక్ష, పీడనలపైన ధిక్కార
పతాకాన్ని ఎగరేసి జాత్యాహంకారానికి, దాని తాలూకు అన్ని రకాల దాస్తీకాలకు ఎదురు
నిలిచినవే.
టోనీ మారిసన్
అసలు పేరు ‘చ్లో అర్డేలియా ఓఫ్ఫోర్డ్’. ఆమె కాధలిక్ గా మతం మారాక ఆంథోనీ(టోనీ) గా
పేరు మారింది. ‘మారిసన్’ అనేది భర్తతో వచ్చి చేరించి. రామా విల్లిస్, జార్జ్
ఓఫ్ఫోర్డ్ ఆమె తల్లిదండ్రులు. ఓహియో లో 1931లో నలుగురు తోబుట్టువుల మధ్య పుట్టిన ఆమె తాత
బానిసత్వంలో పుట్టి బానిసత్వంలోనే పెరిగినవాడు. టోనీ మారిసన్ మురికి వాడల్లో
దుర్భర దారిద్ర్యంలో చాలీ చాలని వసతులతో పెరిగింది. వీటికి తోడు సమాజం నుంచి
తెల్లజాతి వారి దాస్తీకాలు, నల్లజాతి స్త్రీల పైన లైంగిక వేధింపులు స్వయంగా చూస్తూ
పాఠ్య పుస్తకాలతో పాటు సమాజాన్ని క్షుణ్ణంగా చదివింది. ఆమె తండ్రి స్టీల్
వెల్డింగ్ పని, కార్ వాష్ చెయ్యడం, బేల్దార్ పని వంటి అనేక చిన్న చిన్న పనులు
చెయ్యడమే కాక ఆ పనిని వెదుక్కుంటూ అనేక చోట్లకు తరచూ మకాం మార్చాడు. ఆమె తల్లి
అమెరికాలో ఏనాటికైనా నల్లజాతివారి పరిస్తితులు మెరుగౌతాయని నమ్మినా, టోనీ తండ్రి
మాత్రం తెల్లజాతివారి మాటలను చేతలను నమ్మేవాడు కాదు. ఆయన తన కూతుళ్ళ పట్ల వెకిలిగా
ప్రవర్తించిన ఒక తెల్లవాడిని డాబా మెట్లమీద నుంచి తోసేసి అతని మీదకి మూడు చక్రాల
సైకిల్ని ఎక్కించడం టోనీ మనసులో చెరగని
ముద్ర వేసింది. తన దృష్టిలో తన తండ్రి చేసింది తప్పే అయినా దాని వెనక ఉన్న సామాజిక
వైరుధ్యాలను అర్ధం చేసుకుంది.
టోనీ మారిసన్ ఏల్
యూనివర్సిటీ లోనూ, ప్రిన్ స్టన్ యూనివర్సిటీ లోనూ ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా పనిచేసి
తన ఎనభై ఎనిమిదవ ఏట ఈనెల (ఆగస్ట్) ఐదవ తారీఖున న్యుమోనియాతో మరణించారు. ఆమె భర్త హెరాల్డ్
మారిసన్ జమైకాకు చెందిన ఆర్కిటెక్ట్, ఆమెకు ఇద్దరు కొడుకులు. పిల్లలిద్దరూ
చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడే ఆమె భర్త నుంచి విడాకులు తీసుకుని ఒంటరి తల్లిగా పిల్లల్ని
పెంచి పెద్దచేసింది. ఒక కొడుకు ప్రోస్టేట్ కాన్సర్ తో 2010 లోనే మరణించాడు. ఆమె జీవితం ఎప్పుడూ
ఘర్షణతోనే నడిచింది. స్వేచ్చకు, ఆత్మగౌరవానికీ ప్రాముఖ్యతనిచ్చే టోనీ మారిసన్ తన
వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒంటరితనాన్ని, చికాకును తన రచనా ప్రవృత్తితో గెలిచింది
అనొచ్చు.
