ఆకురాలు ఋతువు
చల్లపల్లి స్వరూపరాణి
అమ్మా!
ఒక్కసారన్నా
నీమాట
విననందుకు
నీ కొడుకు
రోహిత్ ని
క్షమించమ్మా!
నలుగురు నడిచే
దారిలో
తలొంచుకు
నడవనందుకు
కుడి చేతికి
ఎడమ చేతికి
తేడా
లేదన్నందుకు
నన్ను
మన్నించమ్మా!
పరిధులలో
ప్రమేయాలలో
ఒదగనందుకు
సున్నం
కొట్టిన సమాధి లోకంలో
ఊపిరాడక
ఉసురుసురన్నందుకు
నన్ను
క్షమించవూ!
కంచెల్ని దాటి
నా కళ్ళు
నక్షత్రాలని
చూసినందుకు
దగాకోరు రంగుల్ని
చీల్చి
నలుపు రంగుని
ముద్దాడినందుకు
అమ్మా!
నన్ను
క్షమిస్తావు కదూ!
పొయ్యి మీదకీ పొయ్యికిందకీ
జరగటానికి నీ
వొళ్ళు గుల్లచేసుకోటం
కళ్ళతో చూసి
కూడా
మంచి ఉద్యోగం
తెచ్చుకుని
నీ కాళ్ళు
కందకుండా
చూసుకోలేని
ఈ ‘కటికోడిని’
తిట్టుకోవద్దమ్మా!
నీమీద
ప్రేమలేక కాదు
నా
కళ్ళున్నాయి చూడు,
అవి ఇంటిని
దాటి సమాజంలోకి
సమాజాన్ని
దాటి
భూదిగంతాల
వరకూ
నడిచి
వెళ్ళాయి
అమ్మా!
ఒక్క రోజన్నా
నీమాట ఆలకించనందుకు
నన్ను
క్షమించమా!
మగతోడు లేక
లోకంలో ఎన్ని
నిందలు మోశావు
ఎండకీ వానకీ
తడిసినా
తిండికీ
గుడ్డకీ నమిసినా
బతుకు ఎలమీద
తెగించి నుంచోడం
నువ్వేకదమ్మా
నాకు నేర్పిందీ!
ఏడాదిలో ఓరోజు
కిష్టమస్
పండక్కన్నా
యింటికొస్తానని
దారులెంట
పారజూసేదానివి
నేనేమూ
మనువుని
తగలబెట్టే
పనిలో
పండగని
పారబోసుకునేవాడిని
ఊర్లో
అన్నాయోళ్ళు
రాత్రంతా
చర్చీ డెకరేషన్ చేస్తుంటే
కనీసం పండగ
పూటకన్నా
నేను ఇల్లు
చేరాలని
ఏసయ్యని
ఎన్నిసార్లు
బతిమిలాడేవో
నీకే తెలుసు
నా రాత్రులు
కాలేజీ గోడలపై
పోస్టర్లు
అతికించడంలో
నా పగళ్ళు
పుస్తకాల కుస్తీలో
కరిగిపోయినయ్యమ్మా!
ఏసయ్య
ఏమియ్యకపోయినా
మన ఆడోల్లకి
క్షమాగుణం
బాగా నేరిపేడు
నన్ను
క్షమించు!
వయసు మళ్ళుతున్న
నీకు
చేతి ఆసరా
కాలేకపోయిన అశక్తుడిని!
చీకటిని
చీకటని
వెలుతురుని
వెలుతురని
చెప్పే పిడికెడు
స్వేచ్ఛకోసం
అర్రులుచాచిన
వాడిని!
మన్నించమ్మా!
నీ
కొడుకు
దు:ఖితుడై
వెళ్లి
వెన్నెల నవ్వై
తిరిగివస్తాడు చూడు!
ఆకురాలు కాలం
సమీపించింది
ఇక నీ కడుపు
పంట
రోహిత్ చిగురించి
విరగబూస్తాడు
నేను
వెదజల్లుకుంటూ వెళ్ళిన
వేకువ చుక్కలు
చీకటి ఋతువులో
అక్కడక్కడా
మినుకుమంటున్నాయి చూడు!
ఆ చుక్కల్లో
నీ రోహిత్ కనబడతాడు
నువ్విక
నాకోసం ఏడవొద్దు
నేను వెళ్తూ
నిన్ను అనాధను చెయ్యలేదు
నా నెత్తుటిలో
తడిసిన ఈనేల
తిరిగి చిచ్చరపిడుగుల్లాంటి
నీ రోహిత్ లను
కంటుంది
చూసి
మురుసుకోమ్మా!
(To the ever blazed
memory of beloved Rohith Vemula)
16.01.2020
Comments
Post a Comment