Manusruti - write up














అసమానతకు శాశ్వత చిరునామా ‘మనుస్మృతి’
                                                                             చల్లపల్లి స్వరూపరాణి

చరిత్రకారులు ఎంతసేపటికీ భారత్ పై మహ్మదీయుల దండయాత్రల గురించి రాయడంతో పుస్తకాలు నింపేశారని, నిజానికి హిందూ ఇండియాపై మహ్మదీయుల దురాక్రమణ కంటే అంతకు ముందు బౌద్ధ ఇండియాని బ్రాహ్మణ వాదులు దురాక్రమించారని ముస్లింలు రాకపూర్వం జరిగిన భారతదేశ చరిత్ర మొత్తం బౌద్దులకూ, బ్రాహ్మణవాదులకూ మధ్య జరిగిన సంఘర్షణే అని అంబేద్కర్ అంటారు. ఆ చరిత్రలో ‘మనుస్మృతి’ రచన ఒక ముఖ్యమైన అధ్యాయం.
మనుస్మృతి ఒక మత గ్రంధమో లేక కాల్పనిక కావ్యమో కాదు. అది ఒక ‘అధర్మశాస్త్రం’ మనుస్మృతి రచనకూ భారత రాజకీయ చరిత్రతో కొంతకాలం ప్రత్యక్ష సంబంధం, మరికొంతకాలం పరోక్ష సంబంధం ఉంది. బౌద్దాన్ని ఈదేశపు సాంస్కృతిక అస్తిత్వంగా అధికారికంగా ప్రకటించిన మౌర్య అశోకుడు తన పరిపాలనను బౌద్ధ ధర్మ సూత్రాలకు అనుగుణంగా సాగించడమే కాదు తన రాజ్యంలో వైదిక క్రతువులైన యజ్ఞ యాగాలనూ, జంతు బలులనూ నిషేధించాడు. దీనితో బ్రాహ్మణులకు ప్రాధాన్యత లేకుండా పోయింది. దానికంటే బౌద్ధం వైదిక బ్రాహ్మణ మతాన్నీ, వేదాల ప్రామాణికతనీ బోనులో నిలబెట్టి దానికి ప్రత్యామ్నాయ తాత్విక దృక్పధాన్ని ముందుకు తీసుకురావడం బ్రాహ్మణ మతస్తులకు తీవ్ర అసంతృప్తిని, బౌద్ధం పట్ల దాని అనుయాయుల పట్ల శత్రు భావాన్ని కలిగించింది. బౌద్ధం పట్ల బ్రాహ్మణ ద్వేషానికి ‘పుష్యమిత్ర శుంగుడు’ ప్రతినిధి అయ్యాడు. అశోకుడి మనుమడైన బృహద్రధుని రాజ్యంలో సేనాధిపతిగా ఉండే పుష్యమిత్రుడు రాజుని కుట్రతో చంపి ఆ సింహాసనాన్ని అధిష్టించాడు. బృహద్రధుని హత్య క్రీ.పూ. 185లో జరిగిందని చరిత్ర చెబుతుంది. పుష్యమిత్రుడు రాజ్యాన్ని అధిష్టించాక యజ్ఞయాగాది క్రతువులను పునరుద్దరించడంతో పాటు బౌద్ధ విప్లవంతో బలహీనపడిన బ్రాహ్మణ మతాన్ని తిరిగి బతికించడం కోసం మనుస్మృతిని రాయించాడు. ఇది క్రీస్తుకు పూర్వం 185 తర్వాత గ్రంధస్తం అయ్యిందని అంబేద్కర్ తో పాటు మరికొందరు చరిత్రకారుల అభిప్రాయం.

మనుస్మృతిని ఒక దైవికమైన గ్రంధంగా ‘సృష్టికర్త’ ‘మనువు’ అనే వ్యక్తికి చెప్పగా ఆయన దీన్ని గ్రంధస్తం చేశాడని భావించేవారు ఇప్పటికీ ఉన్నారు. ‘మనువు’ అనే పేరుకు ప్రాచీన కాలంలో కొంత గౌరవం, అంగీకారం ఉంది. అయితే నిజంగా ‘మనువు’ అనే వ్యక్తి లేడనీ, కేవలం ఆ పేరుకు ఉండే ప్రాచీనత, ‘దైవత్వం’ అనే అంశాల దృష్ట్యా రచయిత అయిన ‘సుమతీ భార్గవ’ కు ఆపేరు ఆపాదించారని అంబేద్కర్ పేర్కొన్నారు. ఈ గ్రంధ రచయిత పేరు గ్రంధంలో ఎక్కడా ఉండక ప్రతి అధ్యాయం చివరలో అతని వంశ నామమైన ‘బృగు’ అని ఉంటుందని, కనుక మనుస్మృతికి ‘బృగు కృత సంహిత’ అనే మరో పేరు ఉందని బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యాఖ్యానించారు. ఈ గ్రంధాన్ని పాలకులు, ప్రజలు, ధర్మశాస్త్రంగా భావిస్తారు కాబట్టి దీనికి ‘మనుధర్మ నియమావళి’ అనే పేరు కూడా ప్రాచుర్యంలో ఉంది. ‘మనుస్మృతి’ బ్రాహ్మణ మతస్తులచే ఒక రాజకీయ ఉద్దేశ్యంతో రూపొందిన గ్రంధం కాబట్టి తర్వాత వచ్చిన ఇతర స్మృతి కర్తలకు దాని పుట్టుపూర్వోత్తరాల గురించిన అవగాహన ఉంది. అందువల్లనే క్రీ. శ నాల్గవ శతాబ్దంలో రాసిన నారద స్మృతి కర్త ద్వారా మనుస్మృతి గ్రంధకర్త అసలు పేరు ‘సుమతీ భార్గవ’ అనే విషయం బైటికొచ్చింది.