ఆమె చిన్న
నాటి నుంచి సమాజంలో ఎదుర్కొన్న జాతి, లింగ
వివక్షలు, స్వీయ అనుభవాలలోంచి బలమైన సాహిత్యాన్ని టోనీ మారిసన్ సృస్టించగలిగారు. అమెరికన్
సాహిత్యంలో ఒక తెల్లజాతి పురుషుడి కంటే నల్లజాతి స్త్రీగా రాయడం ఎంతో గొప్ప
విషయమని, నల్లజాతి స్త్రీగా తన జీవితమే తనకు ముడి సరుకు అని ఆమె పేర్కొంటారు.
టోనీ మారిసన్
రాసిన ‘Beloved’ అనే నవలకు ఆమెకు 1993 లో
ప్రతిష్టాత్మకమైన నోబుల్ బహుమతి వచ్చింది. ఆ నవలను మారిసన్ మొదట కధగా రాసి తర్వాత
దాన్ని నవలగా మలిచారు. 19 వ శతాబ్దంలో బానిసత్వంలో మగ్గిపోయే ‘మార్గరెట్ గార్నర్’
అనే ఒక నల్లజాతి స్త్రీ తన బానిస సంకెళ్ళను తెంపుకోవడానికి యజమాని నుంచి
పారిపోయేక్రమంలో ఆమె తిరిగి అతని చేతికి చిక్కుతుంది. అప్పటికి ఆమెకు మూడేళ్ళ పాప
ఉంటుంది. మళ్ళీ తనతో పాటు పాప కూడా బానిసగా బతకవల్సి వస్తుందని ఆ తల్లి పాప
గొంతుకోసి చంపేసి వెళ్తుంది. స్వేచ్చకోసం కెంటకీ నుంచి ఒహియోకి పారిపోయిన ఆ స్త్రీ
వాస్తవ కధే Beloved(1987) అనే నవలగా టోనీ మారిసన్ మలిచింది. చదివినప్పుడు మనసు
మెలిపెట్టే ఆ నవల టోనీ మారిసన్ ని అమెరికాలోని నల్లజాతి ప్రజల్లో చాలా ఎత్తులో
నిలబెట్టడమే కాక ప్రపంచ సాహిత్యంలో కూడా ఆ నవల ఒక క్లాసిక్ గా మిగిలిపోయింది. ఆ
నవలకు టోనీ మారిసన్ కు సాహిత్యంలో నోబుల్ (1993)బహుమతితో పాటు పుల్టిజర్ ప్రైజ్
కూడా వచ్చింది. ఆ నవల ఆధారంగా ఒక సినిమా
కూడా వచ్చింది.
టోనీ మారిసన్ బాల్యంలో
మారిసన్ కీ నల్లజాతికి చెందిన తన స్నేహితురాలికి మధ్య ఎప్పుడూ దేవుడున్నాడా? లేడా?