మనుస్మృతి బౌద్ధం తీసుకొచ్చిన సామాజిక విప్లవ సిద్ధాంతాన్ని చంపి పాతరేసింది. బుద్ధుని బోధనల ప్రభావంతో తమ కుల ధర్మానికి విరుద్ధంగా సామాజిక మార్పు కోసం బతికే వాళ్ళని, హేతువాదులనూ, కులాంతర వివాహాలు చేసుకునే వాళ్ళని ‘పాషండు’లని, ‘దుర్మార్గు’లని, హేతువాదులను, వేద విరుద్ధంగా మసలే వారిని క్రూరులని పేర్కొంది మనుస్మృతి. అది అసమానత ప్రాతిపదికన మనుషుల మధ్య అంతరాలు సృష్టించి, వివిధ సామాజిక వర్గాల మధ్య స్పష్టమైన విభజన రేఖలు గీసింది. సమాజంలో బ్రాహ్మణులకు అత్యున్నత స్థానాన్ని బహూకరించి శూద్రులకు(దళితులు కూడా ఈ వర్గంలో భాగం), స్త్రీలకు బానిసత్వాన్ని అంటగట్టింది. ప్రపంచలో ఏది ఉందో అదంతా బ్రాహ్మణులదేనని, ఉన్నతమైన పుట్టుక వల్ల వారికి అన్నీ తీసుకునే హక్కు ఉందని పేర్కొంది. రాజులు కూడా వారి సలహాలు పాటించాలని వారు బ్రాహ్మణులకంటే అధములని చెప్పింది. శూద్రుల ముడ్డికి చీపురూ, మొలకు ముంతా కట్టింది... వారిని కుక్కలతో పోల్చి వారు ఎదురొస్తే ఎంత దూరం జరగాలో, వారి శ్రమను ఏవిధంగా దోపిడీ చెయ్యొచ్చో, వారికి ఎటువంటి శిక్షలు వెయ్యాలో నిర్ణయించింది. వారి పట్ల ఇతరులు అంటరానితనాన్ని పాటించినప్పటికీ వారి సేవలను ఉచితంగా వినియోగించుకోవచ్చని మనుస్మృతి పేర్కొంది. వివిధ కులాల మధ్య వర్ణ సంకరాన్ని అరికట్టడానికి అనేక నియమాలు రూపొందించి కింది కులాల పురుషులతో వివాహం సంబంధంలోకి వెళ్ళే పై కులాల స్త్రీలకు కూడా ఘోరమైన శిక్షలు విధించి వారి సంతానాన్ని అంటరానివారిగా పరిగణించాలని శాసించింది. ఒకే నేరానికి పై కులాలకు సాధారణ శిక్షలనూ, సూద్రులకు కఠిన శిక్షలనూ నిర్దేశించింది. బ్రాహ్మణుడు ఎంత పెద్ద నేరం చేసినా అతడు శిక్షార్హుడు కాడు. స్త్రీలు నమ్మశక్యం కాని మనుషులని, వారు అన్ని అవస్తలలో పురుషుల అజమాయిషీ కింద బతకాలని చెప్పడమే కాదు వారు వివాహం అనే చట్రం నుంచి బైటికి రాకుండా విడాకులు తీసుకునే అవకాశాన్ని నిషేధించింది. వివాహ వ్యవస్థని, కులవ్యవస్తని పవిత్రమైనవిగా చిత్రించింది. ఈనాడు అణగారిన కులాలు, స్త్రీల స్థితికి మూలం మనువు రూపొందించిన నియమ నిబంధనలే మూలం. అందుకే ప్రముఖ Indologist వెండీ డోనిగర్ భారతదేశంలో రాజ్యాంగం అమలులోకి వచ్చేదాకా మనుస్మృతే అమలులో ఉందని పేర్కొన్నారు(తర్వాత కూడా ఉందనుకోండి). మనుస్మృతి రచన, దాని అమలు ద్వారా బౌద్ధం నుంచి సమాజంలో వ్యాప్తి చెందిన సమత, హేతుబద్ధత అనే భావనల స్థానంలో అసమానత, మూఢత్వం, స్త్రీ పురుషుల మధ్య అంతరాలు పెంపొందాలని ఆశించిన బ్రాహ్మణవాదం తన ప్రణాళికను విజయవంతంగా అమలుచేసింది. అందుకే మనుస్మృతి కేవలం ఒక మత గ్రంధం కాదు, అది రాజకీయ వ్యూహం, సమాజంలో అసమానతలు, అంధత్వం ఉండాలని కోరుకునే పాలక వర్గాలు రాజ్యాంగాన్ని తుంగలోతొక్కి ప్రజల పట్ల ముఖ్యంగా అణగారిన కులాలు, స్త్రీల విషయంలో సనాతన ధర్మంగా భావించే ఆ శిక్షాస్మృతిని 'దైవవాక్కు' లాగా అమలుచేస్తాయి... దాన్ని ఉంచాలో తగలబెట్టాలో బాధితులే నిర్ణయించుకుంటారు...
*డిసెంబర్ 25, 1927న బాబాసాహెబ్ అంబేద్కర్ మనుస్మృతిని తగలబెట్టి మనువాదులకు ఒక పెద్ద సవాల్ విసిరారు

Comments

Popular posts from this blog

Charvaka Asram- Write up

Nomadic Tribe- Chenchu

Dalit Women's Writing-EPW