అనే విషయమై చర్చ జరిగేది. తను దేవుడున్నాడు అని చెబితే ఆమె స్నేహితురాలు మాత్రం
దేవుడు లేడని, ఎందుకంటే తనకి తెల్లవాళ్ళకిమల్లే నీలికళ్ళు ఇవ్వమని ఎన్నిసార్లు
ప్రార్ధించినా ఇవ్వని దేవుడు ఎందుకుంటాడని ఆ అమ్మాయి వాదన. ఈ అంశాన్ని టోనీ The
Bluest Eyes అనే నవలకు ఇతివృత్తంగా తీసుకున్నారు. ‘పెకోలా’ అనే 11 సంవత్సరాల
నల్లజాతి అమ్మాయి చింపిరి జుట్టు, చాలీ చాలని దుస్తులు, సరీగా లేసులు కట్టుకోని
బూట్లతో నల్లగా ఉన్న తనను స్కూల్లో ఇతరులు హీనంగా,
తృణీకారంగా నిలువెల్లా గుచ్చి గుచ్చి చూస్తారని, ఆ చూపుల్లో ఎన్నో ఎన్నో
అర్ధాలున్నాయని చివరికి తనను తాను అసహ్యించుకుంటుంది. పైగా ఆ అమ్మాయి తన తండ్రి
చేత బలాత్కరించబడుతుంది. ఒకవైపు జాతి వివక్షను ఎదుర్కొంటూ మరోవైపు ఇటువంటి
తీవ్రమైన మానసిక రుగ్మతకు గురయ్యే నల్లజాతి పురుషుల సంక్లిష్ట కోణాన్ని చిత్రించడం
రచయితకి కత్తిమీద సాములాంటిది. అయినప్పటికీ ఆమె ఆ పని సునాయాసంగా చేశారు. ‘పెకోలా’
అనుభవించే మానసిక వేదన తన స్వీయ అనుభవం నుంచి రాశానని, అది సగటు నల్లజాతి యువతి
అంతరంగం అని టోనీ ఒక ఇంటర్వ్యూలో
పేర్కొన్నారు.
టోనీ మారిసన్
నవలల్లో ‘Song of Solomon’ అనే నవల నల్లజాతి పురుషుల కోణం నుంచి వారు
జాత్యహంకారానికి ఎదురొడ్డి చేసిన అస్తిత్వ పోరాటాలను చిత్రిస్తే, ‘Soola’ అనే నవలలో
ఆమె నల్లజాతి స్త్రీల మధ్య ఉండే పరస్పర స్నేహం, అక్క చెల్లెళ్ళ అనుబంధంను గొప్పగా రాశారు. ఇంకా ‘Paradise’, ‘Tar Baby’, ‘Love’,
‘Home’ మొదలైన నవలలు, కధలు, నాటకాలు, వ్యాసాలతో పాటు బాక్సర్ మహమ్మద్ ఆలీ జీవిత
చరిత్రను, నల్లజాతి ఉద్యమకారిణి ఏంజెలా డేవిస్ జీవిత చరిత్రను గ్రంధస్తం చేసింది.
టోనీ మారిసన్ సాహిత్య కృషి ఎంతో విస్త్రుతమైనది. ‘The Black Book’ అనే ప్రచురణ
సంస్థ ద్వారా నల్లజాతి వారి సాహిత్యాన్ని పెద్ద ఎత్తున వెలుగులోకి తెచ్చింది. ఆ
సంస్థ నల్లజాతి వారి చరిత్రను ఫోటోలు,
డాక్యుమెంటరీలు, పుస్తకాల రూపంలో నమోదు చేసింది. బానిసలు వ్యాపారం,
నల్లజాతివారిపై ఇతరులు జరిపే మూకదాడులు, నల్లవారికి సహకరించిన చర్చీలు మొదలైనవి
వాటిలో ముఖ్యమైనవి. ఆమె ఎంతో మందిని
రచయితలుగా తీర్చి దిద్దింది. ‘Random House’ అనే ప్రచురణ సంస్థ ప్రచురించే
టెక్స్ట్ పుస్తకాలకు ఎడిటర్ గా ఆ సంస్థ అమ్మకాలను పెంచింది. ఇవన్నీ ఆఫ్రో- అమెరికన్ రచయిత్రిగా గొప్ప పేరును,
గుర్తింపునూ ఇచ్చాయి. టోనీ మారిసన్ మంచి ఉపన్యాసకురాలిగా కూడా గుర్తింపు పొందారు. అమెరికన్
సమాజంలో టోనీ మారిసన్ కు ఉన్న గుర్తింపుకు న్యూయార్క్ మ్యూజియంలో ఉన్న ఆమె
నిలువెత్తు విగ్రహమే సాక్ష్యం. ఆలిస్ వాకర్, మాయా ఏంజెలో వంటి గొప్ప మిత్రులు
ఆమెకున్నారు. వారంతా మారిసన్ సాహిత్యానికి తగిన గుర్తింపు రావడం లేదని ఆరోపిస్తూ
పత్రికలకు ఉత్తరాలు రాశారు. ఆమె దగ్గర చదువుకున్న విద్యార్ధుల్లో పౌరహక్కుల
ఉద్యమకారుడైన స్తాక్లీ కార్మిచేల్ వంటివారున్నారు. ప్రెసిడెంట్ బరాక్ ఒబామా 2012
లో టోనీ మారిసన్ కి ఆ దేశపు అత్యధిక పౌర సన్మానం చేసి Presidential Medal of Freedom అందిస్తూ ఆమె రచనలతో తమ ఆత్మలకు సేవ చేసి తమ జాతిని
శక్తివంతం చేసిందని పేర్కొన్నాడు.
భారతదేశపు కుల
సమాజంలో దళిత స్త్రీల వలే అమెరికాలో నల్లజాతి స్త్రీలు అటు తెల్లజాతి నుంచి జాతి
దురహంకారాన్ని, లైంగిక వేధింపులను, నల్లజాతి నుంచి పురుషాధిక్యతను ఎదుర్కొంటూ
నిత్యం జీవన్మరణ పోరాటం చెయ్యడంపై టోనీ మారిసన్ పదునైన కవితాత్మక శైలిలో రాశారు.
సాహిత్యంలో ముద్రల గురించి మాట్లాడుతూ తనని ‘ఆఫ్రో- అమెరికన్ రచయిత్రి’ అని అంటే
తనకేమీ అభ్యంతరం లేదని, ఆ జీవితం ఎన్నో బలమైన ముద్రల్ని తన మనసుమీద వేసి తన
సాహిత్యాన్ని సారవంతం చేసిందని ఆమె అంటారు. అందరూ ఇప్పుడు ‘బ్లాక్ ఈజ్ బ్యూటిఫుల్’
అంటున్నారు గానీ నలుపు రంగు అందంగా ఉండదనే రోజులు తనకి తెలుసనీ సమాజంలోనూ సాహిత్యంలోనూ ఒకప్పటి జాతిపరమైన ఘర్షణను,
సంక్లిష్టను మారిసన్ గుర్తుచేస్తారు. ప్రపంచంలో ఎక్కడైనా అణచివేతకు గురయ్యే సమూహాల
నుంచే బలమైన సాహిత్యం వస్తుందని, వారి అక్షరాలకి రక్తం, చెమట, కన్నీరు అంటి
ఉంటాయని ఆమె అంటారు. దుర్భరమైన స్వేచ్చా రాహిత్యానికి గురౌతూ కనీసపు మనిషి హోదాకు
నోచుకోని నల్లజాతి వారు అమెరికాలో బానిసత్వాన్ని అధికారికంగా రద్దు చేశాక కూడా
సుమారు మరో శతాబ్దం పాటు బానిస బతుకుల్ని కొనసాగించవలసిన పరిస్థితి, వారిలో
స్త్రీలు కార్చిన కన్నీరూ, చిద్రమైన వారి స్వప్నాలూ టోనీ మారిసన్ సాహిత్యంలో
రక్తమాంసాలతో కనిపించడం ఆమె అక్షరాల గొప్పదనం. “చదువరులు ఎదుటివారి జాతి
ఏమిటో తెలుసుకోనవసరం లేని పరిస్తితి వచ్చేదాకా చదవాలని నా కోరిక” అని ప్రకటించిన టోనీ మారిసన్ తన సాహిత్య ప్రయోజనం ఏమిటో స్పష్టంగా
తెలిసిన రచయిత. ఆమె నోరులేని మూగ రోదనకు తన గొంతునిచ్చి ప్రపంచంలోని అణగారిన
ప్రజలందరికీ ఆత్మబందువైంది. She is noble, because she made her characters
noble, unavailable to pity...
12.08. 19
Comments
Post a Comment